You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుజరాత్ యూనివర్సిటీ: 'నమాజ్ చేస్తుండగా మాపై దాడి చేశారు, మేం చదువు ఎలా పూర్తి చేయాల'ని ప్రశ్నిస్తున్న విదేశీ విద్యార్థులు
"మాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ మా చదువును ఎలా కొనసాగించాలో తెలీడం లేదు" అని విదేశీ విద్యార్థి ఒకరు బీబీసీ కరస్పాండెంట్ రాక్సీ గాగ్డేకర్ ఛారాతో ఆందోళనగా చెప్పారు.
శనివారం రాత్రి గుజరాత్ యూనివర్సిటీలోని హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి జరిగింది. ఇప్పుడు అక్కడంతా భయాందోళనలతో కూడిన వాతావరణం ఉంది.
యూనివర్సిటీ హాస్టల్‌లోని ఎ-బ్లాక్‌లో ఉంటున్న అఫ్గానిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్రికాతోపాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులపై 25మందితో కూడిన గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు విదేశీ విద్యార్థులకు గాయాలయ్యాయి.
ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. గుజరాత్ ప్రభుత్వంతో మాట్లాడామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఇంతకీ అసలు ఏం జరిగింది?
'జై శ్రీరామ్ అనాలని బెదిరిస్తున్నారు'
బీబీసీ గుజరాతీ బృందం ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన సమయంలో, హాస్టల్ బ్లాక్‌లో ఎటు చూసినా పోలీసులు, యూనివర్సిటీ అధికారులే కనిపించారు.
ఘటనాస్థలంలో రాళ్లు ఉండటాన్ని గమనించాం. చాలా వాహనాలు ధ్వంసమైన స్థితిలో కనిపించాయి. దానిని బట్టి అక్కడ రాళ్లదాడి జరిగిందని అర్థమవుతోంది.
హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల్లో భయాందోళనలు కనిపించాయి.
అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన నోమన్ మాట్లాడుతూ, “విదేశీ విద్యార్థులు ఉండే హాస్టల్ ఇది. నాలాగా విదేశాల నుంచి చదువుకోవడానికి వచ్చేవారు ఇకపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితి. అసలు, వారు ఇక్కడికి ఎలా వచ్చారో విచారణ జరపాలి. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. బయటి వారు తరచూ లోపలికి జొరబడి, జై శ్రీరామ్ అనండి లేదంటే పొడిచేస్తామని బెదిరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం” అన్నారు.
ఈ ఘటనపై అహ్మదాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో ఒకరిని గుర్తించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
శనివారం రాత్రి, సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించినవిగా చెప్తున్న కొన్ని వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి.
ఆ వీడియోల్లో ఓ మూక విద్యార్థుల వాహనాలపై రాళ్లు విసురుతున్నట్లు ఉంది.
దాడులకు పాల్పడుతన్న వారు మతమపరమైన నినాదాలు చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
వైస్ ఛాన్సలర్ ఏమన్నారు?
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖెడావాలా, మాజీ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ షేక్‌లు బాధిత విద్యార్థులతో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.
ఇద్దరు నేతలూ ఈ ఘటనను ఖండించారు. గుజరాత్ పోలీసులు, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వారు ప్రశ్నించారు.
గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నీరజా గుప్తా, “రెండు గ్రూపుల మధ్య ముందు నుంచి విబేధాలు ఉన్నాయి. అసలు ఏం జరిగిందనే విషయం విచారణలో తెలుస్తుంది” అన్నారు.
“కొంతమంది విద్యార్థులు హాస్టల్ బయట నమాజ్ చేస్తున్న సమయంలో ఆ గుంపుతో వాగ్వాదం జరిగింది. యూనివర్సిటీ యాజమాన్యం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. ఆరోజు రాత్రే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు” అని చెప్పారు.
పోలీసులు ఏం చెప్పారు?
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటనపై హోంశాఖలోని ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అయితే, దీనిని ధృవీకరించడానికి సమాచారం లభించలేదు.
ఆదివారం ఈ విషయం వెలుగులోకి రావడంతో అహ్మదాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ జీ.ఎస్.మాలిక్ ఘటనాస్థలానికి చేరుకుని, పరిశీలించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “75మందికి పైగా విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు. రాత్రి సమయంలో కొంతమంది విద్యార్థులు హాస్టల్ భవనం బయట నమాజ్ చేస్తున్నారు. అప్పుడు కొంతమంది వచ్చి అక్కడెందుకు నమాజ్ చేస్తున్నారని ప్రశ్నించారు” అని చెప్పారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, అదే విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. అది తారాస్థాయికి చేరకుని, ఘర్షణకు దారి తీసింది.
పోలీసు కంట్రోల్ రూంకు రాత్రి 10.51కు సమాచారం అందినదని, వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నామని పోలీసులు చెప్పారు.
దీనిపై సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు చేశాడని, 25మంది రాళ్లదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.
“20-25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. వారిని గుర్తించేందుకు తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశాం. బాధ్యులను అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. క్రైం బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఈ కేసును పర్యవేక్షిస్తారు” అని పోలీస్ కమిషనర్ చెప్పారు.
ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థుల్లో ఒకరు శ్రీలంకకు చెందినవారని, మరొకరది తజికిస్తాన్ అని అహ్మదాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ జీ.ఎస్.మాలిక్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ వేదికపైకి జాన్ సీనా నగ్నంగా ఎందుకు వచ్చారు?
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
- రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?
- జీఎన్ సాయిబాబా: ‘నేను ఇంతకాలం బతుకుతానని జైలు అధికారులు కూడా అనుకోలేదు’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)