You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎన్డీయేలోకి టీడీపీ: నరేంద్ర మోదీపై చంద్రబాబు స్వరం ఎలా మారుతూ వచ్చింది?
- రచయిత, వి. రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో కలిసి పని చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ నాయకత్వం కూడా టీడీపీ, జనసేనలతో కలిసి ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు శనివారం నాడు ఆ రెండు పార్టీల నేతలతో చర్చల అనంతరం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొంది.
అయితే, టీడీపీ, జనసేన, బీజేపీల అనైతికపొత్తు ఊహించిన విషయమేనని, ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా మరోసారి వైయస్సార్ కాంగ్రెస్‌కు పట్టంగట్టేందుకే ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏపీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు అన్నారు.
టీడీపీ, జనసేనలను ఎన్డీయేలోకి తీసుకుంటున్నట్లు అధికారిక ప్రకటన వెలువడంతో గతంలో ఎన్డీయేతో కలిసి పని చేసి, మరికొన్నాళ్లు దూరం జరిగిన చంద్రబాబు నాయుడు మళ్లీ మోదీ కలిసి పని చేయడానికి సిద్ధమయ్యారని స్పష్టమైంది.
అయితే, వివిధ సందర్భాలలో ప్రధానమంత్రి మోదీ పట్ల భిన్న ప్రకటనలు చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. 2019లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.
మోదీకి కుటుంబం కూడా లేదని, కుటుంబం లేనికి వ్యక్తి విలువలు ఏం తెలుస్తాయని, మోదీకి అసలు గుర్తింపే లేదని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఒకప్పుడు బీజేపీతో రాజకీయ కారణాలతో కలిసి పని చేశామని, ఇప్పుడు మోదీ కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది కాబట్టి తాము మోదీని వ్యతిరేకిస్తున్నామని చంద్రబాబు ఆ ఇంటర్వ్యూలో అన్నారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు చంద్రబాబు నాయుడు స్వరం మారింది. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ను పూర్తిగా సమర్థిస్తున్నా...’’ - రిపబ్లిక్ టీవీ చానల్ 2023 ఏప్రిల్ 25న నిర్వహించిన ‘‘టైమ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్’’ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో బీజేపీ నడిపిస్తున్న నేషల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) కూటమిలో టీడీపీ మళ్లీ చేరుతుందా అనే ప్రశ్న అప్పటి నుంచే వినిపించసాగింది. చివరకు ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కలిసి పని చేస్తున్నట్లు ప్రకటించుకున్నాయి.
మొదట దూరం, తరువాత చేరిక
మోదీ ప్రధాని పదవి చేపట్టిన దగ్గర నుంచి చంద్రబాబు వైఖరి పలు విధాలుగా మారుతూ ఉంది. మొదట కొన్నేళ్లు స్నేహహస్తం అందించిన బాబు తరువాత తన వైఖరి మార్చుకున్నారు. ఇప్పుడు మైత్రీరాగం అందుకున్నారు.
మోదీని చంద్రబాబు ఎప్పుడు పొగిడారో, ఎప్పుడు విమర్శించారో వివరంగా చూద్దాం.
2002:
ఫిబ్రవరి-మార్చి మధ్య గుజరాత్ అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నారు. గుజరాత్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ మోదీ రాజీనామా చేయాలని నాడు చంద్రబాబు డిమాండ్ చేశారు. అప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
2014:
2004 ఎన్నికల్లో ఎన్‌డీఏలోనే ఉన్న టీడీపీ, 2009 ఎన్నికల నాటికి ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది.
2014 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ ఎన్‌డీఏలో చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మోదీని చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు.
కాంగ్రెస్ పాలనలో దేశం "అవినీతిలో కూరుకు పోయింది", ‘‘అవినీతి అనేది దేశానికి క్యాన్సర్’’ మాదిరిగా పట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. అవినీతిని పారదోలాలంటే మోదీ లాంటి నాయకుడు కావాలన్నారు.
2014 ఏప్రిల్‌లో మహబూబ్ నగర్ పట్టణంలో బీజేపీ, టీడీపీ కూటమి ఎన్నికల ప్రచార సభ జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక పత్రికలో ట్రైనీ జర్నలిస్టుగా ఉన్న నేను, ఒక స్థానిక సీనియర్ జర్నలిస్టు వెంట ఆ సభ కవరేజీకి వెళ్లాను.
సభకు మోదీ, చంద్రబాబు వచ్చారు.
మోదీ, తనకు కేటాయించిన కుర్చీలో చంద్రబాబును లాగి మరీ కూర్చోబెట్టింది ఈ సభలోనే. చంద్రబాబు వద్దు అంటున్నా మోదీ ఆయన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ సీన్ నేటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది.
‘‘నరేంద్ర మోదీ ప్రధాని కావాలా, వద్దా? దేశంలోని ప్రతి ఒక్కరు మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు.’’
‘‘గుజరాత్‌ను ఆయన బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. దేశాన్ని కూడా అలాగే చేస్తారు.’’
‘‘యువతకు ఉద్యోగాలు, మహిళలకు భద్రత ఉండాలంటే నరేంద్ర మోదీ నాయకత్వం ఈ దేశానికి అవసరం.’’
‘‘రాహుల్ గాంధీ ఒక నాయకుడా? కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం.’’ అంటూ చంద్రబాబు మోదీని పొగుడుతూ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
యూట్యూబ్‌లో వెతికితే ఆ వీడియోలు నేటికీ కనిపిస్తాయి.
2015:
ఆ ఏడాది అక్టోబరు 22న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు మోదీ వచ్చారు. నాడు చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని చాలా పొగిడారు.
‘‘మీరు ఏది ప్రారంభించినా అది విజయవంతమవుతుంది. అమరావతి కూడా వృద్ధి చెందుతుంది’’
‘‘రాష్ట్రానికి ప్రధాని మోదీ ఎంతగానో సహకరిస్తున్నారు’’
‘‘మీరు చూపించిన చొరవ, కష్టాల్లో ఉన్నప్పుడు సహకరించిన తీరును తెలుగు జాతి ఎప్పుడూ మరచిపోలేదు’’
ఇలా సాగింది చంద్రబాబు ప్రసంగం.
2016:
నవంబరు 8న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాడు సమర్థించారు. "పెద్దనోట్ల రద్దుతో నల్లధనం, నకిలీ నోట్ల సమస్య ఉండదు" అని ఆయన అన్నట్టు ఇండియా టుడే ఒక కథనంలో తెలిపింది.
ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చాక...
2018:
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెబుతూ, ఎన్‌డీఏ నుంచి బయటకు రావాలని నిర్ణయించామని 2018 మార్చి 7న చంద్రబాబు ప్రకటించారు.
ఆ తరువాత కొద్ది రోజులకు ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఉద్యమం చేపట్టారు.
బీజేపీతో సంబంధాలు తెంచుకున్న నాటి నుంచి మోదీని ఆయన విమర్శించడం ప్రారంభించారు.
‘‘ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి వాటిని కేంద్రం పట్టించుకోవడం లేదు. నరేంద్ర మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారు’’ అంటూ నాడు అసెంబ్లీలో ఆయన విమర్శించారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి టీడీపీ పోటీ చేసింది.
2018 నవంబరు 8 నాటికి పెద్దనోట్లు రద్దు చేసి రెండేళ్లు అయింది.
2016లో ఆ నిర్ణయాన్ని ప్రశంసించిన చంద్రబాబు, ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత పెద్దనోట్ల రద్దును విమర్శించారు.
‘‘పెద్దనోట్ల రద్దు అనేది డిజాస్టర్. ఇప్పటికీ దేశం దాని ప్రభావం నుంచి కోలుకోలేదు. సరైన ఆలోచన లేకుండా బీజేపీ తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్థికవ్యవస్థకు బాగా దెబ్బతగిలింది’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఆ తరువాత బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ లాంటి ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.
‘‘పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అంతరాలను మోదీ చెరిపేశారు.. బీజేపీని వ్యతిరేకించే వారంతా కలిసి పని చేయాలి’’ అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారని అప్పట్లో ది వైర్ ఒక కథనాన్ని ప్రచురించింది.
కొనసాగిన విమర్శల పర్వం
2019:
చంద్రబాబు ఫిబ్రవరి 11న ప్రత్యేక హోదా కోసం దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో 'ధర్మపోరాట దీక్ష'ను చేపట్టారు.
అప్పుడు మోదీ గురించి చంద్రబాబు అన్న మాటలు ఇవీ..
‘‘మట్టి, యమునా నీళ్లు మన ముఖాన కొట్టారు...’’
‘‘ఈ ప్రధానమంత్రి వ్యక్తిగతంగా నన్ను విమర్శిస్తున్నారు. నేను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటారు?’’
‘‘మీ(మోదీ) కంటే మించిన నటులు భారత్‌లో ఎవరూ లేరు...’’
‘‘ప్రజలు మీకు(మోదీ) పూర్తి మెజారిటీ ఇచ్చారు. ఈ దేశానికి మీరు ఏం ఒరగబెట్టారో చెప్పండి. దేశాన్ని విభజించి, విద్వేషాలు పెంచారు...’’
అమరావతి శంకుస్థాపన సమయంలో మోదీ ఏ పని చేపట్టినా విజయవంతమవుతుందని పొగిడిన చంద్రబాబు, ఈసారి మాత్రం ‘‘మీరు ఎప్పుడూ మాటల మనిషే కానీ చేతల మనిషి కాదు.. ఏ పనీ చేయడం మీకు చేత కాదు’’ అన్నారు.
‘‘గుజరాత్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టింది మీరే (మోదీ). మళ్లీ దీక్ష చేసింది మీరే(మోదీ). ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఆయనకు లేదు, రాజీనామా చేయాలని మేమంతా నాడు డిమాండ్ చేశాం.’’
‘‘మీరు కాపాలాదారు(చౌకీదార్) కాదు, మీ వద్ద ఉన్న తాళాలతో గేట్లు తీసి దొంగలను విదేశాలకు పంపుతున్నారు.’’
‘‘రఫేల్ యుద్ధవిమానాల ధరను మూడు రెట్లు పెంచారు. దళారులు చేసే పనిని ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు చేసింది? రక్షణ విధానాలను తుంగలో తొక్కి అనుభంలేని రిలయన్స్‌కు కాంట్రాక్టు ఇచ్చారు.’’
‘‘నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేశారు. మోదీకి వ్యతిరేకంగా ఓట్లు వేయకపోతే రాష్ట్రంలో, దేశంలో ఎన్నికలే ఉండవు.’’ అంటూ చంద్రబాబు విమర్శించారు.
మళ్లీ ప్రశంసలు
2020:
కరోనావైరస్ మహమ్మారి సమయంలో నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలను చంద్రబాబు ప్రశంసించారు.
‘‘మీ(మోదీ) సమర్థవంతమైన నాయకత్వంలో కోవిడ్-19 సంక్షోభం నుంచి దేశం బయటపడి, మళ్లీ గాడిలో పడుతుంది’’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారని రిపబ్లిక్ వరల్డ్ వెబ్‌సైట్ ప్రచురించింది.
2023:
ఏప్రిల్ 25న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో మోదీ విధానాలను సమర్థిస్తూ చంద్రబాబు మాట్లాడారు.
ఒంటరిగా పోటీ చేయరనే విమర్శలు
దాదాపు 1975 నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనపై ‘‘ఎన్నికల్లో ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయరు...’’ అనే విమర్శ ఉంది.
1995 సెప్టెంబరు 1న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీకి అధినేతగానూ మారారు.
1999 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఒక్కసారి కూడా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయలేదు.
2019లో తొలిసారి ఒంటరిగా పోటీ చేసింది. అప్పుడు ఓడిపోయారు.
1999 ఎన్నికల్లో తొలిసారి టీడీపీని చంద్రబాబు నడిపించారు. నాడు ఆయన బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో చేరారు.
చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ఎన్నికల ప్రస్థానం
1999 అసెంబ్లీ ఎన్నికలు:
టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసింది.
టీడీపీ: ఏపీలో 269 స్థానాల్లో పోటీ చేసి 180 సీట్లు గెలుచుకుంది.
బీజేపీ: 24 స్థానాల్లో పోటీ చేసి 12 సీట్లు గెలుచుకుంది.
2004 అసెంబ్లీ ఎన్నికలు:
మరోసారి బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి.
టీడీపీ: 267 స్థానాల్లో పోటీ చేసి 47 సీట్లు గెలుచుకుంది.
బీజేపీ: 27 స్థానాల్లో పోటీ చేసి 2 సీట్లలో గెలిచింది.
2009 అసెంబ్లీ ఎన్నికలు:
టీఆర్‌ఎస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంది.
టీడీపీ: 225 స్థానాల్లో పోటీ చేసి 92 స్థానాలు గెలుచుకుంది.
టీఆర్‌ఎస్: 45 స్థానాల్లో పోటీ చేసి 10 సీట్లలో విజయం సాధించింది.
2014 అసెంబ్లీ ఎన్నికలు:
టీడీపీ మళ్లీ ఎన్‌డీఏలో చేరింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించింది.
టీడీపీ: 102 స్థానాలు గెలుచుకుంది.
బీజేపీ: 4 స్థానాలు దక్కించుకుంది.
2019 అసెంబ్లీ ఎన్నికలు:
టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లకు 23 స్థానాలను గెలుచుకుంది.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే అత్యంత పురాతన శిలాజ అడవి గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్పారు?
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?
- మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు
- అనంత్ అంబానీ: వేల జంతువులతో రిలయన్స్ నిర్వహిస్తున్న ‘వంతారా’ జూలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)