పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?

    • రచయిత, మిషెల్లీ ఫ్లూరీ
    • హోదా, పనామా నుంచి బిజినెస్ కరస్పాండెంట్

మానవ నిర్మాణ అద్భుతాలలో పనామా కాలువ ఒకటి. ప్రపంచ సముద్ర వాణిజ్య రవాణాలో ఐదుశాతం ఈ కాలువ ద్వారానే జరుగుతోంది. కానీ ఈ కాలువకు ఇప్పుడో పెద్ద కష్టం వచ్చి పడింది. ఇందులో నీళ్ళు ఇంకిపోతున్నాయి.

నౌకల రవాణా సాగేందుకు అనువైన నీటిమట్టం పనామా కాలువలో ఉండటం లేదు. ఫలితంగా దీని ద్వారా ప్రయాణించే నౌకల సంఖ్యను కూడా తగ్గిస్తున్నారు.

లాకుల ద్వారా నీటి మట్టాన్ని పెంచి, తగ్గించి నౌకలు సాఫీగా సముద్రంలోకి ప్రవేశించేలా ఈ పనామా కాలువను నిర్మించారు.

ఎర్ర సముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలిపే సూయెజ్ కాలువలానే, పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాలను కలిపే మరో జలసంధి పనామా కెనాల్.

ఇటీవల సూయెజ్ కెనాల్‌లో ప్రయాణించే నౌకల హుతీల దాడుల కారణంగా భద్రతా పరమైన చిక్కులు ఎదుర్కొంటుంటే. పనామా కెనాల్‌లో నీళ్ళు ఇంకిపోయి నౌకల ప్రయాణానికి ఇబ్బందిగా మారింది.

పనామా కాలువలోకి గటూన్ సరస్సుకు చెందిన స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తుంటాయి. కాలువలోని నీటికి ఈ గటూన్ సరస్సే ఆధారం. కాలువ నీటి మట్టం అడుగంటుతున్న నేపథ్యంలో పనామా కాలువ హైడ్రాలజిస్ట్ నెల్సన్ గ్యుయెరా గటూన్ సరస్సులో పడవపై ప్రయాణించి పశ్చిమం వైపున ఉన్న నీటిమట్టం బోర్డును చూపారు.

‘‘ప్రస్తుతం ఆ బోర్డు 81.20 అడుగుల నీటి మట్టాన్ని చూపుతోంది. కానీ ఇదింకా ఐదు అడుగులు ఎక్కువగా ఉండాలి’’ అని ఆయన వివరించారు.

పనామా కాలువకు వర్షపు నీరే ఆధారం. ఇప్పుడు వర్షాలు తక్కువగా పడుతున్నాయి.

వర్షాభావం, ఎల్‌నినో ప్రభావం కారణంగా 110 ఏళ్ళ పనామా కాలువ చరిత్రలో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదైన రెండో సంవత్సరంగా 2023 నిలిచింది.

రికార్డులలో వర్షపాతం నమోదు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి 2023 అక్టోబరు లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే కాలువ ప్రాంతం 41 శాతం తక్కువ వర్షపాతాన్ని చూస్తోంది. దీనివల్ల అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల మధ్య దగ్గరి దారిగా ఉన్న ఈ కాలువలో నీటి మట్టం తగ్గి దాని ప్రభావం 27 వేల కోట్ల విలువైన కార్గో రవాణాపై పడుతోంది.

అధికారులు జల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రతిరోజూ పనామా కాలువద్వారా కొన్ని కార్గో నౌకలు ప్రయాణించగలుగుతున్నాయి. కాలువ లాకులను నిర్వహించేందుకు సరస్సు నుంచి నీటిని వదలడం ద్వారా ఇది సాధ్యమవుతోంది.

ప్రతిరోజూ 36 నౌకలు ప్రయాణించాల్సి ఉండగా, నీటిమట్టం తగ్గడం వల్ల ప్రస్తుతం ఈ సంఖ్యను 24కు తగ్గించారు.

రవాణా నౌకల బరువుపైన కూడా ఆంక్షలు విధించడంతో నౌకలు తక్కువ మొత్తంలోనే సరకు రవాణా చేస్తున్నాయి. రవాణా నౌకల సంఖ్య తగ్గించడం ప్రపంచ వాణిజ్యానికి సమస్యగా మారుతోంది.

మామూలు రోజులలో ప్రపచ సముద్ర వాణిజ్యంలో 5శాతం ఈ కాలువద్వారానే సాగుతోంది. అమెరికా కంటైనర్ల ప్రయాణమైతే 40 శాతం పనామా కాలువగుండానే జరుగుతుంది. కాలువలో నీళ్ళు ఇలాగే ఇంకిపోవడం కొనసాగితే నౌకలు ప్రత్యమ్నాయ మార్గాలు ఎంచుకోక తప్పదు. దీనివల్ల దూరం, రవాణా ఖర్చులు పెరుగుతాయి.

సవాళ్ళకు సిద్ధం: పనామా కెనాల్ అథారిటీ

కాలువలో నీరు తగ్గిపోవడం కేవలం నౌకల రవాణానే ప్రభావితం చేయదు. పనామా కెనాల్ యాజమాన్యం పనామా రాజధాని పనామా సిటీ సహా దేశంలోని సగం మంది జనాభా నీటి అవసరాలను తీర్చుతోంది. ఈ క్రమంలో పనామా కాలువ మరో వందేళ్ళకుపైగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని అథార్టీ భరోసా ఇస్తోంది.

కాలువలో నీళ్ళు ఇంకిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని పనామా కెనాల్ అథార్టీ మొదటి చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్ ఇల్యా ఎస్పినో డీ మారోట్టా చెప్పారు.

‘‘మేం దీనిని తరచూ తలెత్తే సమస్య కావాలను కోవడం లేదు. మేమీ మార్గంలో నౌకల రవాణాను, వాటి సరుకుల బరువును తగ్గించాలనుకోవడం లేదు’’ అని తెలిపారు.

పనామా కాలువ మనగడకు సహాయకారి కాగలవని భావిస్తున్న కొన్ని ప్రాజెక్టులలో వచ్చే ఐదేళ్ళలో 8.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే పథకాలను అమలు చేయడానికి అథార్టీ సిద్ధమవుతోంది.

‘‘పనామా వర్షాలు ఎక్కువగా పడే దేశం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టే ఇక్కడ కూడా వర్షపాతం తగ్గుతోంది. అంటే భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది జలసంరక్షణ’’ అని ఆమె చెప్పారు.

రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి

సముద్రమట్టానికి ఎగువన నిర్మించిన లాకుల ద్వారా పనమా కాలువలో సరుకు రవాణా నౌకలు ప్రయాణించి మధ్యలోని గుటెన్, అలాజ్యూలా అనే సరస్సులను దాటుకుని సముద్రంలోకి ప్రవేశిస్తాయి.

ఈ లాకుల ద్వారా ప్రయాణించే నౌక కోసం 50 మిలియన్ గ్యాలన్ల నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నీటివినియోగాన్ని తగ్గించగలిగే అధునాతన లాకులను 2016లో నిర్మించారు. ఇవి 60 శాతం నీటిని ఆదా చేయగలుగుతాయి.

అయితే పాత పనామా కాలువ లాకులు వినియోగంలోనే ఉన్నాయి. వీటికి రిపేర్లు చేయడమనేది ఓ పెద్ద ప్రాజెక్ట్. ఈ లోగా ఒక లాకు నీటిని మరో లాకులో వినియోగించుకునే మార్గాలను కాలువ యాజమాన్యం కనిపెట్టింది. వీటిని క్రాస్ ఫిల్లింగ్స్ అని పిలుస్తారు. ఇలా ఆదా చేసిన నీరు ఆరు నౌకల రవాణాకు సరిపడా నీటికి సమానంగా ఉంటోంది.

అలాగే రిజర్వాయర్ల నిర్మాణంపై కూడా కాలువ యాజమాన్యం దృష్టి సారించింది.

వర్షాకాలంలో నీటిని సంరక్షించి, వేసవిలాంటి రోజుల్లో నీటి సరఫరా సాఫీగా జరగడానికి వీలుగా ఇండోరివర్ వద్ద డ్యామ్ కట్టి దాని నుంచి పనామా కెనాల్ కు ప్రధాన రిజర్వాయర్‌గా ఉన్న గుటెన్ సరస్సులోకి నీటిని పైపుల ద్వారా వదలనున్నారు. ఈ పథకం వల్ల నౌకల ట్రాఫిక్ రోజూ 12 నుంచి 15కు పెరుగుతుంది.

అయితే ఈ దిశగా ముందుకు వెళ్ళడమనేది అనుకున్నంత తేలికైన పని కాదు. ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా ప్రభుత్వ అనుమతి రాలేదు. అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి అనేక సంవత్సరాలు పడుతుంది.

పసిఫిక్, అట్లాంటిక్ మధ్య షార్ట్ కట్

సముద్ర జలాలను శుద్ధి చేసే కర్మగారాలను నిర్మించడం మరో ఆలోచన. వర్షాభావ పరిస్థితుల కారణంగా నదులు, సరస్సులలో ఉప్పుశాతం పెరుగుతోంది. దేశంలోనే అతిపెద్ద మంచినీటి వనరులను నిర్వహిస్తున్న సంస్థగా పనామా యాజమాన్యానికి ఈ సవాలును ఎదుర్కోక తప్పని పరిస్థితి. కానీ ఈ ఆలోచన చాలా ఖర్చుతో కూడుకున్నది. సముద్రజలాల నుంచి ఉప్పును తొలగించి శుద్ధి చేయడానికి భారీ ఖర్చు, ఇంధనం అవసమరవుతాయి.

ఈ ఏడాది మరింత అస్థిరంగా మారిన ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది. పనామా కాలువలో సరుకు రవాణా దాని గరిష్ఠ సరకు రవాణాతో పోల్చితే 49 శాతానికి పడిపోయింది.

తమ రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందని అగుంజా షిఫ్పింగ్ కంపెనీకి పనమా బ్రాంచ్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న జోస్ సెర్వంటీస్ చెప్పారు. పనామా కాలువలో నీటి మట్టం పడిపోవడం వల్ల వస్త్రాల నుంచి ఆహారం దాకా ఉన్న రెండు మిలియన్ టన్నుల గూడ్స్ రవాణా ఆలస్యమవుతోందని ఆయన తెలిపారు.

పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ఉన్న షార్ట్ కట్ మార్గమిదే అని జోస్ సెర్వంటీస్ చెప్పారు. అయితే ఇది మూత పడితే ప్రత్యామ్నాయం చూసుకోకతప్పదు. దాంతో సరకు రవాణాకు చాలా ఎక్కువ సమయం, ఎక్కువ డబ్బు ఖర్చవుతాయి. రోడ్డు రైలు మార్గాల ద్వారా చేసే రవాణా కారణంగా ఖర్చు పెరిగితే దాని ప్రభావం అంతిమంగా వినియోగదారుడిపైనే పడుతుందని ఆయన తెలిపారు.

వానలు అనుకున్నంత స్థాయిలో పడితే పనామా కాలువ లాకుల ద్వారా ప్రయాణించే నౌకల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. కానీ అది తాత్కాలిక పరిష్కారమే అవుతుంది.

ఇది వాతావరణ మార్పుల దుష్ప్రభావమే అనడంలో సందేహం లేదు. ఈ ప్రభావం ప్రపంచవాణిజ్యంతోపాటు పనామా కాలువ భవితవ్యంపైనా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)