మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు

కొంత మందికి బయటకు వెళ్లడం ఇష్టమే ఉండదు. మరికొంత మంది చీకటిగా ఉండే గదిలో అలా పడుకొని ఉండటాన్ని ఇష్టపడతారు. కొందరు హెడ్‌ఫోన్లలో పెద్దగా సౌండ్ పెట్టుకొని పాటలు వినడాన్ని ఆస్వాదిస్తారు.

కానీ, ఇలాంటి ప్రవర్తన వల్ల మెదడుపై చెడు ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

ఈ కథనంలో మెదడుకు చేటు చేస్తున్న 11 అలవాట్ల గురించి చర్చిద్దాం. వాటితోపాటు ఇలాంటి అలవాట్లను ఎలా మానుకోవాలో తెలుసుకుందాం.

హార్వర్డ్ మెడికల్ స్కూల్, యూఎన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ వంటి సంస్థలు సహా వివిధ పరిశోధక నివేదికలను క్రోడీకరించి అందులోని సమాచారాన్ని ఈ కథనంలో అందిస్తున్నాం.

1. నిద్ర లేమి

మెదడుకు అత్యంత తీవ్ర నష్టం తగినంత నిద్ర లేకపోవడం వల్లే జరుగుతుందని న్యూరాలజీ అండ్ వెల్‌నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా వెల్లడించింది.

పెద్దలకు తగినంత నిద్ర అంటే రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలని సూచించింది. రాత్రి పూట నిద్రపోతే మరింత మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

నిద్రపోగానే మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలోనే మెదడు కొత్త కణాలను సృష్టిస్తుంది. ఏడు గంటల నిద్రలేకపోతే కొత్త కణాలు ఏర్పడవు.

ఫలితంగా, మీరు ఏ విషయాన్నీ గుర్తుంచుకోలేరు. ఏకాగ్రత కుదరదు. చిరాకుగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. నిద్రలేమి వల్ల అల్జీమర్స్ వచ్చే ముప్పు పెరుగుతుంది.

మీ మెదడును రక్షించుకోవాలంటే ఒకటే మార్గం. రోజూ రాత్రి కనీసం 7 గంటలు నిద్రపోవడమే దీనికి పరిష్కారం. 8 గంటలు నిద్రపోతే ఇంకా మంచిది.

ఇందుకోసం మీరు రోజూ నిద్రపోవడానికి ఒక గంట ముందే మంచంపైకి చేరుకోవాలి. ఈ సమయంలో ఎలాంటి గ్యాడ్జెట్స్‌ను వాడకూడదు.

మీ పడకగదిని నిద్రకు అనువైన ప్రదేశంగా మార్చుకోవాలి. నిద్రపోయేముందు గదిలో వెలుతురును తగ్గించండి. మీ మంచం, దుస్తులు, గది ఉష్ణోగ్రత అన్నీ మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోండి.

ఇంకో విషయం. ముఖాన్ని మొత్తం కవర్ చేసుకొని ఎప్పుడూ నిద్రించవద్దు. ఎందుకంటే మనం ముక్కు ద్వారా ఆక్సీజన్‌ను పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్‌ను వదులుతాం. ఈ నిరంతర ప్రక్రియ కారణంగా ముఖాన్ని మొత్తం కవర్ చేసుకున్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ మీ ముఖం చుట్టూ పేరుకుపోతుంది. ఫలితంగా నిద్రలో మీకు సరిపడా ఆక్సీజన్ అందకపోవచ్చు.

2. బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం

రాత్రంతా తినకుండా ఉన్న తర్వాత, ఉదయాన చేసే అల్పాహారం రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది. కానీ, మనలో చాలా మంది ఉదయాన బ్రేక్‌ఫాస్ట్ తినడాన్ని మానేస్తారు.

బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పడిపోతాయి. ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది.

రోజూ బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం వల్ల మెదడుకు నష్టం కలుగుతుంది. మెదడులోని కణాల సామర్థ్యం తగ్గిపోతుంది.

పోషకాల లేమి వల్ల మెదడు సాధారణ పనితీరు దెబ్బతింటుంది.

3. తగినంత నీరు తాగకపోవడం

మన మెదడులో 75 శాతం నీరే ఉంటుంది.

మెదడు సామర్థ్యం మేరకు పని చేయాలంటే తగినంత నీటితో హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం.

తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల మెదడులోని కణజాలాలు కుంచించుకుపోతాయి. కణాల పనితీరు క్షీణిస్తుంది. దీనివల్ల మీరు తార్కికంగా ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది.

నిపుణులు చెప్పినదాని ప్రకారం, మెదడును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పెద్దలు రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి.

మీ వయస్సు, ఆరోగ్యం, బరువు, వాతావరణ పరిస్థితులు, జీవన విధానాన్ని బట్టి నీరు తాగాల్సిన మోతాదు పెరగవచ్చు.

4. దీర్ఘకాలిక ఒత్తిడి

దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మెదడు కణాలు చనిపోతాయి. మెదడు ముందుభాగం కుంచించుకుపోతుంది. ఇది మన జ్ఞాపకశక్తిని, ఆలోచనాశక్తిని ప్రభావితం చేస్తుంది.

పరిశోధకుల ప్రకారం, నిరంతరం పనిలో మునిగితేలే వ్యక్తులు, ఎవరైనా ఏదైనా చేయాలని అడిగితే ‘నో’ చెప్పలేని వారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు.

వెంటనే ఈ తీరును మార్చుకోండి. అదనపు ఒత్తిడిని వదిలేయండి.

అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా కొందరు మెదడుకు ఒత్తిడి కలిగించే పనుల్ని చేస్తూనే ఉంటారు.

అనారోగ్యంగా ఉన్నప్పుడు మెదడు, అనారోగ్యాన్ని తగ్గించే పనిలో బిజీగా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి అనారోగ్యంగా ఉన్నప్పుడు మెదడుకు పని చెప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. పనికి సెలవు ఇవ్వాలి.

లేని పక్షంలో మెదడుపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది.

ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం కూడా అధిక ఒత్తిడికి కారణం అవుతుంది.

మనలో చాలా మంది, రోజంతా కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉంటారు.

దీనితోపాటు సెలవుల్లో కూడా మనం ఇంట్లోనే ఉంటాం. తగినంత శారీరక కదలికలు, శ్రమ చేయడం లేదు.

దీనివల్ల ఊబకాయం, గుండె వ్యాధులు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. డిమెన్షియా కూడా రావొచ్చు.

కాబట్టి మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజూ వ్యాయామం చేయాలి. అరగంటకు ఒకసారి కుర్చీలోంచి లేచి నడవాలి. దీనికోసం టైమర్ సెట్ చేసుకోవచ్చు.

వారంలో కనీసం మూడు రోజులు అరగంట పాటు వాకింగ్ లేదా జాగింగ్ చేయాలి.

5. గూగుల్‌పై అతిగా ఆధారపడటం

మన ముందు తరం వారు క్యాలిక్యులేటర్లు వాడకుండా చిన్న చిన్న లెక్కలు చేయడం, ఫోన్ నంబర్లను గుర్తుంచుకోవడం, అధికంగా పుస్తకాలు చదవడం వంటివి చేసేవారు. వారికి జనరల్ నాలెడ్జ్ కూడా చాలా బాగుండేది.

ఇలాంటి అలవాట్లన్నీ మెదడుకు వ్యాయామం లాంటివి. ఇవి మెదడు ఆలోచనా శక్తిని, జ్ఞాపక శక్తిని దీర్ఘకాలం పాటు మెరుగ్గా ఉంచుతాయి.

కానీ, ఈ తరంలో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. టెక్నాలజీ మీద అతిగా ఆధారపడటం మన మెదడు సామర్థ్యాన్ని తగ్గించింది.

రోజురోజుకు జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి క్షీణిస్తున్నాయి.

మీ మెదడును చురుగ్గా ఉంచుకోవాలంటే గూగుల్ మీద ఆధారపడకుండా మీరే అన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వీటితో పాటు వర్డ్ జంబుల్, పజిల్ మ్యాచింగ్, సుడోకు వంటి మెదడుకు పని కల్పించే ఆటల ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

6. నిరంతరం హెడ్‌ఫోన్స్ వాడటం, బిగ్గరగా సంగీతం వినడం

మీరు వాడే హెడ్‌ఫోన్లు లేదా ఎయిర్‌పాడ్స్ 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే మీకు నష్టం కలిగిస్తాయి.

పెద్ద సౌండ్‌తో సంగీతం వినడం, ఎక్కువసేపు బిగ్గరగా వచ్చే ధ్వనులను వినడం వల్ల వినికిడి లోపం ఏర్పడవచ్చు.

ఒకసారి వినికిడి సామర్థ్యం దెబ్బతింటే, అది తిరిగి మామూలు స్థితికి రాలేదనే భయాలు కూడా ఉన్నాయి.

వినికిడి లోపం కూడా నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది.

అమెరికా పరిశోధకుల ప్రకారం, వినికిడి లోపం ఉన్న వ్యక్తుల్లో మెదడు కణజాలం కూడా దెబ్బతింటుంది. ఇది వారికి అల్జీమర్స్ వచ్చే ముప్పును పెంచుతుంది.

ఫలితంగా చదవడం, ఏకాగ్రత కుదరడం కష్టం అవుతుంది.

హెడ్‌ఫోన్లు వాడేటప్పుడు, మీకు నచ్చిన పాటను పెద్ద ధ్వనితో వినే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

మీరు ఎక్కువసేపు హెడ్‌ఫోన్లలో పాటలు వింటున్నట్లయితే వాల్యూమ్‌ను 60 శాతానికి మించి పెంచవద్దు. అదే పనిగా హెడ్‌ఫోన్లు వాడుతున్నట్లయితే మధ్యలో ఒక గంట బ్రేక్ తీసుకోండి.

7. ఎప్పుడూ ఒంటరిగా ఉండటం, ఇతరులతో కలవలేకపోవడం

ఇతరులతో మాట్లాడటం, చాటింగ్ వంటివి మీ మెదడు ఆరోగ్యంగా ఉండటానికి చాలా కీలకం.

తగినంత నిద్ర లేకపోతే మెదడుకు ఎంత నష్టం కలుగుతుందో, ఎప్పుడూ ఒంటరిగా ఉండటం వల్ల కూడా అంతే నష్టం కలుగుతుంది.

స్నేహితులతో లేదా కుటుంబంతో ఉండటం వల్ల మెదడు తాజాగా ఉంటుంది.

ఒంటరితనం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

మీ మెదడు ఆరోగ్యం బాగుండాలంటే మీ స్నేహితులు, కుటుంబంతో తరచూ తగినంత సమయాన్ని గడపండి. అయితే, వారు సానుకూల దృక్పథంతో ఆలోచించే వారు అయితే మంచిది.

8. ప్రతికూల ఆలోచనలు, వ్యక్తులు

ప్రతికూలంగా ఆలోచించే అలవాటు ఉంటే మెదడుకు హాని కలుగుతుంది.

ఎందుకంటే ప్రతికూల ఆలోచనల కారణంగా ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి తలెత్తుతాయి.

అలాగే డిమెన్షియా, అల్జీమర్స్‌కు కారణమయ్యే అమిలాయిడ్, టౌ వంటి ప్రొటీన్లు మెదడులో పేరుకుపోతాయి.

కాబట్టి, వెంటనే ప్రతికూల ఆలోచనల్ని ఆపడానికి ప్రయత్నించండి. ఇలా తరచూ చేయడం అలవాటుగా మారుతుంది.

ఇలాంటి ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి కావాలంటే సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోవచ్చు.

ప్రతికూల స్నేహాలను వదులుకోవడం చాలా ముఖ్యం. ప్రతికూల వార్తల్ని ఎక్కువగా చూడకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

9. చీకటిలో ఎక్కువ సమయం గడపటం

చీకటిలో ఎక్కువ సమయం గడిపేవారు లేదా గాలి, వెలుతురు తక్కువగా ఉండే ఇరుకు ప్రదేశాల్లో చాలా కాలం పాటు ఉంటే అలాంటి వాతావరణం వ్యక్తుల మెదడుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుందని అమెరికా పరిశోధన తెలిపింది.

మెదడు ఆరోగ్యానికి సూర్యరశ్మి చాలా కీలకం. లేకపోతే డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి.

మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోజూ కాసేపు ఎండలో ఉండాలి. ఇందుకోసం బయటకు వెళ్లాలి. ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి.

10. అతిగా తినే అలవాటు

ఎంత ఆరోగ్యకర ఆహారం అయినప్పటికీ అతిగా తింటే మెదడుకు నష్టం కలగొచ్చు.

అతిగా తినడం వల్ల మెదడులోని ధమనులు మూసుకుపోయి రక్త ప్రకసరణ తగ్గిపోతుందని పరిశోధనలు చూపించాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచనా శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి. ఇది అల్జీమర్స్‌కు దారి తీస్తుంది.

జంక్ ఫుడ్, నూనెలో వేయించిన ఆహారాలు, అధిక చక్కెరలు ఉండే చిరుతిండ్లు, శీతల పానీయాల వల్ల కూడా ఇలాంటి ముప్పే వస్తుంది.

అందుకే తగు మోతాదులో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

రోజూవారీ క్యాలరీలను తెలుసుకోవడానికి చాలా మంది వేర్వేరు యాప్‌లను వాడతారు. కానీ న్యూట్రిషన్ సలహా ప్రకారం సొంతంగా డైట్‌ను రూపొందించుకొని దాన్ని అనుసరించడం చాలా ఉత్తమ మార్గం.

డైటింగ్ చేయడం అంటే కొవ్వును వదిలించుకోవడమే అని చాలా మంది భావిస్తారు. కానీ, మెదడులో 60 శాతం కొవ్వు ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. అందుకే అన్ని రకాల ఆహారాలను తినాలి. కానీ, తగు మోతాదులో తీసుకోవాలి.

మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇవి మెదడుపై చాలా దుష్ప్రభావాలను చూపుతాయి.

ఇవి మెదడులోని నరాలను కుంచించుకుపోయేలా చేసి కణాలను దెబ్బతీస్తాయి.

11. స్క్రీన్ టైమ్

స్క్రీన్ టైమ్ విపరీతంగా ఉంటే అది మెదడు పరిమాణం, అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలు ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లను వాడటం వల్ల ఫ్రంటల్ కార్టెక్స్‌కు భారీ నష్టం కలుగుతుంది.

రోజులో ఏడు గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్ల ముందు గడిపే పిల్లల్లో సెరెబ్రల్ కార్టెక్స్ సన్నగా ఉంటుందని పరిశోధనలు చూపుతున్నాయి.

ఎందుకంటే మొబైల్ ఫోన్లలోని విద్యుదయస్కాంత క్షేత్రాలకు ఎక్కువ సమయం పాటు ఎక్స్‌పోజ్ కావడం వల్ల తలనొప్పి, గందరగోళం, మెదడులో కణతులు ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

అందుకే, పిల్లలు స్క్రీన్ చూసే సమయాన్ని పూర్తిగా తగ్గించాలి. ఫోన్‌ను శరీరానికి దగ్గరగా పెట్టుకొని నిద్రపోకూడదు.

జేబులో కంటే ఫోన్‌ను బ్యాగ్‌లో పెట్టుకోవడం ఉత్తమం. ఎక్కువసేపు ఫోన్‌లో మాట్లాడాల్సి ఉంటే స్పీకర్ పెట్టుకొని మాట్లాడటం మంచిది. ఫోన్‌లో మాట్లాడటం కంటే మెసేజ్‌లు చేయడం మరింత మంచిది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)