చంద్రబాబు కుప్పం పర్యటన: ‘నా నియోజకవర్గం నుంచి నేను పారిపోవాలా’... పోలీసుల మీద టీడీపీ అధినేత ఆగ్రహం

కుప్పం పర్యటన గురించి నెల ముందే డీజీపీకి సమాచారం ఇచ్చానని అయినా తన పర్యటను అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

రోడ్ షో‌ చేయనివ్వకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తనను సొంత నియోజకవర్గంలోకి ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

‘మీరు ఏ చట్టప్రకారం జీవోను తీసుకొచ్చారు. ఇప్పటికే చట్టం అమల్లో ఉంటే కొత్త జీవో ఎందుకు? ప్రభుత్వం తీరుతో విసిగి పోయిన ప్రజలు మా సభలకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ సభలను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోంది.

1861 నాటి చట్టాన్ని ఇప్పుడు మాపై రుద్దుతారా? ఆ చట్టం మద్రాస్ ప్రెసిడెన్సీకి వర్తించదు. దాన్ని అడాప్ట్ చేసుకోవాలి’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడు రోజుల పర్యటన కోసం ఇప్పటికే చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం చేరుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ‘ఇదేం ఖర్మ’ అనే కార్యక్రమాన్ని ఆయన చేపడుతున్నారు.

పెద్దూరు వద్ద చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం రోడ్ షోకు అనుమతి లేదని ఆయనకు తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తనను ఎలా అడ్డుకుంటారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇచ్చేందుకు డీఎస్‌పీ సుధాకర్ రెడ్డి వచ్చారు. కానీ నోటీసులు తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారు. ఎందుకు నోటీసులు ఇస్తున్నారో రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు రోడ్ షో కోసం టీడీపీ శ్రేణులు వస్తుండటంతో వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

ఇటీవల చంద్రబాబు ర్యాలీల్లో కొందరు మరణించడంతో, రోడ్ షోలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. నేడు శాంతిపురం మండలంలో పర్యటించనున్న చంద్రబాబు ప్రచార వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సభకు తరలివస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శాంతిపురం మండలంలోని గొల్లపల్లి వద్ద టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. కార్యకర్తల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం, చంద్రబాబు పర్యటనపై ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌కు నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. సభలకు అనుమతులు లేవని, సభలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

‘రాజకీయ లబ్ధి కోసమే’

అయితే రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు జీవో మీద రాద్ధాంతం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేశ్ అన్నారు.

‘చంద్రబాబు నాయుడుని రోడ్ షోలు చేయవద్దు అన్నారు. కానీ సమావేశాలు పెట్టుకోవద్దని చెప్పలేదు. ఇంత వరకు ఆయన సభల గురించి పోలీసులకు సమాచారమే ఇవ్వలేదు’ అని జోగి రమేశ్ ఆరోపించారు.