భోపాల్ గ్యాస్ విషాదం: 39 ఏళ్లయినా తేలని మృతుల సంఖ్య, అందని పరిహారం

    • రచయిత, సల్మాన్ రవి
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్, భోపాల్

దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తు అయిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు సుదీర్ఘకాలంగా న్యాయం కరవైంది.

ఈ గ్యాస్ ప్రమాద బాధితులు ఎంతో కాలంగా, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

1984లో డిసెంబర్ 2, 3 తేదీల్లో రాత్రి పూట, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి 40 టన్నుల ‘మిథైల్ ఐసోసైనేట్’ గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటన జరిగిన తర్వాత భోపాల్ నగరమంతా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

యూనియన్ కార్బైట్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు ఈ ఘటనతో బాగా ప్రభావితమయ్యాయి.

గ్యాస్ లీక్ తర్వాత ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున ఎక్కడి వారు అక్కడే కూలిపోయారు.

ఈ ప్రమాదంలో 5,295 మంది వరకు మరణించి ఉంటారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

అయితే, ఈ దుర్ఘటన జరిగి 39 ఏళ్లు అయినప్పటికీ మరణాల సంఖ్య, బాధితుల విషయంలో ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి.

ఎంత మంది చనిపోయారు, ఎంత మంది దీని బారిన పడ్డారన్నది ఇంకా అస్పష్టంగానే ఉంది.

ప్రమాద గణాంకాలపై అస్పష్టంగా ఉండటంతో భోపాల్ గ్యాస్ ఘటన బాధితుల తరఫున పలు సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ విషయంపై జనవరి 10న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ప్రభుత్వం 1997లోనే మరణాల సంఖ్యను నమోదు చేయడం ఆపివేసిందని భోపాల్ గ్యాస్ పీడిత్ పెన్షన్‌భోగి సంఘర్ష్ మోర్చా అధ్యక్షుడు బాలకృష్ణ నామ్‌దేవ్ చెప్పారు.

సుప్రీంకోర్టులో ప్రభుత్వం సమర్పించిన గణాంకాలన్ని తప్పుడువని ఆయన ఆరోపించారు. దీంతో మళ్లీ అన్ని సంఘాలు ఆందోళనకు దిగినట్టు తెలిపారు.

ఎంత మంది ప్రజలు చనిపోయారు?

గ్యాస్ బాధితుల సంఘాలకు చెందిన మహిళలు భోపాల్‌లో నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ విషయంలో జోక్యం చేసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్, ప్రభుత్వం సుప్రీంకోర్టులో సరైన గణాంకాలను సమర్పిస్తుందని హామీ ఇచ్చారు.

మంత్రి భరోసా మేరకు మహిళలు ప్రస్తుతం తమ నిరాహార దీక్షను విరమించారు.

ఈ దుర్ఘటన వల్ల వచ్చిన వ్యాధులతో 1997 నుంచి వేలాది మంది చనిపోయినట్టు అధికారిక రికార్డులు స్పష్టంగా పేర్కొంటున్నాయి.

నిజానికి ఈ ప్రమాదంలో 25 వేల మంది వరకు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రమాద మరణాల సంఖ్యను సవరించకపోతే, ఆందోళన సంస్థలు మళ్లీ నిరసనలను చేపట్టనున్నాయి.

ఒకవేళ మరణాల సంఖ్యను సవరించకపోతే, యూనియన్ కార్బైడ్, దాని యజమాన్య సంస్థ ‘డౌ కెమికల్’లు వారికి తగిన పరిహారాలు ఇచ్చేందుకు నిరాకరించవచ్చు.

బాధిత ప్రజలు దాఖలు చేసిన ‘క్యూరేటివ్ పిటిషన్’పై త్వరలోనే సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

రూ. 25,000 పరిహారం..

భోపాల్ గ్యాస్ పీడిత్ మహిళా స్టేషనరీ కర్మచారి సంఘానికి చెందిన మహిళ రషీదా బీ. ఆమె సంస్థ సుదీర్ఘకాలంగా గ్యాస్ బాధితుల తరఫున పోరాడుతోంది.

ఎంతో కాలంగా తాను గ్యాస్ లీక్ ద్వారా వచ్చిన దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొంటున్నట్టు ఆమె చెప్పారు.

ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే వారిలో ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కూడా ఉన్నారు.

ఈ గ్యాస్ లీక్ కారణంగా ప్రభావితమైన 9.3 శాతం మందికి మాత్రమే కేవలం రూ.25 వేలు అందినట్టు రశిదా బీ అన్నారు.

కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం..

ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టించేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని గ్యాస్ బాధితుల కోసం పోరాడుతున్న భోపాల్ గ్రూప్ ఫర్ ఇన్‌ఫర్మేషన్ అండ్ యాక్షన్‌కు చెందిన రచనా ధింగ్రా బీబీసీకి చెప్పారు.

సుప్రీంకోర్టులో సమర్పించిన గణాంకాలు కనీసం ప్రభుత్వ రికార్డులతో సరిపోవడం లేదని ధింగ్రా అన్నారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) రిపోర్టులను ప్రస్తావించిన ధింగ్రా.. 2010లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఈ గ్యాస్ ప్రమాద మరణాల సంఖ్య, బాధితుల డేటాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్టు చెప్పారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలని కోరుతూ అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు చౌహాన్ రాసిన లేఖను ధింగ్రా బీబీసీకి చూపించారు.

‘‘భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన (క్లయిమ్స్‌ ప్రాసెసింగ్) చట్టం 1985 ప్రకారం పరిహారాల విషయంలో అన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు. అప్పటి హోం మంత్రి పి. చిదంబరం ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థాయిలో మంత్రుల బృందం ఏర్పడింది. 10,047 మంది గ్యాస్ బాధితులు వాస్తవానికి చనిపోయిన వారి జాబితాలో ఉన్నారు. కానీ, వీరి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి మండలి మృతుల జాబితాకు పాటించిన ప్రమాణాలను వీరి విషయంలో పాటించలేదు." అని శివరాజ్ సింగ్ చౌహాన్ తన లేఖలో పేర్కొన్నారు.

"డెత్ క్లెయిమ్‌ వర్గీకరణలో మృతులను శాశ్వత లేదా పాక్షిక వైకల్యం క్యాటగిరీలో వేశారు. అలాగే, మరి కొన్ని సందర్భాలలో మృతికి కారణం గ్యాస్ ప్రభావం కాదని, సాధారణ క్యాటగిరీలో వేశారు. ఈ వర్గీకరణ న్యాయసమ్మతం కాదు.’’ అని చౌహాన్ ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

పరిహారాల డిమాండ్..

కాబట్టి , 10 వేల 47 మందిని మృతుల జాబితాలో చేర్చి , వారికి 10 లక్షల పరిహారం అందజేయాలని కోరుతున్నాను.

తద్వారా , గ్యాస్ ప్రమాదంలో మరణించిన మొత్తం 15 వేల 342 మంది కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చౌహాన్ అప్పటి ప్రధానమంత్రికి తెలియజేశారు.

గ్యాస్ ప్రమాదంలో పాక్షికంగా గాయపడిన వారికి అదనంగా రూ.5,21,332 ఇచ్చే విషయంలో ఎలాంటి ప్రతిపాదనలను చేయలేదు.

ఈ కేసులన్నింటిన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

అప్పుడైతేనే ఆ బాధితులకు న్యాయం చేకూరుతుందని అప్పటి ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు.

12 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఏం చెప్పారో గుర్తు చేయడం కోసమే ఈ ఆందోళన చేపట్టినట్టు గ్యాస్ పీడిత్ మహిళా పురుష్ సంఘర్ష్ మోర్చా షెహ్‌జాదీ బీ చెప్పారు.

ప్రభుత్వం ఆస్పత్రులకు చెందిన రికార్డులను, రీసెర్చ్ డేటాను కనీసం సుప్రీంకోర్టుకు సమర్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్యాస్ ప్రభావితం వల్ల 95 శాతం మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడ్డారని, 97 శాతం మందికి భయంకరమైన కిడ్నీ సమస్యలు వచ్చాయని ఆమె చెప్పారు. వీరిని గాయపడిన వారి కేటగిరీ కింద చేర్చారు.

ప్రస్తుతం రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వాస్ సారంగ్ సంస్థలకు హామీ ఇస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం సరైన గణాంకాలను సుప్రీంకోర్టుకి సమర్పించకపోతే, అప్పుడు గ్యాస్ బాధితులు తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తారు.

‘‘ఈ గ్యాస్ దుర్ఘటన అతిపెద్ద పారిశ్రామిక విపత్తు. పరిహారాలు, న్యాయం కోసం నేడు కూడా బాధితులు ఆందోళన చేయడం రెండో అతిపెద్ద దుర్ఘటన కంటే చిన్నదేమీ కాదు’’ అని రచన ధింగ్రా చెప్పారు.

ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉందని, ముఖ్యమంత్రి తేలిగ్గా తమకు న్యాయం కల్పించవచ్చని రశిదా బీ కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)