You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘నేను జైలులోనే చనిపోతానని అధికారులు అనుకున్నారు’ - నిర్దోషిగా విడుదలయ్యాక జీఎన్ సాయిబాబా ఏం చెప్పారంటే..
- రచయిత, రాఘవేంద్రరావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్. సాయిబాబా శనివారం (అక్టోబర్ 12) రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆయనను 2014లో పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 మార్చిలో సాయిబాబా నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యారు.
ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఆధారంగా 2024 మార్చి 11న పబ్లిష్ చేసిన కథనాన్ని ఇప్పుడు యథాతథంగా మరోసారి అందిస్తున్నాం.
‘‘నేను ఇంతకాలం బతుకుతానని జైలు అధికారులు అనుకోలేదు. నేను జైలులోనే చనిపోతానని వారు అనుకున్నారు’’
దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా జైలు నుంచి విడుదలైన తరువాత అన్న మాటలివి.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ- అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద ఆయనను 2014లో అరెస్టు చేశారు. ఆయనకు మావోయిస్టు సంస్థలతో సంబంధాలున్నాయని పోలీసులు ఆరోపించారు.
2017లో కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధరించి జీవిత ఖైదు విధించింది. అయితే 2022 అక్టోబర్ 14న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ జీఎన్ సాయిబాబాను విడుదల చేసింది.
ఆ తర్వాత 24 గంటల్లో, అంటే అక్టోబర్ 15న జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది.
సాయిబాబా సహా ఇతర నిందితులు 'దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు విఘాతం కలిగించేలా తీవ్రమైన నేరానికి పాల్పడ్డారు' అని సుప్రీంకోర్టు భావించింది.
2024 మార్చి 5న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మరోసారి ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. కమ్యూనిస్టు లేదా నక్సలైట్ సాహిత్యాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం, ఏదైనా భావజాలానికి మద్దతుదారుగా ఉండడం యూఏపీఏ చట్టం కిందకు రాదని పేర్కొంది.
అయితే, ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
దీని గురించి సాయిబాబా చింతిస్తున్నారా?
ఈ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ''చాలా కాలం తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నా. జైల్లో ఉన్నా, అనారోగ్యానికి గురయ్యా. వైద్యానికే నా తొలిప్రాధాన్యం. ఈ న్యాయ పోరాటం ముగియాలని కోరుకుంటున్నా. ఆ విషయం కోర్టులు, నా లాయర్లకే వదిలేస్తున్నా'' అని అన్నారు.
ప్రొఫెసర్ సాయిబాబా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆయన 90 శాతం వైకల్యం ఉంది.
ఈ కేసు కారణంగా జీఎన్ సాయిబాబా తన జీవితంలో దాదాపు పదేళ్లపాటు కోర్టుల్లో, జైల్లో గడిపారు.
''నేను ఈ పదేళ్లలో చాలా కోల్పోయాను. నా స్టూడెంట్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. తరగతులకు దూరమయ్యాను. నేనెప్పుడూ టీచర్‌గానే ఉన్నా, దాని ప్రాముఖ్యం నాకు తెలుసు. నేను జైల్లో ఉన్నా. విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు, వారితో మాట్లాడుతున్నట్లు కలలు వచ్చేవి'' అని ఆయన అన్నారు.
''నేను, నా భార్య వసంత గతంలో ఒక్కరోజు కూడా విడిగా ఉన్నది లేదు. కానీ గడచిన పదేళ్లలో దాదాపు ఎనిమిదన్నరేళ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీని కారణంగా నేనెంత కోల్పోయానో వెల కట్టలేను'' అని చెప్పారు.
'అది కిడ్నాప్, అరెస్టు కాదు'
తనను అరెస్టు చేసిన రోజును జీఎన్ సాయిబాబా గుర్తు చేసుకుంటూ.. ''నన్ను అరెస్టు చేయలేదు. కిడ్నాప్ చేశారు'' అన్నారు.
''యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెంటర్‌లో చీఫ్ ఎగ్జామినర్‌గా ఉన్నా. మధ్యాహ్న భోజన విరామ సమయం వరకూ అక్కడే ఉన్నా. భోజనం చేసేందుకు కారులో ఇంటికి బయలుదేరా, ఇంతలో సివిల్ డ్రెస్‌లో ఉన్న కొందరు నా కారు ఆపారు. డ్రైవర్‌ని అరెస్టు చేశారు. నన్ను కారులో నుంచి బయటికి లాగి కిడ్నాప్ చేశారు'' అని సాయిబాబా చెప్పారు.
''ఏ కేసులో నన్ను అరెస్టు చేస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, సివిల్ డ్రెస్‌లో ఉన్నారు, ఎవరు మీరు? అని అడిగాను. సమాధానం లేదు. మొదట సివిల్ లైన్స్‌కి, ఆ తర్వాత విమానాశ్రయానికి తీసుకెళ్లారు'' అని ఆయన తెలిపారు.
తనపై వచ్చిన ఆరోపణల గురించి ఆయన మాట్లాడుతూ, ''అప్పట్లో నాకేమీ చెప్పలేదు. కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత, యూఏపీఏ కింద పదేళ్ల కిందటి కేసులో నన్ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆయన్ను కస్టడీలోకి తీసుకుంటారా అని పోలీసులను కోర్టు అడిగినప్పుడు, కస్టడీ అవసరం లేదని, జైలుకి పంపించాలని పోలీసులు కోరారు. ఒకవేళ వాళ్లు నన్ను విచారించాలని అనుకుంటే అరెస్టు చేసి, కస్టడీకి తీసుకుని ఉండొచ్చు. నేను కూడా అందుకు అంగీకరించేవాడిని. కానీ, అలాంటిదేమీ జరగలేదు'' అని వివరించారు.
ఎందుకు అరెస్టు చేశారు?
మరి అలాంటప్పుడు జీఎన్ సాయిబాబాను ఎందుకు అరెస్టు చేసి, జైలుకి పంపించారు?
దీనికి ఆయన సమాధానమిస్తూ, ''నేను గిరిజనుల హక్కుల కోసం గొంతెత్తాను. అందులో భాగంగా అనేక ప్రజా సంఘాలు, వివిధ వ్యక్తులతో పరిచయాలున్నాయి. ఇదే విషయమై పనిచేస్తున్న చాలా సంస్థలు నన్ను కన్వీనర్‌గా ఎన్నుకున్నాయి. మేం గిరిజనులపై మారణహోమానికి, ఆపరేషన్ గ్రీన్ హంట్‌కి వ్యతిరేకంగా గిరిజనుల రక్షణ కోసం పోరాడుతున్నాం.
దేశంలోని పది కోట్ల మంది గిరిజనుల అణచివేతకు వ్యతిరేకంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలతో కలిసి పోరాటం సాగించాం. అందుకే మా గొంతునొక్కేందుకు నాపై కేసు బనాయించి, తప్పుడు కేసులు నమోదు చేశారని తెలిసింది. నన్ను పదేళ్లు జైల్లో పెట్టారు'' అని చెప్పారు.
జైల్లో ఎలాంటి సౌకర్యాలున్నాయి?
జైల్లో జీఎన్ సాయిబాబాను ఉంచిన గది పొడవు 8 అడుగులు, వెడల్పు పది అడుగులు. అండా బ్యారక్‌గా పిలిచే ఈ జైలుగదికి కిటికీలు ఉండవు. ఒకవైపు ఇనుప కడ్డీలతో ఉంటుంది.
జీఎన్ సాయిబాబా చిన్నతనం నుంచి వీల్‌చైర్ వాడుతున్నారు. అది ఆయన కనీస అవసరాల్లో ఒకటి. మరి జైల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వారి అవసరాలను పట్టించుకున్నారా?
''జైల్లో టాయిలెట్ వరకూ వీల్‌చైర్‌లో వెళ్లలేం. స్నానం చేసే చోటుకి కూడా వెళ్లలేం. నేను నా కాళ్లపై నిలబడలేను. నేను బాత్రూమ్‌కి వెళ్లాలన్నా, స్నానం చేయాలన్నా, పడుకోవాలన్నా, అన్ని పనులకూ ఇద్దరు మనుషులు కావాలి. జైలు సెల్‌లోనూ నేను అటూఇటూ తిరగలేను. అలాంటి పరిస్థితుల్లో ఎనిమిదన్నరేళ్లు జైల్లో ఉండాల్సి వచ్చింది. నేను ఇంకా కొంతకాలం బతుకుతానని జైలు అధికారులకు కూడా నమ్మకం లేదు. నేను జైలులోనే చనిపోతానని వారు అనుకున్నారు'' అని సాయిబాబా చెప్పారు.
అయితే, ఇంతకాలం జైళ్లో గడిపినా మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకముందా? యూఏపీఏ వంటి కఠిన చట్టాల గురించి ఆయన అభిప్రాయమేంటి?
ఆయన ఇలా అన్నారు, ''భారత న్యాయవ్యవస్థ దేశప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నా. అలా జరగదని చెప్పను కానీ, భారత న్యాయవ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాత్రం కచ్చితంగా చెబుతా. ప్రధాన న్యాయమూర్తి కూడా బెయిల్ ఎందుకు ఇవ్వలేదో పదేపదే చెబుతున్నారు. కోర్టు ఆదేశాలు కూడా వస్తాయి. కానీ, ఎవరిపై కేసు పెండింగ్‌లో ఉందో, వారికి బెయిల్ రాదు. బెయిల్ తిరస్కరణకు గురవుతుంది.''
''గిరిజనులు, దళితులు, మైనారిటీలు, ఓబీసీల్లోని కొన్ని వర్గాలకు కచ్చితంగా బెయిల్ రాదు. మనం జైళ్లలోకి వెళ్లి చూస్తే ఈ వర్గాలకు చెందిన వారే జైళ్ల నిండా ఉంటారు, విచారణ ఖైదీలుగా(అండర్ ట్రయల్)'' అన్నారు సాయిబాబా.
యూఏపీఏ చట్టం గురించి మాట్లాడుతూ, ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని జీఎన్ సాయిబాబా అన్నారు.
''ఇది ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన చట్టం. ఇంతటి క్రూరమైన చట్టం ప్రపంచంలోని ఏ దేశంలోనూ అమల్లో లేదు. ఇది దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధం.''
''నేను ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా. అదే చట్టం కింద నన్ను జైల్లో పెట్టారు. నా గొంతు నొక్కేశారు.''
జైలుకి వెళ్లిన అనంతరం సాయిబాబాను దిల్లీ యూనివర్సిటీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై సాయిబాబా మాట్లాడుతూ, ''నేను టీచర్‌గా జీవించి, టీచర్‌గానే చనిపోవాలనుకుంటున్నా. నా ఉద్యోగం నాతోనే ఉండాలనుకుంటున్నా. దాని కోసం పోరాడాల్సిన అవసరం లేదు.''
ఇప్పటి వరకూ ఏం జరిగింది?
2013లో హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి అరెస్టయ్యారు. వారు ప్రొఫెసర్ సాయిబాబా సహకారంతో మావోయిస్టు నేతలను కలిసేందుకు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 2013 - దిల్లీలోని ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు.
ఫిబ్రవరి 2014 - పోలీసులు అరెస్టు వారెంట్ తీసుకున్నారు, కానీ ఆయన్ను అరెస్టు చేయలేకపోయారు.
మే 2014 - మావోయిస్టులతో సంబంధాల కారణంగా అరెస్టు.
జూన్ 2015 - వైద్య కారణాలతో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
డిసెంబర్ 2015 - మళ్లీ జైలుకు వెళ్లారు.
ఏప్రిల్ 2016 - సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మార్చి 2017 - యూఏపీఏ సెక్షన్ల కింద జీవిత ఖైదు పడింది. సాయిబాబా బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్‌ను ఆశ్రయించారు.
ఏప్రిల్ 2021 - దిల్లీ యూనివర్సిటీ ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది.
అక్టోబర్ 2022 - బాంబే హైకోర్టు, నాగ్‌పూర్ బెంచ్ ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.
అక్టోబర్ 2022 - బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
మార్చి 2024 - బాంబే హైకోర్టు, నాగ్‌పూర్ బెంచ్ ఆయన్ను మరోసారి విడుదల చేసింది.
అక్టోబర్ 2024 - హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రొఫెసర్ జీఎన్. సాయిబాబా తుదిశ్వాస విడిచారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)