టన్నుల కొద్దీ పేలుడుపదార్థాలు, బంగారంతో ముంబయికి వచ్చిన ఈ నౌక ఎలా పేలిపోయింది? ఆ బంగారమంతా ఏమైంది?

    • రచయిత, హర్షల్ అగుడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది. హిరోషిమా, నాగసాకీలపై పేలిన అణుబాంబుల మోత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ, అంతకుముందే ఓ శక్తిమంతమైన పేలుడు సంభవించిందని మీకు తెలుసా? ఆ పేలుడు భారత్‌లోనే జరిగిందంటే మీరు నమ్ముతారా?

1944 ఏప్రిల్.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషు రవాణా నౌక ఎస్ఎస్ ఫోర్ట్ స్టికిన్ మంటల్లో చిక్కుకుని అతిపెద్ద పేలుళ్ళకు దారితీసింది. అప్పటిదాకా ప్రపంచంలో అదే అతిపెద్ద పేలుడు.

1944 ఏప్రిల్ 15న బాంబే ఓడరేవులో భారీ పేలుళ్ళు సంభవించాయి. ఈ ఘటనలో 700 మందికిపైగా చనిపోయినట్టు చెబుతారు. అయితే, ఇందుకు సంబంధించిన అధికారిక గణాంకాలేవీ అందుబాటులో లేవు. ఈ పేలుళ్ళ ప్రకంపనలు పూణేవరకు వ్యాపించాయి. ముంబయిలో అనేక భవంతులు నేలమట్టమయ్యాయి. ట్రామ్, రైలు సర్వీసులను రెండు రోజులపాటు నిలిపివేశారు.

పేలుళ్ళ కారణంగా ధ్వంసమైన విక్టోరియా నౌకాశ్రయాన్ని బాగుచేయడానికి ఆరు నెలల సమయం పట్టింది. నిర్మాణ కార్మికులు ఇందుకోసం ఎంతో చెమటోడ్చాల్సి వచ్చింది. పేలుళ్ళలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళిగానే ఏటా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి 21వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారు.

లివర్‌పూల్ టు ముంబయి

అది రెండో ప్రపంచ యుద్ద సమయం. యూకేలోని లివర్‌పుల్‌ బిర్కెన్‌హెడ్ పోర్ట్ నుంచి ఫోర్ట్ స్టికిన్ నౌక ఇండియాకు బయల్దేరింది. ఈ నౌక బ్రిటిషు ప్రభుత్వానికి చెందినది. ఈ నౌకలో మిత్రరాజ్యాలకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. బిర్కెన్‌హెడ్ నుంచి కరాచీ మీదుగా ఈ నౌక ముంబయి చేరుకోవాల్సి ఉంది.

ఈ ఫోర్ట్ స్టికిన్ నౌక పేలుడు గురించి ముంబయి చరిత్రకారుడు నితిన్ సాలుంఖే ‘అన్‌నోన్ ముంబయి’ పుస్తకంలో విస్తృతంగా రాశారు.

నితిన్ సాలుంఖే చెప్పిన ప్రకారం.. ‘ఫోర్ట్ స్టికిన్ 424 అడుగుల పొడవు, 7,124 టన్నుల బరువు ఉంది. అందులో యుద్దవిమానాలు, నౌకల విడిభాగాలు, వివిధ రకాల పేలుడు పదార్థాలు, బుల్లెట్లు, ఆయుధాలు, నీటిలోనూ పేలగల బాంబులతోపాటు భారీ విధ్వంసాన్ని సృష్టించగల 1400 టన్నుల పేలుడు పదార్థాలతో నౌక నిండి పోయి ఉంది.’

ఈ పేలుడు పదార్థాలతోపాటు మిలియన్ పౌండ్ల విలువైన 382 కేజీల బంగారు బిస్కెట్లను కూడా ఓడలోకి ఎక్కించారు. ఈ బంగారాన్ని భారత్‌లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ బ్రిటన్ పంపింది.వీటిని 30 చెక్క డబ్బాలలో పేర్చారు. ఒక్కో చెక్క డబ్బాలో 12 కేజీల బంగారు బిస్కెట్లను నింపారు.భద్రతా కారణాల రీత్యా వీటిని ఇనుప పెట్టెలలో పెట్టి వెల్డింగ్ చేశారు. ఆయుధాలు ఉంచిన నోటే వీటిని కూడా భద్రపరిచారు.

ఈ నౌకలోని సొత్తు అంతటికీ 45 ఏళ్ళ కెప్టెన్ అలెగ్జాండర్ నైస్మిత్‌దే బాధ్యత. నౌకలో ప్రమాదకరమైన వస్తువులు ఉండటంతో బయల్దేరినప్పటినుంచి ఆయన టెన్షన్‌గానే ఉన్నారు. మరోపక్క యుద్ధం కారణంగా ఏ సమయంలో శత్రుదేశాలు ఈ నౌకపై దాడిచేస్తే పరిస్థితి ఏంటా అనే చింత ఆయన్ను వెంటాడుతోంది.

నౌకలో పేలుడు పదార్థాలు ఉన్న కారణంగా సిబ్బంది ఎవరూ కూడా మద్యం, సిగరెట్లు తాగకుండా నిషేధం విధించారు.

కరాచీ రేవులో అలజడి

ఈ నౌక లివర్‌పూల్ నుంచి ఫిబ్రవరి 24 1944న బయల్దేరి మార్చి 30న కరాచీ నౌకాశ్రయానికి చేరుకుంది. అక్కడ యుద్ద విమానాలను, నౌకల విడిభాగాలను దింపారు.

ఈ నౌక బ్రిటన్‌ను వీడటానికి ముందే మరమ్మతులు చేసేందుకు చీఫ్ ఇంజనీర్ ప్రయత్నించారు కానీ, అత్యవసరంగా నౌక బయల్దేరాల్సి రావడంతో ఆయనకు సరిపడా సమయం చిక్కలేదు. దీంతో కరాచీలో మరమ్మతులు చేయాలని భావించారు కానీ, అనుమతి లభించలేదు. ఇది కెప్టెన్ అలెక్స్‌ను మరింత ఒత్తిడికి గురిచేసింది.

వీలైనంత త్వరగా నౌకలో ఉన్న బంగారం, పేలుడు పదార్థాలను ముంబయి ఓడరేవులో దించేయాలి. రిపేర్ల పని పెట్టుకుంటే మంబాయి చేరుకోవడం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో అధికారులు నౌక మరమ్మతుకు అవకాశం ఇవ్వలేదు.

మొత్తం మీద కరాచీ ఓడరువులో నౌకకు పదిరోజులపాటు లంగరేశారు. ఇక్కడ నౌకలో చాలా భాగం ఖాళీ కావడం, యుద్ధం కారణంగా రవాణా నౌకలు తక్కువగా తిరుగుతుండటంతో, ఈ నౌకలో ఖాళీ అయిన స్థలంలో కొంత సరుకును ముంబయికి పంపాలని నిర్ణయించారు. ఇందుకు కరాచీ అధికారులు కూడా అభ్యంతర పెట్టలేదు.

అయితే కరాచీ నుంచి కూడా సరకు రవాణా చేయాలనే విషయాన్ని బ్రిటన్‌లో బయల్దేరేముందు కెప్టెన్ అలెక్స్‌కు చెప్పకపోవడంతో ఆయనకు కోపం వచ్చింది. కానీ అధికారుల అభిమతానికి అడ్డుచెప్పలేని పరిస్థితి. యుద్దం వల్ల నౌకలో అంగుళం స్థలం కూడా ఖాళీగా వదిలేయడానికి వీల్లేదని పై నుంచి ఆదేశాలు ఉన్నాయని అధికారులు పదేపదే చెప్పారు.

ఎట్టకేలకు కెప్టెన్ అలెక్స్ అభ్యంతరాలను తోసి రాజని, 87వేల పత్తి బేళ్ళు, 300 టన్నుల క్రూడ్ సల్ఫర్, 10వేల టన్నుల కట్టెలు, 100 గాలన్ల ముడిచమురు, వివిధ తుక్కు సామాన్లు, బియ్యం బస్తాలు, చేపల ఎరువులను నౌకలో నింపారు.

కాటన్ సాక్సులను పేలుడు పదార్థాల కంపార్ట్‌మెంట్‌లోకి చేర్చారు. అసలే నౌక పేలుడు పదార్థాలతో నిండిపోయి ఉంటే, తేలికగా అంటుకునే పత్తి, నూనె, కట్టెలను నౌకలోకి చేర్చడంపై కెప్టెన్ అభ్యంతర పెట్టినా ప్రయోజనం లేకపోయింది.

ముంబయి పోర్టులో హడావుడి

ఫోర్ట్ స్టికిన్ ఏప్రిల్ 9న కరాచీ ఓడ రేవును వీడింది. ఏప్రిల్ 12 ఉదయానికల్లా ముంబయి పోర్టులోకి ప్రవేశించింది. కరాచీ ఓడరేవులానే ముంబయిలో కూడా ఫోర్ట్ స్టికిన్‌కు గందరగోళ పరిస్థితి ఎదురైంది.

పేలుడుపదార్థాలు రవాణా చేసే నౌకలు కచ్చితంగా ఎర్రజెండా ఎగురవేయాలి. దీనివల్ల ఆ నౌకకు ప్రాధాన్యం ఇచ్చి, సామన్లను కిందకు దింపడానికి అవకాశం కల్పిస్తారు. కానీ స్టికిన్ ఓడపై ఎర్రజెండా లేకపోవడంతో నౌక లంగరు వేయడానికి చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. విక్టోరియా హార్బర్‌లో నౌక నుంచి సామాన్లను దించే విషయంలో గణనీయమైన జాప్యం జరిగింది.

నౌక నుంచి ముందుగా పత్తిబేళ్ళు, నూనె డ్రమ్ములు దించాలని అధికారులు నిర్ణయించారు. దీంతోపాటు పేలుడుపదార్థాలను నియమాలను పాటిస్తూ దించాలని భావించారు. కానీ వీటిని నౌక నుంచి తరలించడానికి చిన్నపడవలు లభించకపోవడంతో ఈ పని వాయిదాపడింది.

ఈ లోపు మరమ్మతుల కోసం ఇంజిన్ భాగాలను విడదీయడం మొదలుపెట్టారు. ఇంజిన్ భాగాలను వేరుచేయడంతో నౌకను నడపలేని పరిస్థితి. తరువాత జరిగిన దారుణ పరిణామానికి ఇది కూడా ఒక కారణమైంది.

ఆ తరువాత రోజు ఉదయం కూడా నౌకలోని సరుకంతా చెక్కుచెదరకుండా అలాగే ఉంది. బంగారు బిస్కెట్లతో ఉన్న బాక్సులను ఎవరూ ముట్టుకోలేదు. నౌక నుంచి దింపిన తరువాత అధికారులు వాటిని తెరిచి తనిఖీ చేస్తారని చెప్పారు. ఈ బాక్సులను తెరిచేందుకు వెల్డింగ్ మిషన్‌ను నౌకలోకి తేవాలని చెప్పారు. వెల్డింగ్ కారణంగా నిప్పురవ్వలు ఎగిసి పక్కనున్న పేలుడుపదార్థాలపై పడతాయని కెప్టెన్ అలెక్స్ అంగీకరించలేదు. దీంతో ఈ బాక్సులను నౌక నుంచి దింపిన తరువాతనే అధికారుల సమక్షంలో తనిఖీ చేయాలని నిర్ణయించారు.

ఏప్రిల్ 13 మధ్యాహ్నానికి కూడా నౌకలోని పేలుడు పదార్థాలను దించి, తీరానికి చేర్చేందుకు చిన్నపడవలు రాలేదు. దీంతో పేలుడు పదార్థాలు నౌకలోనే ఉండిపోయాయి. కొంతమంది పనివాళ్ళు నౌకలోని భారీ దుంగలను దించే పనిలో ఉన్నారు.

పొగ మొదలు..

మూడురోజుల తరువాత కూడా నౌకలోని సరుకును దించే పని పూర్తి కాలేదు. ఏప్రిల్ 14న ఫోర్ట్ స్టికిన్‌తోపాటు రేవులో మరో 10,12 నౌకలు కూడా ఉన్నాయి. ఆ రోజు ఉదయం సరుకును దించే పని మెల్లిగా సాగుతోంది. మధ్యాహ్నం భోజన విరామంలో, ఓ నౌకలోని ఇద్దరు అధికారులు స్టికిన్ నౌకలో ఏదో జరుగుతోందని గమనించారు. నౌక దిగువ భాగం నుంచి పొగ రావడాన్ని వారు చూశారు. అయితే పొగ హఠాత్తుగా మాయం కావడంతో అది తమ భ్రమ అని భావించారు.

ఓడరేవులో నుంచుని ఉన్న పోలీసు కూడా పొగరావడాన్ని చూశారు. కానీ నౌకాపరిశ్రమలో మంటల రావడం సాధారణ విషయమే కావడంతో, నౌకలోని వారు ఆ విషయాన్ని చూసుకుంటారనే ఉద్దేశంతో దానిని పట్టించుకోలేదు. గంటన్నర తరవాత నౌక నుంచి సరుకును దింపే పని మొదలైంది. పెద్ద పెద్ద వస్తువులను బయటకు తీసినప్పుడు అడుగు నుంచి భారీ ఎత్తున పొగరావడం మొదలైంది.

వెంటనే అలారం మోగింది. పొగ ఎక్కడి నుంచి వస్తోందో కనిపెట్టడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. కానీ పొగ కారణంగా వారు లోపలకు వెళ్ళలేకపోయారు. నౌకలోని పంపు ద్వారా పొగను తగ్గించలేకపోయారు. మధ్యాహ్నం 2గంటల 25 నిమిషాలకు ఇద్దరు ఫైర్ బ్రిగేడియర్లు చేరుకున్నారు. ఆ మంటల పర్యవసానం ఏమిటి, నౌకలో పేలుడు పదార్థాలు ఎక్కడున్నాయనే విషయాలు తెలియకుండానే ఫైర్ బ్రిగేడ్స్ నౌకలోని రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. సమాచారం తెలిసిన తరువాత మరో 10, 12 బాంబులను వెంటనే బయటకు పంపారు.

ఈ క్రమంలో నౌకలోని రెండో డెక్‌పై మొదటి పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలు, కాటన్ సాక్సులు, బంగారం బాక్సులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు.దీంతో ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. షిప్ ఇంజిన్ భాగాలను మరమ్మతు కోసం విడదీయంతో నౌకను కదిలించలేని పరిస్థితి. క్రమంగా మంటలు భారీగా చెలరేగడంతో నౌక కూడా కరిగిపోవడం మొదలవడంతో సిబ్బంది అంతా భయభ్రాంతులకు గురయ్యారు.

హఠాత్తుగా నౌక బయట పెద్ద ఎత్తున ఓ అగ్నిగోళంలా కనిపించింది. దీంతో నౌకలోని వారందరూ దిగిపోవాల్సిందిగా కెప్టెన్ అలెక్స్ ఆదేశించారు. సిబ్బంది నౌకను వీడటం మొదలైంది.

రెండు భారీ పేలుళ్ళు

సాయంత్రం 4గంటల 6 నిమిషాలకు ఫోర్ట్ స్టికిన్లో తొలిపేలుడు సంభవించింది. దీంతో నౌక రెండు ముక్కలైంది. ఇందులో ఓ ముక్క సముద్రంలో తేలగా, మిగిలిన ముక్క అరకిలోమీటరు దూరంలోని భవంతిలోకి దూసుకుపోవడంతో, ఆధాటికి భవంతి కూలిపోయింది. నీటి పైపులు పగిలిపోయాయి. మంటలను అదుపు చేయడానికి వచ్చిన సిబ్బంది కూడా ఎగిరిపడ్డారు. సముద్రంలో జరిగిన పేలుడు కారణంగా ఏర్పడిన అలజడికి 10, 12నౌకలు కూడా మునిగిపోయాయి. నౌకకు సంబంధించిన 3 టన్నుల విడి భాగాలు ఎగిరిపడటంతో అనేకమంది చనిపోయారు. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాకమునుపే సాయంత్రం 4గంటల 20 నిమిషాలకు మరో పేలుడు సంభవించింది. దీని తీవ్రత మొదటి పేలుడు కంటే అనేకరెట్లు ఎక్కువగా ఉంది.

ఈ పేలుడు కారణంగా నౌకాశ్రయంలోని బొగ్గు, కట్టెల సముదాయాలకు మంటలు అంటుకున్నాయి. ట్రైన్ సర్వీసులను రద్దు చేశారు. అలాగే ట్రామ్ సర్వీసులను కూడా ఆపేశారు. ముంబయిలో నీటిసరఫరాకు అంతరాయం ఏర్పడింది. నౌకలోని బుల్లెట్లు ఎగిరి సమీప ప్రాంతాలలో పడ్డాయి. సగం ధ్వంసమైన భవనాలను నేలమట్టం చేసే క్రమంలో అక్కడ కూడా మరికొన్ని పేలుడు పదార్థాలు బయటపడి, పేలిపోయినట్టు వార్తలు వచ్చాయి.

ఈ ఘటనలో 20 లక్షల మిలియన్ పౌండ్ల నష్టం వాటల్లిందని అంచనా వేశారు. మంటలను అదుపు చేసే క్రమంలో 66మంది అగ్నిమాపక సిబ్బంది, 500 నుంచి 700 మంది పౌరులు మరణించారని అంచనా.

చాలామంది కనిపించకుండా పోయారు. కొన్ని మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోయారు. చాలా రోజులపాటు ముంబయి సముద్రతీరంలో శవాలు బయటపడుతూనే ఉన్నాయి. తరువాత ఈ సంఘటనపై వార్తా పత్రికలలో వివిధరకాల కథనాలు దర్శనమిచ్చాయి.

నౌకలోని బంగారం ఏమైంది?

పేలుడు కారణంగా నౌక నుంచి ఎగిరిపడిన బంగారు బిస్కెట్లు ఓడరేవుకు అరకిలోమీటరు దూరంలోని పార్సి వ్యక్తి ఇంటిపై పడ్డాయి. అదేదో బరువైన పదార్థమని, అది నెత్తిన పడితే చచ్చిపోతానని ఆ ఇంటి యజమాని భావించారు. కానీ అదృష్టవశాత్తు తప్పించుకుని, తరువాత ఆ లోహం ఏమిటా అని చూస్తే అది 28 పౌండ్ల బరువైన బంగారు బిస్కెట్.

దీని తరువాత నౌకలోని 382 కేజీలో బంగారం గురించి అనేక కథనాలు వచ్చాయి. పార్సి వ్యక్తి ఇంటిపై ఏకంగా బంగారు వాన కురిసిందనే అతిశయోక్తులు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ఘటన పార్సి వ్యక్తి ఇంటి వద్ద కాకుండా మరెక్కడా జరిగినట్టుగా ఆధారాలు లభించలేదు.

ఫోర్ట్ స్టికిన్ నౌక అడుగున రెండో కంపార్ట్‌మెంట్‌లో బంగారం బాక్సులు ఉన్నాయి. పేలుడులో ఈ బాక్సులు పేలిపోవడంతో బంగారు బిస్కెట్లలో చాలాభాగం నీళ్లలో మునిగిపోయాయి.

విక్టోరియా డాక్‌యార్డ్‌లో 2009 ఫిబ్రవరిలో తవ్వకాలు చేస్తున్న ఓ కార్మికుడికి కొన్ని బంగారు బిస్కెట్లు దొరికాయి. ఇవి 1944 నాటివే అయి ఉండొచ్చు. దీంతోపాటు 1980లో రేవులో పూడిక తొలగిస్తుండగా 10 కేజీల బరువున్న బంగారుముద్ద దొరికింది. దీనిని ప్రభుత్వానికి అందచేసిన కార్మికుడికి వెయ్యిరూపాయల నగదు బహుమతి కూడా అందించారు.

విక్టోరియా నౌకాశ్రయంలో భూగర్భంలో కొన్ని బంగారుమద్దలు ఉండే ఉంటాయి. అవి దొరకొచ్చు... దొరక్కపోవచ్చు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)