You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Herpes: ఈ సుఖ వ్యాధి ఎందుకొస్తుంది, యువతలో ఎక్కువగా వస్తోంది ఎందుకు
- రచయిత, డాక్టర్ శైలజ చందు
- హోదా, బీబీసీ కోసం
జననేంద్రియ హెర్పెస్ అనేది యువతీయువకులలో చాలా సాధారణంగా కనిపించే లైంగిక సంక్రమణ వ్యాధి (Sexually Transmitted Disease - STD).
లైంగిక సంబంధాలలో చురుకుగా పాల్గొనే యువతీయువకులలో జననేంద్రియాల హెర్పెస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ ఇన్పెక్షన్ కు రెండు రకాల హెర్పెస్‌లు( Herpes Virus) కారణం.
1) హెర్పెస్ టైప్ 1- నోటి అల్సర్లను కలుగ జేస్తుంది.
2) హెర్పెస్ టైప్ 2- జననేంద్రియాల వద్ద అల్సర్లు వస్తాయి.
చాలామందిలో ఈ హెర్పెస్ వైరస్ శరీరం లోపల ఉన్నా సరే, ఎలాంటి లక్షణాలూ ఉండవు. కానీ, వారితో ఎవరైనా లైంగికంగా కలిస్తే వైరస్ సంక్రమించే ప్రమాదం ఉంటుంది.
జననాంగాల హెర్పెస్ ఇన్ఫెక్షన్ మొదటి సారి కలిగినపుడు దానిని ప్రాథమిక ఇన్ఫెక్షన్ ( Primary Herpes ) అంటారు.
హెర్పెస్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలేమిటి?
జననాంగాల వద్ద అసాధారణమైన పుండ్లు, దుర్వాసనతో కూడిన స్రావం, మూత్ర విసర్జన సమయంలో మంట ఉంటాయి. ఈ లక్షణాలు ఏవైనా గమనించినట్లయితే మీరు డాక్టర్‌ని కలవాలి.
లైంగిక కలయిక జరిగిన 4 నుంచి 7 రోజుల తర్వాత జననాంగాల వద్ద చిన్న పొక్కులలా, నీటి బొబ్బలుగా వస్తాయి. తర్వాత పుండ్లు ఏర్పడతాయి. మహిళలు ఆ ప్రదేశంలో నొప్పి, వాపుతో బాధ పడతారు. మూత్ర విసర్జన చాలా బాధాకరంగా మండుతున్నట్లుగా ఉంటుంది.
జననేంద్రియాల హెర్పెస్ (పునరావృత ఇన్ఫెక్షన్ - Recurrent Genital Herpes )
మొదటి సారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత , హెర్పెస్ వైరస్ నరాలలో అచేతనంగా కొంత కాలం ఉండిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గినపుడు వైరస్‌లు మళ్లీ ఉత్తేజితమై పునరావృత సంక్రమణ (Recurrent infection) వస్తుంది.
వైరస్‌లు రీయాక్టివేట్ కావడానికి కారణాలేమిటి?
రోగ నిరోధక శక్తి తగ్గినపుడు ఈ వైరస్‌లు పునరుత్తేజితమవుతాయి. జ్వరం వచ్చినా, అల్ట్రా వయొలెట్ కాంతి సోకినపుడు, రుతుస్రావమైనపుడు, ఒత్తిడిలో ఉన్నా, ఏదైనా గాయమైనా ఈ వైరస్ చైతన్యవంతమవుతుంది.
Herpes Virus -2 పునరావృత ఇన్ఫెక్షన్ రాబోయే ముందు, నరాలలో నొప్పి, చర్మం స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు 1- 2 రోజులుంటాయి. ఆ తర్వాత చర్మం మీద నీటిపొక్కులు, పుండ్లు ఏర్పడతాయి.
ప్రాథమిక వ్యాధి (Primary Infection) తో పోలిస్తే ఈ పునరావృత స్థాయిలో లక్షణాలు తక్కువ ఉంటాయి.
వయసు పెరిగే కొద్దీ మళ్లీమళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గిపోతుంది.
తల్లి నుంచి గర్భస్థ శిశువుకు సంక్రమిస్తుందా?
జననేంద్రియాల హెర్పెస్ లైంగిక సంబంధాల వల్ల వ్యాప్తి చెందుతుంది.
కొందరు వ్యక్తులలో ఏ లక్షణాలు లేనప్పటికీ వారిలో వైరస్ ఉండొచ్చు. అలాంటివారు తమ నుంచి లైంగిక భాగస్వాములకు వైరస్‌ను బదిలీ చేయగలరు.
ఇటీవలికాలంలో Herpes Type 1 ఇన్ఫెక్షన్లు ఎక్కువైనట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కౌమారంలో ఉన్నవారిలో వైరస్ ఎక్కువవుతున్నట్లు ఒక అధ్యయనం తెలిపింది.
ఈ వయసువారు ఎక్కువగా ఓరల్ సెక్స్‌లో పాల్గొనడమనేది కారణంగా చెప్పవచ్చు.
తల్లి నుంచి గర్భస్థ శిశువుకి సోకే ప్రమాదముంది. దాని వల్ల అబార్షన్ అయ్యే అవకాశముంది.
అంతేకాకుండా, బిడ్డ , గర్భంలోనే చనిపోవడం, అవయవలోపాలు, శిశువు చర్మం మీద, కంటిలోను కురుపులు రావడం జరగవచ్చు.
రోగ నిర్ధరణ, చికిత్స ఎలా చేస్తారు?
పుండ్ల నుంచి ఒక నమూనాను తీసుకొని దానిని పరీక్షించవచ్చు. కొన్ని సందర్భాల్లో హెర్పెస్ యాంటీబాడీస్ కోసం రక్త పరీక్ష చేయొచ్చు.
ప్రాథమిక ఇన్ఫెక్షనా (Primary infection) లేదా రెండో సారి ( recurrent infection) వచ్చిందా అనే విషయం యాంటీ బాడీస్ పరీక్షలో తెలుస్తుంది.
సమర్థమైన యాంటీ వైరస్ మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక ఇన్ఫెక్షన్ ( Primary Herpes) కు ఎలా వాడాలి, పునరుత్తేజిత ఇన్ఫెక్షన్‌కు ఎలా వాడాలి అనే విషయంపై వైద్యుల సూచనతో చికిత్స తీసుకోవాలి.
హెర్పెస్ ఉన్నవారు సెక్స్లో పాల్గొన వచ్చా?
హెర్పెస్ ఉంటే, ముందుగా సెక్స్ పార్టనర్(ల)తో మాట్లాడాలి. తనకు హెర్పెస్ ఉన్న విషయం, దాని వల్ల కలిగే ప్రమాదం గురించి వారికి తెలియజెప్పాలి.
కండోమ్‌లను ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు, కానీ, అది ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేదు. పుండ్లు లేదా హెర్పెస్ యొక్క ఇతర లక్షణాలను కలిగి ఉండటం వలన వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుంది. మీకు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ, మీరు మీ సెక్స్ భాగస్వాములకు వైరస్ సోకేలా చేస్తారు.
గర్భిణులకు హెర్పెస్ సంక్రమిస్తే సిజేరియన్ చేయాల్సిందేనా?
గర్భిణి మొదటి దశలో హెర్పెస్ ఇన్ఫెక్షన్ సోకినట్లయితే అబార్షన్ జరిగే ప్రమాదం ఉంది.
బిడ్డకు అవయవ లోపాలు, చర్మంపై, కంటిలో కురుపులు సైతం రావచ్చు.
సాధారణ కాన్పు జరిగే సమయంలో, తల్లి గర్భ ద్వారంలో ఉన్న హెర్పెస్ ఇన్ఫెక్షన్ తో కూడిన ద్రవాలు సోకడం వల్ల పుట్టే బిడ్డకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది.
శిశువుకి హెర్పెస్ (Neonatal herpes) వ్యాధి కొన్ని సార్లు చర్మానికి, కళ్లకు, నోటికి మాత్రమే వస్తుంది. ఇటువంటి తేలికపాటి లక్షణాలుంటే , అది పెద్ద ప్రమాదకరం కాదు.
కానీ, శిశువు శరీరంలోని ప్రతి భాగానికీ హెర్పెస్ సంక్రమిస్తే ( Disseminated Herpes) అది ప్రాణాంతకం అవుతుంది. అప్పుడు శిశువు మరణించే ప్రమాదం ఉంది.
యాంటీవైరల్ మందులు వాడినా సరే, మరణించే అవకాశం 30 శాతం వరకూ ఉంటుంది.
ఎక్కువగా, ఈ తీవ్రమైన వ్యాధి నెలలు నిండని (Premature babies) బిడ్డలలో వచ్చే అవకాశం ఉంది.
ప్రాధమిక ఇన్ఫెక్షన్ (Primary Herpes) కాన్పు సమయంలోగానీ, డెలివరీ డేట్ కు 6 వారాల ముందు సంభవించినా గానీ, సాధారణ కాన్పు చేయకూడదు.
గర్భిణి, కాన్పు కోసం వచ్చిన సమయంలో గానీ, లేదా కాన్పు డేట్‌కు 6 వారాల ముందు గానీ హెర్పెస్ వచ్చి వున్నట్లయితే, ఆమెకు సాధారణ కాన్పు చేయడం , శిశువుకి ప్రమాదకరం. జనన మార్గంలో ఉన్న హెర్పెస్ సోకిన ద్రవాలు శిశువుకు తీవ్రమైన వ్యాధిని (Neonatal Herpes) కలుగజేస్తాయి.
అందుకని బిడ్డకు ప్రాణాంతకమైన నియోనాటల్ హెర్పెస్ రాకుండా నివారించేందుకు, సాధారణ కాన్పుకు బదులు సిజేరియన్ ద్వారా డెలివరీ చేయాలి.
తల్లికి ప్రాథమిక ఇన్ఫెక్షన్ ( Primary Herpes) వుంటేనే బిడ్డకు, నియోనేటల్ హెర్పెస్ వచ్చే అవకాశముంది.
అదే , కాన్పు సమయంలో తల్లికి పునరావృత ఇన్ఫెక్షన్ (recurrent infection) వస్తే, బిడ్డకు తీవ్రమైన వ్యాధి (Neonatal Herpes) వచ్చే ప్రమాదముండదు. ఆ పరిస్థితుల్లో, సాధారణ కాన్పు చేయవచ్చు.
తల్లికి పునరావృత ఇన్ఫెక్షన్ (Recurrent Herpes) స్థితిలో వున్నపుడు బిడ్డకు తల్లినుండి యాంటీ బాడిస్ బదిలీ అవుతాయి. ఆ యాంటీబాడిస్ వల్ల బిడ్డకు రక్షణ లభిస్తుంది.
జననేంద్రియ హెర్పెస్ వచ్చే ప్రమాదాన్ని ఎలా తగ్గించగలం?
లైంగిక సంక్రమణ వ్యాధులు లేని భాగస్వామితో, దీర్ఘకాలికంగా పరస్పర సంబంధం మాత్రమే (Monogamy) ఉంటే ఈ వైరస్ రాదు. ఇద్దరిలో ఏ ఒక్కరికి వేరేవారితో లైంగిక సంబంధాలున్నా వైరస్ రావడానికి అవకాశం ఉంటుంది.
కండోమ్ వాడడం వల్ల కొంత రక్షణ పొందవచ్చు.
సెక్స్ చేసే ప్రతిసారి రబ్బరు కండోమ్‌లను సరైన మార్గంలో ఉపయోగించాలి.
కానీ, రబ్బరు కండోమ్, హెర్పెస్ పుండ్లు ఉన్న అన్ని ప్రదేశాలనూ కప్పలేదు. అంతే కాదు, హెర్పెస్ పుండ్లు లేని చర్మ ప్రాంతాల నుండి కూడా హెర్పెస్ వైరస్ విడుదల కావచ్చు.
ఈ కారణాల వల్ల, హెర్పెస్ రాకుండా కండోమ్‌లు పూర్తిగా రక్షిస్తాయన్న నమ్మకం లేదు.
జననేంద్రియ హెర్పెస్ వల్ల ఆరోగ్యం, లైంగిక జీవితం మరియు సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందోనన్న ఆందోళన సహజం.
అవసరమైన చికిత్స తీసుకుంటూ, ఆందోళనల గురించి వివరంగా డాక్టర్ తో చర్చించడం మంచిది.
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)