You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈటల రాజేందర్ - బండి సంజయ్: తెలంగాణ బీజేపీలో కాకరేపిన కాళేశ్వరం కేసు.. కేంద్ర మంత్రి, ఎంపీ మాటల ఆంతర్యమేంటి?
- రచయిత, బళ్ళ సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీలు కాళేశ్వరాన్ని విస్తృతంగా వాడుకున్నాయి. కానీ, ఆ వివాదం అటు ఇటు తిరిగి ఇప్పుడు బీజేపీకి కూడా అంటింది. ఇదిప్పుడు పార్టీ కీలక నేతలైన ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల మధ్య వివాదంగా కనిపిస్తోంది.
మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్లు కుంగడం, కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసింది.
ఇందులో భాగంగా ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను విచారణకు పిలిచింది కమిషన్. ఈ సందర్భంగా ఈటల చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి.
''కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం'' అని ప్రధాని నరేంద్రమోదీ గతంలో ఆరోపించారు.
అప్పటి నుంచి ఆ పార్టీ స్టాండ్ అదే. కానీ, ఇప్పుడు ఈటలది సంకట స్థితి.
కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరైన తరువాత బయటకు వచ్చి మీడియాతోను, ఆ తరువాత టీవీ ఇంటర్వ్యూల్లోనూ ఈటల చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పడేశాయి.
''కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనే దానికి, ఆర్థిక శాఖకు సంబంధం లేదు. ఖర్చు అంతా సాగునీటి శాఖ చూసింది. కేటాయింపు మాత్రమే ఆర్థిక శాఖ చేసింది''
జూన్ 6న కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట హాజరైన తర్వాత ఈటల చేసిన వ్యాఖ్యలివి.
అంతేకాదు, ''కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ త్వరగా బయటపెట్టాలి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం హరీశ్, తుమ్మల, నన్ను కలిపి మంత్రివర్గ ఉపసంఘం వేశారు. రూ.63 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. అది రూ.82 వేల కోట్లకు వెళ్లింది. తరువాత ఎంత పెరిగిందో నాకు అవగాహన లేదు.
డిజైన్స్, కన్‌స్ట్రక్షన్‌తో సంబంధం ఉందా? అని అడిగారు. దానితో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధం లేదని చెప్పాను. కార్పొరేషన్ అప్పులు, ఇరిగేషన్ చెల్లింపుల మీద ఫైనాన్స్ అజమాయిషీ లేదని చెప్పాను'' అని రాజేందర్ తెలిపారు.
అదే రోజు ఒక టీవీ చానెల్ ఇంటర్వ్యూలో కూడా కాళేశ్వరం వల్ల తెలంగాణకు మేలు జరిగిందని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఆ మాటలు వైరల్ అయ్యాయి.
కాళేశ్వరం వల్ల పైసా ప్రయోజనం లేదు, అంతా అవినీతే అని చెబుతున్న బీజేపీకి ఇది ఇబ్బందికరంగా మారింది.
దానికితోడు ఈ పరిస్థితిని కాంగ్రెస్ బాగా వాడుకుంది.
కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం: కాంగ్రెస్
మాజీ సీఎం కేసీఆర్‌ను ఈటల రాజేందర్ కాపాడుతున్నారని, ఆయన తన పాత బాస్‌ను మర్చిపోలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఈటల చర్యలకు బీజేపీ నాయకులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.
అంతేకాదు, మాజీమంత్రి హరీశ్ రావును ఈటల కలిశారని, బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు.
మరోవైపు కొందరు బీజేపీ నాయకులు దీనిపై బహిరంగంగానే మాట్లాడారు.
కాళేశ్వరంలో కేసీఆర్‌ను కాపాడాలని చూస్తే అది తప్పేనని ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు.
కానీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి మాత్రం రాజేందర్‌కు మద్దతుగా నిలిచారు.
''బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోతున్నాయంటూ అబద్ధపు ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. కమిషన్ ముందు అన్ని విషయాలనూ ఈటల రాజేందర్ స్పష్టంగా చెప్పారు'' అని ప్రకాశ్ రెడ్డి అన్నారు.
కానీ, తాజాగా అంటే జూన్ 19న రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ కలకలం రేపాయి.
''కేబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందా? మీ శాఖలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కేబినెట్లో పెట్టండని కేసీఆర్ చెప్పేవారు. ప్రాజెక్టు నిర్మించడం, అవినీతి వేరువేరుగా చూడాలి. కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేయాలి. అవినీతి నిగ్గు తేల్చాలి. బీజేపీ అయితే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది'' అన్నారు ఈటల.
అంతేకాదు, కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల బీజేపీ ఎంపీగా కాకుండా మాజీ మంత్రిగా వాంగ్మూలం ఇచ్చారన్నది గమనించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అయినా, పార్టీలో చర్చకు తెర పడలేదు.
'అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పొచ్చా?'
జూన్ 22న బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో విషయం ఇంకా పెద్దదైంది.
''కాళేశ్వరంపై మోదీ చెప్పిందే బీజేపీ విధానం. కాళేశ్వరంపై బీజేపీ స్టాండ్ మారిందని, బీఆర్ఎస్‌తో కుమ్మక్కైందని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ స్టాండ్ వెరీ క్లియర్. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులే వందల కోట్లు సంపాదించారంటే, ఇక కేసీఆర్ కుటుంబం ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు'' అని బండి సంజయ్ అన్నారు.
అంతటితో ఆయన ఆగలేదు.
''మేం మాట మార్చడానికి ఊసరవెల్లులం కాదు'' అన్నారు.
"నేను గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, ఇప్పుడు కేంద్ర మంత్రిని. కాబట్టి అప్పుడో మాట, ఇప్పుడో మాట చెప్పొచ్చా?'' అని వ్యాఖ్యానించారు సంజయ్.
'ఈ రెండు మాటలూ నేరుగా ఈటలను ఉద్దేశించినవే' అని భాష్యం చెప్పుకుంటున్నారు కార్యకర్తలు.
సంజయ్ మాట్లాడిన వెంటనే కొందరు బీజేపీ నాయకులు వరుసగా కాళేశ్వరం మీద ప్రకటనలు చేశారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు, కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీశ్... వీరంతా కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద స్కామ్ అని, సీబీఐ విచారణ జరగాలని, బండి సంజయ్ చెప్పిందే పార్టీ విధానమని ప్రకటనలు చేశారు.
ఎన్నడూ లేనిది కేవలం రెండు రోజుల వ్యవధిలో ఇంతమంది నాయకులు ఒకే అంశంపై వరుసగా ప్రకటనలు ఇవ్వడం వెనుక కారణం ఏంటనే చర్చ మొదలైంది.
అయితే, ఈటల రాజేందర్ కూడా ఈ విషయంలో తగ్గలేదు.
''బీజేపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, కమిషన్లకు వ్యతిరేకం'' అనే మాటను ఆయన పదేపదే వినిపిస్తున్నారు.
అంతేకాదు, మరో అడుగు ముందుకేసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పొగిడారు.
''కిషన్ రెడ్డి పత్రికల్లో హెడ్‌లైన్స్ కోసం, టీవీల్లో సంచలనం కోసం మాట్లాడరు. కానీ, కొందరికి సంచలనం కావాలి'' అని ఈటల అన్నారు.
దీంతో ఈ వ్యాఖ్యలు బండి సంజయ్‌కి కౌంటర్ ఇస్తూ అన్నవేనన్న విశ్లేషణలూ పెరిగాయి.
అంతర్గత రాజకీయాలు బహిర్గతం: తెలకపల్లి
''కాళేశ్వరం విషయంలో బీజేపీ నాయకత్వం ఇరకాటంలో పడింది. ఈటల వాంగ్మూలం అచ్చంగా బీఆర్ఎస్ చెప్పేట్టుగానే ఉంది. మాట మార్చడం విశ్వసనీయత కాదు, ఉద్యమ కాలం నుంచీ నీటి గురించి కొట్లాడి ఇప్పుడు నీటి ప్రాజెక్టులను తప్పని ఎలా అంటాం అనే ధోరణిలో రాజేందర్ ఉన్నారు. ఆయన తన వైఖరి మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ బీజేపీలోని అంతర్గత రాజకీయాలు ఈ అంశంపై ప్రతిఫలిస్తున్నాయి'' అని సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి బీబీసీతో అన్నారు.
అసలు బీఆర్ఎస్ – బీజేపీల మధ్య వాస్తవంగా ఘర్షణ ఉందా? అన్నదానిపై కూడా అనుమానాలున్నాయని తెలకపల్లి అన్నారు.
''ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ వారు ఈటల పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు. వాళ్ల పత్రికల్లో ఆయనకు మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. తాజాగా కేసీఆర్ మీద ధర్మపురి అరవింద్ విమర్శలు, దానిపై ప్రతిదాడి కూడా ఏదో షాడో బాక్సింగ్ మాదిరే కనిపిస్తోంది'' అన్నారు రవి.
బీజేపీ-బీఆర్ఎస్ మధ్య బలమైన సాన్నిహిత్యం ఏర్పడుతోందన్నట్టు రవి విశ్లేషించారు.
నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగితే బీజేపీ ఎప్పుడో ఆపగలిగి ఉండేదని మరికొందరు జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
అదంతా పైపైనే: దుర్గం రవీందర్
''బీజేపీ అసలు ఈ కాళేశ్వరం అంశాన్ని సీరియస్‌గా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. పైగా కాళేశ్వరంతో ఆ పార్టీలో అంతర్గత సమస్యలు వస్తాయని కూడా అనుకోను. అదంతా పైపైనే.
నిజంగా వారు కాళేశ్వరంలో అవినీతిని ఆపాలనుకుని ఉంటే కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి కోట్ల రూపాయలు అప్పు తెచ్చినప్పుడే ఆపి ఉండొచ్చు. కేంద్రం తలచుకుంటే రాష్ట్రానికి అప్పు పుట్టకుండా అడ్డుకోవచ్చు. కానీ, అప్పుడెందుకు ఆపలేదు? బిల్లుల విషయంలో బీఆర్ఎస్ అవసరం ఉందని బీజేపీ చూసీ చూడనట్లు వదిలేసి ఇప్పుడు మాట్లాడుతోంది'' అని సీనియర్ పాత్రికేయులు దుర్గం రవీందర్ బీబీసీతో అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యల ఆధారంగా తెలంగాణ బీజేపీలో ఏదో జరిగిపోతోందన్న వాదన సరికాదని బీజేపీ నాయకులు అంటున్నారు.
అలాంటిదేం లేదు: బీజేపీ
సంజయ్, ఈటల రెండు వేర్వేరు సందర్భాల్లో, వేర్వేరు వేదికలపై చేసిన వ్యాఖ్యలను కలిపి చూసి, ఇద్దరి మధ్య వివాదం ఉందనడం సరికాదని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
''కాళేశ్వరం విషయంలో వారిద్దరి వైఖరీ ఒకటే. రాజేందర్ ఉప ఎన్నిక కాలం నుంచీ కేసీఆర్‌పై పోరాడుతూనే ఉన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. మోదీ వైఖరే నా వైఖరి అని సంజయ్ చెప్పారు. ప్రాజెక్టులో అవినీతిపై చర్యలు తీసుకోవాలని రాజేందర్ అంటున్నారు. ఇక్కడ తేడా ఏముంది?" అని పోరెడ్డి కిషోర్ రెడ్డి అన్నారు.
అంతేకాదు, అసలు ఈటలను విచారణకు పిలవడమే కుట్ర అని కిషోర్ ఆరోపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)