దిల్లీ ఆస్పత్రి అగ్ని ప్రమాదం: ‘రెండో బిడ్డయినా దక్కుతాడనుకుంటే.. మార్చురీ దగ్గర వేచిచూడాల్సి వచ్చింది..’

    • రచయిత, సిరాజ్ అలీ, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, దిల్లీ నుంచి బీబీసీ ప్రతినిధులు

దిల్లీలోని జీటీబీ నగర్ హాస్పిటల్ మార్చురీ బయట నిశ్శబ్దం అలముకుంది. అక్కడ కూర్చున్న కుటుంబాలన్నీ మౌనంగా రోదిస్తున్నాయి. అప్పుడప్పుడు ఆ ఏడుపులు బయటకు వినిపిస్తున్నాయి. మార్చురీ పక్కన ఉన్న ఓ షెడ్‌లో ఆ కుటుంబాలన్నీ కూర్చుని ఉన్నాయి. వేసవి వేడి నుంచి కాపాడుకోవడానికి ఆ షెడ్డు ఏ మాత్రం సరిపోవడం లేదు.

అక్కడే రాజ్ కుమార్, వినోద్ కుమార్ కూర్చుని ఉన్నారు. రాజ్‌కుమార్ స్తబ్దుగా ఉండిపోతే, వినోద్ మాత్రం కన్నీళ్ళు దాచుకోలేకపోతున్నారు.

దిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో శనివారం రాత్రి పసిపిల్లల ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో తన పసిబిడ్డను వినోద్ పోగొట్టుకున్నారు.

వివేక్ విహార్‌లోని బేబీకేర్ న్యూబోర్న్ హాస్పిటల్‌లో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో హఠాత్తుగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే పరిస్థితి గందరగోళంగా మారింది.

అగ్నిమాపక సిబ్బంది 12 మంది నవజాత శిశువులను రక్షించారు. వీరిని సమీపంలోని మరో ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం ఉదయానికల్లా వీరిలో ఆరుగురు శిశువులు మరణించారు. పోస్టుమార్టం నిర్వహించాక సోమవారం ఉదయం నవజాత శిశువుల మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. అలా తమ బిడ్డల శవాలను అందుకున్నవారిలో రాజ్, వినోద్ కూడా ఉన్నారు.

‘రెండో బిడ్డయినా దక్కుతాడనుకుంటే’

వినోద్, జ్యోతి దంపతుల గతంలో ఓ బిడ్డను కోల్పోయారు. దీంతో రెండో బిడ్డ పుట్టుక కోసం ఎంతగానో ఎదురుచూశారు. కానీ ఇప్పుడు మార్చురీ బయట తన బిడ్డ శవాన్ని తీసుకువెళ్ళేందుకు వేచి ఉండాల్సి వచ్చింది. ఏడ్చి ఏడ్చి వినోద్ గొంతు పూడుకుపోయింది. కన్నీళ్ళు ఇంకిపోయి కళ్ళు పొడిబారిపోయాయి.

‘‘శనివారం ఉదయం నాకు అబ్బాయి పుట్టాడు’’ అని వినోద్ చెప్పారు. ‘‘పుట్టగానే బిడ్డకు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో బేబీకేర్ న్యూబోర్న్ హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. ఆయన భార్య జ్యోతి ఇంకా జిల్‌మిల్‌లోని ఓ ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆమెకు తన పసికందు చనిపోయిన విషయం తెలియదు. ఈ విషయాన్ని వినోద్ తన తల్లికి కూడా చెప్పలేని పరిస్థితి. ఆమెకు గుండెజబ్బు ఉండటంతో, ఈ విషయం చెపితే అది ఆమె తట్టుకోలేరనే భయంతో వినోద్ ఆమెకు ఈ విషయం చెప్పలేదు.

‘‘శనివారం మధ్యాహ్నం మా అబ్బాయిని ఆస్పత్రిలో చూశాను. రాత్రి 9 గంటల ప్రాంతంలో మరోసారి నా బిడ్డ వద్దకు వెళ్ళాను. త్వరలోనే ఆస్పత్రి నుంచి బిడ్డను తీసుకువెళ్ళవచ్చని డాక్టర్లు చెప్పారు’’ అని వినోద్ తెలిపారు.

కానీ కొన్ని గంటల వ్యవధిలోనే ఆస్పత్రిలో మంటలు రేగాయి. ఈ విషయం గురించి వినోద్‌కు ఆదివారం ఉదయం తెలియజేశారు.

‘‘ఆస్పత్రి సిబ్బంది ఒకరు నాకు కాల్ చేశారు. ఆస్పత్రిలో పేలుడు సంభవించిందని, ఆస్పత్రికి వెళ్ళి బిడ్డ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని చెప్పారు’’ అని వినోద్ వివరించారు.

భయంతో ఆయన ఘటనాస్థలికి చేరుకున్నారు. ‘‘అక్కడంతా ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. నన్ను ముందు వివేక్ విహార్ పోలీసు స్టేషన్‌కు, ఆ తరువాత జీటీబీ నగర్ ఆస్పత్రికి పంపారు’’ అని చెప్పారు.

వినోద్ తన బిడ్డ శవాన్ని గుర్తించలేకపోయారు. ‘‘ఆ మృతదేహం స్థితిని చూస్తే అది నాబిడ్డదేనని చెప్పడం చాలా కష్టంగా అనిపించింది’’

అయితే సోమవారం ఉదయం మార్చురీలో శిశువు శవాన్ని చూపించాక, ఆయన అది తన బిడ్డదేనని అంగీకరించారు.

ఆయన తన చేతులలోకి ఆ పసికందు శవాన్ని తీసుకోలేకపోయారు. సమీపబంధువులే బిడ్డ శవాన్ని కారు వద్దకు తీసుకువెళ్లారు.

‘న్యాయం కావాలి’

బేబీకేర్ న్యూబోర్న్ హాస్పిటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం అనేక మంది తల్లిదండ్రులను భయంలోకి నెట్టేసింది. అలాంటివారిలో రాజ్ కుమార్, ఉమా కూడా ఉన్నారు .

వీరి కుమార్తె 17 రోజుల పసికందు. ఘాజియాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఈ పాప పుట్టింది. అయితే జ్వరం రావడంతో ఈ పసికందును బేబీ కేర్ న్యూబోర్న్ హాస్పిటల్‌కు రెఫర్ చేశారు.

‘‘అగ్నిప్రమాదం జరిగినట్టు కనీసం నాకు చెప్పలేదు. నేను పూర్తిగా ఫీజు చెల్లించకపోవడం వల్ల డాక్టర్లు నా ఫోన్ రిసీవ్ చేసుకోవడం లేదనుకున్నా’’ అని రాజ్ కుమార్ చెప్పారు. అయితే రాజ్ కుమార్ కొంత డబ్బు పోగుచేసుకుని ఆదివారం ఉదయం ఆస్పత్రికి చేరుకునే సరికి అక్కడంతా ధ్వంసమై కనిపించింది. ‘‘పోలీసు అధికారులు నన్ను పోలీసు స్టేషన్‌కు వెళ్లమన్నారు. అక్కడ నుంచి ఆస్పత్రికి వెళ్ళాను. బతికున్నవారిలో నా కూతురు ఉందేమోనని చూశాను. కానీ తను అక్కడ లేదు’’ అని రాజ్ కుమార్ చెప్పారు.

సోమవారం ఉదయం రాజ్‌కుమార్ తన కుమార్తె శవాన్ని మార్చురీ నుంచి తీసుకున్నారు. తెల్లనివస్త్రంలో చుట్టిన బిడ్డ శవాన్ని చేతులపైకి తీసుకుని తన స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఆయన మౌనంగా మార్చురీని వీడారు.

‘‘నాకు న్యాయం కావాలి. కానీ అందుకోసం నేను ఒక్కడినీ పోరాడలేను. ఇందుకోసం బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులందరూ ముందుకు రావాలి’’ అని ఆయన చెప్పారు. ‘‘మేమందరం ముందుకు రాకపోతే ఇదో విషాదకర ఘటనగా అందరూ మరిచిపోతారు’’ అని చెప్పారు రాజ్‌కుమార్.

మంటలు ఎలా చెలరేగాయి?

పసిబిడ్డల శవాలను ఆయా కుటుంబాలకు అప్పగిస్తున్నారు. మార్చురీకి కిలోన్నర మీటరు దూరంలో ఉన్న బేబీకేర్ న్యూ బోర్న్ ఆస్పత్రి ధ్వంసమై కనిపిస్తోంది. సోమవారం సాయంత్రం 6గంటల సమయంలో ఫోరెన్సిక్ బృందం ఘటానాస్థలికి చేరుకని విచారణ మొదలుపెట్టింది.

మంటలు ఎలా రేగాయనే విషయం ఇంకా అస్పష్టంగానే ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగి ఉంటాయని అగ్నిమాపక విభాగాధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రి నివాస ప్రాంతాల మధ్యన ఓ వాణిజ్య భవంతిలో ఉంది. ఆస్పత్రి వెనుక ఓ కాలనీ ఉంది.

ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న దిల్లీ పోలీసులు ఆస్పత్రి యజమానిని, ఇన్‌చార్జ్ వైద్యుడిని అరెస్ట్ చేశారు.

‘‘ఆస్పత్రి 120 గజాల విస్తీర్ణంలో ఉంది. ఘటన జరిగిన సమయంలో 12 మంది చిన్నారులు ఇక్కడ ఉన్నారు. వీరిలో ఆరుగురు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ప్రమాదం జరగక ముందు ఒకరు చనిపోయారు’’ అని తెలిపారు.

అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి ఆస్పత్రి బాధ్యుడిపై పోలీసులు మరిన్ని అభియోగాలు మోపుతున్నారు. ‘‘ఆస్పత్రి నిరంభ్యతర పత్రం (ఎన్ఓసీ) మార్చి 31తో ముగిసింది. ఆస్పత్రిలో కేవలం ఐదు పడకలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ ఘటన జరిగిన సమయంలో 11 పడకల దాకా ఉన్నాయి. అక్కడ ఎటువంటి అగ్నిమాపక సాధనాలు లేవు. ఇతర నిబంధనలను కూడా పట్టించుకోలేదు. ఐపీసీ 304, 308 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేస్తున్నాం’’ అని చెప్పారు.

ఆ ఆస్పత్రిలో ఎంబీబీఎస్ పట్టా కలిగిన డాక్టర్లకు బదులుగా , బీఏఎంఎస్ డిగ్రీ కలిగిన డాక్టర్లు పనిచేస్తున్న విషయం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

నగరంలోని అన్ని నిర్మాణాల తరహాలోనే హాస్పిటల్స్ కూడా నిరభ్యంతర పత్రాలను పొందాలి. అలాగే అగ్నిమాపక విభాగం నుంచి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్‌ను కూడా పొందాల్సి ఉంటుంది. అగ్ని

నగరంలోని ఇతర మౌలిక సదుపాయాల తరహాలోనే ఆసుపత్రులు కూడా అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ అని పిలిచే నిరభ్యంతర ధృవీకరణ పత్రాన్ని పొందాలి. అగ్నిమాపక భద్రతా నిబంధనలను సంస్థ పాటిస్తోందనడానికి ఈ ధృవీకరణ పత్రం నిదర్శనగా నిలుస్తుంది.

అయితే బేబీ కేర్ న్యూబోర్న్ ఆస్పత్రి కేసు విషయంలో అలాంటి ధృవీకరణ పత్రం అవసరమా లేదా అనేది అగ్నిమాపక విభాగం ఇంకా నిర్థరించలేదు.

ఆస్పత్రి ఉన్న భవనం ఎత్తును కొలవాల్సిందిగా ఎంసీడీకి లేఖ రాసినట్టు దిల్లీ ఫైర్ సర్వీస్ డైరక్టర్ అటుల్ గార్గ్ చెప్పారు. ‘‘ 9 మీటర్ల కంటే ఎత్తు తక్కువగా ఉంటే అగ్నిమాపక విభాగం నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని చెప్పారు.

హాస్పిటల్ లైసెన్స్ గడువు మార్చి 31తో ముగిసిందని, దానిని వెంటనే ఖాళీ చేసే ఆలోచన కూడా లేదని హిందూస్థాన్ టైమ్స్ కథనం తెలిపింది. పైగా ఆస్పత్రి అనుమతించిన సామర్థ్యం కంటే ఎక్కువ సామర్థ్యంతో నడుస్తోందని తెలిపింది.

హాస్పిటల్ యజమాని ఇలాంటి ఆస్పత్రులే మరో మూడు ఎటువంటి లైసెన్సులు లేకుండా నడుపుతున్నారని ఆ కథనం తెలిపింది.

ఆస్పత్రిలో 10గంటల 55 నిమిషాలకు అగ్నిప్రమాదం జరిగితే, దాదాపు 35 నిమిషాల తరువాత అగ్నిమాపక సిబ్బంది 11.30గంటలకు అప్రమత్తమైందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.

మంటలు చెలరేగగానే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసే ముందు మంటలను స్వయంగా అదుపు చేసేందుకు ఆస్పత్రి అధికారులు ప్రయత్నించారా లేదా అనే విషయాన్ని కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఈ ఆస్పత్రి యజమాని నవీన్ కిచ్చి ఇలాంటివే మరో మూడు ఆస్పత్రులు నడుపుతున్నారు. 2021లో ఓ ఆపరేషన్‌కు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఆయనపై అభియోగాలు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)