You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మీ పిల్లలు దూరంగా ఉన్నవి చూడలేకపోతున్నారా? పిల్లలకు కళ్లద్దాలు రావడానికి ఇదొక కారణం
- రచయిత, సుభాష్ చంద్రబోస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లోని పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రతీ ముగ్గురు పిల్లల్లో ఒకరు 2030 నాటికి మయోపియా బారిన పడే అవకాశం ఉందని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి వైద్యులు హెచ్చరించారు.
మయోపియా అనేది కంటిలో తలెత్తే లోపం.
దీనివల్ల కంటికి దగ్గరిగా ఉన్నవి కనిపిస్తాయి. కానీ దూరంగా ఉన్నవి కనిపించవు. లేదా మసకగా కనిపిస్తాయి.
మయోపియా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోందని, జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఇది తీవ్రమవుతోందని వైద్యులు చెబుతున్నారు.
పిల్లల్లో మయోపియా ఎలా వస్తుంది? దీన్ని ఎలా నివారించాలి? వైద్యులు ఏం చెబుతున్నారు? వంటి విషయాలు తెలుసుకుందాం.
'20 ఏళ్లలో కేసులు మూడింతలు పెరిగాయి..'
2030 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసించే 5-15 ఏళ్ల మధ్య వయస్సు గల ప్రతీ ముగ్గురు పిల్లల్లో ఒకరు మయోపియా బారిన పడే అవకాశం ఉందని ముంబైకి చెందిన డాక్టర్ అగర్వాల్స్ ఆసుపత్రి వైద్యులు హెచ్చరించారు.
గత 20 ఏళ్లలో మయోపియా కేసుల సంఖ్య మూడింతలు పెరిగిందని వారు వెల్లడించారు.
1999- 2019 వరకు రికార్డు చేసిన డేటా ప్రకారం మయోపియా కేసుల సంఖ్య ఈ 20 ఏళ్లలో 4.44 శాతం నుంచి 21.15 శాతానికి పెరిగాయని వారు తెలిపారు.
వరల్డ్ మయోపియా ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, 2050 నాటికి ప్రపంచ జనాభాలో 50 శాతం మంది మయోపియాతో బాధపడతారని అంచనాలున్నాయి.
దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఏటా మే 13 నుంచి 19 వరకు ప్రపంచవ్యాప్తంగా మయోపియా అవేర్‌నెస్ వీక్ నిర్వహిస్తారు.
మయోపియా అంటే ఏంటి?
మయోపియా అనేది కంటిలో తలెత్తే ఒక లోపం.
ఈ లోపం వల్ల దూరంగా ఉన్నవి మసకగా కనిపిస్తాయి. ఈ లోపం ఎంత తీవ్రంగా ఉంటే దూరంగా ఉన్న వస్తువులు అంత మసకగా కనిపిస్తాయి.
పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల వారిలో ఈ లోపం కనిపించవచ్చని డాక్టర్ అగర్వాల్స్ ఆసుపత్రి సర్జన్, కంటి వైద్యులు అక్షయ చెప్పారు.
కోవిడ్-19 తర్వాత జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఇటీవల పాఠశాల పిల్లల్లో మయోపియా కేసులు పెరిగాయని ఆమె చెప్పారు.
ఆరుబయట ఆడుకోవడానికి బదులుగా పిల్లలు ఇంట్లోనే ఉంటూ డిజిటల్ స్క్రీన్లను ఎక్కువగా చూడటం వల్ల పిల్లల్లో మయోపియా కేసులు పెరుగుతున్నాయని ఎగ్మోర్ ప్రభుత్వ నేత్ర వైద్యశాల మాజీ డైరెక్టర్, కంటి వైద్యులు వహీదా నాసిర్ అన్నారు.
ఆన్‌లైన్ క్లాసులతో పాటు ఇతర డిజిటల్ స్క్రీన్ల వాడకం పెరగడం వల్ల టీనేజర్లలోనూ ఈ కంటి లోపం పెరిగిందని అక్షయ చెప్పారు.
మయోపియా రకాలు
స్కూల్ పిల్లలకు దగ్గరగా ఉన్న వస్తువులు బాగా కనిపించి, దూరంగా ఉన్నవి మసక మసకగా కనిపించడాన్ని ‘స్కూల్ మయోపియా’ అని అంటారు.
ఇదొక కంటి లోపం.
స్కూల్ మయోపియా మాత్రమే కాకుండా, హెరిడిటరీ మయోపియా, ప్రీమెచ్యూర్ మయోపియా కూడా ఉంటాయి.
మయోపియా ఎందుకు వస్తుంది?
మయోపియా రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు కొన్ని ఇతర కారణాలు ఉన్నాయి.
తల్లిదండ్రులకు మయోపియా ఉంటే పిల్లలకు కూడా ఇది వచ్చే అవకాశం ఉందని డాక్టర్ అక్షయ అన్నారు.
డిజిటల్ స్క్రీన్ చూసే సమయం పెరగడం వల్ల రెటీనా సమస్యలు పెరుగుతున్నాయని ఆమె చెప్పారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో మయోపియా సమస్య పెరుగుతోందని ఆమె అన్నారు.
మయోపియా లక్షణాలు
మయోపియాలో రెండు రకాలున్నాయని డాక్టర్ వహీదా నాసిర్ చెప్పారు.
అందులో ఒకటి సింపుల్ మయోపియా.
రెండోది పాథాలజిక్ మయోపియా.
‘‘సింపుల్ మయోపియాలో కేవలం చూపులో (పవర్)లో మార్పులు వస్తాయి. పాథాలజిక్ మయోపియాలో చూపుతో పాటు రెటినా సమస్యలు కూడా ఉంటాయి’’ అని డాక్టర్ వహీదా చెప్పారు.
దీని లక్షణాలను గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కంటి చూపు మందగిస్తుందని వహీదా అన్నారు.
సాధారణంగా పిల్లల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తున్నందున త్వరగా దీన్ని గుర్తించడం కష్టమవుతుందని అక్షయ అన్నారు.
కానీ, పిల్లల్లో ఈ లోపాన్ని గుర్తించడానికి పనికొచ్చే కొన్ని సంకేతాలను ఆమె చెప్పారు.
- మయోపియా ఉన్న పిల్లలకు దూరంగా ఉన్న వస్తువులు మసకగా కనిపిస్తాయి. కాబట్టి వారు ఒకవేళ టీవీ చూడాల్సి వస్తే దానికి దగ్గరగా కూర్చుంటారు.
- బోర్డుపై రాసింది చూడటానికి, చదవడానికి ఇబ్బంది పడే పిల్లల్ని తక్షణమే పరీక్షించాలి.
- పిల్లలకు తరచుగా తలనొప్పి, కంటి నొప్పి వస్తుంటే అనుమానించాలి.
నియంత్రించడం ఎలా?
మయోపియా ఉన్న వ్యక్తులు సరైన స్క్రీనింగ్, చికిత్స తీసుకోవడం ద్వారా కంటి చూపు మరింత మందగించకుండా జాగ్రత్త పడొచ్చు.
ఒకవేళ మీకు కంటిలోపం ఉన్నట్లు నిర్ధరణ అయితే వైద్యుల సిఫార్సు మేరకు కళ్లద్దాలు లేదా లెన్సులు వాడాలని డాక్టర్ అక్షయ సూచించారు.
మయోపియా తీవ్రత, బాధితుల వయస్సు, పరిస్థితిని బట్టి లేజర్ చికిత్స కూడా తీసుకోవచ్చని వహీదా అన్నారు.
‘‘ఈ సమస్య ఉన్నవారు కళ్లద్దాలు వాడకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారొచ్చు. శస్త్ర చికిత్సకు దారి తీయొచ్చు’’ అని చెప్పారు.
ముందు జాగ్రత్తలు
వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలోని ప్రతీ ఇద్దరిలో ఒకరికి మయోపియా వచ్చే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ మయోపియా ఇన్‌స్టిట్యూట్ గణాంకాలు చెబుతున్నాయి.
కొన్ని జాగ్రత్తలతో మయోపియా రాకుండా చూసుకోవచ్చని డాక్టర్లు చెప్పారు.
- డిజిటల్ స్క్రీన్ చూసే సమయాన్ని తగ్గించుకోవడం
- తరచుగా డిజిటల్ స్క్రీన్ వాడుతుంటే మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి.
- తక్కువ వెలుతురులో చదవకూడదు.
- ఏటా కంటి పరీక్ష చేయించుకోవాలి.
- బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ వాడాలి.
- మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.
- ధూమపానానికి దూరంగా ఉండాలి.
(గమనిక - ఈ కథనం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు, సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి:
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడానికి కారణం ఇదేనా?
- అఫ్గానిస్తాన్ వరదలు: ‘మా వాళ్ల మృతదేహాలు వీధుల్లో దొరికాయి’
- బ్యాంకు పరీక్షల కోచింగ్కు నంద్యాల ఎందుకింత ప్రత్యేకం?
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మృతి, అసలేం జరిగిందంటే..
- వైఎస్ రాజశేఖరరెడ్డి: హెలికాప్టర్ అదృశ్యమైన తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది... ఆచూకీ ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)