You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నిధుల కేటాయింపు పెరిగితే భారత్‌లో క్రీడలు మరింత అభివృద్ధి చెందుతాయా?
- రచయిత, జాహ్నవి మూలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత రెండు దశాబ్దాలుగా భారత ప్రభుత్వం, క్రీడా రంగం కోసం నిధులను వెచ్చిస్తోంది. క్రీడా రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరిగింది. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పతకాల సంఖ్య పెరిగింది. కానీ, ఇది సరిపోతుందా?
2004 ఒలింపిక్స్‌లో ఒక పతకం నుంచి 2024 ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు... ఆసియా క్రీడలు, ఆసియా పారా క్రీడల్లో అత్యధిక పతకాలు ఇలా భారత క్రీడా రంగం చాలా పురోగతి సాధించింది. ఇంకా మెరుగ్గా రాణించే స్థితిలో నిలిచింది.
క్రీడా, యువజన మంత్రిత్వ శాఖ కోసం ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో రూ.3,443 కోట్లను కేటాయించారు.
2023లో క్రీడలపై ప్రైవేట్ సెక్టార్ చేసిన ఖర్చు 15,766 కోట్ల వరకు ఉంటుందని ‘గ్రూప్ ఎం’ రిపోర్ట్ తెలిపింది. వీటిల్లో క్రికెట్ ఆధిపత్యమే ఎక్కువని పేర్కొంది.
కొత్త తరం ఆకాంక్షలు
ఒలింపిక్ క్రీడల్లో పెరిగిన మద్దతు, విజయాల శాతం అదితి స్వామి వంటి కొత్త తరం క్రీడాకారుల్లో ఆకాంక్షల్ని రేకెత్తించాయి. అదితి స్వామి 17 ఏళ్ల వయస్సులోనే 2023లో వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచారు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్‌గా, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు.
''నేను బాగా ఆడగలిగాను. ఎందుకంటే నాకు సరైన సమయంలో స్కాలర్‌షిప్ అందింది. స్కాలర్‌షిప్ లేకపోతే క్రీడల్లో కెరీర్‌ను నిర్మించుకోవడం చాలా కష్టమయ్యేది'' అని తన ప్రయాణం గురించి ఆమె చెప్పారు.
తొమ్మిదేళ్ల వయస్సులో ఆర్చరీని మొదలుపెట్టిన అదితి, తమ పట్టణంలోని ఒక చెరకు తోటలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆర్చరీ రేంజ్‌లో ప్రాక్టీస్ చేసేవారు. మహారాష్ట్రలోని సతారాలో ఆమె ఈ శిక్షణ పొందారు.
అప్పులు చేసి ఆర్చరీ సామగ్రి కొనుగోలు
ఆమె తండ్రి గోపీచంద్ ఒక స్కూల్ టీచర్. తల్లి శైలా, స్థానిక ప్రభుత్వ ఉద్యోగి.
వారికొచ్చే జీతాలతో క్రీడల్లో అదితి కెరీర్‌ను నిర్మించడానికి వారు నిరంతరం కష్టపడాల్సి వచ్చింది. ఆమె కోసం వారు చాలా అప్పులు చేశారు.
''రెండు మూడు నెలలకోసారి కొత్త బాణాల సెట్ అవసరమయ్యేది. ఎత్తు పెరుగుతున్నప్పుడల్లా విల్లును మార్చాల్సి వచ్చేది'' అని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.
ఒక్కో బాణాల సెట్ ధర దాదాపు రూ. 40,000 ఉంటుంది. విల్లు ధర రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది. వీటితో పాటు ఆమె డైట్, పోటీల్లో పాల్గొనేందుకు ప్రయాణ ఖర్చులు అదనంగా తోడయ్యేవి.
కొన్నేళ్ల పాటు ఇలాగే సాగింది. 2022లో గుజరాత్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో ఆమె స్వర్ణం గెలిచాక పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చింది. ఆ విజయం తర్వాత, భారత ప్రభుత్వం నుంచి 'ఖేలో ఇండియా' పథకం కింద ఆమెకు నెలకు రూ. 10,000 స్కాలర్‌షిప్ లభించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి నెలకు రూ. 20,000 చొప్పున మరో స్కాలర్‌షిప్ కూడా ఆమెను వెదుక్కుంటూ వచ్చింది.
ఈ స్కాలర్‌షిప్‌లు ఆమెకు ఎంతో సహాయపడ్డాయి.
''క్రీడల్లో పురోగతి సాధించినకొద్దీ ఖర్చు కూడా పెరుగుతుంది. ప్రతీసారి కొత్త పరికరాలు కొనేంత స్థోమత కుటుంబం వద్ద ఎప్పుడూ ఉండదు. ఆటల్లో ప్రతిభ ఉండి, చక్కగా రాణిస్తూ ఆర్థిక మద్దతు లేకపోవడంతో ఆడటం మానేసిన కొందరు ప్లేయర్లు నాకు తెలుసు'' అని అదితి చెప్పుకొచ్చారు.
అదితి కథ, భారత్‌లోని చాలామంది ప్లేయర్ల స్థితిగతులను ప్రతిబింబిస్తుంది. తన కెరీర్ ఆరంభంలో నిర్మాణ కార్మికునిగా పనిచేసిన ఒలింపియన్ అథ్లెట్ అవినాశ్ సాబ్లే, మంచి డైట్ లేకపోవడంతో ఒక దశలో దాదాపు బాక్సింగ్ నుంచి తప్పుకుందామనుకున్న వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత దీపక్ బోరియా ఇందుకు ఉదాహరణలు.
అయినప్పటికీ వారు కష్టాలకు ఎదురీదారు. భారత్‌కు పతకాలు అందించారు.
క్రీడల్లో ఎదుగుతున్న భారత్
దిల్లీలో 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ మండలి సమావేశంలో, దేశ వ్యాప్తంగా అథ్లెట్ల కోసం మెరుగైన శిక్షణా సౌకర్యాలు, ఉత్తమ కోచింగ్, గొప్ప అవకాశాల గురించి భారత క్రీడా మంత్రి మాన్సుక్ మాండవీయ మాట్లాడారు.
దేశంలో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించిన నిపుణులు కూడా అథ్లెట్ల కోసం చేయాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలు సాధించి ఓవరాల్‌గా 71వ స్థానంలో నిలిచింది. భారత్ పొరుగు దేశం, దాదాపు భారత్ స్థాయిలో జనాభా ఉన్న చైనా, ఒలింపిక్స్‌లో 91 పతకాలు గెలిచి రెండో స్థానాన్ని దక్కించుకుంది.
క్రీడాకారులపై భారత తలసరి ఖర్చు చైనాతో పోలిస్తే 5 రెట్లు తక్కువగా ఉందంటూ రెండు దేశాల మధ్య పోలికలు వచ్చాయి.
అభివృద్ధి చెందుతున్న ఒక ఆర్థిక వ్యవస్థలో మిగతా అత్యవసర రంగాలతో పోలిస్తే క్రీడలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని బేస్‌లైన్ వెంచర్స్ అనే స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన తుహిన్ మిశ్రా అన్నారు. ఈ సంస్థ భారత్‌లోని అగ్రశ్రేణి అథ్లెట్లతో పనిచేస్తుంది.
''జీడీపీ ఒక్కసారి ఒక నిర్ధిష్ట స్థాయికి చేరుకుంటే క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుంది. భారత్‌లో ఇదే జరుగుతోంది. వచ్చే 15-20 ఏళ్లలో క్రీడలు గణనీయంగా పురోగతి సాధిస్తాయి'' అని ఆయన అన్నారు.
ఒలింపిక్స్‌తో పోలిస్తే పారాలింపిక్స్‌లోనే భారత్ ఎక్కువ పతకాలు సాధించింది.
2004లో రెండు పతకాల నుంచి 2024లో 29 పతకాలు సాధించి పారాలింపిక్స్ క్రీడల్లో భారత్ తన ముద్రను వేసింది.
వైకల్యాల పట్ల వైఖరిలో వచ్చిన మార్పు, పారా స్పోర్ట్స్‌లో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి వల్లే ఇది సాధ్యమైందని చాలామంది అంటుంటారు.
పెరిగిన నిధుల కేటాయింపు
భారత్‌కు సంబంధించి స్పోర్ట్స్ ఫండింగ్‌లో 2009-2010 మధ్య కాలంలో ఒక పెద్ద మలుపు చోటుచేసుకుంది. ఆ సమయంలో కామన్వెల్త్ క్రీడలకు దిల్లీ ఆతిథ్యం వచ్చింది. భారత క్రీడాకారులు 38 స్వర్ణాలతో సహా మొత్తం 101 పతకాలు సాధించారు.
ఈ ప్రదర్శనతో భారత్‌లో ఒలింపిక్ క్రీడల పట్ల అవగాహన, ఆసక్తి పెరిగాయని ఫలితంగా క్రీడల్లో నిధుల పెంపుకు దారి తీసిందని నిపుణులు అంటున్నారు.
ఆ తర్వాతే 2014లో టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్), 2017-18 కాలంలో ఖేలో ఇండియా పథకాలను భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
టాప్స్ స్కీమ్, అంతర్జాతీయ వేదికపై పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అగ్రశ్రేణి క్రీడాకారులకు అండగా నిలుస్తుంది. క్రీడల్లో ప్రతిభ ఉన్న పిల్లలకు శిక్షణ ఇవ్వడం, మాజీ అథ్లెట్లకు మద్దతుగా నిలవడం, క్షేత్రస్థాయిలో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై 'ఖేలో ఇండియా' దృష్టి సారిస్తుంది.
ఖేలో ఇండియా పథకం కింద, 2,781 మంది అథ్లెట్లకు కోచింగ్, క్రీడా సామగ్రి, వైద్య సంరక్షణ, పాకెట్ అలవెన్స్ ఇస్తున్నట్లు పార్లమెంట్‌లో క్రీడామంత్రి మాన్సుక్ మాండవీయ చెప్పారు.
ఈ పథకాలు చాలా ముఖ్యమైనవని, వీటి ద్వారా లభించే ఆర్థిక సహాయం అథ్లెట్ల కెరీర్ తొలినాళ్లలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
ప్రతిభావంతులైన అథ్లెట్లకు స్థిరమైన ఆర్థిక మద్దతు కోసం వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో అథ్లెట్ల కోసం కోటాను కేటాయిస్తారు.
2014తో పోలిస్తే ప్రస్తుతం క్రీడలపై వెచ్చించిన మొత్తం మూడింతలు అయిందని క్రీడామంత్రి వెల్లడించారు.
భారత వార్షిక బడ్జెట్‌లో యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖకు కేటాయించిన బడ్జెట్‌ను ఆయన ప్రస్తావించారు.
గత బడ్జెట్ల గణాంకాలను గమనిస్తే కామన్వెల్త్ క్రీడల కారణంగా 2009-10లో క్రీడలపై ఎంత భారీగా ఖర్చు చేశారో అవుతుంది. ఇటీవలి ఏళ్లలో కూడా క్రమంగా ఈ గణాంకాలు మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని అన్నారు.
నిష్పత్తుల ప్రకారం చూస్తే, వార్షిక బడ్జెట్‌లో క్రీడల కోసం కేటాయిస్తున్న నిధులు ఏళ్లుగా స్థిరంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అయితే నిధుల వాడకం ఎలా మెరుగైందో వారు చెబుతున్నారు.
తమ రీజియన్‌లో క్రీడాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా కృషి చేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా ఇందులోనూ తేడాలు ఉంటాయని గణాంకాల ద్వారా తెలుస్తుంది.
ఇతర రీజియన్లతో పోలిస్తే క్రీడల్లో హరియాణా ఎందుకు ఉత్తమంగా ఉందో ఇది చూపిస్తుంది.
''హరియాణా క్రీడలపై దృష్టి సారించింది. క్రీడలకు ప్రోత్సాహం కల్పించడం కోసం భారీగా ప్రైజ్‌మనీ, ప్రభుత్వ ఉద్యోగాలు, అవార్డులు వంటి వాటిని ప్రభుత్వం అందజేస్తుంది. అక్కడ క్రీడా సంస్కృతి విలసిల్లడానికి, ఆటగాళ్లకు పేరు రావడానికి ఈ చర్యలు ఎంతో దోహదపడ్డాయి'' అని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సౌరభ్ దుగ్గల్ అన్నారు.
ప్రైవేట్ రంగం కృషి
రైఫిల్ షూటర్ దీపాలి దేశ్‌పాండే, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత ఆమె స్వప్నిల్ కుశాలేకు కోచింగ్ ఇచ్చారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వప్నిల్ కాంస్య పతకాన్ని గెలిచారు.
''మా రోజుల్లో కార్పొరేట్ల నుంచి మాకు పెద్దగా ఫండింగ్ అందకపోయేది. కొన్నిసార్లు కొంతమందికి ఈ సహాయం అందేది. క్రీడా సామగ్రి, ఇతర ఖర్చులు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ విషయంలో ఇప్పుడు చాలా మారిపోయింది'' అని ఆమె గుర్తు చేసుకున్నారు.
కామన్వెల్త్ గేమ్స్ (2010) తర్వాత ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, రిలయన్స్ ఫౌండేషన్, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, గోస్పోర్ట్స్ వంటి ఫౌండేషన్లు, అనేక ఎన్జీవోలు ఉద్భవించాయి. ఇవన్నీ చాలా చురుగ్గా యంగ్ స్పోర్టింగ్ టాలెంట్ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి.
ఒక జట్టుతో కలిసి పనిచేసేందుకు లేదా యువ ఆటగాళ్లను స్పాన్సర్ చేసేందుకు పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.
''అథ్లెట్లు మంచి ప్రదర్శన కనబరిచినప్పుడు, స్పాన్సర్లకు వారు చేసిన కృషికి తగిన ఫలితం వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆ క్రీడాకారుడికి ఉన్న పాపులారిటీతో బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇద్దరికీ ఇది ప్రయోజనకరమే. కాబట్టి ఆటలకు, ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడానికి మరిన్ని బ్రాండ్లు ముందుకు వస్తున్నాయి'' అని తుహిన్ మిష్రా వివరించారు.
కానీ, ఈ డబ్బుతో ప్రయోజనం పొందుతున్న మహిళా ప్లేయర్లు ఎంతమంది ఉన్నారు? ఈ సంఖ్య చాలా తక్కువే, కానీ కచ్చితంగా ఇది పెరుగుతోందని తుహిన్ అన్నారు.
''సాధారణంగా కార్పొరేట్లు ఆటగాళ్ల ప్రదర్శనను చూస్తాయి. గత కొన్ని ఒలింపిక్స్‌లో మహిళా అథ్లెట్లు అద్భుత ప్రదర్శనలు నమోదు చేశారు. పీవీ సింధు, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్, మను భాకర్‌లు ఈ జాబితాలో ఉన్నారు. ఈ ప్రదర్శనలు వారికి మరింత గుర్తింపు తెచ్చిపెట్టాయి'' అని ఆయన వివరించారు.
గత 24 ఏళ్లలో ఒలింపిక్స్‌లో భారత్ గెలిచిన 26 పతకాల్లో మహిళలు గెలిచినవి పది ఉన్నాయి.
గ్రూప్‌ఎం సంస్థ వెలువరించిన 'ఇండియా స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్ రిపోర్ట్' ప్రకారం చూస్తే, మరింత మంది అమ్మాయిలు క్రీడల్లోకి వస్తున్నారు, లింగ మూసధోరణులను బద్దలు చేస్తున్నారు.
క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడానికి మహిళా కేంద్రీకృత కార్యక్రమాలు, టోర్నమెంట్లు నిర్వహించడం వంటి చొరవలు దోహదపడుతున్నాయని ఈ రిపోర్ట్ పేర్కొంది.
గత 8 ఏళ్లలో క్రీడా రంగం వ్యయం 941 మిలియన్ డాలర్ల నుంచి 1.9 బిలియన్ డాలర్లకు పెరిగిందని అందులో రాశారు.
అయితే ఈ వ్యయంలో 87 శాతం క్రికెట్‌లోకి వెళ్తుందని పేర్కొంది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు మెజారిటీ వాటా కేటాయిస్తారని రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది.
అందుకే, స్పాన్సర్‌షిప్‌కు మించి చూడాలని కొంతమంది నమ్ముతారు.
''స్పాన్సర్‌షిప్ అనేది చాలా చిన్నది. మనకు కావాల్సింది పెట్టుబడి'' అని మాజీ ఒలింపియన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అదిలె సుమరివాలా అన్నారు.
''చాలా ప్రైవేట్ సంస్థలు లాభాలను ఆశిస్తూ క్రీడల్లో పెట్టుబడులు పెడతాయి. క్రీడల పర్యావరణాన్ని తీర్చిదిద్దడానికి క్షేత్రస్థాయిలోని క్రీడా సమాఖ్యల అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలి. కోచ్‌లు, మేనేజర్లు, డాక్టర్లు, వైద్యులు, స్పోర్ట్స్ సైంటిస్టులు, ఫిజియోలు, వాలంటీర్ల కోసం నిధులను అందించాలి. స్పాన్సర్ చేయడం మాత్రమే కాకుండా 5 నుంచి 10 ఏళ్ల కాలానికి దీర్ఘకాలిక మద్దతు ఇవ్వాలి. ఒడిశా ప్రభుత్వం ఇలాగే హాకీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విధానం విజయవంతం అయింది'' అని ఆయన వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)