You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1954 నాటి కుంభమేళా తొక్కిసలాటలో 800 మంది మరణించిన తరువాత నెహ్రూ ఏం సలహా ఇచ్చారంటే
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా 30 మంది చనిపోయారు. మరో 60 మంది గాయపడ్డారు.
మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో స్నానాల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో ఈ ప్రమాదం జరిగింది.
చనిపోయిన వారిలో 25మందిని గుర్తించామని డీఐజీ (మహాకుంభ్ నగర్ మేలా ప్రాంతం) వైభవ్ కృష్ణ చెప్పారు. గాయపడ్డవారు చికిత్స పొందుతున్నారు.
హరిద్వార్, ఉజ్జయిని, ప్రయాగ్‌రాజ్, నాసిక్‌లలో ప్రత్యేక సందర్భాల్లో కుంభమేళాలు నిర్వహిస్తుంటారు.
ఎక్కువరోజుల పాటు సాగే కుంభమేళాలో కొన్ని రోజులు ప్రత్యేకమైనవి. ఈ రోజుల్లో స్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది.
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరిగే సమయంలో సంగమంలో స్నానమాచరించాలని భక్తులు కోరుకుంటారు. గంగ, యమున, అంతర్వాహినిగా ఉండే సరస్వతి నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు.
ఈ సంగమ ప్రాంతంలో స్నానమాచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు.
అయితే కొన్నిసార్లు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చినప్పుడు వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం కష్టమైన విషయం.
కుంభమేళా సమయంలో గతంలోనూ ప్రమాదాలు జరిగాయి.
అలహాబాద్(ప్రయాగ్‌రాజ్) కుంభమేళా 1954
ప్రస్తుత ప్రయాగ్‌రాజ్(అప్పటి అలహాబాద్) కుంభమేళా నిర్వహించారు.
స్వాతంత్ర్యం తరువాత జరిగిన తొలి కుంభమేళా ఇది.
ఆ కుంభమేళాలో భాగంగా 1954 ఫిబ్రవరి 3న మౌని అమావాస్య సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఓ ఏనుగు కారణంగా అక్కడ తొక్కిసలాట జరిగినట్లు చెప్తారు.
ఈ తొక్కిసలాటలో 800మందికిపైగా భక్తులు మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు.
కుంభమేళాకు వెళ్లొద్దంటూ అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రాజకీయనాయకులు, వీఐపీలకు ఈ తొక్కిసలాట తర్వాత సలహా ఇచ్చారు.
హరిద్వార్ కుంభమేళా 1986
హరిద్వార్‌లో కుంభమేళా జరిగింది.
1986 ఏప్రిల్ 14న అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, అనేక ఇతర రాష్ట్రాల సీఎంలు, నాయకులతో కలిసి హరిద్వార్ వెళ్లారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
వారి రాకతో సాధారణ భక్తులను ఒడ్డు దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో రద్దీ పెరిగిపోయింది. భక్తులను నియంత్రించడం సాధ్యం కాలేదు.
ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది చనిపోయారు. అంతకుముందు 1927, 1950ల్లో జరిగిన హరిద్వార్ కుంభమేళాల్లోనూ తొక్కిసలాటలు జరిగాయి.
ఉజ్జయిని సింహస్థ కుంభమేళా 1992
ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళా నిర్వహించారు. తొక్కిసలాటలో దాదాపు 50 మంది చనిపోయారు.
నాసిక్ కుంభమేళా 2003
2003లో నాసిక్‌లో కుంభమేళా జరిగింది. సాధువులు వెండినాణేలు పంపిణీ చేశారని దైనిక్ జాగరణ్ కథనంలో ఉంది.
వెండి నాణేల కోసం భక్తులు ఎగబడ్డారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. దాదాపు 30 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 100 మందికి పైగా గాయపడ్డారు.
హరిద్వార్ కుంభమేళా 2010
హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించారు.
అమృత స్నానాల విషయంలో భక్తులకు, సాధువులకు మధ్య వాగ్వాదం జరిగింది.
తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రకటించింది.
అలహాబాద్(ప్రయాగ్‌రాజ్)కుంభమేళా 2013
2013లో అలహాబాద్(ప్రయాగ్‌రాజ్)లో కుంభమేళా నిర్వహించారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగిందిన రాయిటర్స్ తెలిపింది.
ఆ ప్రమాదంలో 36 మంది చనిపోయారు. వారిలో 29 మంది మహిళలు.
తొక్కిసలాటకు కారణమేంటో స్పష్టంగా తెలియలేదు. పోలీసులు భక్తులను నియంత్రించడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగిందని కొందరు చెప్పారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద తొక్కిసలాట జరిగిందని, అక్కడి నుంచి భక్తులు కిందపడ్డారని ఒకరు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)