డీప్‌సీక్ ఎలా పనిచేస్తోంది, ఇతర చాట్‌బాట్‌లకు దీనికి తేడా ఏమిటి?

    • రచయిత, జో క్లెన్‌మన్
    • హోదా, టెక్నాలజీ ఎడిటర్

డీప్‌సీక్ చైనాకు చెందిన ఒక ఏఐ-చాట్‌బాట్ యాప్. ఈ యాప్, అమెరికా మార్కెట్‌‌పై భారీ ప్రభావాన్ని చూపింది. కృత్రిమ మేథ (ఏఐ)లో అమెరికా ఆధిపత్యంపై పలు ప్రశ్నలను లేవనెత్తింది.

ఈ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.

డీప్‌సీక్ మిగతా అన్ని చాట్‌బాట్‌ల్లాగే పనిచేస్తుంది. కాస్త ఎక్కువగా చాట్ చేస్తుంటుంది.

ఓపెన్‌ఏఐకి చెందిన చాట్ జీపీటీ, గూగుల్ రూపొందించిన జెమిని తరహాలోనే మీరు ఈ యాప్ (లేదా వెబ్‌సైట్) ఓపెన్ చేసి ఏదైనా ప్రశ్న అడిగితే, మీకు జవాబు ఇవ్వడానికి ఇది దాని అత్యుత్తమ స్థాయిలో పని చేస్తుంది.

మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి సుదీర్ఘమైన సమాధానాలను ఇస్తుంది. అందులో ఒక అభిప్రాయం లేకుండా చూసుకుంటుంది.

మీరు రాజకీయాలకు సంబంధించి ప్రశ్న(డోనల్డ్ ట్రంప్ మంచి అధ్యక్షుడా?) అడిగినా? లేదా సాఫ్ట్ డ్రింకుల (పెప్సీ, కోక్‌లలో ఏది బావుంటుంది?) గురించి ప్రశ్నించినా, ఈ అంశం 'హైలీ సబ్జెక్టివ్' అని మొదలుపెడుతూ ఈ చాట్‌బాట్ తన స్పందనను తెలియజేస్తుంది.

చాట్ జీపీటీ కంటే డీప్‌సీక్ మెరుగైనదా? కాదా? అని ప్రశ్నించినప్పుడు కూడా, రెండు యాప్‌లలో లాభనష్టాలను అంచనా వేసింది తప్పా ఏది మెరుగైనదనే అంశంలో తన అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పలేదు. చాట్‌జీపీటీ కూడా ఇలాగే చేసింది. దాదాపు ఒకేలా సమాధానం చెప్పింది.

2023 అక్టోబర్ నాటి డేటా వరకు చాట్‌బాట్‌కు శిక్షణ ఇచ్చినట్లు డీప్‌సీక్ సంస్థ చెబుతోంది. అయితే, యాప్‌లో ఈరోజు తేదీ వరకు సమాచారం అందుబాటులో ఉన్నట్లు అనిపించినప్పటికీ, వెబ్‌సైట్ వెర్షన్‌లో మాత్రం ఇంత డేటా అందుబాటులో లేదు.

ఇది చాట్ జీపీటీ తొలి వెర్షన్లకు భిన్నంగా ఏమీ లేదు. రియల్ టైమ్‌లో వెబ్‌లోకి చేరవేసిన తప్పుడు సమాచారాన్ని చాట్‌బాట్ ప్రసారం చేయకుండా ఆపడానికి చేసిన ఒక విధమైన రక్షణ ప్రయత్నం ఇది.

ఇది చాలా వేగంగా సమాధానాలు చెబుతుంది. కానీ, ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ చాట్‌బాట్‌ను వాడటానికి ఎక్కువమంది ప్రయత్నిస్తున్నందున దాని వేగం కాస్త మందగించింది.

కానీ, ఒక అంశంలో మాత్రం చాట్ జీపీటీకి దీనికి పోలిక లేదు. చైనాలో నిషేధించిన అంశాల ను ప్రశ్నించినప్పుడు డీప్‌సీక్ స్వీయ సెన్సార్‌ను పాటిస్తోంది.

కొన్నిసార్లు ఇది తన సమాధానాన్ని మొదలుపెట్టి వెంటనే ఆపేస్తుంది. తర్వాత స్క్రీన్ నుంచి ఆ స్పందన మాయమైపోయి, 'ఇంకే వేరే ఏదైనా మాట్లాడండి' అనే టెక్ట్స్‌ కనిపిస్తుంది.

1989 నాటి తియానన్మెన్ స్క్వేర్ నిరసనలు అనేవి చైనాలో కచ్చితంగా ఒక నిషిద్ధ అంశం. నాటి నిరసనల్లో మిలిటరీ చేతుల్లో 200 మంది పౌరులు చనిపోయారని చైనా ప్రభుత్వం చెబుతుండగా, ఈ మృతుల సంఖ్య వందల నుంచి కొన్ని వేల వరకు ఉంటుందని కొందరు అంచనా వేశారు.

ఈ అంశానికి సంబంధించిన ఏ ప్రశ్నకు కూడా డీప్‌సీక్ సమాధానం చెప్పదు.

చైనాలో ఆరోజు ఏం జరిగిందనే దాని గురించి విస్తృతంగా సమాధానం ఇవ్వదు.

డీప్‌సీక్‌తో పోల్చితే అమెరికా తయారు చేసిన చాట్ జీపీటీ, తియానన్మెన్ స్క్వేర్‌కు సంబంధించిన సమాధానాల్లో వెనకడుగు వేయదు.

నిజం చెప్పాలంటే ఈ యాప్‌ తయారీలో చైనా ప్రభుత్వ ప్రమేయం లేదని ఆక్స్‌ఫర్డ్ చైనా పాలసీ ల్యాబ్ డైరెక్టర్, ఆక్స్‌ఫర్డ్ ఇంటర్‌నెట్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చర్ కేలా బ్లూమ్‌క్విస్ట్ అన్నారు.

కచ్చితత్వం (ఆక్యురసీ) విషయంలో ఇతర చాట్‌బాట్‌ల తరహాలోనే డీప్‌సీక్ కూడా అదే హెచ్చరికలను జారీ చేస్తుంది. డీప్‌సీక్ వాడుక అనుభవం కూడా లక్షల మంది ప్రజలు వాడుతున్న అమెరికా చాట్‌బాట్‌ల తరహాలోనే ఉంటుంది.

ముఖ్యంగా టాప్ టైర్ సర్వీస్‌లను సబ్‌స్క్రైబ్ చేయని యూజర్లకు, అచ్చం చాట్ జీపీటీ వాడినప్పుడు వచ్చే అనుభూతినే కలిగిస్తుంది.

ఒక గణిత సమస్యను ఊహించుకోండి. దాని సరైన సమాధానం 32 దశాంశ స్థానాలు ఉంటుందని అనుకుందాం. కానీ, సంక్షిప్త రూపంలో 8 దశాంశాలకే సరిపోతుంది.

ఇది పూర్తి సమాధానం కాదు. కానీ, చాలామందికి దీనిపై పెద్దగా అభ్యంతరం ఉండదు. ఈ వ్యవస్థ ఖర్చులను, కంప్యూటింగ్ అవసరాలను తగ్గించింది. కానీ, ఇది దిగ్గజ కంపెనీల టెక్నాలజీతో దీన్ని రూపొందించారనే సంగతి మనకు తెలుసు. ఇందులో ఎన్‌విడియా చిప్‌లు, మెటా ఓపెన్ సోర్స్ లామా ఆర్కిటెక్చర్‌తో పాటు అలీబాబా కంపెనీకి చెందిన క్వెన్‌ను ఉపయోగించారు.

''ఎక్కువ శాతం అమెరికా ఏఐ సంస్థలు వద్ద ఉన్న మానిటైజేషన్ వ్యూహాల ఆలోచనను ఇది కచ్చితంగా సవాలు చేస్తుందని నేను అనుకుంటున్నా. రాబోయే రెండు నెలల్లో ఏం జరుగుతుందో చూద్దాం'' అని బ్లూమ్‌క్విస్ట్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)