నంబర్ ప్లేటే కదా అనుకోవద్దు.. ఇవన్నీ తెలుసుకోండి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
రోడ్డుపై వెళ్తున్న వాహనాల నెంబరు ప్లేట్లను కాసేపు చూస్తే… అవి రకరకాలుగా కనిపిస్తాయి. కొన్ని తెలుపు.. కొన్ని పసుపు.. మరికొన్ని ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అసలు ఈ రంగులన్నింటికీ అర్థమేంటి? ఏ వాహనానికి ఎలాంటి నంబర్ ప్లేట్ ఉండాలి?నంబర్ ప్లేట్ విషయంలో వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కొన్ని వాహనాలకు బీహెచ్ అనే రెండు అక్షరాలు కనిపిస్తాయి. అవి ఎలాంటి వాహనాలకు ఇస్తారు. ఎలాంటి అర్హతలు ఉండాలి?
ఈ అంశాలపై బీబీసీ విశాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్‌తో మాట్లాడింది. ఆయన చెప్పిన వివరాలను కొన్ని ప్రశ్నలు-సమాధానాల రూపంలో తెలుసుకుందాం.

1. వాహనాల నంబర్ ప్లేట్లు వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయి?
- తెలుపు రంగు ప్లేట్‌పై నలుపు అక్షరాలు - ప్రైవేట్/నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలు.
- పసుపు ప్లేట్‌పై నలుపు అక్షరాలు - ట్రాన్స్పోర్ట్/కమర్షియల్ వాహనాలు.
- ఆకుపచ్చ ప్లేట్‌పై తెలుపు అక్షరాలు - ప్రైవేట్ బ్యాటరీ/ఎలక్ట్రిక్ వాహనాలు.
- ఆకుపచ్చ ప్లేట్‌పై పసుపు అక్షరాలు - కమర్షియల్/ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు.
- ఆకుపచ్చ ప్లేట్‌పై నలుపు అక్షరాలు - కొన్ని ఎలక్ట్రిక్ రెంట్-ఎ-క్యాబ్ వాహనాలు.
- డీప్ బ్లూ ప్లేట్ - దౌత్య/కాన్సులర్ వాహనాలకు సంబంధించిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ మార్కులు.
- తాత్కాలిక రిజిస్ట్రేషన్ విషయంలో ఎరుపు అక్షరాలు/నంబర్లు పసుపు ప్లేట్‌పై ఉండే విధానం ఉంది.
2) ప్రైవేట్, కమర్షియల్ వాహనం నంబర్ ప్లేట్ల మధ్య తేడా ఎందుకు?
ప్రైవేట్ వాహనాలకు తెలుపు ప్లేట్‌పై నలుపు అక్షరాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు పసుపుపై నలుపు అక్షరాలు అని సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్)లో పేర్కొన్నారు.
దీని ప్రధాన ఉద్దేశం వాహనం ఏ కేటగిరీకి చెందినదో రోడ్డుపైనే సులభంగా గుర్తించడం.
ఉదాహరణకు ట్యాక్సీ, బస్సు, సరకు రవాణా వాహనం వంటి వాహనాలను పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దూరం నుంచే గుర్తించేందుకు రంగు సహాయపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
3) ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ నంబర్ ప్లేట్ ఎందుకుంటుంది?
కేంద్ర ప్రభుత్వం 2018లో సీఎంవీఆర్ రూల్ 50కి సవరణ చేసి బ్యాటరీ/ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌ను నిర్దేశించింది.
- నాన్-ట్రాన్స్పోర్ట్ ఈవీ (ఎలక్ట్రిక్ వెహికిల్) - ఆకుపచ్చ ప్లేట్‌పై తెలుపు అక్షరాలు
- ట్రాన్స్పోర్ట్ ఈవీ - ఆకుపచ్చ ప్లేట్ పై నలుపు అక్షరాలు (2018 నోటిఫికేషన్ ప్రకారం)
వాహనం ఎలక్ట్రిక్ అని సులభంగా గుర్తించడానికి ఈ రంగు నిబంధన తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
4) నీలం రంగు నంబర్ ప్లేట్లు ఎవరికి ఇస్తారు?
ఇది సాధారణ ప్రజల వాహనాలకు కాదు.
సీఎంవీఆర్లో దౌత్య కార్యాలయాలు, కాన్సులర్/డిప్లొమాటిక్ మిషన్లకు చెందిన వాహనాలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ మార్కులు ఉన్నాయి. వాటికి డీప్ బ్లూ ప్లేట్, ప్రత్యేక అక్షరాలు/నంబర్ రంగుల కలయిక ఉంటుంది.
అందువల్ల రోడ్డుపై ఇలాంటి ప్లేట్ కనిపిస్తే అది సాధారణ AP రిజిస్ట్రేషన్ వాహనం కాదని అర్థం.

ఫొటో సోర్స్, RCH Srinivas
5) భారత్ సిరీస్ (BH) నంబర్ ప్లేట్లు ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు అర్హులు?
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగరీత్యా మారే వ్యక్తులు తమ వ్యక్తిగత వాహనాన్ని కొత్త రాష్ట్రంలో మళ్లీ రిజిస్టర్ చేయాల్సిన ఇబ్బందిని తగ్గించేందుకు దీనిని తీసుకొచ్చారు.
ఇది YY BH #### XX ఫార్మాట్ లో ఉంటుంది.
- YY - మొదటి రిజిస్ట్రేషన్ సంవత్సరం
- BH - Bharat Series
- నాలుగు అంకెల సంఖ్య
- XX - అక్షరాల సిరీస్.
ఇది ప్రధానంగా సాయుధ దళ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టారులో పని చేసే వారు, నాలుగు లేదా అంత కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా యూటీలలో కార్యాలయాలున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు బీహెచ్ నెంబరును పొందేరుకు అర్హత పొందవచ్చు.
ప్రైవేట్ ఉద్యోగి అయితే, సంస్థకు కనీసం 4 రాష్ట్రాలు/UTల్లో కార్యాలయాలు ఉన్నట్లు ధ్రువీకరణ ఇవ్వాలి. అంటే "ప్రైవేట్ ఉద్యోగి అయితే ఎవరైనా BH తీసుకోవచ్చు" అనేది తప్పు.
6) ఎరుపు రంగు నంబర్ ప్లేట్లు లేదా తాత్కాలిక రిజిస్ట్రేషన్ నిబంధనలు ఏమిటి?
తాత్కాలిక రిజిస్ట్రేషన్‌కు పసుపు రంగు ప్లేట్ పై ఎరుపు అక్షరాలు/నంబర్లు ఉండే విధానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ప్రకారం తాత్కాలిక రిజిస్ట్రేషన్ 30 రోజుల గడువుతో ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆర్టీవో/ఈ-సేవా/డీలర్ ద్వారా తాత్కలిక రిజిస్ట్రేషన్ పొందవచ్చు.
పసుపు ప్లేట్‌పై ఎరుపు అక్షరాలతో ఉండే తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు ఈ రకం నెంబరు ప్లేట్ ఇస్తారు.

ఫొటో సోర్స్, mvd kerala
7) నంబర్ ప్లేట్ రంగుతోపాటు అక్షరాలు, నంబర్ల ఫార్మాట్ కూడా మారుతుంది. వాటి అర్థం ఏంటి?
ఉదాహరణకు ఏదైనా కారు నెంబరు AP 31 AB 1234 అనుకుంటే...అందులో
- AP - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోడ్
- 31 - సంబంధిత రిజిస్ట్రింగ్ అథారిటీ/ప్రాంత కోడ్
- AB - సిరీస్
- 1234 - ఆ వాహనానికి కేటాయించిన నంబర్.
ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ అధికారిక జాబితాలో AP రాష్ట్ర కోడ్‌గా ఉంది. ప్రధానంగా వాహనం ఏ రాష్ట్రం, ఏ రిజిస్ట్రింగ్ అథారిటీ పరిధిలో రిజిస్టర్ అయిందో గుర్తించడానికి ఈ కోడ్ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
8) నంబర్ ప్లేట్ తప్పుగా పెట్టడం, రంగు మార్చడం, ఫ్యాన్సీగా రాయడం నేరమా?
రిజిస్ట్రేషన్ మార్క్ నిర్దేశించిన విధంగా స్పష్టంగా, చదవగలిగేలా ముందు, వెనుక ప్రదర్శించాలి. ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది.
కాబట్టి... ఫాంట్ మార్చడం, నంబర్లను వంకరగా రాయడం, నంబర్ల మధ్య అనవసర డిజైన్లు పెట్టడం, అక్షరాలను మార్చి మరో అర్థం వచ్చేలా చేయడం, నంబర్ కనిపించకుండా చేయడం వంటివి నిబంధనల ఉల్లంఘనకు దారితీయవచ్చు.
నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించేలా, చదవగలిగేలా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ప్రకారం రిజిస్ట్రేషన్ మార్క్ ముందు, వెనుక సమతలమైన ప్రదేశంలో స్పష్టంగా, చదవడానికి వీలుగా ఉండాలి. కాబట్టి నంబర్‌ను కప్పేసేలా స్టిక్కర్లు, ఫ్రేంలు, అలంకరణలు, పేర్లు, మత/రాజకీయ నినాదాలు, డిజైన్లు పెట్టడం సమస్యగా మారుతుంది.
చాలాసార్లు నెంబర ప్లేట్‌పై ఫాంట్ మార్చడం, నంబర్‌ను తప్పుగా రాయడం ఇప్పటికీ కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం అక్షరాలు, నంబర్ల పరిమాణం, స్పేస్, డిస్ప్లే విధానం కూడా నిర్దేశించారు.
ప్లేట్ మురికిగా ఉన్నా, వంగిపోయినా, అక్షరాలను మార్చినా, కొంత భాగం కప్పి ఉంచినా నంబర్ స్పష్టంగా కనిపించదు. దీంతో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వ్యవస్థకు వాహనాన్ని గుర్తించడంలో ఇబ్బంది రావచ్చు. ఇది కేవలం ట్రాఫిక్ చలాన్ల సమస్య మాత్రమే కాదు. వాహనం దొంగతనం, ప్రమాదం లేదా నేర దర్యాప్తు సమయంలోనూ రిజిస్ట్రేషన్ నంబర్ కీలకంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, mvdkerala
9) ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ లేదా నంబర్‌ను మార్చి రాయడం వల్ల ప్రమాదాలు/నేర దర్యాప్తులో సమస్యలు వస్తాయా?
వస్తాయి. రిజిస్ట్రేషన్ నంబర్ ప్రతి వాహనానికి ప్రత్యేక గుర్తింపు. ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి, సీసీటీవీ లేదా ఏఎన్పీఆర్ ద్వారా నంబర్‌ను గుర్తించడం దర్యాప్తులో కీలకంగా ఉంటుంది. నంబర్‌ను ఉద్దేశపూర్వకంగా మార్చి రాసినా, కొంత భాగం కప్పి ఉంచినా వాహనాన్ని గుర్తించడం, సంబంధిత వివరాలను డేటాబేస్‌తో సరిపోల్చడం కష్టమవుతుంది. ముఖ్యంగా హిట్ అండ్ రన్ కేసుల్లో ఇది దర్యాప్తును ఆలస్యం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ కూడా వాహన రిజిస్ట్రేషన్ వివరాలను శోధించే సదుపాయం ప్రమాదాలు లేదా నేరాల సందర్భాల్లో ఉపయోగపడుతుందని పేర్కొంటోంది.

ఫొటో సోర్స్, mvd kerala
10) HSRP అంటే ఏంటి? దీని ప్రయోజనం ఏంటి?
HSRP అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్. సాధారణ నంబర్ ప్లేట్‌తో పోలిస్తే దీనిలో ప్రత్యేక భద్రతా లక్షణాలు ఉంటాయి. రిఫ్లెక్టివ్ మెటీరియల్, హోలోగ్రామ్, లేజర్ ద్వారా గుర్తింపు, ట్యాంపర్ చేయడం కష్టమైన ఫిక్సింగ్ వంటి అంశాలు ఇందులో ఉంటాయి.
కొత్త వాహనాలకు HSRP అమలు చేసే విధానాన్ని కేంద్రప్రభుత్వం నిబంధనల ద్వారా నిర్దేశించింది. సాధారణంగా కొత్త వాహనాలకు తయారీదారు లేదా అధీకృత డీలర్ ద్వారా HSRP అమర్చే విధానం ఉంటుంది. నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, ప్లేట్‌ను మార్చడం లేదా ట్యాంపర్ చేయడం కష్టతరం చేయడం, వాహనాన్ని సులభంగా గుర్తించడం దీని ప్రధాన ఉద్దేశాలు.
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) సాధారణ ప్లేట్ కంటే అదనపు హంగులు కలిగినది. దానిలో ప్రత్యేక రిఫ్లెక్టివ్ మెటల్, భద్రతా గుర్తులు, లేజర్‌తో ముద్రించిన గుర్తింపు, హోలోగ్రామ్, సులభంగా తొలగించలేని విధంగా అమర్చే వ్యవస్థ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.
2018లో కేంద్ర ప్రభుత్వం HSRP కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త వాహనాలకు HSRPను తయారీదారు లేదా డీలర్ ద్వారా అమర్చే విధానాన్ని నిర్దేశించింది.
11) నంబర్ ప్లేట్ పాడైతే ఎక్కడైనా తయారు చేయించుకోవచ్చా?
ఎక్కడైనా తయారు చేయించుకోవడం సరైన విధానం కాదు, ముఖ్యంగా HSRP అయితే నిర్దిష్ట భద్రతాప్రమాణాలు ఉన్నాయి. నంబర్ ప్లేట్ పాడైనా లేదా పోయినా... అనుమతి పొందిన సంస్థ ద్వారా కొత్త HSRP ప్లేట్‌ను తీసుకోవాలి. అలాగే రోడ్డుపక్కన ఉన్న షాప్‌లో మనకు నచ్చిన ఫాంట్లో నంబర్ ప్లేట్ తయారు చేయించుకోకూడదు. నిబంధనల ప్రకారం నిర్ణయించిన సంస్థ ద్వారా కొత్త HSRP ప్లేట్‌ను తీసుకోవాలి.
12) మీ వాహనం నంబర్ ప్లేట్ సరైనదో కాదో ఎలా తెలుస్తుంది?
ఒక సాధారణ వాహనదారుడు తన వాహనానికి సరైన నంబర్ ప్లేట్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏ విషయాలు తప్పనిసరిగా చూసుకోవాలి.
- వాహనానికి సరైన రంగులో నంబర్ ప్లేట్ ఉందా?
- ఆర్సీలో ఉన్న రిజిస్ట్రేషన్ నంబరే ప్లేట్‌పై ఉందా?
- అక్షరాలు, నంబర్లు స్పష్టంగా ఉన్నాయా? నిబంధనల ప్రకారం ఉన్నాయా?
- స్టిక్కర్లు, డిజైన్లు, ఫ్రేంలు నంబర్‌ను కప్పకుండా ఉన్నాయా?
13) సాయుధ దళాలు, రాష్ట్రపతి, ప్రధాని వంటి వారి వాహనాలకు నంబర్లు ఎలా కేటాయిస్తారు?
అవును. రక్షణ దళాలకు చెందిన వాహనాలకు సాధారణ RTO రిజిస్ట్రేషన్‌కు భిన్నమైన ప్రత్యేక విధానం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వాహనాలకు కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. అయితే రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖుల వాహనాల విషయంలో వాహనం ఏ ప్రభుత్వ విభాగం లేదా సంస్థకు చెందినదన్నదాన్ని బట్టి రిజిస్ట్రేషన్ విధానం ఉంటుంది.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహనాల రిజిస్ట్రేషన్‌కు వాహనాల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక నిబంధన (సెక్షన్ 60) ఉంది. రక్షణ దళాల వాహనాలకు ప్రత్యేక నంబరింగ్ విధానం ఉంటుంది. బాణం గుర్తు ఉన్న నంబర్ ప్లేట్లు ఈ రక్షణ వాహనాల ప్రత్యేక గుర్తింపులో భాగం.
రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖుల అధికారిక వాహనాలకు ప్రత్యేక గుర్తింపు/భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం వాహనం కేంద్ర ప్రభుత్వానికి చెందినదా, ఏ సంస్థ/శాఖకు చెందినదా అన్నదాన్ని బట్టి రిజిస్ట్రేషన్ విధానం మారుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























