You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కొత్త పార్లమెంటులో నేటి నుంచి సమావేశాలు, పాత భవనాన్ని ఏం చేస్తారు?
కొత్త పార్లమెంటు భవనంలో సెప్టెంబర్ 19వ తేదీన సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.15 గం.లకు లోక్ సభ, 2.15 గం.లకు రాజ్యసభ సమావేశాలు మొదలవుతాయి.
ఈ ఏడాది మే 28న ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ నూతన భవనాన్ని అధికారికంగా ప్రారభించారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాలను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా పలు పార్టీలు బహిష్కరించాయి.
భవనాన్ని ప్రధాని మోదీకి బదులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని అప్పట్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
మరి కొత్త పార్లమెంటు ఎలా ఉంటుంది? నిర్మాణ విశేషాలు ఏంటి? పాత భవనాన్ని ఏం చేస్తారు?
కొత్త పార్లమెంట్‌ను ఎందుకు నిర్మించారు?
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద కొత్త పార్లమెంటు భవనం నిర్మించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఖర్చు దాదాపు రూ. 20 వేల కోట్లు.
వాస్తవానికి దిల్లీలోని రాజ్‌పథ్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాన్ని సెంట్రల్ విస్టా అని పిలుస్తారు. ఇందులో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ సమీపంలో ఉన్న ప్రిన్సెస్ పార్క్ ప్రాంతం కూడా ఉంది.
రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, ఉపరాష్ట్రపతి ఇల్లు కూడా సెంట్రల్ విస్టా పరిధిలోకి వస్తాయి. ప్రస్తుత పార్లమెంట్ భవనం దాదాపు 100 ఏళ్ల నాటిది. ఆ పార్లమెంట్ హౌస్‌లో ఎంపీలు కూర్చోవడానికి స్థలం సరిపోవట్లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
సీట్ల కొరత
ప్రస్తుతం లోక్‌సభలో 545 స్థానాలున్నాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా చేసిన డీలిమిటేషన్‌తో ఈ సీట్ల సంఖ్యలో ఇప్పటివరకు ఎలాంటి మార్పు జరగలేదు.
ఎంపీ సీట్ల సంఖ్య 2026 సంవత్సరం వరకు అలాగే ఉంటుంది. కానీ ఆ తర్వాతి ఎన్నికల్లో సీట్లు పెరిగే అవకాశం ఉంది.
అటువంటి పరిస్థితిలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు కూర్చోవడానికి స్థలం సరిపోదు.
మౌలిక సదుపాయాలు
పార్లమెంటు భవనాన్ని నిర్మించినప్పుడు నేటి అవసరాలకు సరిపడే డ్రైనేజి వ్యవస్థతోపాటు అప్పటికి ఇంకా అందుబాటులో లేని ఎయిర్ కండిషనింగ్, ఫైర్ ఫైటింగ్, సీసీటీవీ, ఆడియో వీడియో సిస్టమ్స్ వంటి సౌకర్యాలు లేవని, ఇప్పుడు వాటిని కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా వీటిని పార్లమెంట్ హౌజ్‌కు చేర్చారు. అనంతరం భవనంలో తేమ వంటి సమస్యలు తలెత్తి అగ్నిప్రమాదాలు పెరిగాయి.
భద్రత
దాదాపు 100 ఏళ్ల క్రితం పార్లమెంట్ భవనాన్ని నిర్మించినప్పుడు దిల్లీ భూకంప జోన్-2లో ఉండగా, ఇప్పుడు అది నాలుగుకు చేరుకుంది.
ఉద్యోగులకు తక్కువ స్థలం
ఎంపీలు కాకుండా, వందల మంది ఉద్యోగులు పార్లమెంటులో పనిచేస్తున్నారు. పార్లమెంట్‌లో జనం రద్దీ కూడా పెరిగింది.
కొత్త, పాత భవనాల్లో తేడాలేంటి?
పార్లమెంట్‌లోని లోక్‌సభ భవనాన్ని జాతీయ పక్షి నెమలి థీమ్‌తో, రాజ్యసభను జాతీయ పుష్పం కమలం థీమ్‌తో రూపొందించారు.
పాత లోక్‌సభలో గరిష్ఠంగా 552 మంది కూర్చోవచ్చు. కొత్త లోక్‌సభ భవనం 888 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది.
పాత రాజ్యసభ భవనంలో 250 మంది సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉండగా, కొత్త రాజ్యసభ హాలు సామర్థ్యాన్ని 384కి పెంచారు.
కొత్త పార్లమెంట్ హౌస్‌లో ఉభయ సభల సమావేశం సందర్భంగా 1,272 మంది సభ్యులు అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది.
కొత్త భవనంలో ఎంపీలందరికీ వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నామని, ‘పేపర్‌లెస్ ఆఫీస్’ లే లక్ష్యంగా ఆధునిక డిజిటల్ సౌకర్యాలు ఉంటాయని అధికారులు చెప్పారు.
కొత్త పార్లమెంట్‌లో భారత ప్రజాస్వామ్య వారసత్వాన్ని వర్ణించే కాన్‌స్టిట్యూషనల్ హాల్ ఉంటుంది. భారత రాజ్యాంగం అసలు ప్రతిని కూడా అక్కడ ఉంచుతారు.
అలాగే ఎంపీలు కూర్చునేందుకు పెద్ద హాలు, లైబ్రరీ, కమిటీల కోసం అనేక గదులు, డైనింగ్ రూమ్‌లు, పార్కింగ్ స్థలాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం 64,500 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. కొత్త పార్లమెంట్ వైశాల్యం ప్రస్తుత పార్లమెంట్ భవనం కంటే 17,000 చదరపు మీటర్లు ఎక్కువ.
పాత పార్లమెంట్‌ను ఏం చేయనున్నారు?
పాత పార్లమెంట్ హౌస్‌ను బ్రిటీష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ 'కౌన్సిల్ హౌస్'గా రూపొందించారు.
దీన్ని నిర్మించడానికి ఆరు సంవత్సరాలు (1921-1927) పట్టింది. అప్పట్లో బ్రిటీష్ ప్రభుత్వ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ భవనంలో పనిచేసేది.
అప్పట్లో దీని నిర్మాణానికి రూ. 83 లక్షలు ఖర్చు చేశారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 'కౌన్సిల్ హౌస్'ను పార్లమెంట్ హౌస్‌గా మార్చారు.
ఇపుడు కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి రానుండటంతో పాత పార్లమెంట్ భవనాన్ని పార్లమెంటరీ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎవరు నిర్మించారు?
టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ కొత్త భవనం నిర్మాణం చేపట్టింది.
2020 సెప్టెంబర్‌లో రూ. 861.90 కోట్ల బిడ్డింగ్ ద్వారా ఈ కాంట్రాక్టును గెలుచుకుంది.
కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగం. ఈ ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌ను గుజరాత్‌లోని ఆర్కిటెక్చర్ సంస్థ అయిన హెచ్‌సీపీ డిజైన్స్ తయారుచేసింది.
2019 అక్టోబర్‌లో పార్లమెంట్, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, సెంట్రల్ విస్టాల అభివృద్ధి తదితర కన్సల్టెన్సీ పనిని హెచ్‌సీపీ డిజైన్ సంస్థకి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) అప్పగించింది.
ఈ సంస్థ సెంట్రల్ విస్టా ప్రాంతం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి, కొత్త అవసరాలకు అనుగుణంగా భవనాల రూపకల్పనలో పాలుపంచుకుంది.
కన్సల్టెన్సీ కోసం గతేడాది సెప్టెంబర్‌లో సీపీడబ్ల్యూడీ టెండర్ ఆహ్వానించింది. రూ.229.75 కోట్లు వ్యయంగా నిర్ణయించారు. హెచ్‌సీపీ డిజైన్ ఈ బిడ్‌ను గెలుచుకుంది.
హెచ్‌సీపీ డిజైన్ కంపెనీకి గుజరాత్‌లో గాంధీనగర్‌లోని సెంట్రల్ విస్టా, స్టేట్ సెక్రటేరియట్, అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, ముంబై పోర్ట్ కాంప్లెక్స్, వారణాసిలోని మందిర్ కాంప్లెక్స్, ఐఐఎం అహ్మదాబాద్ కొత్త క్యాంపస్ డెవలప్‌మెంట్ వంటి ప్రాజెక్ట్‌లలో అనుభవం ఉంది.
ఇవి కూడా చదవండి:
- సెంగోల్: అధికార మార్పిడికి గుర్తుగా నెహ్రూ ఈ దండాన్ని అందుకున్నారా? ఇందులో నిజమెంత?
- బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన చెంచులు, ఆదివాసీలను స్వాతంత్ర్య సమరయోధులుగా ఎందుకు గుర్తించలేదు?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- ఐపీఎల్: శుభ్‌మన్ గిల్ భారీ సెంచరీతో ఫైనల్‌కు గుజరాత్.. అతడి ఆటపై రోహిత్ శర్మ ఏమన్నాడు? ( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)