You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సూలీ: మగ గొరిల్లా అనుకున్నారు.. తీరా చూస్తే తల్లయ్యింది!
- రచయిత, గ్రీమ్ బేకర్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికాలోని ఒహాయోలో ఒక జూ సిబ్బంది నాలుగేళ్లుగా తాము ఒక మగ గొరిల్లాను సాకుతున్నామని అనుకున్నారు.
కానీ, అది తాజాగా బిడ్డకు జన్మనివ్వడంతో వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
2019 నుంచి తమ జూలో ఉంటున్న సూలీ అనే గొరిల్లా గురువారం బిడ్డకు జన్మనిచ్చినట్లు కొలంబస్ జూ నిర్వాహకులు చెప్పారు.
పిల్ల గొరిల్లా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తోందని, సూలీ ఒక అద్భుతమైన తల్లి అని జూ కీపర్లు ఒక బ్లాగ్ పోస్టులో చెప్పారు.
‘‘సూలీ బిడ్డకు జన్మనివ్వడాన్ని అసలు ఊహించలేదు. మా జంతు సంరక్షణ బృందానికి ఇది చాలా ఉత్సాహాన్ని కలిగించింది. అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు ఈ శిశువు పుట్టుక చాలా కీలకమైనది’’ అని వారు రాశారు.
సూలీ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుందని, అందుకే దాన్ని ఎప్పుడూ పరిక్షించాల్సిన అవసరం రాలేదని, సూలీ విషయంలో తాము పొరబడటానికి ఇదే కారణమైందని వారు పేర్కొన్నారు.
తన శిశువుకు సూలీ పాలు ఇవ్వడం చూసేంతవరకు జూ కీపర్లకు ఎలాంటి అనుమానం రాలేదు.
గొరిల్లా చిన్న వయస్సులో ఉన్నప్పుడు అది ఆడదో, మగదో గుర్తుబట్టడం కష్టమని నిపుణులు అంటున్నారు .
‘‘సూలీ వయస్సు 8 ఏళ్లు. పునరుత్పత్తికి ఇది సరైన వయస్సే. కానీ, లైంగిక లక్షణాలను స్పష్టంగా బయటపెట్టడానికి దీన్ని ఇంకా చిన్న వయస్సుగానే పరిగణించవచ్చు’’ అని జూ సిబ్బంది అన్నారు.
‘‘8 ఏళ్ల వరకు మగ, ఆడ గొరిల్లాలు ఒకే పరిమాణంలో ఉంటాయి. అప్పటివరకు వాటి లైంగిక గుర్తింపునకు సంబంధించిన అవయవాలు ఏర్పడవు. మగ గొరిల్లాలకు 12 ఏళ్లు లేదా ఆ తర్వాత మాత్రమే వెన్నెముక వంటివి అభివృద్ధి చెందుతాయి’’ అని వారు వివరించారు.
పొత్తి కడుపు పెద్దగా ఉండటం వల్ల సాధారణంగా గొరిల్లాల్లో గర్భం తాలూకు సంకేతాలు కనబడవు. పైగా గొరిల్లాలకు జన్మించే కూనలు, నవజాత శిశువుల (మానవుల శిశువులు) కంటే చాలా చిన్నగా ఉంటాయి.
‘‘అంతరించిపోతున్న ఈ జాతిలో మరో జీవి పురుడు పోసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’’ అని జూ నిర్వాహకులు చెప్పారు.
గొరిల్లా కూన తండ్రి ఎవరో నిర్ధరించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని వారు తెలిపారు.
ఆ జంతు ప్రదర్శన శాలలో 10 ఏళ్ల కమోలీ, ఆరేళ్ల జేజే అనే మగ గొరిల్లాలు కూడా ఉన్నాయి.
సూలీకి జన్మించిన కూన కచ్చితంగా ఆడ గొరిల్లా అయి ఉంటుందని కొలంబస్ నిర్వాహకులు చెబుతున్నారు.
‘‘అది ఆడ గొరిల్లా. దాన్ని చూశాక మా బృందం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దాని ఫోటోలను నిపుణులకు కూడా పంపించాం’’ అని నిర్వాహకులు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)