పెంపుడు జంతువుల నుంచి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు సోకకుండా పాటించాల్సిన 5 జాగ్రత్తలు

    • రచయిత, రెడేషియన్
    • హోదా, బీబీసీ ముండో

పెంపుడు జంతువులు కొన్ని కుటుంబాల్లో సభ్యులుగా మారిపోతుంటాయి. మన జీవితాల్లో వీటి స్థానం నానాటికీ పెరుగుతోంది.

వీటి వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అయితే, పెంపుడు జంతువుల నుంచి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సంక్రమించకుండా మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఈ జంతువుల నుంచి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. వీటిలో కొన్ని ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకం కూడా అవుతాయి. రేబీస్, టాక్సోప్లాస్మోసిస్‌లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోసిస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 200కు పైనే ఉంటుంది.

మనుషులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న పది సాంక్రమిక వ్యాధుల్లో ఆరు పెంపుడు జంతువుల నుంచే వస్తున్నాయని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది.

ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత, ఇంట్లో పెంపుడు జంతువులను వదిలేయాలనేమీ అనుకోకూడదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదకర వైరస్‌లు, బ్యాక్టీరియాలు వాటి నుంచి మనకు సోకకుండా అడ్డుకోవచ్చు. ఆ జాగ్రత్తలు, సూచనలు ఏమిటో తెలుసుకుందాం.

1. వైద్యుల దగ్గరకు తీసుకెళ్లండి

పెంపుడు జంతువులు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, ఏడాదికి కనీసం ఒకసారైనా వాటిని పశు వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి.

అక్కడ కొన్ని ప్రాథమిక పరీక్షలను నిర్వహించుకొని రావాలని వైద్యులు సూచిస్తారు. పెంపుడు జంతువుల ఆరోగ్యం గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారు.

వాటి ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే అప్పుడే వైద్యులను అడిగి నివృత్తి చేసుకోవాలి. అదే సమయంలో కుక్కలు, పిల్లులు అయితే, కచ్చితంగా రేబీస్ వ్యాక్సీన్ వేయించాలి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ సోకితే కొన్నిసార్లు మరణ ముప్పు దాదాపు వంద శాతం వరకూ ఉంటుంది.

‘‘ఇన్ఫెక్షన్‌కు గురైన పెంపుడు జంతువుల లాలాజలాన్ని తాకడంతోపాటు అవి కరిచినా, గోకినా రేబీస్ వచ్చే ముప్పుంటుంది’’ అని సవ్‌పాలోలోని పాలిస్టా స్టేట్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సైమన్ బాల్డినీ లుయెయిస్ చెప్పారు.

పెంపుడు జంతువులకు రేబీస్ వ్యాక్సీన్లు వేయించడం ద్వారా పరోక్షంగా వాటి యజమానులకూ రక్షణ ఉంటుంది.

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే వాటికి ‘‘డీవార్మింగ్’’ చేయించాలి. దీని ద్వారా వాటి కడుపులోని ప్రమాదకర సూక్ష్మజీవులను బయటకు పంపించొచ్చు.

2. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

పెంపుడు జంతువులు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి నీరు, ఆహారం తీసుకునే పాత్రలను కూడా శుభ్రంగా ఉంచాలి. అవి మూత్రం పోసే, మలాన్ని విసర్జించే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

లేకపోతే, ఈ ప్రదేశాలకు పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకూ ఈ ప్రదేశాలు కారణం కావచ్చు.

పిల్లులను పెంచుకునేవారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే టాక్సోప్లాస్మోసిస్‌ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే టాక్సోప్లాస్మా గోండి బ్యాక్టీరియా ఇక్కడి నుంచే వ్యాపిస్తుంది.

‘‘ఈ సూక్ష్మజీవులు పెంపుడు జంతువుల జీర్ణశయ నాళాల్లో ఉంటాయి. ఇవి మలం ద్వారా బయటకు వస్తుంటాయి’’ అని సవ్‌పాలోలోని ‘అవుట్‌ పేషెంట్ క్లినిక్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ అండ్ జూనోసిస్’ అధ్యక్షుడు, డాక్టర్ మార్కోస్ వినీసియస్ డా సిల్వా చెప్పారు.

‘‘ఇన్ఫెక్షన్‌తో కలుషితమైన ఆ ప్రాంతాలను నేరుగా తాకినప్పుడు మనుషులకూ ఆ ఇన్ఫెక్షన్ సోకొచ్చు. ఒక్కోసారి నీరు, ఆహారం కూడా వీటితో కలుషితం అవుతాయి’’అని ఆయన తెలిపారు.

కొన్ని కేసుల్లో టాక్సోప్లాస్మోసిస్ ప్రమాదకరంగా కూడా మారగలదు. ముఖ్యంగా గర్భిణుల్లో దీని వల్ల గర్భస్రావం లేదా పిండంలో లోపాలు కలగొచ్చు.

ఈ ముప్పును తగ్గించుకోవాలంటే, పిల్లుల మలం నమూనాలకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని నిపుణులు సూచించారు. పిల్లి పిల్లల విషయంలో ఈ పరీక్షలు తరచూ నిర్వహించాల్సి ఉంటుంది.

ఒకసారి ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధరణ అయితే, ఆ పిల్లి శరీరం నుంచి ఇన్ఫెక్షన్‌ను పూర్తిగా తొలగించేందుకు ప్రస్తుతం చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

పిల్లులు మల విసర్జనకు ఉపయోగించే ట్రేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. వారానికి కనీసం రెండుసార్లైనా వీటిని శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సబ్బు నీటితో శుభ్రంగా వీటిని కడగాలని చెబుతున్నారు.

వీటిని శుభ్రంచేసిన అనంతరం, ఎలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు సోకకుండా మీ చేతులను కూడా శుభ్రంగా కడుక్కోవాలి.

గర్భిణులు మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తొమ్మిది నెలల సమయంలో పిల్లుల మల విసర్జన ట్రేలను వారు శుభ్రం చేయకూడదని సీడీసీ చెబుతోంది.

3. టాయిలెట్ మ్యాట్, లిటర్ బ్యాక్స్ దూరంగా ఉంచండి

పెంపుడు జంతువులకు సంబంధించి వస్తువులను పెట్టే పరిసరాలు కూడా బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులతో కలుషితం కాకుండా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు కుక్కల టాయిలెట్ మ్యాట్, పిల్లుల లిటర్ బ్యాక్స్ లాంటివి వంటగది లేదా భోజనం చేసే ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉంచాలి.

కొన్నిసార్లు పెంపుడు జంతువులు ఇంట్లో ఎక్కడబడితే అక్కడ మూత్రం పోస్తుంటాయి. వీటికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

వీటి మల, మూత్రాలను వీలైనంత త్వరగా అక్కడి నుంచి శుభ్రం చేయాలి. అక్కడ బ్లీచ్ లేదా యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్లతో శుభ్రం చేయాల్సి ఉంటుంది.

అరుదుగా పెంచుకునే తాబేళ్ల లాంటి పెంపుడు జంతువుల్లోనూ ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే తాబేళ్ల మలంలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. దీని వల్ల మనుషుల్లో జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.

4. ఆ ప్రాంతాలనూ శుభ్రంగా ఉంచండి

ఇంటి బయట ప్రాంతాల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి.

ఎందుకంటే ఇక్కడే పెంపుడు జంతువులు ఇతర జంతువులతో కలుస్తుంటాయి. కొన్నిసార్లు గబ్బిలాలు, ఎలుకల మూత్రాన్ని కూడా పెంపుడు జంతువులు తాకే ప్రమాదం ఉంటుంది.

ఎలుకలు, గబ్బిలాల మూత్రంలో లెప్టోస్పిరా బ్యాక్టీరియా ఉంటుంది. దీని వల్ల లెఫ్టోస్పిరోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది.

ముక్కు లేదా నోటి ద్వారా ఈ సూక్ష్మజీవులు మన శరీరంలోకి కూడా ప్రవేశిస్తాయి. దీంతో జ్వరం రావడం, మల, మూత్రాల ద్వారా రక్తస్రావం వరకూ జరగొచ్చు.

అందుకే మొదట ఇంటి బయట పరిసరాలను కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను కూడా కాస్త దూరంగా పెట్టాలి.

లెప్టోస్పిరా నుంచి రక్షణ కల్పించేందుకు కుక్కలకు వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏడాదికి ఒకసారి వేయించాల్సి ఉంటుంది.

కుక్కలకు లీష్మానియాసిస్‌గా పిలిచే మరో ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీనికి కారణం దోమ కాటు ద్వారా వ్యాపించే ప్రోటోజోవా. ఈ దోమలు చెత్తబుట్టల పరిసరాల్లో ఎక్కువగా ఉంటాయి.

అందుకే చెత్త పేరుకోకుండా జాగ్రత్త వహించాలి. ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా కూడా వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయి.

5. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించండి

ఈ ఆపరేషన్ తేలికగానే పూర్తవుతుంది. వీటి వల్ల అనవసరంగా పెంపుడు జంతువులకు పిల్లలు పుట్టకుండా ఉంటాయి.

అయితే, ఈ ఆపరేషన్‌తో పిల్లులు, కుక్కల్లో ఉద్రేకం కూడా తగ్గుతుందని సిల్వా చెప్పారు.

‘‘కాస్త వయసుకు వచ్చాక, కొన్ని జంతువుల్లో దూకుడు పెరుగుతుంది. కరవడం, గోకడం లాంటివి కూడా మొదలుపెడతాయి. వాటికి ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే మనుషులకు కూడా సోకే ముప్పు అప్పుడు ఎక్కువ అవుతుంది. ఇలాంటి ప్రవర్తన ఆ ఆపరేషన్‌తో కొంత వరకు తగ్గుతుంది’’ అని సిల్వా వివరించారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)