హచికో: ప్రపంచంలోనే అత్యంత విశ్వాసంగల ఈ కుక్కకు వందేళ్లు, ఏంటి దీని ప్రత్యేకత?

    • రచయిత, నికోలస్ యోంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“ఎన్నిరోజులైనా సరే, నీ కోసం వేచి ఉంటా” అని ఓ చైనీస్ సినిమా పోస్టర్‌పై ట్యాగ్‌లైన్ ఉంటుంది. ఇది హచికో కథను గుర్తుచేస్తుంది.

యజమాని మరణించిన తర్వాత చాలాకాలం పాటు రైల్వేస్టేషన్‌లో ఆయన కోసం ఎదురు చూసిన అత్యంత విశ్వాసపాత్రురాలైన కుక్క అది.

100 సంవత్సరాల క్రితం జన్మించిన ఈ క్రీమ్ వైట్ ‘అకితా ఇను’ అనే ఈ కుక్క పుస్తకాల నుంచి ఫ్యూచురామా వంటి సైన్స్ ఫిక్షన్ సిరీస్‌ వరకు...పాపులర్ క్యారెక్టర్‌గా మారింది.

ఈ కుక్క కథ నేపథ్యంగా 1987లో జపనీస్ వెర్షన్, తర్వాత చైనీస్, 2009లో రిచర్డ్ గేరె నటించిన ‘హచి’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాయి.

గ్రేఫ్రియర్స్ బాబీ వంటివి వచ్చినా, హచికో కుక్కకున్న పాపులారిటీ ప్రపంచంలోని మరొక దానికి సాటిరాలేదు.

హచికో తన యజమాని కోసం టోక్యోలోని షిబుయా స్టేషన్‌లో దశాబ్ధ కాలం పాటు ఎదురు చూసింది. అందుకే ఆ స్టేషన్ బయట ఆ కుక్కకు గుర్తుగా ఒక కాంస్య విగ్రహం ఉంటుంది.

ఈ విగ్రహాన్ని1934లో ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అది దెబ్బతినడంతో దాన్ని పునరుద్దరించారు.

హచికో కథను జపనీస్ విద్యార్థులకు భక్తి, విశ్వసనీయతకు ఉదాహరణగా బోధిస్తుంటారు.

హచికో కల్మషంలేని భక్తి కలిగిన "ఆదర్శ జపనీస్ పౌరుడు" అని హవాయి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ క్రిస్టీన్ యానో అన్నారు.

‘‘అది విశ్వాసపాత్రమైనది, నమ్మదగినది, యజమానికి విధేయురాలు’’ అని యానో అన్నారు.

హచికో కథేంటి?

హచికో అనే ఈ కుక్క 1923 నవంబర్‌లో అకిటా జిల్లాలోని ఓడేట్ నగరంలో పుట్టింది. సుప్రసిద్ధ అకిటా జాతి కుక్కలకు ఈ ప్రాంతమే పుట్టినిల్లు.

అకిటా జాతికి చెందిన ఈ జపనీస్ కుక్క సైజులో కాస్త పెద్దగానే ఉంటుంది. జపాన్‌లో పురాతన, అత్యంత ప్రజాదరణ పొందిన కుక్క జాతులలో అకితా ఒకటి.

1931లో జపాన్ ప్రభుత్వం ఈ కుక్కను జాతీయ చిహ్నంగా ప్రకటించింది. ఆ శునకాలు ఒకప్పుడు అడవి పంది, ఎల్క్ (కణజు) వంటి జంతువులను వేటాడేందుకు శిక్షణ పొందేవి.

"అకిటా కుక్కలు ప్రశాంతత, చిత్తశుద్ధి, తెలివి గల ధైర్యవంతమైన జాతి కుక్కలు. ఇవి తమ యజమానులకు అత్యంత విధేయంగా ఉంటాయి" అని హచికో గురించి ఆంగ్ల భాషా పిల్లల పుస్తక రచయిత ఐట్సు సకురాబా అన్నారు .

"వీటికి మొండితనం కూడా ఎక్కువే. దాని యజమాని కాని వ్యక్తుల విషయంలో చాలా అలర్ట్‌గా ఉంటాయి" అని సకురాబా తెలిపారు.

ఫేమస్ అగ్రికల్చర్ ప్రొఫెసర్, కుక్కల ప్రేమికుడు అయిన హిడేసాబురో యునో ఒక విద్యార్థిని అకిటా జాతికి చెందిన కుక్కపిల్లని వెతికిపెట్టమని కోరారు. ఆ ఏడాదిలోనే హచికో జన్మించింది.

ఆ కుక్కపిల్ల 1924 జనవరి 15న షిబుయా జిల్లాలోని యునో నివాసానికి చేరుకుంది. అయితే రైలు ప్రయాణం కారణంగా కుక్కలో ఎలాంటి స్పందనలు కనిపించకపోవడంతో మొదట అది చనిపోయిందని భావించారు.

హచికో జీవిత చరిత్ర రాసిన రచయిత, ప్రొఫెసర్ మయూమి ఇటో ప్రకారం..యునో, ఆయన భార్య ‘యే’ ఆరు నెలలపాటు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో అది కోలుకుంది.

యునో ఆ కుక్క పిల్లకు హాచీ అని (జపనీస్‌లో ఎనిమిది) పేరు పెట్టారు. కో అంటే చిన్న పిల్లలు, పెంపుడు జంతువులను గౌరవంగా, ఇష్టంగా పిలుచుకోవడానికి ఉపయోగిస్తారు.

యునో హచికోను 16 నెలలపాటు సాకారు.

స్టేషన్ వద్ద సుదీర్ఘ నిరీక్షణ

హచికో యజమాని అయిన యునో పని మీద వారంలో చాలాసార్లు రైలులో వెళ్లి, వస్తుండేవారు.

అతనితో పాటు హచికో, మరో రెండు కుక్కలు టోక్యోలోని షిబుయా స్టేషన్‌కు వచ్చేవి. సాయంత్రం యునో తిరిగి వచ్చే వరకు అక్కడే వేచి ఉండేవి.

అయితే, 1925 మే 21న యునో (53) సెరిబ్రల్ హెమరేజ్‌తో మరణించారు.

"అంత్యక్రియల సమయంలో హచికో ఇంట్లో డాక్టర్ యునో వాసన పసిగట్టి, గదిలోకి వెళ్లింది. అతని శవపేటిక వద్దకు వెళ్లి, అక్కడి నుంచి కదల్లేదు" అని ప్రొఫెసర్ ఇటో పుస్తకంలో రాశారు.

హచికో తరువాతి కొన్ని నెలలు షిబుయా వెలుపల వివిధ కుటుంబాలతో గడిపింది. చివరికి, 1925 వేసవిలో యునో తోటమాలి కొబయాషి కికుసాబురో ఇంటి నుంచి వచ్చేసింది.

యునో నివసించిన ప్రాంతానికి తిరిగి వచ్చిన తరువాత, హచికో రైల్వే స్టేషన్‌‌కు రోజూ వెళ్లి వస్తుండేది.

"సాయంత్రం హచికో టికెట్ గేట్ వద్ద నిలబడి, ప్రతి ప్రయాణికుడి వైపు ఎవరికోసమో వెతుకుతున్నట్లుగా చూసేది" అని ప్రొఫెసర్ ఇటో తెలిపారు.

స్టేషన్ ఉద్యోగులు మొదట్లో దాన్ని ఇబ్బందిగా చూశారు. అక్కడున్న షాపుల వాళ్లు దాని మీద నీళ్లు పోసేవారు. పిల్లలు దాన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నించేవారు.

జపాన్‌ను కలిచివేసిన హచికో మరణం

1932 అక్టోబర్ లో జపనీస్ దినపత్రిక టోక్యో అసహి షింబున్ ఆ కుక్క గురించి కథనం రాసిన తర్వాత దేశ వ్యాప్తంగా దాని పేరు మారుమోగింది.

స్టేషన్‌కి ప్రతిరోజూ హచికో కోసం ఆహారం విరాళంగా వచ్చేది. ఆ కుక్కను చూడటానికి చాలా దూరం నుంచి సందర్శకులు వచ్చేవారు. దానిపై కవితలూ రాశారు.

1935 మార్చి 8న హచికో మరణం అనేక వార్తాపత్రికలలో పెద్ద హెడ్‌లైన్‌‌గా మారింది.

దాని అంత్యక్రియలలో బౌద్ధ సన్యాసులు ప్రార్థనలు చేశారు. అనేకమంది ప్రముఖులు సంతాపం తెలిపారు.

హచికో విగ్రహం నిర్మాణానికి 1934లో నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టగా, 3,000 మంది స్పందించారు.

తరువాతి రోజుల్లో వేలాది మంది హచికో విగ్రహాన్ని సందర్శించారు.

కొద్దిరోజులకు జపాన్‌లో యుద్దం కారణంగా హచికో విగ్రహం కొద్దిగా ధ్వంసమైంది. దీంతో కొత్త విగ్రహం కోసం నిధుల సేకరణ డ్రైవ్ చేపట్టగా 800,000 యెన్‌( సుమారు రూ. 4.55 లక్షలు)లను సేకరించగలిగారు.

ఆ సమయంలో అది చాలా పెద్ద మొత్తం. ఈ రోజు సుమారు రూ. 229 కోట్లకు సమానం.

"డాక్టర్ యునో తిరిగి రాలేడని దానికి తెలుసు అనుకుంటున్నా, కానీ అది వేచి ఉంది. ఒకరిపై విశ్వాసం ఉంచడమనే విలువను హచికో మాకు నేర్పించింది" అని 1982లో ఒక వార్తాపత్రిక కథనంలో ఒకామోటో తకేషి అనే వ్యక్తి రాశారు. హైస్కూల్ స్టూడెంట్‌గా ఉన్న సమయంలో తకేషి స్టేషన్‌లో రోజూ హచికోను చూసేవారు.

హచికోను గుర్తు చేసుకుంటూ..

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 8 న షిబుయా స్టేషన్ వెలుపల హచికో మెమోరిల్ సర్వీస్ జరుగుతుంది.

హచికో విగ్రహానికి తరచుగా కండువాలు, శాంటా టోపీలు అలంకరించేవారు. ఇటీవల దానికి మాస్కు కూడా పెట్టారు.

హచికో అవశేషాలను టోక్యోలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచర్ అండ్ సైన్స్‌లో ప్రదర్శించారు.

దాని అవశేషాలలో కొన్ని అయోమా స్మశానవాటికలో యునో, యేలతో కలిపి ఖననం చేశారు.

యునో స్వస్థలమైన హిసాయ్, యూనివర్శిటీ ఆఫ్ టోక్యో, రోడ్ ఐలాండ్‌లలో హచికో విగ్రహాలు ఏర్పాటుచేశారు.

హచికో 100వ పుట్టినరోజు సందర్భంగా ఓడేట్‌లో ఈ ఏడాది చాలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అత్యంత నమ్మకమైన ఈ శునకాన్ని ఈ ప్రపంచం మరో శతాబ్దం వరకు గుర్తుంచుకుంటుందా ? అంటే ప్రొఫెసర్ యానో అవుననే అంటున్నారు.

ఎందుకంటే హచికో హీరోయిజాన్ని ఏ నిర్దిష్ట కాలం ద్వారా నిర్వచించలేరని యానో నమ్ముతున్నారు. అది కాలాతీతమైనదని చెబుతున్నారు.

"ఇప్పటి నుంచి మరో వందేళ్లు కూడా షరతులు లేని, అంకితభావంతో కూడిన ఈ ప్రేమ మారదు. హచికో కథ ఎప్పటికీ నిలిచి ఉంటుంది." అని సకురబా తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)