You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గొర్రె పురాణం రివ్యూ: గొర్రెను హీరోగా చూపించిన ఈ సినిమా ఎలా ఉందంటే..
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
‘కలర్ ఫొటో’, ‘శ్రీరంగ నీతులు’, 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' లాంటి సినిమాలతో ప్రేక్షకులకు కనెక్ట్ అయిన నటుడు సుహాస్.
అతని తాజా సినిమానే 'గొర్రె పురాణం'. ఈ సినిమా ఎలా ఉందన్నది ఈ రివ్యూలో చూద్దాం.
కథ ఏంటి?
అల్లారం అనే గ్రామంలో ఒక గొర్రె, రెండు మతాలవారి మధ్య గొడవలకు ఎలా కారణమైంది?
ఈ గొర్రెకు సంబంధించిన వార్తపై మీడియా ఎందుకు ఫోకస్ చేసింది? జంతు సంరక్షణ సంఘం ఈ గొర్రెను రక్షించడానికి ఎందుకు నిరాకరించింది? రవి (సుహాస్) ఈ గొర్రెకు ఎందుకు రక్షకుడిగా మారాడు? అన్నదే కథ.
ఎలా ఉంది?
'గొర్రె పురాణం' పేరుకు తగ్గట్టు ఒక గొర్రె కథ. గొర్రెకు ఒక పేరు ఉన్నా, అది ప్రేక్షకులకు తెలియదు. అందుకే దాన్ని 'గొర్రె' అనే పిలవాలి.
'గొర్రె' హీరో అయిన ఈ కథలో దానికి బాడీ లాంగ్వేజ్ లేదు. ఒక మామూలు గొర్రె సినిమాలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.
ఇప్పటికే జంతువులే హీరోలుగా అనేక సినిమాలు వచ్చాయి. వాటిల్లో వాటికి బలమైన డబ్బింగ్ ఉండేది. అలాగే వాటికి డబ్బింగ్ చెప్పేటప్పుడు హాస్యం పుట్టేలా వాటి బాడీ లాంగ్వేజ్ ఉండేది. కానీ, ఈ సినిమాలో ఈ గొర్రెకు అలాంటివేమీ లేవు. డబ్బింగ్ కూడా నప్పలేదు.
అందులోనూ ఈ గొర్రె తెలుపు రంగులో ఉంటుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో గొర్రెలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ గొర్రె రంగును బట్టి, కెమెరా కదలికను బట్టి కష్టపడి ప్రేక్షకులు దాన్ని చూడాల్సి వస్తుంది.
మొత్తం మీద ఈ గొర్రెను సినిమాలో హీరోగా డిజైన్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు.
కెమెరా వర్క్‌లో కూడా ఎమోషనల్‌గా గొర్రెతో కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం లేదు.
క్లోజ్ షాట్స్ ఎక్కువ లేవు. దానికి డైలాగ్స్ ఉన్నప్పుడు కూడా దాని ముఖం, కళ్లు, నోరు స్పష్టంగా కనిపించేలా షాట్స్ లేవు.
సినిమాలో ఇంకా చాలా గొర్రెలు ఉన్న సన్నివేశాలు వచ్చినప్పుడు ఈ గొర్రె తేలిపోతుంది. ప్రత్యేకంగా ఎక్కడా ఈ గొర్రె ప్రేక్షకులకు హీరో గొర్రెలా కనిపించదు.
కథ ప్రకారం రవి (సుహాస్), గొర్రె ముఖ్య పాత్రలు. కానీ, రాజకీయ హత్యలు, మీడియా నేపథ్యాలు కూడా కథలో నడుస్తుంటాయి.
సుహాస్ (రవి) ఇందులో అతిథి పాత్ర చేశారనే చెప్పొచ్చు. ఓ 25- 30 నిమిషాలు మాత్రమే అతడు స్క్రీన్ మీద కనిపిస్తాడు.
సపోర్టింగ్ నటులు కూడా కలగాపులగంగా కలిసిపోయారు. ఫ్రేమ్స్ మధ్యలో నటులు మారిపోతూ ఉంటారు. అది ప్రేక్షకులకు గందరగోళంగా అనిపిస్తుంటుంది.
సుహాస్ (రవి) ఉన్న స్క్రీన్ స్పేస్‌లో బలమైన ఎమోషన్స్ పండించే సీన్స్ లేకపోవడంతో అతని నటన కూడా తేలిపోయినట్టే అనిపిస్తుంది.
మొత్తం మీద పాత్రల డిజైన్‌లో క్లారిటీ లేదు.
స్టోరీ ఫ్లో ఎలా ఉందంటే..
బలమైన కథ ఉన్న సినిమా ఇది. అలాగే అనేక సమకాలీన అంశాలను కూడా స్పృశించిన కథ. కనెక్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.
కానీ, స్టోరీ ఫ్లో మాత్రం ప్రేక్షకులను బోర్ కొట్టించేస్తుంది. కథలో చాలా ప్రాధాన్యత ఉన్న గొర్రెను స్క్రీన్ మీద బలంగా చూపించలేకపోయారు.
గొర్రెకు స్ట్రెంత్ ఇచ్చేలా రవి (సుహాస్ )పాత్ర ఒక అరగంట తర్వాత ఉన్నా బాగుండేది. లేదా ఈ గొర్రె కథతో పాటు రవి కథ కూడా ఒకేసారి నడిచినా బాగుండేది.
ఇంటర్వెల్ వరకూ స్క్రీన్ మీద ప్రేక్షకులను ఆకర్షించే పాత్ర లేదు. సుహాస్ ఇంటర్వెల్‌లో కనిపించడంతో సెకండ్ హాఫ్‌లో కథ ఆసక్తికరంగా మారుతుందేమో అనిపిస్తుంది. కానీ, అదేమీ లేదు.
మంచి సోషల్ ఇష్యూతో వచ్చిన ఈ సినిమా మొత్తం ఒక కామిక్ యానిమేషన్‌లా మారిపోయింది.
ప్రధాన కథ నుంచి 'మీడియా సెన్సేషనలైజేషన్' కు సినిమా మారిపోవడంతో లెక్క లేనన్ని పాత్రలు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి.
దీని వల్ల సినిమాలా కాకుండా ఒక సంఘటన మీద వివిధ మీడియా ఛానళ్ల అభిప్రాయంలా అనిపిస్తుంది.
'గొర్రె పురాణం' కథ పరంగా బాగానే ఉన్నా, మెయిన్ స్టోరీ పక్క దారి పట్టడం వల్ల పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచిన సినిమాగా మారింది.
ప్లస్ పాయింట్స్
- కథ
- క్లైమాక్స్‌లో కోర్టు సీన్
- ముగింపు
మైనస్ పాయింట్స్
- రవి (సుహాస్ )కి స్క్రీన్ స్పేస్ మరీ తక్కువగా ఉండటం
- గొర్రె పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేకపోవడం
- మెయిన్ స్టోరీతో సంబంధం లేని అనేక ట్రాక్స్ కథలో ఉండటం
(గమనిక: ఈ రివ్యూలోని అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)