You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రంప్ చెబుతున్నట్లు వాషింగ్టన్ డీసీలో నేరాలు ‘అదుపు తప్పాయా’?
- రచయిత, లూసీ గిల్డర్, జేక్ హోర్టన్
- హోదా, బీబీసీ వెరిఫై
వాషింగ్టన్ డీసీలో వందలమంది నేషనల్ గార్డ్స్‌ను మోహరిస్తానని, నేరాలను కట్టడి చేయడానికి పోలీసు విభాగాన్ని తన అధీనంలోకి తీసుకుంటానని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వాషింగ్టన్‌కు ‘లిబరేషన్ డే’ అని ప్రకటించిన డోనల్డ్ ట్రంప్.. దేశ రాజధానిని నేరాలు, రక్తపాతం, గందరగోళం, అధ్వాన్న పరిస్థితుల నుంచి రక్షిస్తానని అన్నారు.
అయితే వాషింగ్టన్ డీసీ మేయర్ మురేల్ బౌసర్ మాత్రం నగరంలో నేరాలు భారీగా తగ్గాయని, 30 ఏళ్ల కనిష్ఠ స్థాయికి చేరాయని అన్నారు.
వాషింగ్టన్‌లో నేర గణాంకాలు ఏం చెబుతున్నాయి.
అమెరికాలోని ఇతర నగరాలతో పోలిస్తే అమెరికన్ల రాజధాని నగరంలో పరిస్థితి ఎలా ఉందో బీబీసీ వెరిఫై పరిశీలించింది.
వాషింగ్టన్ డీసీలో హింసాత్మక నేరాలు పెరిగాయా?
‘కొలంబియా జిల్లాలో నేర అత్యవసర పరిస్థితి’ని ప్రకటిస్తూ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో "రాజధానిలో హింస పెరుగుతోంది" అని పేర్కొన్నారు.
వాషింగ్టన్‌లో నేరాలు అదుపులో లేవని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన పదే పదే ప్రస్తావించారు.
అయితే వాషింగ్టన్ డీసీకి చెందిన మెట్రోపాలిటన్ పోలీస్(ఎంపీడీసీ)
ప్రకటించిన నేర గణాంకాలను చూస్తే 2023, 2024 లో పతాక స్థాయిలో ఉన్న హింసాత్మక ఘటనలు ఇప్పుడు 30 ఏళ్లలో కనిష్ఠ స్థాయికి తగ్గాయి.
2025లో వెలువడిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఇక్కడ నేరాలు తగ్గుతున్నాయి.
2024లో ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం హింసాత్మక నేరాలు మొత్తంగా 26 శాతం, దొంగతనాలు 28 శాతం తగ్గినట్లు ఎంపీడీసీ నివేదిక చెబుతోంది.
అయితే ఈ నేర గణాంకాల్లో నిజమెంతని నగర పోలీసులు ట్రంప్‌ను ప్రశ్నిస్తున్నారు.
ఎందుకంటే హింసాత్మక ఘటనల విషయంలో ఎంపీడీసీ, అమెరికాలో నేర గణాంకాలను నమోదు చేస్తున్న మరో సంస్థ ఎఫ్‌బీఐ వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి.
ఎంపీడీసీ విడుదల చేసిన డాటా ప్రకారం 2024లో నేరాలు 35 శాతం తగ్గితే, ఎఫ్‌బీఐ విడుదల చేసిన నివేదికలో 9 శాతం తగ్గినట్లు ఉంది.
ఎంత తగ్గాయనే విషయంలో రెండు నివేదికల మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ రెండు నివేదికలూ వాషింగ్టన్ డీసీలో నేరాలు తగ్గినట్లు చెప్పాయి.
హత్యల సంగతేంటి?
వాషింగ్టన్ డీసీలో ‘2023లో హత్యలు ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అత్యధిక రేటుకు చేరుకున్నాయి. అవి పాతికేళ్ల నాటి అంకెల స్థాయికి చేరాయి’ అని ట్రంప్ చెప్పారు.
అయితే ఈ లెక్కలకు ఆధారం ఏంటని బీబీసీ వెరిఫై బృందం వైట్‌హౌస్‌ను సంప్రదించింది. వారు ఈ గణాంకాలు "ఎఫ్‌బీఐ" అందించినట్లు చెప్పారు.
హత్యల రేటు 2023లో ప్రతి లక్ష మంది ప్రజలకు 40గా ఉందని, ఇది గత 20 ఏళ్లలోనే గరిష్ఠమని ఎఫ్‌బీఐ డేటా చెబుతోంది.
అయితే, అది ఇప్పటి వరకు నమోదైన గరిష్ఠ స్థాయి కాదు. 1990, 2000ల ప్రారంభంలో ఈ రేటు ఇంకా అధికంగా ఉంది.
2024లో హత్యల రేటు తగ్గింది. గతేడాదితో పోలిస్తే 12 శాతం తగ్గిందని ఎంపీడీసీ వెల్లడించింది.
దేశంలోని మిగతా నగరాలతో పోల్చుకుంటే రాజధానిలో హత్యల రేటు సగటు కంటే అధికంగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఈ ఏడాది ఆగస్టు 11 నాటికి వాషింగ్టన్ డీసీలో 99 హత్యలు జరిగాయి. ఇందులో 21 ఏళ్ల కాంగ్రెస్ ఇంటర్న్‌ను కాల్చి చంపిన ఘటన కూడా ఉంది.
ట్రంప్ తన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ హత్య గురించి ప్రస్తావించారు.
కార్ల దొంగతనాలు
ఆగస్టు ప్రారంభంలో రాజధానిలో ఒక కారును దొంగిలించే ప్రయత్నంలో జరిగిన ఘర్షణలో గాయపడిన 19 ఏళ్ల డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ విభాగపు మాజీ ఉద్యోగి కేసును ట్రంప్ ప్రస్తావించారు.
గత ఐదేళ్లలో "కార్ల దొంగతనాలు మూడు రెట్ల కంటే ఎక్కువయ్యాయి" అని ట్రంప్ ఆరోపించారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 189 కార్ల దొంగతనం నేరాలు నమోదైనట్లు ఎంపీడీసీ తెలిపింది.
గతే ఏడాది ఆగస్టు వరకు 300 కార్ల దొంగతనం కేసులు నమోదైనట్లు వెల్లడించింది.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే వాషింగ్టన్‌లో..
వాషింగ్టన్ డీసీలో హింస స్థాయి దేశంలోని 30కి పైగా ఇతర నగరాల కంటే ఎక్కువగా ఉంది" అని కౌన్సిల్ ఫర్ క్రిమినల్ జస్టిస్‌కు చెందిన గెల్బ్ బీబీసీతో చెప్పారు.
"దేశంలోని ఇతర పెద్ద నగరాల్లో నేరాలు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది" అని ఆయన అన్నారు.
అమెరికాలోని 30 పెద్ద నగరాల్లో క్రైమ్ రేట్ గురించి సీసీజే పరిశీలిస్తుంది.
గతేడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్థంలో డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో హత్యల రేటు 19 శాతం తగ్గిపోయిందని అది విశ్లేషించింది.
సీసీజే అధ్యయనం ప్రకారం నగరాల్లో సగటున 17శాతం నేరాలు తగ్గాయి.
కోవిడ్ సంక్షోభానికి ముందు 2019 తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే 2025లో తొలి ఆరు నెలల్లో హత్యలు 3 శాతం మాత్రమే తగ్గాయి.
అదే సమయంలో దేశంలోని 30 నగరాల్లో నేరాల రేటు 14 శాతం పడిపోయిందని సీసీజే అధ్యయనంలో తేలింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)