You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య, ‘అందుకే తుపాకీతో కాల్చా’ అని చెప్పిన తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు
- రచయిత, ఆషాయ్ ఎడ్గే
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఒక కుటుంబంలో ఒక అమ్మాయి మంచి పేరు సంపాదించుకుంటే ఎవరు బాధపడతారు? ఆమె ఒకప్పుడు టెన్నిస్ అకాడమీ నడిపేది. ఆ కారణంగా ఆమె తండ్రిని ఎగతాళి చేసేవారు. ఆ కోపాన్నిమనసులో పెట్టుకున్న ఆయన కూతురిని కాల్చి చంపారు. జరిగింది విషాదం. కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం?" అని పేరు చెప్పడానికి ఇష్టపడని రాధికాయాదవ్ దగ్గరి బంధువు అన్నారు.
హరియాణాలోని గురుగావ్‌లో, మాజీ జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి రాధికాయాదవ్ బుల్లెట్ తగిలి మరణించారు. రాధిక తండ్రి దీపక్ ఆమెపై వెనుక నుంచి మూడు బుల్లెట్లను పేల్చారని, దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జూలై 10 ఉదయం గురుగావ్‌లోని సెక్టార్ 57లో జరిగింది.
రాధిక తండ్రి నేరాన్ని అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు.
రాధిక అంకుల్ కుల్దీప్ యాదవ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా గురుగావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టు దీపక్ యాదవ్‌ను పోలీస్ కస్టడీకి అప్పగించింది. మరోవైపు దర్యాప్తు కొనసాగుతోంది.
ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మెరిసిన రాధిక హత్యకు గురవడం సోషల్ మీడియాతోపాటు చాలా చోట్ల చర్చకు దారితీసింది. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి బీబీసీ సంఘటనా స్థలాన్ని సందర్శించింది.
రాధిక మూడంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. మేం అక్కడికి చేరుకునేసరికి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. ఆమె కుటుంబంతో కలిసి రెండవ అంతస్తులో నివసించేవారు. ఆ ఇంటిబయట, జర్నలిస్టులు, ఆమె బంధువులు గుమిగూడి కనిపించారు.
రాధిక బంధువులు చాలామంది మాట్లాడటానికి ఇష్టపడలేదు. మాట్లాడిన వారు పరిమిత సమాచారం మాత్రమే ఇచ్చారు. రాధిక మరణంతో చాలామంది దిగ్భ్రాంతికి గురైనట్టుగా కనిపించారు.
అసలేం జరిగింది?
జూలై 10వ తేదీ ఉదయం 10గంటల 30 నిమిషాల ప్రాంతంలో హత్య జరిగిందనిపోలీసులు తెలిపారు.
దీపక్ యాదవ్ నేరం అంగీకరించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
"నా కూతురు జాతీయ ఛాంపియన్. భుజానికి గాయమైన తర్వాత, ఆమె సొంత అకాడమీని ప్రారంభించాలని నిర్ణయించుంది. నేను పాలు కొనడంకోసం మా స్వగ్రామం వజీరాబాద్‌కు వెళ్ళినప్పుడు, 'నీ కూతురు సంపాదనతో నువ్వు బతుకుతున్నావ్' అంటూ ప్రజలు ఎగతాళి చేశారు. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. అందుకే నేను అకాడమీని మూసేయమని అడిగాను. కానీ తను వినలేదు. అందుకే నేనామెను తుపాకీతో కాల్చి చంపాను."అని దీపక్ చెప్పారని పోలీసులు తెలిపారు.
దీపక్ యాదవ్ రాధికపై మూడు బుల్లెట్లను పేల్చడంతో ఆమె చనిపోయినట్టు దీపక్ యాదవ్ తెలిపారని పోలీసులు చెప్పారు.
అవమానాలను భరించలేకే హత్య చేశానని దీపక్ చెబుతుండగా.. మీడియా, బంధువులు ఇతర కారణాల గురించి చర్చిస్తున్నారు.
పేరు చెప్పడానికి ఇష్టపడని దగ్గరి బంధువు ఒకరు మాట్లాడుతూ, "దీపక్ ఆమె టెన్నిస్ ఆడటాన్ని ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. నిజానికి ఆమెకు అవసరమైనవాటికోసం లక్షలు ఖర్చు చేశారు. దీపక్ చాలా మంచి వ్యక్తి. ఈ వార్త విన్నాక మేమందరం షాక్ అయ్యాం. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు." అని చెప్పారు.
రాధిక తల్లి మంజు యాదవ్ లిఖితపూర్వక వాంగ్మూలం ఇవ్వలేదని, హత్య జరిగినప్పుడు తాను వేరే గదిలో నిద్రపోతున్నానని చెప్పారని పోలీసులు తెలిపారు.
"నా కూతురు చాలా మంచిది. మర్యాదగలవ్యక్తి. దీపక్ ఆమెను ఎందుకు చంపాడో నాకు అర్థం కావడం లేదు" అని ఆమె చెప్పారని పోలీసులు అన్నారు.
ఆ సమయంలో రాధిక సోదరుడు ధీరజ్ యాదవ్ ఇంట్లో లేరు.
అకాడమీని మూసివేయనందుకే ఆమెను చంపానని తండ్రి దీపక్ చెబుతుండగా, ఆమె టెన్నిస్ కెరీర్‌కు ఎప్పుడూ మద్దతు ఇచ్చారని బంధువులు అంటున్నారని పోలీసులు తెలిపారు.
అసలు కారణం ఏంటన్నది దర్యాప్తులో బయటపడే అవకాశం ఉంది.
రాధికా యాదవ్ టెన్నిస్ అకాడమీ ఎలా ఉండేది?
కొన్ని నెలల క్రితం, గురుగావ్‌లోని సెక్టార్ 61లో ఒక స్థలాన్ని అద్దెకు తీసుకుని, టెన్నిస్ అకాడమీని ప్రారంభించారు రాధిక.
ఆ ప్రాంగణాన్ని నిర్వహించే తనూ అనే వ్యక్తి మాట్లాడుతూ, "రాధిక మేడమ్ ప్రతి ఉదయం, సాయంత్రం వచ్చేవారు. నెల క్రితమే క్లాస్‌లు స్టార్ట్ చేశారు. ఇద్దరు నుంచి నలుగురు పిల్లలు నేర్చుకోవడానికి వచ్చేవారు. ఆమె చాలా అంకితభావంతో నేర్పించేవారు. మాకు తెలిసింది ఇంతే."అని చెప్పారు.
రాధిక భాగస్వామ్యంతో అకాడమీని ప్రారంభించారు.
ఇది వివిధ క్రీడల కోసం మైదానాలను అద్దెకు ఇచ్చే ఎట్ స్పోర్ట్స్ 18 క్రికెట్ అకాడమీ కాంప్లెక్స్‌లో ఉంది.
ఈ కాంప్లెక్స్‌లో మూడు టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. వీటిని రాధిక తన అకాడమీ కోసం అద్దెకు తీసుకున్నారు.
రాధిక టెన్నిస్ కెరీర్
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం, రాధిక ఐటీఎఫ్ కింద 36 సింగిల్స్, 7 డబుల్స్ మ్యాచ్‌లు ఆడారు.
ఆమె చివరి సింగిల్స్ మ్యాచ్ మార్చి 2024లో జరిగింది. ఆమె చివరి డబుల్స్ మ్యాచ్ జూన్ 2023లో జరిగింది. భుజం గాయం తర్వాత, ఆమె గురుగావ్‌లో టెన్నిస్ అకాడమీని ప్రారంభించారు.
అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొన్నారు రాధిక. 2024లో తన కెరీర్‌లో అత్యుత్తమ ఐటీఎఫ్ డబుల్స్ ర్యాంకింగ్ 113ని సాధించారు.
రాధిక మరణం తర్వాత, అనేక మంది క్రీడాకారులు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు.
జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సౌజన్య బావిశెట్టి ఇలా రాశారు, "ఇది హృదయ విదారకం. నేను ఆమెను ఒకసారి ఒక టోర్నమెంట్‌లో కలిశాను. ఆమె నవ్వు చాలా అందంగా ఉంటుంది. ఆమె తండ్రి ఇంత భయంకరమైన నేరం చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆమె ఒక మూర్ఖపు ఆలోచనకుతన జీవితాన్ని కోల్పోయింది – దీనిపై 'ప్రజలేమంటారు?".
"ఈ వార్త హృదయ విదారకమైంది. కలచివేసేది" అని టెన్నిస్ క్రీడాకారిణి శర్మదా బాలు సోషల్ మీడియాలో రాశారు.
పోలీసులు ఏం చెబుతున్నారు?
"భవనాలను అద్దెకు ఇచ్చే దీపక్ యాదవ్ తన కుమార్తె అకాడమీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నందున ఆమె పని చేయవలసిన అవసరం లేదని ఆయన భావించారు. దానిని మూసేయమని ఆమెను కోరారు."అని గురుగావ్ పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ చెప్పారు.
"అందుకు రాధిక నిరాకరించారు. దాంతో ఇద్దరికి పెద్ద వాదన జరిగింది. దీపక్ యాదవ్ తన లైసెన్స్‌డ్ తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. మేం నిందితుడిని అరెస్టు చేసి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం" అని కుమార్ తెలిపారు.
మ్యూజిక్ వీడియో కూడా కారణమా?
రాధిక హత్య తర్వాత, ఒక సంవత్సరం క్రితం నాటి ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్ లేదా మ్యూజిక్ వీడియోనే హత్యకు కారణమనే వదంతులు వ్యాపించాయి. కానీ పోలీసులు వాటిని ఖండించారు.
"ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో హత్యకు, ఆ వీడియోకు ఎటువంటి సంబంధం లేదని తేలింది. అవి కేవలం పుకార్లు మాత్రమే" అని సందీప్ కుమార్ అన్నారు.
ఇనామ్ ఉల్ హక్ ఎవరు, ఆయనేమంటున్నారు?
ఇప్పుడు మాట్లాడుకుంటున్న మ్యూజిక్ వీడియో ఏడాది కిందటిది. ఇనామ్ ఉల్ హక్ ఆ వీడియోలో నటించారు. ఇనామ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "మా పాట షూటింగ్ నాలుగు నుంచి ఐదు గంటలు జరిగింది. నోయిడాలో చిత్రీకరించాం. షూటింగ్ సమయంలో రాధిక తల్లి మాతో ఉన్నారు. తన తండ్రికి ఈ పాట చాలా నచ్చిందని రాధిక నాతో చెప్పారు. అక్కడ చాలా మంది ఉన్నారు. మా ఇద్దరి మధ్య వృత్తిపరమైన సంబంధమే ఉంది. మేం మొదటిసారి ఆమెను కలిసినప్పుడు తనకు నటి కావాలనుందని నా టీమ్ మేట్స్‌తో చెప్పారు" అని అన్నారు.
"మేం షూట్ తర్వాత మాట్లాడుకున్నాం కానీ కలవలేదు. ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ పాటను ప్రమోట్ చేయలేదు. మాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, వారు తమ ఖాతాలను యాక్టివేట్, డీయాక్టివేట్ చేస్తారు. రాధిక కూడా తన సోషల్ మీడియా ఖాతాను రెండు-మూడు సార్లు తొలగించారు" అని ఆయన చెప్పారు.
"ఈ పాట అనుకన్నంతగా హిట్ కాలేదు. అందుకే నేను దానిని సోషల్ మీడియా నుంచి తొలగించాలనుకున్నా. చివరి క్షణంలో ఈ పాటలో నన్ను ఎంపిక చేశారు. ఇందులో నా లుక్ నాకు నచ్చలేదు. ఈ దుర్ఘటన జరగకముందే నేను ఈ పాటను తొలగించాలనుకున్నాను.కానీ ఇప్పుడు తొలగించడం కరెక్ట్ కాదు."అని ఇనామ్ తెలిపారు.
"రాధిక ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో నాకు తెలియదు. సెట్‌లో నేను ఆమె తల్లిని 'ఆంటీ జీ' అని పిలిచేవాడిని, ఆమె తల్లి పేరు కూడా నాకు తెలియదు. రాధిక తల్లి ఏమనుకుంటున్నారో నేను ఏమీ చెప్పలేను, కానీ ప్రతి సన్నివేశాన్ని ఆమె ముందే చిత్రీకరించారు." అని ఇనామ్ అన్నారు.
"నాకు గురుగావ్ పోలీసుల నుంచి ఎటువంటి కాల్ రాలేదు. నాకు కాల్ వస్తే, నేను వారికి అన్నీ చెబుతా. ఒక మనిషిగా రాధిక మరణం పట్ల నాకు బాధగా ఉంది. ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పినది నిజం. దానికి వేరే కోణం ఇవ్వకండి. మనం ఎవరి మతాన్ని చూసి పని చేయం కదా" అని ఇనామ్ అన్నారు.
గురుగ్రావ్ కోర్టు దీపక్ యాదవ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పోలీసు దర్యాప్తు తర్వాత ఈ కేసులోని మరిన్ని అంశాలు బయటపడతాయి.
ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి నిర్మాణాత్మకమైన సమాచారమేదీ లేదు. కానీ ఆమె ఇంటి బయట నిశ్శబ్దం, బంధువులు నోరువిప్పకపోవడం వంటి విషయాలు ఈ కేసు కనిపించే దానికంటే చాలా క్లిష్టంగా ఉండవచ్చని చెబుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)