You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోడ్డు పక్కన ఉన్న ట్రక్కులో 11 శవాలు, అసలేమైంది?
- రచయిత, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ న్యూస్
హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతంగా పేరుపడిన దక్షిణ మెక్సికో నగరంలో, ఒక ట్రక్కులో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది శరీర భాగాలు గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
గత నెలలో మేయర్ హత్యకు గురైన గెరెరో రాష్ట్రంలోని చిల్పాన్‌సింగో నగరంలోనే ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.
మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే ఆయన్ను తల నరికి మొండెం నుంచి వేరుచేసి పడేశారు.
వీటిని దారుణ హత్యలుగా పరిణిస్తున్నామని, బాధితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ తెలిపారు.
రోడ్డు పక్కన ఒక ట్రక్కు వదిలేసి ఉందని సమాచారం అందడంతో బుధవారం రాత్రి పోలీసులు అక్కడికి వెళ్లారు.
గతంలో సంపన్నుల ప్రాంతమైన ఆకాపుల్కోకి వెళ్లే రహదారి పక్కన మృతదేహాలతో ఉన్న ఈ ట్రక్కును గుర్తించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు హాట్‌స్పాట్‌గా మారిన ఈ ప్రాంతంలో హత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.
స్మగ్లింగ్‌కు అనువుగా ఉన్న పసిఫిక్ తీర ప్రాంతంలో ఉండడంతో మెక్సికోలోని హింసాత్మక ఘటనలు జరిగే రాష్ట్రాల్లో గెరెరో కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో నిరుడు 1,890 హత్యలు నమోదయ్యాయి.
సుమారు 2,80,000 మంది జనాభా కలిగిన చిల్పాన్‌సింగో నగరం ఆర్డిల్లోస్, త్లాకోస్ అనే రెండు మాదకద్రవ్యాల రవాణా ముఠాల మధ్య ఘర్షణలకు నిలయంగా మారింది.
జూన్ 2న జరిగిన మెక్సికో ఎన్నికల్లో పోటీలో ఉన్న ఆరుగురు అభ్యర్థులు హత్యకు గురయ్యారు.
గత నెలలో చిల్పాన్‌సింగో మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అలెజాండ్రో ఆర్కోస్‌ను వారం రోజుల్లోనే తలనరికి చంపేశారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు మెక్సికన్ ప్రభుత్వం 2006లో సైన్యాన్ని మోహరించినప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకూ 4,50,000 మంది హత్యకు గురయ్యారు. దాదాపు 10 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదు.
మెక్సికో నూతన అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ హింసాత్మక నేరాలను అరికట్టడంపై దృష్టిపెట్టారు. మెరుగైన గూఢచార వ్యవస్థ, భాగస్వామ్యంతో పాటు నేషనల్ గార్డ్ వంటి వాటిని పెంపొందించే దిశగా నూతన భద్రతా ప్రణాళికలను ఆమె తీసుకొచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)