మగవాళ్లపై గృహహింస: టాయిలెట్‌కు కూడా వెళ్లనివ్వకుండా వేధించిన ప్రియురాలికి జైలు శిక్ష

    • రచయిత, సారా ఈజీడేల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్చరిక: ఈ కథనంలో కలిచివేసే అంశాలు ఉన్నాయి.

సమాజంలో స్త్రీలే కాదు, పురుషులూ గృహహింసకు గురవుతున్నారని తెలిపే కథనం ఇది. గారెత్‌ జోన్స్ అనే వ్యక్తి ఆయన ప్రియురాలి చేతిలో దెబ్బలు తిన్నారు. తనను ఆమె మంచంపై పడుకోనివ్వలేదు. కనీసం టాయిలెట్‌ను కూడా ఉపయోగించుకోనివ్వ లేదు. తనలాగా మరెవ్వరూ బాధితులు కాకూడదనే ఉద్దేశంతో ఆయన తన కథను పంచుకున్నారు.

41 ఏళ్ల గారెత్‌జోన్స్‌కు 2021 జూలైలో ఆన్‌లైన్‌ ద్వారా ఓ మహిళ పరిచయమయ్యారు. తరువాత ఆయన ఆమె నుంచి నెలల తరబడి మానసిక, శారీరక వేధింపులు ఎదుర్కొన్నారు.

వాటి నుంచి కోలుకోవడానికి ఏడాదికిపైగా ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

కొంతమంది అనుకుంటున్నట్టుగా పురుషులపై గృహహింస అరుదైనదేమీ కాదని, ప్రతి ఆరేడుగురు పురుషులలో ఒకరు వారి భాగస్వామి నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారని, జోన్స్‌కు సహాయం అందించిన మ్యాన్ కైండ్ ఇనిషియేటివ్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.

బ్రిటన్‌‌‌లోని వేల్స్‌లో ప్రతి 25 మంది మగవాళ్లలో ఒకరు తమ భాగస్వామి వల్ల హింసకు గురవుతున్నారని ఆ సంస్థ వెల్లడించింది.

ఈ ఏడాది ప్రారంభంలో చెషైర్‌లోని విన్స్‌ఫోర్డ్‌కు చెందిన 41 ఏళ్ల సారా రిగ్బీ, తన ప్రియుడిని హింసించినట్టు క్రౌన్ కోర్ట్‌లో అంగీకరించడంతో 20 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే, రిగ్బీ తన ప్రవర్తనను మార్చుకోవడానికి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్షను అమలు చేయకుండా కోర్టు ఆమెకు ఒక అవకాశం ఇచ్చింది.

"రిగ్బీ తన ప్రియుడిని గొంతు పిసికి, ఊపిరాడకుండా చేసేది. చాలామంది అనుకుంటారు... మహిళలు మాత్రమే వేధింపులకు, హింసకు గురవుతారని. కానీ ఈ కేసు అలాంటిది కాదు" అని చెషైర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డిటెక్టివ్ కానిస్టేబుల్ సోఫీ వార్డ్ అన్నారు.

తమ తొమ్మిది నెలల బంధంలో స్నేహితులు, కుటుంబాన్ని కలవకుండా చేయడమే కాకుండా 40,000 పౌండ్ల (దాదాపు రూ. 43లక్షలు) మేరకు తాను ఆర్థికంగా నష్టపోయేలా చేసిందని జోన్స్ వెల్లడించారు.

తనను రోజూ అనరాని మాటలు అనేదని, ఆమె అనుమతి లేకుండా టాయిలెట్ కూడా ఉపయోగించకూడదని ఆయన అన్నారు.

"చివరకు తినే భోజనంపై కూడా ఆంక్షలు విధించడంతో నేను రెండు నెలల్లో నాలుగున్నర కిలోల బరువు తగ్గిపోయాను. అంతేకాదు ఇలా ప్రవర్తిస్తోందని ఎవరికైనా చెబితే నేనే ఆమెను హింసిస్తున్నట్టుగా కేసు పెడతానని బెదిరించింది" అని జోన్స్ అన్నారు.

తన ప్రియురాలు రిగ్బీకి శిక్ష విధించిన ఐదు నెలల తర్వాత, తాను అనుభవించిన వేదనను బయటి ప్రపంచానికి వివరించారు జోన్స్.

మొదట తమ బంధం బాగానే అనిపించిందని, అయితే కొంచెం అతిగా ప్రేమ కురిపిస్తున్నట్టు అనిపించేదని చెప్పారు.

"దానిని ప్రేమ బాంబు దాడి అని వారంటారేమో" అన్నారాయన.

"రిగ్బీని కలిసిన నాలుగు నెలల తర్వాత నా అపార్ట్‌మెంట్ నుంచి తన ఇంటికి షిష్ట్ అయ్యాను. ఆ తర్వాత చిత్రహింసలు ఇంకా ఎక్కువయ్యాయి. నేను ఇంట్లో ఉంటున్నందుకు అద్దె కూడా వసూలు చేసేది. నెలకు 700 పౌండ్లు (అంటే దాదాపు రూ. 76 వేలు) అద్దెతో పాటు అన్ని బిల్లులు కూడా చెల్లించాను. నాకు కనీసం ఇంటితాళాలు ఇచ్చేది కాదు. తను ఉన్నప్పుడు మాత్రమే నేను ఇంట్లో ఉండాలి" అని వెల్లడించారు జోన్స్.

"నేను బాత్‌రూమ్ వాడాలా, వద్దా... ఏం తినాలి? ఏం తినకూడదు? ఇలా అన్నింటి మీదా ఆంక్షలు విధించేది" అని జోన్స్ తెలిపారు.

"ఆమె చెప్పినట్టుగా నేను వినకపోతే కనీసం దిండు, దుప్పటి కూడా ఇవ్వకుండా నేలమీద పడుకోమనేది"

"నేను స్నానం చేయడానికి, షేవ్ చేసుకోవడానికి, టాయిలెట్ ఉపయోగించడానికి కూడా అనుమతించేది కాదు"

"నేను అలాగే ఉగ్గబట్టుకుని స్థానిక సూపర్ మార్కెట్, పబ్ లేదంటే రెస్టరెంట్‌కి వెళ్లి టాయిలెట్ యూజ్ చేసుకునేవాడిని"

"ఆమె లేనప్పుడు ఇంట్లో ఉండడానికి వీలులేదు. ఆమె బయటకు వెళ్లాలనుకుంటే, నాకు పని ఉన్నా సరే నేను కూడా బయటకు వెళ్లిపోవలసిందే."

"నా ఫోన్ చెక్ చేస్తూ ఉండేది. ‘నువ్వు ఇప్పుడు నాతో ఉంటున్నావ్ నీ కుటుంబాన్ని, స్నేహితులను కలవకూడదు’ అని చెప్పేది"

"మా అమ్మ మెసేజ్ చేసినా రిగ్బీకి తెలిస్తే ఎలా ప్రవర్తిస్తుందో అనే భయంతో వెంటనే డిలీట్ చేసే వాడిని" అని జోన్స్ చెప్పారు.

కొరకడం, తన్నడం, గోళ్లతో రక్కడం, పిడిగుద్దులతో శారీరకంగా హింసించేది అని జోన్స్ అన్నారు.

ఒకసారి వారాంతంలో లండన్‌కు వెళ్లినప్పుడు రిగ్బీ డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్‌ను కొనాలని డిమాండ్ చేసిన సంఘటన గురించి వివరించారాయన.

"మేము హారోడ్స్‌లో ఉన్నాము. అప్పుడు 'నువ్వు నాకు ఖరీదైన వస్తువేదైనా కొనిచ్చేవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదు' అంది. జంపర్‌తో నా చేతిమీద గీరింది. నా చేతికి గాయమై రక్తస్రావం అవుతోంది. అయినా సరే తన కోసం ఖరీదైన వస్తువేదైనా కొనాల్సిందే అని పట్టుబట్టింది"

"మా బంధానికి ఐదు నెలలు పూర్తి అయిన తర్వాత, తనకు తెలియకుండా మా అమ్మను కలుసుకున్నా. ఈ విషయం తెలిసి నా మీద విరుచుకుపడింది" అని జోన్స్ చెప్పారు.

"నేను నా కుటుంబాన్ని ఇకపై కలవలేను అనుకున్నాను. వాళ్లు కూడా 'మా గురించి ఆలోచించకు, నువ్వు సంతోషంగా ఉండు' అని చెప్పారు"

ఆ సమయంలోనే గారెత్ జోన్స్ మ్యాన్‌కైండ్ ఇనిషియేటివ్‌ సంస్థకు ఫోన్ చేశారు.

జోన్స్ గృహహింసకు గురవుతున్నారని ఆ సంస్థ ధ్రువీకరించింది.

రిగ్బీలాంటి వ్యక్తులబారి నుంచి బయటపడాలని సూచించి, సహాయం అందజేసింది మ్యాన్‌కైండ్ ఇనిషియేటివ్‌ సంస్థ.

‘‘మా అబ్బాయి ఈ విషయాల గురించి బయటి ప్రపంచానికి చెప్పినందుకు మాకు గర్వంగా ఉంది’’ అని గారెత్ వాళ్ల అమ్మ డయాన్ డెబెన్స్ అన్నారు.

"మీ బంధం మీకు ఆనందాన్ని ఇవ్వకుండా చిరాకు కలిగిస్తుంటే, ఇకపై నీతో నేను కొనసాగలేను అని మీ భాగస్వామికి చెప్పేయండి. అటువంటి బంధాలనుంచి బయట పడండి అని చెప్పాలనుకుంటున్నా" అని ఆమె అన్నారు.

"మీ పిల్లలు ఎంతపెద్దవారైనా సరే, వారు బాధపడుతున్నారని మీకు తెలిసి కూడా, మీరు నిస్సహాయంగా ఉండిపోవడం అనే బాధ వర్ణనాతీతం." అన్నారామె.

"జోన్స్ గాయాలతో కనిపించేవాడు. ఒకసారి ముక్కు కోసుకుపోయి కనిపించాడు" అని డెబెన్స్ చెప్పారు.

"ఒక మనిషి ఇంకో మనిషితో ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని నేను నమ్మలేకపోయాను" అని ఆమె అన్నారు.

గారెత్ తన కథను చెప్పే సాహసం చేయడాన్ని మ్యాన్‌కైండ్ ఇనిషియేటివ్ చైర్మన్ మార్క్ బ్రూక్స్ మెచ్చుకున్నారు.

"గృహ హింసకు గురైన మగవారి గురించి పెద్దగా మాట్లాడరు. దీనిపై ఎక్కువగా చర్చ జరగదు" అని బ్రూక్స్ అన్నారు.

"అందుకే దీనిపై చాలామందికి అవగాహన ఉండదు. పురుషులపై గృహహింస అనేది వాస్తవంగా జరిగే విషయమే" అని ఆయన అన్నారు.

భవిష్యత్తులో గారెత్ నిజమైన ప్రేమను పొందుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన తల్లి డయాన్ డెబెన్స్.

కానీ ఇప్పుడు మాత్రం గారెత్ అందుకు సిద్ధంగా లేరు.

"తన దుస్తులు విడిచిపెట్టినట్టుగానే ఈ హింసను, హింసించిన వ్యక్తిని విడిచిపెట్టాడు. కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థికంగా మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సి వచ్చింది. స్నేహాన్ని తిరిగి పెంపొందించుకోవలసి వచ్చింది. పనిని మాత్రమే కాదు తనను తాను పునర్నిర్మించుకోవలసి వచ్చింది’’ అని డెబెన్స్ అన్నారు.

"ఈ హింస చాలా కాలం పాటు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. నా మీద నాకే గౌరవం పోయింది. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి నేను ట్రీట్‌మెంట్ తీసుకోవలసి వచ్చింది" అని గారెత్ జోన్స్ అన్నారు.

పురుషులు హింసకు గురికావడం గురించి మాట్లాడటం పరువు తక్కువని చాలామంది అనుకుంటారు. ఆ అభిప్రాయాన్ని మార్చడానికే తన కథను చెప్పాలనుకున్నారు జోన్స్.

గమనిక: భారతదేశంలో గృహహింసకి సంబంధించి హెల్ప్ లైన్ 1091/1291 టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)