ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ ఎంత? ఎన్నికల్లో ట్రంప్‌‌కు ఎలా దగ్గరయ్యారు?

    • రచయిత, నటాలీ షెర్మాన్ & డెర్బీల్ జోర్డాన్
    • హోదా, బీబీసీ బిజినెస్ రిపోర్టర్స్

బిలియనీర్ ఎలాన్ మస్క్ వార్తలు లేకుండా ఒక్కరోజు కూడా ఉండదేమో అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.

ఎక్స్, టెస్లా ,స్పేస్‌ఎక్స్ అధినేత, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్, కీలక విషయాలపై తన అభిప్రాయాలను తెలియజేయడానికి ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేసుకుంటున్నారు.

న్యూరాలింక్‌ కంపెనీ ద్వారా మనిషి మెదుడులో చిప్ అమర్చాలని, ఎక్స్‌ని ‘సూపర్ యాప్’గా మార్చాలని ఆయన ఆలోచిస్తున్నారు.

కృత్రిమ మేధస్సు మానవాళికి ప్రమాదకరమని హెచ్చరికలు చేస్తూనే, ఆ కార్యక్రమాలపైనే ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డోనల్డ్ ట్రంప్ విజయం తర్వాత మస్క్ స్థాయి, సంపద పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో మస్క్ కీలకమైన, వివాదాస్పదమైన పాత్రను పోషించారు.

అంతేకాదు, ట్రంప్ ఆలోచనలు, మస్క్ ఆలోచనలు దాదాపు ఒకేలా ఉన్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ అనే విధానం ద్వారా మితిమీరిన బ్యూరోక్రసీని, అనవసర నిబంధనలను, వృథా ఖర్చులను తగ్గిస్తానని చెబుతున్నారు.

మస్క్ కూడా దాదాపు ఇదే ఆలోచనతో తన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఉద్యోగులను తొలగించారు.

ఎలాన్ మస్క్ ఎక్కడ జన్మించారు?

దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు ఎలాన్ మస్క్. ఇంట్లో తయారు చేసిన చాక్లెట్ ఈస్టర్ ఎగ్స్‌ను సోదరుడితో కలిసి ఇంటింటికీ వెళ్లి అమ్మేవారు మస్క్.

పన్నెండు సంవత్సరాల వయస్సులో తన మొదటి కంప్యూటర్ గేమ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తులో తానొక మంచి ప్రారిశ్రామికవేత్త కాగలనని అనిపించుకున్నారు.

తన బాల్యం చాలాకష్టంగా గడిచిందని వివరించారు మస్క్. తల్లిదండ్రుల విడాకులు, స్కూల్లో వేధింపులు, ఆస్పెర్గర్స్ సిండ్రోమ్‌లాంటి వాటితో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.

కాలేజ్‌లో చేరడానికని కెనడాకు, అక్కడినుంచి అమెరికాకు వెళ్లారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం చదువుకున్నారు.

2010లో మేరీ క్లెయిర్ అనే మేగజైన్‌కు ఎలాన్ మస్క్ మొదటి భార్య జస్టిన్ రాసిన ఆర్టికల్‌లో.. మిలియన్ల డాలర్ల డబ్బు సంపాదించడానికి ముందు కూడా మస్క్ తిరస్కారాన్ని స్వీకరించే వ్యక్తి కాదని రాశారు.

జస్టిన్ మస్క్ ఒక రచయిత్రి. కాలేజీ రోజుల్లో జస్టిన్‌తో మస్క్‌కు పరిచయం ఏర్పడింది.

ఎలాన్ మస్క్ డబ్బు ఎలా సంపాదించారు?

స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేయాలనుకున్నా గానీ ఆ తర్వాత మస్క్ ఆ ప్రయత్నం మానుకున్నారు.

1990ల "డాట్‌కామ్ బూమ్" సమయంలో రెండు టెక్నాలజీ స్టార్టప్‌లను స్థాపించారు. అందులో ఒకటి వెబ్ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగా, రెండోది ఆన్‌లైన్ బ్యాంకింగ్ కంపెనీ. తర్వాత ఇది ‘పేపాల్‌’గా మారింది. దీనిని 2002లో ఈబేకు సుమారు రూ. 12,658 కోట్లకు అమ్మారు.

కొత్త రాకెట్ కంపెనీ, స్పేస్‌ఎక్స్‌తో ఆయన దశ మారిపోయింది. నాసాకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ సంస్థ. అలాగే 2008లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయ్యే వరకు ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా బోర్డుకు అధ్యక్షత వహించారు మస్క్.

ఈ రెండు సంస్థలు కొన్నిసార్లు ఆర్థిక పతనానికి దగ్గరైనప్పటికీ, ఆయా పరిశ్రమలను బలోపేతం చేయడానికి ఇవి అవకాశం కల్పించాయి.

అక్టోబరు 2022లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకోవడం మస్క్ తాజా వ్యాపార ఎత్తుగడ.

అప్పటి నుంచి ఎక్కువగా వివాదాల్లో నిలుస్తున్నారాయన. ట్విట్టర్‌ ప్లాట్‌ఫామ్‌ను సురక్షితంగా ఉంచే టీమ్‌ల వేతనాల్లో కోత విధించడంతోపాటు కొంతమంది ఉద్యోగులను కూడా తొలగించారు. కంపెనీ పేరును ట్విట్టర్‌ నుంచి ఎక్స్‌గా మార్చారు. ఇది కేవలం ప్రకటనల మీదనే ఆధారపడకుండా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌న్ విధానం కూడా తీసుకువచ్చారు.

రకరకాల సేవలను అందించేలా, ప్రతి పనికోసం ఉపయోగించేలా ఎక్స్‌ని తీర్చిదిద్దాలన్నది మస్క్ ఆశయం. అయితే, కంపెనీ విలువ ఆయన మొదట చెల్లించిన 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.7 లక్షల కోట్లు) నుంచి 19 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లకు) పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి.

2018లో విడిపోవడానికి ముందు చాట్ జీపీటీ మాతృ సంస్థలో ప్రారంభ పెట్టుబడిదారుడిగా ఉన్నారు మస్క్. తర్వాత 2023లో "విశ్వం స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి" తన సొంత కంపెనీ ఎక్స్ఏఐని స్థాపించి, ఏఐ రంగంలో కూడా ముందుకెళ్లాలని ఆయన అనుకున్నారు.

మస్క్ ఇప్పటికి మూడుసార్లు విడాకులు తీసుకున్నారు. అందులో ఒకే మహిళ నుంచి రెండుసార్లు తీసుకున్నారు. ఆమె బ్రిటిష్ నటి తాలూలా రిలే. మస్క్ తాను చేసిన తప్పుల గురించి కూడా స్పష్టంగా బయటకు చెప్పేవారు.

2022లో ఇచ్చిన ఒక టెడ్ ఇంటర్వ్యూలో మస్క్ "మీరు నా పాపాలను మాత్రమే రాస్తే, ఈ భూమిపై అత్యంత చెత్త వ్యక్తిని అవుతాను. నేను చేసిన మంచి పనులతో పోల్చి చూస్తే బావుంటుందేమో’’ అని అన్నారు.

మస్క్ నికర ఆస్తుల విలువ ఎంత?

మస్క్ సంపద కూడబెట్టడం ఆపలేదు. ప్రపంచంలోని బిలియనీర్ల సంపదను ట్రాక్ చేసే బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో మస్క్ అత్యంత ధనవంతుడు.

ఆయన ప్రస్తుత నికర ఆస్తుల విలువ సుమారు 290 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 24.47 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా వేసింది. ట్రంప్ విజయం తర్వాత టెస్లా షేర్ ధరతో పాటు మస్క్ సంపద కూడా పెరిగింది.

టెస్లాలో మస్క్‌కు 13 శాతానికి పైగా వాటా ఉంది. 2020లో టెస్లా స్టాక్ విలువ చాలా పెరిగింది. కంపెనీ ఎక్కువ కార్లను తయారు చేసి సాధారణ లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. అయితే, స్టాక్ విలువ పెరుగుదల చాలా ఎక్కువగా ఉందని కొందరు భావించారు.

2022 చివరిలో ఆ కంపెనీ షేర్లు పడిపోయాయి. ట్విట్టర్ టేకోవర్ చేసి దానిపై ఎక్కువ దృష్టి పెట్టడమే షేర్ల పతనానికి కారణమని ఆరోపించారు. అయినప్పటికీ వారి స్థానాన్ని స్థిరపరచుకున్నారు.

డిజిటల్ కరెన్సీలతో పాటు బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్‌తో సహా అనేక ఇతర చిన్న కంపెనీలలో మస్క్ పెట్టుబడులు ఉన్నాయి.

కష్టపడి పనిచేస్తానని గర్వంగా చెప్పే మస్క్, కేవలం డబ్బు సంపాదించడం కోసం తాను వ్యాపారం చేయడం లేదని తరచూ చెబుతుంటారు.

ట్రంప్‌కు ఎందుకు మద్దతు ఇచ్చారు?

ఎలాన్ మస్క్ 2002లో అమెరికా పౌరసత్వం పొందారు. చాలాకాలం పాటు ఎలాంటి రాజకీయ పార్టీ ముద్ర పడకుండా ఉన్నారు. ఆయన తనను తాను హాఫ్-డెమొక్రాట్, హాఫ్ రిపబ్లికన్ అనీ, రాజకీయంగా మితవాద, ఇండిపెండెంట్ అంటూ చెప్పుకునేవారు.

బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్‌లకు ఓటు వేశానని, అంతేకాకుండా జో బైడెన్‌కు అయిష్టంగానే ఓటు వేశానని మస్క్ చెప్పారు.

కానీ కొన్నేళ్లుగా ఆయన డోనల్డ్ ట్రంప్‌కు మద్దతిస్తూ వచ్చారు. ట్రంప్ ప్రచారానికి ప్రధాన మద్దతుదారులలో ఒకరిగా ఉన్నారు.

ఆర్థిక వ్యవస్థ, ఇమ్మిగ్రేషన్, గన్ కంట్రోల్‌ సహా అనేక సమస్యలపై డెమొక్రాటిక్ పార్టీ వైఖరిని మస్క్ విమర్శించారు.

ఎన్నికలకు ముందు అనేక రిపబ్లికన్ ర్యాలీలలో ఆయన కనిపించారు. ట్రంప్‌ను తిరిగి ఎన్నుకోవడంలో సహాయపడటానికి రాజకీయ కార్యాచరణ కమిటీకి చాలా మొత్తంలో నిధులు సేకరించారు మస్క్.

అంతేకాకుండా ట్రంప్‌కు తాను మద్దతిస్తున్నట్టు ఎక్స్‌ వేదికగా పదేపదే చెప్పేవారు.

మస్క్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ) అమెరికాలో కీలక రాష్ట్రాల్లోని ఓటర్లకు మిలియన్ డాలర్లు బహుమతిని ఇస్తానని చెప్పింది.

ఈ రాజకీయ వివాదాలకు ముందు కూడా మస్క్ విమర్శలు ఎదుర్కొన్నారు.

మస్క్ యుక్రెయిన్‌కు తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను అందించారు. అయితే రష్యాలోని ప్రధాన నేవీ పోర్టు సెవాస్టోపోల్‌లో స్టార్‌లింక్‌ని యాక్టివేట్ చేయాలని కీవ్ నుంచి వచ్చిన అత్యవసర అభ్యర్థనను తిరస్కరించినందుకు ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు.

కాలిఫోర్నియా నిబంధనలు, అధిక పన్నుల గురించి ఫిర్యాదు చేస్తూ టెక్సస్‌కి వెళ్లారు. యూనియన్ నిర్వాహకులతో కూడా విభేదించారు. 2020లో కరోనావైరస్ లాక్‌డౌన్‌లను ‘ఫాసిజం’ అని విమర్శించారు.

టెస్లా విషయంలో వాతావరణ మార్పు వంటి ప్రధాన మానవ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి కేంద్రీకరించినందున, తన వ్యాపారాలను దాతృత్వానికి ఒక రూపంగా చూస్తున్నానని మస్క్ చెప్పారు.

కృత్రిమ మేధపై ఆసక్తి ఉన్నప్పటికీ, సూపర్-ఇంటెలిజెంట్ ఏఐలతో మానవాళి భవిష్యత్తుకు ముప్పు కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసే వారిలో ఆయన ప్రముఖులు. ఏఐ వృద్ధి ప్రపంచంలో సరిపడినంత జనాభా లేకుండా పోవడానికి కారణమవుతుందని అన్నారు.

మస్క్‌కి 12 మంది పిల్లలు ఉన్నారు. ఆయన మొదటి భార్యకి ఆరుగురు, కెనడియన్ సింగర్ గ్రిమ్స్‌కి ముగ్గురు, శివన్ జిలిస్‌కి ముగ్గురు పిల్లలున్నారు.

జిలిస్‌కి కవలలు పుట్టిన తరువాత జనాభా క్షీణత సంక్షోభ సమయంలో నా వంతు కృషి చేస్తున్నానని ట్వీట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)