వినేశ్ ఫొగాట్‌ అనర్హత: మహిళలు బరువు తగ్గడం కష్టమా?

    • రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అధిక బరువు కారణంగా అనర్హతకు గురయ్యారు.

వినేశ్ బుధవారం మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగం ఫైనల్స్‌లో తలపడాల్సింది. కానీ, ఉదయం ఆమె బరువును పరిశీలించగా నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు తేలింది.

కేంద్ర క్రీడా మంత్రి మాన్సుఖ్ మాండవియా ఈ అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ‘‘భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటం వల్ల ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది’’ అని చెప్పారు.

వినేశ్, రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఆడుతున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ఆమె బరువు 50 కిలోలు ఉండాలి.

వినేశ్‌పై అనర్హత వేటు పడిన తర్వాత.. ఒక్క రోజులోనే బరువు పెరగడం, తగ్గడం జరుగుతుందా? అనే చర్చ మొదలైంది.

అలాగే పురుషులతో పోలిస్తే మహిళలు బరువు తగ్గడం చాలా కష్టమా? అనే సందేహం చాలామందిలో వ్యక్తమవుతోంది.

గత ఒలింపిక్స్‌లో 53 కేజీల విభాగంలో పోటీపడిన వినేశ్ ఫొగాట్ ఈసారి 50 కేజీల విభాగంలో పోటీల్లో పాల్గొన్నారు.

వినేశ్ బరువు తగ్గడానికి చాలా కష్టపడ్డారని భారత ఒలింపియన్ బజ్‌రంగ్ పునియా ‘బీబీసీ’తో అన్నారు.

చెమటకు, బరువుకు సంబంధం ఉంటుందా

“బరువు తగ్గడంలో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య చాలా తేడా ఉంటుంది. అబ్బాయిలకు ఎక్కువగా చెమట వస్తుంది. ఫలితంగా త్వరగా బరువు కోల్పోతారు. వినేశ్ గత ఆరు నెలలుగా కొద్దిగా నీళ్లు, ఒకట్రెండు రోటీలు మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారు ’’ అని బజ్‌రంగ్ పునియా చెప్పారు.

ఫైనల్ మ్యాచ్‌కు ముందు కూడా వినేశ్ తన బరువు తగ్గించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఆమె బరువు, నిర్దేశించిన దాని కంటే ఎక్కువగా ఉంది.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత వైద్య బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ దిన్షా పార్దివాలా మాట్లాడుతూ, "వినేశ్‌కు 1.5 కిలోల ఆహారం అవసరం. ఒకేరోజు మూడు మ్యాచ్‌లు ఆడినందున ఆమెకు బలమైన ఆహారం చాలా అవసరం. సెమీ ఫైనల్ తర్వాత వినేశ్ బరువు 2.7 కిలో గ్రాములు ఎక్కువగా ఉంది.

బరువు తగ్గడానికి కావాల్సినంత సమయం మా దగ్గర లేదు. అయినప్పటికీ ఆమె బరువు తగ్గించడానికి మేమంతా గట్టిగా ప్రయత్నించాం’’ అని వివరించారు.

దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నావల్ కె. విక్రమ్, ప్రజల బరువు సమస్యలపై అధ్యయనం చేశారు.

“బరువు తగ్గడంలో పురుషుల సామర్థ్యానికి, మహిళల సామర్థ్యానికి మధ్య తేడా ఉంటుందని నేను అనుకోను. కానీ ఆడ, మగ శరీర నిర్మాణంలో తేడా ఉండటంతో పాటు, మహిళల్లో బరువు పెరగడానికి చాలా కారణాలుంటాయి’’ అని డాక్టర్ నావల్ బీబీసీకి వివరించారు.

చెమటలు పట్టడాన్ని బరువు తగ్గడంలో పెద్ద అంశంగా భావించడం లేదని ఆయన అన్నారు. పురుషులు, మహిళలు బరువు తగ్గడంలో చెమట పెద్ద తేడా చూపిస్తుందని అనుకోవట్లేదని ఆయన చెప్పారు.

శరీరంలో నుంచి నీరు బయటకు వస్తే మాత్రం బరువు తగ్గడం ఖాయమని డైటీషియన్, వెల్ నెస్ నిపుణులు దివ్య ప్రకాశ్ తెలిపారు. ఒకవేళ మీకు ఒక లీటరు చెమట పట్టినట్లయితే, మీ బరువు ఒక కిలోగ్రాము వరకు తగ్గుతుందని ఆమె వెల్లడించారు.

ఒక రోజులో బరువు పెరగడం, తగ్గడం సాధ్యమేనా?

పీరియడ్స్ సమయంలో మహిళల బరువు 700 గ్రాముల నుంచి ఒక కేజీ వరకు పెరుగుతుందని దివ్య ప్రకాశ్ తెలిపారు. అయితే, ఇది మహిళల శరీరంపై, వారు చేసే పనిమీద ఆధారపడి ఉంటుందని చెప్పారు.

ఎవరి బరువు ఎందుకు పెరిగిందో స్పష్టంగా చెప్పలేమని ఆమె అన్నారు.

‘‘బరువు తగ్గడానికి చెమట చిందించడం ఒక మార్గం. నెమ్మదిగా, క్రమంగా బరువు తగ్గించుకోవడం సురక్షితం. లేకపోతే, శరీరంలో నీటికొరత ఏర్పడుతుంది. బహుశా వినేశ్ ఫొగాట్ బాగా చెమట చిందించి ఉండొచ్చు, అందుకే ఆమె శరీరం డీహైడ్రేట్ అయింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది" అని దివ్య ప్రకాశ్ వివరించారు.

చెమట పట్టడంలో శరీర పరిమాణం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పురుషుల శరీరం పెద్దదిగా ఉండటం వల్ల వారికి ఎక్కువ చెమట పడుతుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పురుషులు రన్నింగ్ ద్వారా 300 కేలరీలు ఖర్చు చేయగలిగితే, మహిళలు 180 కేలరీలు మాత్రమే కరిగిస్తారు.

ఇదే కాకుండా, పురుషులతో పోలిస్తే మహిళల శరీరం తక్కువ అథ్లెటిక్‌గా ఉంటుంది. అంటే వారి శరీరంలో 'లీన్ కండరాలు' తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా మహిళల బీఎంఆర్ (బేసల్ మెటబాలిక్ రేట్) ఎక్కువగా ఉంటుంది.

దీనివల్ల మహిళల్లో బరువు పెరిగే లేదా తగ్గే వేగం కూడా తగ్గిపోతుందని దివ్య ప్రకాశ్ అన్నారు.

మహిళల్లో బరువు పెరగడం లేదా తగ్గడం అనే అంశాలు వారి శరీరంలోని హార్మోన్లలో జరిగే మార్పులపై ఆధారపడి ఉంటాయి.

ఎయిమ్స్ ఆసుపత్రి డాక్టర్ నావల్ చెప్పినదాని ప్రకారం, మహిళల్లో పీరియడ్స్ ప్రారంభమైన తర్వాత, గర్భం దాల్చిన సమయంలో, బిడ్డ పుట్టినప్పుడు, పీరియడ్స్ ఆగిపోయే వరకు హార్మోన్లలో చాలా మార్పులు జరుగుతాయి. పురుషులలో ఇలా జరగదు.

పురుషులు, మహిళల శరీరాలలో కొవ్వు పరిమాణంలోనూ తేడా ఉంటుంది. ఒకే వయస్సు, బరువు ఉండే స్త్రీ, పురుషులను చూస్తే పురుషుల్లో ఎక్కువగా కండరాలు ఉంటాయి. పురుషుల కంటే మహిళల శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.

కేజీ బరువు తగ్గాలంటే ఎన్ని కేలరీలు కరిగించాలి

అన్ని వయస్సుల్లోని మహిళలు బరువు తగ్గడం కష్టమేమీ కాదంటున్నారు ఫోర్టిస్ హాస్పిటల్ సీ-డీఓసీ చైర్మన్ అనూప్ మిశ్రా.

"మహిళల్లో వయసు పెరిగే కొద్ది హార్మోన్లు మారుతాయి. అందుకే బరువు తగ్గడం కష్టంగా మారొచ్చు. మనం ద్రవాలు తీసుకోవడం తగ్గించి, ఎక్కువ మూత్ర విసర్జన చేస్తే, అది చెమట కంటే బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

పీరియడ్స్ ముందు తర్వాత మహిళల్లో ద్రవాల మార్పు ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వారి బరువు పెరుగుతుంది.

మీరు ఎక్కువ ద్రవాలతో పాటు, అధిక కేలరీల ఆహారం తీసుకుంటే, మీ బరువు ఒకే రోజులో 1.5 కిలోల వరకు పెరుగుతుంది’’ అని ఆయన వివరించారు.

నిపుణుల లెక్క ప్రకారం, ఎవరైనా ఒక కేజీ బరువు తగ్గడానికి, 7200 కేలరీల శక్తి కరిగించాలి.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)