You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గాజాలో ఆహారం జారవిడవడంపై విమర్శలేంటి? ‘ఎయిర్ డ్రాప్స్’తో 20 లక్షల మందికి భోజనం దొరకడం సాధ్యమేనా?
గాజాలో పోషకాహార లోపంపై అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుండడంతో గత వారాంతంలో ఇజ్రాయెల్ మానవతాసాయాన్ని అందించడం తిరిగి ప్రారంభించింది.
జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సమన్వయం చేసుకుంటూ గగనతలం నుంచి ఆహారాన్ని గాజాలోకి జారవిడుస్తోంది.
అయితే ఇజ్రాయెల్ మానవతాసాయాన్ని అందిస్తున్న తీరుపై సహాయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి అధికారులు విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. ఇది ఖర్చుతో కూడిన వ్యవహారామని.. రిస్క్‌తో కూడుకున్నదని, భూమ్మీద నుంచి నేరుగా అందించే సాయానికి ఇది ప్రత్యామ్నాయం కాదని వారు అంటున్నారు.
గాజా స్ట్రిప్ అంతటా ఆకలిచావులు తలెత్తే ప్రమాదం ఉందన్న హెచ్చరికల తర్వాత ఎయిర్‌డ్రాప్స్ ద్వారా మానవతాసాయం తిరిగి మొదలైంది.
24 గంటల్లోనే పోషకాహారలోపంతో 14 మంది చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలో నడిచే గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరింత మానవాతాసాయం పంపిణీ చేసేందుకు వీలుగా గాజాలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం(జులై 27) నుంచి ఇజ్రాయెల్ రోజులో 10గంటలపాటు మిలటరీ ఆపరేషన్‌కు విరామం ఇస్తోంది.
దీంతో మరణాల సంఖ్య బయటకు వచ్చింది. పోషకాహార లోపంతో మరణిస్తున్న వారి సంఖ్యను గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడిస్తోంది.
ఐక్యరాజ్యసమితితో పాటు ఇతర సంస్థలకు చెందిన 120కి పైగా ట్రక్కులు, నిత్యావసరాలు తీసుకుని ఆ రోజు గాజాలో ప్రవేశించాయని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు.
'ఖర్చెక్కువ, సరిపడా అందవు'
7 ప్యాలెట్ల పిండి, పంచదార, క్యాన్‌డ్ ఫుడ్ గాజాలో జారవిడిచామని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.
''25 టన్నుల ఆహారం, అవసరమైన మానవతాసాయం'' జోర్డాన్, యూఏఈ అందించాయని జోర్డాన్ అధికారులు చెప్పారు.
సోమవారం(జులై 28) రెండు అరబ్ దేశాలు మళ్లీ ఎయిర్‌డ్రాప్స్ ద్వారా సాయం అందించడం ప్రారంభించాయి. జోర్డాన్ నుంచి బయలుదేరిన ఓ విమానంలో బీబీసీ బృందం వెళ్లింది.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బలగాలకు నిత్యావసరాలు అందించడానికి మొదలైన ఎయిర్‌డ్రాప్స్ విధానం తర్వాత కాలంలో మానవతాసాయానికి కీలకంగా మారింది.
1973లో ఐక్యరాజ్యసమితి తొలిసారిగా సాయం అందించేందుకు వాటిని ఉపయోగించింది.
అయితే మరింత ప్రభావవంతంగా ఉండే అవకాశాలు లేనప్పుడు, విఫలమైనప్పుడు మాత్రమే వాటిని ''ఆఖరి అవకాశం''గా చూడాలని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యుఎఫ్‌పీ)2021లో విడుదల చేసిన ఓ రిపోర్టులో పేర్కొంది.
డబ్ల్యుఎఫ్‌పీ ఎయిర్‌డ్రాప్స్ నిర్వహించిన చివరి ప్రాంతం దక్షిణ సూడాన్.
‘ఏ అవకాశమూ లేనప్పుడు మాత్రమే’
ఫుడ్ ఎయిర్‌డ్రాప్స్ ఖరీదైనవని, అంత ప్రభావవంతంగా ఉండవని, ఆకలితో అలమటించిపోతున్న ప్రజల మరణాలకు కూడా కారణమవుతాయని యూఎన్ పాలస్తీనా శరణార్థి సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యుఏ హెడ్ ఫిలిప్ లజ్జారిని 'ఎక్స్'లో చేసిన పోస్టులో అన్నారు.
ఎయిర్‌డ్రాప్స్ అంత ప్రయోజనకరం కాదని, మనిషి సృష్టించిన ఆకలిని పరిష్కరించడం రాజకీయ సంకల్పం ద్వారా మాత్రమే సాధ్యమని లజ్జారిని వ్యాఖ్యానించారు.
నిర్బంధం ఎత్తివేయాలని, తలుపులు తెరవాలని, ప్రజలకు అవసరమైనవి గౌరవంగా, సురక్షితంగా వారికి అందే ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
కావాల్సిన స్థాయిలో మానవతాసాయాన్ని ఎయిర్‌డ్రాప్స్ ఎప్పుడూ పంపిణీ చేయలేవని ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీకి చెందిన సియారన్ డొనెలీ అన్నారు.
భూమ్మీద నుంచి అందించే సాయానికి ఎయిర్‌డ్రాప్స్ ప్రత్యామ్నాయం కాదని జోర్డాన్ అధికారి చెప్పారు.
‘ప్రమాదకర ప్రాంతాల్లోకి ఆహార ప్యాకెట్లు’
గతంలో ప్రతి సీ-130 ఎయిర్‌క్రాఫ్ట్ ఒక ట్రిప్పులో 12,500 మీల్స్ అందించగలిగేది.
ఈ లెక్కన గాజాలోని 20 లక్షల మంది ప్రజల్లో ప్రతి ఒక్కరికీ ఒక పూట భోజనం అందించాలంటే 160కిపైగా విమానాలు అవసరమవుతాయని బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రతినిధి జోయ్ ఇన్‌వుడ్ అంచనా వేశారు.
గతంలో నిర్వహించిన ఎయిర్‌డ్రాప్స్ సమయంలో గందరగోళం తలెత్తిందని, నిస్పృహతో ఉన్న ప్రజలు ఆహార పొట్లాలు అందుకునేందుకు ఒకరితో ఒకరు పోటీపడి పెనుగులాడుకున్నారని ఇస్తాంబుల్ నుంచి రిపోర్టు చేసిన బీబీసీ గాజా ప్రతినిధి రష్దీ అబువాలోఫ్ చెప్పారు.
కొన్ని ఆహార పదార్థాల ప్యాకెట్‌లు ప్రమాదకర ప్రాంతాల్లో పడ్డాయని గాజా జర్నలిస్ట్ ఇమాద్ కుడాయా చెప్పారు.
ఆకాశం నుంచి జారవిడిచే ప్యాకేజీల్లో ఎక్కువభాగం పడే చోటకు మనం వెళ్తే..మనల్ని మనం పెద్ద ప్రమాదంలో పెట్టుకున్నట్టే అని ఆయన అన్నారు. అవన్నీ ఇజ్రాయెల్ ఖాళీ చేయించిన ప్రాంతాలని, అది ప్రమాదకరమైనదని చెప్పారు.
ఎయిర్‌డ్రాప్స్ జారవిడిచిన మానవతాసాయం ఇజ్రాయెల్ ప్రమాదకర పోరాట జోన్లుగా ప్రకటించిన చోట పడినట్టు బీబీసీ వెరిఫైకి ఆధారాలు లభించాయి.
‘భారీగా సాయమందించాలి’
మిలటరీ ఆపరేషన్‌కు ఇజ్రాయెల్ ఇచ్చిన విరామం ఈ విపత్తు లాంటి పరిస్థితి తీవ్రతను కాస్త తొలగించి సాధారణ స్థితికి తేవడానికి లభించిన అవకాశమని యునిసెఫ్ వ్యాఖ్యానించింది. ట్రక్ కాన్వాయ్‌లు నలువైపులా వెళ్లడానికి వీలుగా మరిన్ని మానవతా కారిడార్లను తక్షణమే ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది.
యూఎన్‌ఆర్‌డబ్ల్యుఏ ప్రతినిధి జూలియట్ టౌమా ఎయిర్‌డ్రాప్స్‌ను ఖండించారు. తమ సంస్థ సహకారం లేకుండా మానవతాసాయం పంపిణీ ప్రభావవంతంగా ఉండదని, తమకు మంచి నెట్‌వర్క్ ఉందని, అందరినీ చేరుకోగలుగుతామని, ప్రజలకు తమపై విశ్వాసం ఉందని ఆమె అన్నారు.
ఆకలితో ఉన్న ప్రజలకు ఏ మాత్రం ఆలస్యం కాకుండా అందేందుకు వీలుగా మానవతా సాయాన్ని భారీ ఎత్తున చేపట్టాలని డబ్ల్యుఎఫ్‌పీ సూచించింది.
దాడులకు విరామం ప్రకటించడం, ఎయిర్‌డ్రాప్స్ ద్వారా సాయమందించడం సరిపోదని మెడికల్ చారిటీ మెడిసిన్స్ శాన్స్ ఫ్రాంటియర్స్ కూడా హెచ్చరించింది. పంపిణీ జాబితా తయారుచేయాలని, దీనివల్ల తమ పార్శిల్ తమకు అందుతుందని ప్రతి ఒక్కరికీ తెలుస్తుందని సూచించింది.
'ఆకలి చావులు లేవు'
గాజాలో ఆకలిచావులు ఉన్నాయన్న ఆరోపణలు అబద్ధమని, ఇజ్రాయెల్ అలాంటి పరిస్థితులను సృష్టించలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు.
''గాజాలో ఆకలిచావులు సృష్టించాలన్న విధానం లేదు. అక్కడ ఆకలి చావులు లేవు'' అని ఆదివారం(జులై 27)న జెరూసలేంలో ఆయన చెప్పారు.
అంతర్జాతీయ చట్టం అవసరమైన స్థాయిలో అమలు చేసే పరిస్థితులను ఇజ్రాయెల్ కల్పించిందని ఆయన తెలిపారు. మానవతాసాయాన్ని హమాస్ దొంగలించి, దాన్ని సరఫరా చేయడం లేదని ఇజ్రాయెల్‌పై ఆరోపణలు చేస్తోందని నెతన్యాహు అన్నారు.
ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది.
మరోవైపు అమెరికా అందించే నిత్యావసరాలను వ్యవస్థీకృతంగా హమాస్ దోచుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఇటీవలి తన అంతర్గత నివేదికలో తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)