You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దివ్య దేశ్‌ముఖ్: ఫిడే మహిళల చెస్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో కోనేరు హంపిపై గెలిచిన యువ ప్లేయర్
- రచయిత, మనోజ్ చతుర్వేది
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫిడే ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్ అవతరించింది. జార్జియాలోని బటుమిలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కే చెందిన కోనేరు హంపిని ఓడించి, ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది దివ్య దేశ్‌ముఖ్.
ఇద్దరు క్రీడాకారిణుల మధ్య జరిగిన క్లాసికల్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. శని, ఆదివారాల్లో జరిగిన క్లాసికల్ మ్యాచ్‌లలో దివ్య దేశ్‌ముఖ్‌ను గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ముందంజ వేయనివ్వలేదు.
క్లాసికల్ మ్యాచ్ 1-1 పాయింట్లతో డ్రాగా ముగిసింది. ఫైనల్స్‌లో మాత్రం దివ్య ఆధిక్యం సాధించింది.
19 ఏళ్ల దివ్య ఫిడే మహిళల ప్రపంచ కప్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.
ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించడం ఇది కేవలం రెండోసారే.
కోనేరు హంపి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండో ఎడిషన్ విజేత .
టైటిల్ ఫైట్: రెండు తరాల మధ్య పోరు
హంపి, దివ్య మధ్య జరిగిన టైటిల్ మ్యాచ్ రెండు తరాల మధ్య పోరాటం వంటిది. ఎందుకంటే, ఫైనల్స్ ప్రత్యర్థులైన హంపి వయసు 38 సంవత్సరాలు, దివ్య వయసు 19 సంవత్సరాలు.
హంపి 2014లో వివాహం చేసుకున్నారు, ఆమెకు 2017లో కూతురు అహనా జన్మించారు. పాప పుట్టిన తరువాత రెండేళ్ల పాటు చదరంగం పోటీలకు హంపి దూరంగా ఉన్నారు.
హంపి సుదీర్ఘకాలంగా చదరంగం ఆడుతున్నారు. కూతురు పుట్టిన తర్వాత ఆమె గొప్ప విజయాలను సాధించారు. 2019, 2024లో ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిళ్లను గెలుచుకున్నారు హంపి. ఇప్పుడు ఫిడే ప్రపంచ కప్ టైటిల్ పోరులో దివ్య దేశ్‌ముఖ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఫామ్ లేమి కారణంగా రిటైర్ కావాలని అనుకున్నప్పుడల్లా, ఏదో ఒక అద్భుతం జరుగుతోందని, ఆట కొనసాగించేలా ప్రేరేపిస్తోందని హంపి చెప్పారు.
టైటిల్స్ దక్కకపోవడంతో గత సంవత్సరం (37 సంవత్సరాల వయస్సులో) రిటైర్మెంట్ గురించి ఆలోచించడం ప్రారంభించారామె. కానీ, ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత ఆట కొనసాగించాలని నిర్ణయించుకున్నారు హంపి.
పోటాపోటీగా
కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ ఇద్దరూ సెమీ-ఫైనల్స్‌లో చైనా ప్రత్యర్థులను ఓడించారు. కానీ, టోర్నీలో దివ్యతో పోలిస్తే హంపి ప్రయాణం కఠినంగా సాగింది.
హంపి ప్రస్తుత ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్. కానీ, ప్రారంభ ర్యాపిడ్ గేమ్‌లలో ఆశించినంతగా రాణించలేకపోయారామె, చైనాకు చెందిన టింగ్జీ లీ చేతిలో వెనుకబడ్డారు. చివరి ర్యాపిడ్ గేమ్‌ను హంపీ గెలిచి మ్యాచ్‌ను బ్లిట్జ్ గేమ్‌కు తీసుకెళ్లారు, వీటిని టైబ్రేకర్స్ అంటారు. హంపి ఈ మ్యాచ్‌లలో పూర్తి విశ్వాసంతో ఆడారు, రెండు గేమ్‌లను గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్నారు.
ఫైనల్‌కు చేరుకున్న తర్వాత, కోనేరు హంపి మాట్లాడుతూ "ఇది భారత చెస్‌కు అత్యంత సంతోషకరమైన క్షణం. ఈ ప్రపంచ కప్‌లో దివ్య చాలా బాగా రాణించారు. కాబట్టి, ఫైనల్ చాలా కఠినంగా ఉండబోతోంది" అని అన్నారు.
"టింగ్జీతో జరిగిన రాపిడ్ చెస్ తొలి మ్యాచ్ చాలా కఠినంగా సాగింది. అందుకే, నేను బాగా ఆడలేకపోయాను. కానీ, బ్లిట్జ్ గేమ్‌లలో పూర్తి విశ్వాసంతో ఆడాను. ఆ సమయంలో ప్రతి సవాల్‌కు నా దగ్గర సమాధానం ఉంది" అని హంపి అన్నారు.
దివ్య రికార్డులు
దివ్య చెస్ ప్రయాణంలో రికార్డులకు కొదవలేదు. ఆమె ఏడు సంవత్సరాల వయసులో 2013లో మహిళల ఫిడే మాస్టర్‌గా నిలిచారు, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు.
ఫిడే ప్రపంచ కప్‌లో ఫైనల్స్‌కు చేరిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.
అంతేకాదు, క్యాండిడేట్స్ టోర్నమెంట్ 34 ఏళ్ల చరిత్రలో టోర్నీకి అర్హత సాధించిన అతి పిన్న వయస్కురాలు దివ్య. ఆమె గ్రాండ్‌మాస్టర్ నార్మ్ కూడా పూర్తి చేశారు. ఈ విజయంతో గ్రాండ్‌మాస్టర్ కూడా అయ్యింది.
ఇలా గ్రాండ్‌మాస్టర్ అయిన నాలుగో భారతీయ మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది దివ్య.
దివ్య కంటే ముందు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి రమేష్‌బాబులు గ్రాండ్‌మాస్టర్‌లు అయ్యారు.
అనుకోకుండా చెస్ క్రీడాకారిణిగా..
అనుకోకుండా చెస్ క్రీడాకారిణి అయినట్లు దివ్య చెప్పారు.
"మా అక్క బ్యాడ్మింటన్ ఆడేది, నా తల్లిదండ్రులు ఆమెతో వెళ్లేవారు. నాకు నాలుగైదేళ్ల వయసు వచ్చాక నేను కూడా వెళ్లడం ప్రారంభించాను. బ్యాడ్మింటన్ ఆడటానికి ప్రయత్నించాను. కానీ, కాక్ నెట్ దాటి కూడా వెళ్లలేకపోయింది. అదే హాల్‌లో చెస్ కూడా ఆడేవారు అందుకే, నేను దాన్ని చూడటం ప్రారంభించాను" అని దివ్య గుర్తుచేసుకున్నారు.
చెస్ చూడటం వల్ల దివ్యకు ఆ గేమ్‌పై ఆసక్తి ఏర్పడింది. దీంతో, తండ్రి జితేంద్ర, తల్లి నమ్రతలు నాగ్‌పూర్‌లోని వారి ఇంటికి సమీపంలో ఉన్న చెస్ అకాడమీలో దివ్యను చేర్చారు.
దివ్య కేవలం రెండు సంవత్సరాల శిక్షణలోనే తన ప్రతిభను చూపించడం ప్రారంభించారు. 2012లో పుదుచ్చేరిలో జరిగిన జాతీయ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-7 టైటిల్‌ను గెలుచుకున్నారు. ఆ తర్వాత, వెనక్కి తిరిగి చూడలేదు. క్రమంగా అంతర్జాతీయ చెస్‌లో విజయాలు సాధించడం ప్రారంభించారు.
2020 నాటికి, భారత ఒలింపియాడ్ జట్టులో రెగ్యులర్ సభ్యురాలిగా మారారు దివ్య. ఆమెకు విశ్వనాథన్ ఆనంద్ చిట్కాలూ అందించారు.
2023లో 'మహిళా గ్రాండ్‌మాస్టర్ టైటిల్(డబ్ల్యూజీఎం)'ను గెలుచుకున్నారు దివ్య. ఆ తర్వాత, ఇంటర్నేషనల్ మాస్టర్(ఐఎం) టైటిల్ గెలిచారు. ఇప్పుడు ఆమె 'గ్రాండ్‌మాస్టర్' అంచున నిలిచారు.
దివ్య గురించి విశ్వనాథన్ ఆనంద్ మాట్లాడుతూ "ఇది చాలా పెద్ద విజయం. నిజం ఏమిటంటే ఆమె జైనర్, టాన్ జోంగ్జీ, హారిక వంటి గొప్ప ప్లేయర్లను ఓడించారు. దివ్య అపారమైన సామర్థ్యం ఉన్న క్రీడాకారిణి. ఇది ఊహించనిది కాదు. ప్రజలు ఆమె నుంచి దీనిని ఆశించారు, ఆమె దానిని నిరూపించారు" అని అన్నారు.
భారత చెస్ స్వర్ణయుగం
గత కొన్ని సంవత్సరాలుగా భారత చెస్ జోరు పెరుగుతోంది. విశ్వనాథన్ ఆనంద్ చాలాసార్లు ప్రపంచ టైటిళ్లను గెలుచుకొని చెస్ ప్రపంచంలో భారత ఖ్యాతిని పెంచాడన్నది నిజం.
గత సంవత్సరం భారత ప్లేయర్స్ డి గుకేష్, అర్జున్ ఎరిగేసి, ఆర్ ప్రజ్ఞానంద, అరవింద్‌లు ప్రపంచ చెస్ టాప్ టెన్ ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించారు.
భారత్ మొదటిసారి చెస్ ఒలింపియాడ్‌లో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది. అంతేకాదు, ఆనంద్ తర్వాత ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన రెండో భారత ప్లేయర్‌గా గుకేష్ నిలిచారు. ఇప్పుడు దివ్య ఫిడే విమెన్ వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)