మాల్దీవులు: ప్రపంచంలోనే ఈ అతిచిన్న ముస్లిం దేశం భారత్‌కు ఎందుకంత కీలకం, 4 కారణాలు

    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మాల్దీవులు 1200 దీవుల సమూహం. భౌగోళికంగా చూస్తే, ప్రపంచంలో అత్యంత చెల్లాచెదురుగా (అక్కడో దీవి, ఇక్కడో దీవి విసిరేసినట్లుగా) కనిపించే దేశం మాల్దీవులు.

ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపానికి ఫెర్రీలో వెళ్లాల్సి ఉంటుంది. మాల్దీవుల జనాభా కేవలం 5 లక్షల 21వేలు.

1965లో మాల్దీవులు బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. స్వతంత్రం పొందిన మూడు సంవత్సరాల తర్వాత రాజ్యాంగబద్ధ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మాల్దీవుల రాజకీయాల్లో, ప్రజల జీవితాల్లో ఇస్లాం ముఖ్యపాత్ర పోషించింది. 2008లో ఇస్లాం ఆ దేశ మతంగా మారింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న ఇస్లామిక్ దేశం మాల్దీవులు.

60వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న (జూలై 26) మాల్దీవుల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. మాల్దీవుల్లో మోదీ పర్యటించడం ఇది మూడోసారి.

2023లో మొహమ్మద్ ముయిజ్జు అధ్యక్షుడైన తర్వాత మాల్దీవులను సందర్శించిన తొలి విదేశీ నాయకుడు నరేంద్ర మోదీ. మాల్దీవుల్లో ముయిజ్జు అధికారంలోకి రావడంలో భారత వ్యతిరేక ప్రచారం కూడా పాత్ర పోషించింది.

మాల్దీవుల గత ప్రభుత్వం 'ఇండియా ఫస్ట్' విధానాన్ని అనుసరించింది, కానీ ముయిజ్జు ఈ విధానానికి ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారు. చైనాతో సంబంధాలను మరింతగా పెంచారు.

7.5 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉన్న మాల్దీవులను దివాళా నుంచి కాపాడిన తర్వాత, ముయిజ్జు భారత్ విషయంలో తన వైఖరిని మార్చుకున్నారని వార్తా సంస్థ రాయిటర్స్ రాసింది. అధ్యక్షుడైన తర్వాత, ముయిజ్జు మొదట తుర్కియే, యూఏఈ, చైనాలను సందర్శించారు. ఆ తర్వాత, భారత్‌తో సంబంధాలను గాడిన పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.

భారత్‌పై మాల్దీవులు ప్రభుత్వం నుంచి చాలా దూకుడు ప్రకటనలు వస్తున్నప్పుడు కూడా, భారత్ అధికారిక ప్రకటనలలో సహనం, సంయమనం పాటించింది.

ఈ పరిస్థితులు గమనిస్తే, కేవలం ఏడున్నర బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన ఒక చిన్న దేశం విషయంలో భారత్ ఎందుకు అంత సంయమనం పాటించింది అనే ప్రశ్న తలెత్తుతుంది?

మాల్దీవులు ఉన్న ప్రదేశం ఆ దేశాన్ని ప్రత్యేకంగా మార్చింది. హిందూ మహాసముద్రంలోని ప్రధాన సముద్ర మార్గాలకు సమీపంలో మాల్దీవులు ఉన్నాయి.

హిందూ మహాసముద్రంలోని ఈ మార్గాల ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతుంది. గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు ఇదే మార్గం ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఈ పరిస్థితుల్లో భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు క్షీణించడం ఏ విధంగానూ మంచిది కాదు.

మాల్దీవులు ఒక ముఖ్యమైన సముద్ర మార్గం అని, ప్రపంచ వాణిజ్యంలో ప్రత్యేక పాత్ర పోషిస్తోందని బంగ్లాదేశ్‌లో భారత మాజీ హైకమిషనర్ వీణా సిక్రీ అన్నారు.

''భారత ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు ఈ మార్గం చాలా కీలకమైనది. ముఖ్యంగా, గల్ఫ్ దేశాల నుంచి భారత ఇంధన దిగుమతులు ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. మాల్దీవులతో మంచి సంబంధాలు దేశ ఇంధన భద్రతను కూడా నిర్ధరిస్తాయి. భారత్ సముద్ర నిఘాలో మాల్దీవుల సహకారం కూడా కీలకం'' అని సిక్రీ అన్నారు.

''మాల్దీవులు ఉన్న చోట ముఖ్యమైన సముద్ర మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలు పర్షియన్ గల్ఫ్ నుంచి తూర్పు ఆసియా వరకు వెళ్తాయి. వాణిజ్యం కోసం భారత్ కూడా ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంది'' అని థింక్ ట్యాంక్ ఓఆర్ఎఫ్‌లో సీనియర్ ఫెలో అయిన మనోజ్ జోషి విశ్లేషించారు.

మాల్దీవులు భారత్‌కు చాలా దగ్గరగా ఉన్నాయి. భారత్‌లోని లక్షద్వీప్ నుంచి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో, భారత ప్రధాన భూభాగం నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఇవి ఉన్నాయి.

''మాల్దీవులలో చైనా నౌకా స్థావరాన్ని నిర్మిస్తే, అది భారత్‌కు భద్రతాపరమైన సవాల్‌గా మారుతుంది. మాల్దీవులలో చైనా బలంగా మారితే, యుద్ధంలాంటి పరిస్థితుల్లో భారత్‌కు చేరుకోవడం చాలా సులభం అవుతుంది. మాల్దీవులలో చైనాకు అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మాల్దీవులలో నౌకా స్థావరాన్ని నిర్మించాలని చైనా భావిస్తోందన్న వాదనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జాగ్రత్తగా ఉండటం అవసరం'' అని మనోజ్ జోషి చెప్పారు.

''మాల్దీవులు ఇప్పటికీ భారత్‌కు సవాల్‌గానే ఉంది. ఆర్థిక పరిస్థితుల కారణంగానే నరేంద్ర మోదీని ముయిజ్జు ఆహ్వానించారు. మాల్దీవుల ప్రజాభిప్రాయం ఇప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారానే ముయిజ్జు గెలిచారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ముయిజ్జు భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకున్నారు, తనకు తానుగా అనుకుని కాదు'' అని మనోజ్ జోషి అన్నారు.

చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మాల్దీవులు సంతకం చేసింది. చైనా ప్రతిష్టాత్మక ప్రణాళిక బెల్ట్ అండ్ రోడ్‌కు మాల్దీవులు బహిరంగంగా మద్దతు ఇస్తోంది.

హిందూ మహాసముద్రంలో చైనా బలోపేతం కావడాన్ని నివారించడంలో కూడా మాల్దీవులు కీలకం. మాల్దీవుల్లోని అనేక ముఖ్యమైన ప్రాజెక్టులలో భారత్ పెట్టుబడులు పెట్టింది. వీటిలో, గ్రేటర్ మాలె కనెక్టివిటీ ప్రాజెక్ట్ చైనాకు కౌంటర్‌గా భావిస్తున్నారు.

రక్షణ రంగంలో తమకు చైనా సాయం చేస్తోందని గత ఏడాది మార్చిలో మాల్దీవులు చెప్పింది. "మేము చైనాతో సంతకం చేసిన ఒప్పందం రక్షణపరమైన సాయాన్ని కూడా అందిస్తుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతాయి'' అని ఆ సమయంలో మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

మాల్దీవులలో చైనా మిలియన్ డాలర్ల విలువైన చైనా-మాల్దీవుల ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ నిర్మిస్తోంది. మాల్దీవులలో చైనా ఉనికి పెరగడం భారత భద్రతకు ముప్పు అని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. నిరుడు జనవరిలో, ముయిజ్జు చైనాలో పర్యటించారు. రెండు దేశాలూ 20 ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

''పర్షియన్ గల్ఫ్ నుంచి చమురు సురక్షితంగా వచ్చేందుకు వీలుగా అరేబియా సముద్రంలో సైనిక ఉనికిని చైనా కోరుకుంటోంది. మరోవైపు, మాల్దీవులు చైనాకు సులభమైన గమ్యస్థానంగా మారకూడదని భారత్ అనుకుంటోంది'' అని మనోజ్ జోషి అన్నారు.

''మే 10 తర్వాత, మాల్దీవుల్లో ఏ రూపంలోనూ భారత సైనికులు ఉండరు. యూనిఫాంలో అయినా, సామాన్య పౌరుల దుస్తుల్లో అయినా, భారతీయ సైనికులు ఇకపై మాల్దీవుల్లో ఉండరు. నేను పూర్తి విశ్వాసంతో ఈ విషయం చెబుతున్నా'' అని గత ఏడాది మార్చిలో ముయిజ్జు అన్నారు.

ముయిజ్జు గత ఏడాది జనవరి 13న చైనాను సందర్శించారు. ఆ తర్వాత భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. భారత్ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారు.

''మాల్దీవులు ఒక చిన్న దేశం కావొచ్చు. కానీ, అది మమ్మల్ని బెదిరించడానికి ఎవరికీ లైసెన్స్ కాదు'' అని భారత్‌ను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. దీనికి ప్రతిస్పందనగా, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, బెదిరింపులకు పాల్పడే ఏ దేశమూ 4.5 బిలియన్ డాలర్ల విలువైన సాయం అందించదు అన్నారు.

''మాల్దీవులు భారత్‌‌ను ఇష్టపడదు. అయితే, అది భద్రతా సవాల్‌గా మారకుండా చూసుకోవాలి" అని థింక్ ట్యాంక్ అనంత సెంటర్ సీఈవో ఇంద్రాణి బాగ్చి అన్నారు.

తూర్పు - పశ్చిమ దేశాల షిప్పింగ్ లైన్‌కు సమీపంలో ఉండటం వల్ల మాల్దీవులు చైనాకు కూడా చాలా ముఖ్యమైనవి. గల్ఫ్ నుంచి చైనాకు ఈ లైన్ ద్వారానే చమురు వస్తుంది. మాల్దీవులకు సమీపంలోని డియెగో గార్సియాలో అమెరికాకు ఒక ముఖ్యమైన నౌకా స్థావరం ఉంది.

1988లో రాజీవ్ గాంధీ సైన్యాన్ని పంపించి అబ్దుల్ గయూమ్ ప్రభుత్వాన్ని కాపాడారు. 2018లో మాల్దీవుల ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు, భారత్ నీటిని పంపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)