You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనపై అక్కడి ప్రజలు ఏమంటున్నారు?
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జూలై 25న రాజధాని మాలేకు వెళ్లనున్నారు. మాల్దీవుల్లో మోదీ పర్యటించడం ఇది మూడోసారి.
ఈ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా, అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. 2024 అక్టోబర్‌లో కుదిరిన ఒప్పందాల పురోగతి గురించి వీరిద్దరూ సమీక్షిస్తారు.
అనేక ఉమ్మడి ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారని కూడా మాల్దీవుల మీడియా రిపోర్ట్ చేసింది.
2023లో మాల్దీవులు అధ్యక్షుడిగా మొహమ్మద్ ముయిజ్జు గెలుపునకు, ఎన్నికల సమయంలో ఆయన నిర్వహించిన 'ఇండియా అవుట్' ప్రచారం బాగా ఉపయోగపడిందని భావిస్తారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత, భారత్ విషయంలో ముయిజ్జు చాలా దూకుడుగా వ్యవహరించారు. చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం గురించి మాట్లాడారు.
''మాల్దీవులు చిన్న దేశమే. కానీ, అది మమ్మల్ని బెదిరించడానికి ఎవరికీ లైసెన్స్ కాదు'' అని నిరుడు జనవరి 13న చైనా పర్యటన సందర్భంగా భారత్ పేరును ప్రస్తావించకుండా ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేశారు.
మాల్దీవుల అంతర్గత విషయాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని గతంలో ముయిజ్జు ఆరోపించారు.
కానీ, ఎన్నో ఆర్థిక సంక్షోభాలతో సతమతం అవుతున్న మాల్దీవులకు, వాటి నుంచి బయటపడేందుకు భారత్ సహాయపడింది. ఈ సహాయం పొందిన తర్వాత నుంచి భారత్ విషయంలో ముయిజ్జు దూకుడు తగ్గడం మొదలైంది.
మాల్దీవులకు రుణ చెల్లింపు గడువును భారత్ పొడిగించింది.
ఈ పర్యటనపై మాల్దీవుల ప్రజలు ఏమంటున్నారు?
రెండు దేశాల్లో ప్రభుత్వ స్థాయిలో అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, భారత్ గురించి మాల్దీవుల ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? మోదీ పర్యటన గురించి సోషల్ మీడియాలో ఎలా స్పందిస్తున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముస్లిం వ్యతిరేకి అంటూ జూలై 21న అబ్దుల్లా బిన్ మొహమ్మద్ ఇబ్రహీం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. తర్వాత ఆ పోస్టులను తొలగించారు. మాల్దీవుల్లోని సలఫ్ జమీయత్ అనే మత సంస్థ అధ్యక్షుడు అబ్దుల్లా బిన్ మొహమ్మద్ ఇబ్రహీం. ఈయనను ముయిజ్జు భార్య సాజిదా సోదరుడిగా పేర్కొంటూ అధాధు డాట్ కామ్ అనే వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది.
''మాల్దీవుల స్వాతంత్య్ర వేడుకల్లో మాల్దీవుల జెండా కంటే భారత జాతీయ పతాకాలే ఎక్కువ కనబడుతున్నాయి. మనల్ని చూసి భారతీయులు నవ్వుకుంటున్నారు'' అని హసన్ కురుసీ అనే యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
భారత పతాకంపై చర్చ
మాలేలో భారత జాతీయ జెండాను ఎగురవేసిన ఫోటోలను మిధువామ్ సౌద్ అనే యూజర్ షేర్ చేశారు.
''ఏ దేశాధినేత వచ్చినా, ఆ దేశ జాతీయ జెండాను మన రోడ్లపై ఎగురవేయడం సాధారణ ప్రోటోకాల్. మోదీని స్వాగతించేందుకు ఇలా చేశారు. ఇది సమస్య కాదు. కానీ, మాల్దీవుల స్వాతంత్య్ర దినోత్సవం నాడు వేరే దేశ జాతీయ జెండాను ఎగురవేస్తే అది అసాధారణం. ఆరోజున రోడ్లపై మాల్దీవుల జెండా మాత్రమే కనిపించాలి. భారత్, చైనా లేదా మరే ఇతర దేశం జాతీయ జెండా ఉండకూడదు'' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
"మాల్దీవులు మొదట్లో చైనా, గల్ఫ్ దేశాలను భారత్‌కు ప్రత్యామ్నాయంగా చూడటం ప్రారంభించింది. కానీ, త్వరలోనే వాస్తవాన్ని గ్రహించింది. ముయిజ్జూకు భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఈ ప్రాంతంలో మాల్దీవులకు అతిపెద్ద వాణిజ్య, అభివృద్ధి భాగస్వామి భారత్. ముయిజ్జు అధ్యక్షుడు అయ్యాక భారత్ అనేక స్థాయిల్లో ఆర్థిక సహాయం అందించింది'' అని జర్నలిస్ట్ ఇబ్రహీమ్ మాహిల్ మొహమ్మద్ గత నెలలో ఓఆర్‌ఎఫ్ వెబ్‌సైట్‌లో ఒక కథనం రాశారు.
''భారత్‌ను ప్రేమించకు, అలాగే శత్రువుగా మారకు''
ప్రస్తుతం మాల్దీవులు, భారత్ మధ్య రాజకీయ స్థాయిలో అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, అక్కడి ప్రజలకు భారత ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం లేదా? అని అనంత సెంటర్ సీఈవో ఇంద్రాణీ బాగ్చీని బీబీసీ ప్రశ్నించింది. విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపై పనిచేసే థింక్ ట్యాంక్ అనంత సెంటర్.
అయితే, రాజకీయ స్థాయిలోనూ అంతా సవ్యంగా ఏమీ లేదని ఇంద్రాణి బాగ్చి అన్నారు.
''అధికారంలోకి వచ్చాక ముయిజ్జూకు ఇండియా అవుట్ ప్రచారం ద్వారా పెద్దగా ప్రయోజనం కలగలేదనేది నిజం. ఈ ప్రాంతంలో భారత్ ఒక పెద్ద శక్తి. మీరు అమెరికా పక్కనే నివసిస్తూ అమెరికాతో శత్రుత్వం కలిగి ఉండటం భరించలేరు కదా. ముయిజ్జూకు భారత్‌పై ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. కానీ, శత్రుత్వం మాత్రం ఉండకూడదు. మాల్దీవులు ఒక ఇస్లామిక్ దేశం. అది ప్రధాని మోదీని, భారత్‌ను భిన్నంగా చూస్తుంది. మనం అంతా ఒకే భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్నాం. భారత్‌తో బాగుండాలని మాల్దీవులకు కూడా అర్థమైంది.
మన పొరుగు దేశాలకు మనల్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. కానీ, వారు మనతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం ముఖ్యం. కలిసి జీవించాలనుకుంటే, కొన్ని విభేదాలను పట్టించుకోకూడదు. బంగ్లాదేశ్‌తోనూ మన సంబంధాలు బాగా లేవు. కానీ వారి ఫైటర్ జెట్ కూలిపోయిన తర్వాత మనం ఒక వైద్య బృందాన్ని అక్కడికి పంపాం'' అని ఇంద్రాణి వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)