You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏఐ కారణంగా టెక్ ఉద్యోగాల కోత మధ్య తరగతి ప్రజల కలలకు ఆటంకం కానుందా?
- రచయిత, నిఖిల్ ఇనాందార్
- హోదా, బీబీసీ న్యూస్
- 12 వేలమంది ఉద్యోగులను తొలగిస్తామని టీసీఎస్ ప్రకటన
- ఈ తొలగింపు టీసీఎస్ మొత్తం ఉద్యోగులలో 2 శాతానికి సమానం
- ఏఐ కారణంగానే ఉద్యోగాల తొలగింపు?
- 2026 నాటికి ఏఐ నైపుణ్యాలున్నవారు 10 లక్షలమంది అవసరం
- పుంజుకోని తయారీ రంగం, కుదేలవుతున్న సేవల రంగం దేనికి సంకేతం?
భారత ప్రతిష్ఠాత్మక సాఫ్ట్‌వేర్ పరిశ్రమ పరీక్షాకాలాన్ని ఎదుర్కొంటోంది.
ప్రైవేటు రంగంలో దేశంలోనే అతిపెద్ద ఉద్యోగకల్పన కంపెనీ, ఐటీసేవల అతిపెద్ద కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), మధ్యస్థ, ఉన్నతస్థాయి మేనేజ్‌మెంట్ విభాగాల్లో 12వేల ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. దీంతో సంస్థ మొత్తం ఉద్యోగులలో 2 శాతం తగ్గనున్నారు.
ఈ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలో 5లక్షలకుపైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 283 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 2,450 కోట్లు) సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో వాణిజ్య ధోరణికి ఈ కంపెనీని ఓ మార్గదర్శిగా భావిస్తుంటారు.
దేశంలో వైట్‌కాలర్ ఉద్యోగాలకు ఈ కంపెనీ వెన్నెముకగా నిలిచిందని చెప్తారు.
కంపెనీని ''భవిష్యత్తుకు సిద్ధం'' చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీసీఎస్ వెల్లడిచింది. సంస్థ సంప్రదాయ వ్యాపార నమూనాను కుదిపేస్తున్న పరిణామాల మధ్య కొత్త రంగాలలో పెట్టుబడులు పెట్టడం, విస్తృతస్థాయిలో కృత్రిమమేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) ప్రవేశపెట్టడం ఈ నిర్ణయానికి కారణాలుగా పేర్కొంది.
టీసీఎస్ వంటి కంపెనీలు దశాబ్దాలుగా తక్కువ జీతానికి పనిచేసే నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ఆధారపడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఖాతాదారులకు తక్కువ ధరకు సాఫ్ట్‌వేర్‌ని తయారుచేసేవి. అయితే ఇప్పుడీ నమూనా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఒకవైపు కృత్రిమ మేధ అనేక పనులను ఆటోమెటిక్‌గా చేయడం ద్వారా ఖర్చులు తగ్గించగా, మరోవైపు ఖాతాదారులు కేవలం మానవ వనరులపై పొదుపు మాత్రమే కాకుండా మరింత సృజనాత్మక, సరికొత్త పరిష్కారాలను కోరుతున్నారు.
‘‘తగిన పునఃశిక్షణ, పునర్‌నియామక చర్యలు అనేకం కొనసాగుతున్నాయి’’ అని టీసీఎస్ ఓ ప్రకటనలో తెలిపింది.
‘‘ఉద్యోగులను సమర్థంగా వినియోగించుకునే చర్యలలో భాగంగా టీమ్‌లీడర్లను తొలగిస్తూ, నిజంగా పనిచేసే ఉద్యోగులను కొనసాగించే దిశగా ఐటీ కంపెనీలు నడుస్తున్నాయి’’ అని స్టాఫింగ్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ సీఇఓ నీతి శర్మ బీబీసీతో చెప్పారు.
‘‘కృత్రిమమేధ(ఏఐ), క్లౌడ్, డేటా సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందిన సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు గణనీయంగా పెరిగాయి. కానీ అదేస్థాయిలో ఉద్యోగాలు కోల్పోతున్నారు కూడా’’ అని ఆమె వివరించారు.
దేశీయ సాఫ్ట్‌వేర్ రంగంలో నైపుణ్యాల అసమతుల్యత తీవ్రంగా ఉందనే విషయాన్ని టీసీఎస్ ప్రకటన వెల్లడిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్పాదకత వేగంగా పెరగడానికి జనరేటివ్ ఏఐ దోహపడుతోంది. ‘‘ఈ సాంకేతిక పరివర్తన వల్ల సంస్థలు తమ ఉద్యోగ తీరును తిరిగి పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులను ఏ విధంగా కొత్త అవసరాలకు తగిన విధంగా నియమించుకోవాలో విశ్లేషించుకోవాల్సి వస్తోంది’’ అని ‘గ్రాంట్ థారంటన్ భారత్’కు చెందిన ఆర్థికవేత్త రిషి షా బీబీసీకి చెప్పారు.
ప్రాంతీయ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ అంచనా ప్రకారం భారతదేశానికి 2026 నాటికి పదిలక్షలమంది కృత్రిమ మేధ నిపుణుల అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న ఐటీ ఉద్యోగులలో 20శాతం మందికి మాత్రమే ఏఐకు తగిన నైపుణ్యాలున్నాయి.
భవిష్యత్తులో ఏఐను ఉపయోగించేందుకు అవసరమైన కొత్త నైపుణ్యాల కోసం టెక్ కంపెనీలు పెట్టే ఖర్చు భారీగా పెరిగింది. అయితే తగిన నైపుణ్యాలు లేనివారు ఇంటిదారి పట్టాల్సి వస్తోంది.
టీసీఎస్ ప్రకటన దేనికి ప్రతిబింబం?
ఏఐ ప్రవేశంతో ఏర్పడిన నిర్మాణాత్మక మార్పులకు తోడు, భారత ఐటీ రంగం ఎదుర్కొంటున్న విస్తృత స్థాయి వృద్ధి సవాళ్లను టీసీఎస్ ప్రకటన ప్రతిబింబిస్తోందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జెఫ్రీస్ విశ్లేషించింది.
‘‘పరిశ్రమ మొత్తానికిగాను 2022 ఆర్థిక సంవత్సరం నుంచి నికర నియామకాలు చాలా బలహీనంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం, ఐటీ సేవలపై డిమాండ్ అంచనాలు నిరంతరంగా తగ్గుతుండటమే’’ అని జెఫ్రీస్ ఒక నోట్‌లో పేర్కొంది.
భారతదేశపు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సగానికి పైగా ఆదాయం అమెరికా నుంచే వస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్‌ల వల్ల ఈ రంగంపై ప్రభావం పడింది.
వాస్తవానికి ఈ టారిఫ్‌లు ప్రధానంగా భౌతిక వస్తువులపై వర్తించినప్పటికీ, ఆర్థిక అస్థిరతను పరిగణలోకి తీసుకుంటూ, అమెరికా కంపెనీలు ఐటీ సేవలపై వ్యయాన్ని తాత్కాలికంగా తగ్గించుకుంటున్నాయి, లేదా తరలింపు వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నాయి అని నిపుణులు చెబుతున్నారు.
ఏఐ వినియోగం పెరిగేసరికి అమెరికా కంపెనీలు తక్కువ ఖర్చుతో సేవలందించమని ఒత్తిడి తెస్తున్నాయని, దీంతో ఉద్యోగులపై ఆధారపడి పనిచేసే భారత ఐటీ సంస్థలు, తక్కువ మందితో ఎక్కువ పని చేయాల్సిన పరిస్థితికి లోనవుతున్నాయని జెఫ్రీస్ అంటోంది.
ఈ మార్పుల ప్రభావం ఒకప్పుడు ఐటీ బూమ్ కేంద్రాలుగా ఉన్న బెంగళూరు, హైదరాబాద్, పుణే నగరాల్లో స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఓఅంచనా ప్రకారం, గత ఏడాది ఈ రంగంలో 50,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
భారతదేశంలోని ప్రసిద్ధ ఆరు ఐటీ సంస్థలలో కలిపి, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో నికర ఉద్యోగ నియామకాలు 72 శాతం వరకు తగ్గాయని మరో నివేదిక పేర్కొంది.
వృద్ధిపై సేవలరంగం చూపే ప్రభావమేంటి?
ఈ పరిణామాలన్నీ భారత స్థూల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశంలో ప్రతి ఏడాది ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న లక్షలాది మంది యువ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించడంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తడబడుతోంది.
మానుఫ్యాక్చరింగ్ రంగం బలహీనంగా ఉండటంతో, 1990లలో భారత్‌ను ‘‘ప్రపంచ బ్యాక్ ఆఫీసు’’గా నిలిపిన సాఫ్ట్‌వేర్ కంపెనీలే ప్రధాన ఉపాధి మార్గంగా మారాయి. ఈ కంపెనీల వృద్ధి వల్ల, కొత్త మధ్యతరగతి రూపుదిద్దుకుని, నగరాల అభివృద్ధికి, వాహనాలు, ఇళ్ల డిమాండ్ పెరగడానికి దోహదపడింది.
కానీ ఇప్పుడు, స్థిరమైన, బాగా వేతనం వచ్చే ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుండటంతో, సేవల ఆధారిత ఆర్థిక వృద్ధి మీదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కొద్ది సంవత్సరాల క్రితం వరకూ, భారత ఐటీ దిగ్గజాలు ఏటా దాదాపు 6 లక్షల కొత్త గ్రాడ్యుయేట్లను నియమించేవి. కానీ గత రెండేళ్లలో, ఆ సంఖ్య బాగా పడిపోయి సుమారు 1.5 లక్షల దాకా తగ్గిందని టీమ్ లీజ్ డిజిటల్ తెలిపింది.
ఇతర రంగాలైన ఫిన్‌టెక్ స్టార్టప్‌లు, జీసీసీలు (గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు) – అంటే బహుళజాతి కంపెనీల ఐటీ, ఆర్థిక, ఆర్‌అండ్‌డి లాంటి సహాయ కార్యకలాపాలకు సంబంధించిన విదేశీ కేంద్రాల వంటివి ఈ ఉద్యోగాలలో కొంత భాగాన్ని భర్తీ చేస్తున్నా, ‘‘దాదాపు 20-25 శాతం తాజా గ్రాడ్యుయేట్లకు ఏ ఉద్యోగం దొరకకపోవచ్చు" అని నీతి శర్మ అంటున్నారు.
‘‘జీసీసీలు, గతంలో ఐటీ సంస్థలు చేసిన నియామకాల స్థాయిని ఎప్పటికీ చేరలేవు’’ అంటారు ఆమె.
ఈ మార్పుల వల్ల వచ్చే ఆర్థిక ప్రభావాల గురించి భారతదేశంలో పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.
‘‘ఐటీ రంగం కుదించడం వల్ల అనుబంధ సేవలు, రంగాలు దెబ్బతింటాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఖరీదైన వస్తువుల వినియోగంపై తీవ్ర ప్రభావం పడుతుంది’’ అని దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన డి. ముత్తుకృష్ణన్ ‘ఎక్స్’ ఖాతాలో రాశారు.
కొద్ది నెలల క్రితం, ఆటంబర్గ్ అనే మోటార్ టెక్నాలజీ కంపెనీ వ్యవస్థాపకుడు అరిందంపాల్ ‘‘ప్రస్తుతం ఉన్న వైట్ కాలర్ ఉద్యోగాల్లో 40–50 శాతం మాయమయ్యే అవకాశముంది. ఇది భారత మధ్యతరగతి క్షీణించడానికి దారి తీస్తుంది. వినియోగ కేంద్రిత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది’’ అని లింక్డెన్‌లో రాశారు.
ఏఐ విప్లవం వల్ల ఏర్పడుతున్న ఈ విస్తృతమైన గందరగోళానికి భారత టెక్ దిగ్గజాలు ఎంత వేగంగా అనుగుణంగా మారతాయన్నదే, దేశం టెక్నాలజీ శక్తిగా తన స్థానం నిలబెట్టుకోగలదా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. అదే విధంగా, దేశపు వృద్ధిని ముందుకు నడిపించే మధ్య తరగతి వినియోగ సామర్థ్యం కొనసాగుతుందా లేదా అన్నదీ ఇదే నిర్ణయించనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)