You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
కమ్యూనిస్టు నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
సురవరం సుధాకర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు ఉనారు. సురవరం మృతిపై సీపీఐ సంతాపం వ్యక్తంచేసింది.
పేద ప్రజలు,కార్మికుల సంక్షేమం కోసం ఆయన తన జీవితం మొత్తాన్ని అంకితం చేశారని సీపీఐ జాతీయనాయకులు డి.రాజా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మానవత్వం, అంతులేని నిబద్ధత, సీపీఐ, లెఫ్ట్ ఉద్యమం పట్ల జీవితమంతా అంకితభావం చూపిన వ్యక్తిగా ఆయన గుర్తుండిపోతారని రాజా అన్నారు.
మూడుసార్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా
సురవరం సుధాకర్ రెడ్డి 2012 నుంచి 2019వరకు సీపీఐ ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయల స్థాయికి ఎదిగారు. మూడుసార్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
సుధాకర్ రెడ్డి సొంతూరు ఉమ్మడి మహబూబ్‌నగర జిల్లాలోని ఉండవల్లి మండలం కంచుపాడు.
1942లో జన్మించిన ఆయన విద్యార్థి దశనుంచే కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారు.
1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, తర్వాత జిల్లా కార్యదర్శిగా, 1964లో కాలేజ్ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
1967లో ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్‌బీ పూర్తిచేశారు.
1970లో ఏఐఎస్ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడయ్యారు. 1974 నుంచి 1984వరకు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు.
1998లో నల్గొండ ఎంపీగా గెలిచారు. 2000లో ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 2004లో రెండోసారి ఎంపీ అయిన సురవరం 2012లో జరిగిన సీపీఐ జాతీయ మహాసభలలో ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.
దేశం గొప్ప ప్రజాస్వామికవాదిని కోల్పోయింది: సీఎం రేవంత్ రెడ్డి
సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన దేశ రాజకీయాల్లో ముఖ్యంగా వామపక్ష రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని, ఆయన మరణంతో దేశం గొప్ప ప్రజాస్వామికవాదిని కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో నివాళులర్పించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)