స్పోర్ట్స్ కామెంటేటర్, ప్రజెంటర్ కావడం ఎలా?

    • రచయిత, జస్పాల్ సింగ్
    • హోదా, బీబీసీ జర్నలిస్టు

రవిచంద్రన్ అశ్విన్ మొదటిబాల్ వేశాడు. స్టంప్‌లకు ఎదురుగా బాల్ దూసుకువెళ్తోంది. స్టీవ్ స్మిత్ కాస్త ముందుకు వచ్చాడు. బ్రిలియంట్‌ డ్రైవ్ అది. బౌండరీ దిశగా బాల్ దూసుకువెళ్తోంది... అది ఫోర్.

ఇది రేడియో కామెంటరీ స్టైల్. మ్యాచ్‌ ఎలా జరుగుతోందో ఆడియెన్స్‌కు ఇలానే చెబుతుంటారు. నేరుగా స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్నామనే అనుభూతిని కలిగిస్తారు.

టీవీలో కామెంటరీ ఇంకాస్త భిన్నంగా ఉంటుంది. టీవీ లేదా రేడియో ఏదైనా గేమ్‌లో కామెంటరీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు స్టేడియంలో కాకుండా మరెక్కడైనా మ్యాచ్ చూస్తే, కామెంటరీ లేకుండా దీన్ని ఊహించుకోవడం కష్టం.

నేటి డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రపంచంలో ఎక్కడ చూసినా లైవ్ కామెంటరీలే కనిపిస్తున్నాయి. మ్యాచ్‌ ఎలా జరుగుతోందో చెప్పేందుకు మంచిమంచి పదాలతో కామెంటేటర్లు కనికట్టు చేస్తుంటారు.

ఎలా మొదలుపెట్టాలి?

భారత్‌తోపాటు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో భిన్నమైన స్పోర్ట్స్ లీగ్‌లను నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం భారత్‌లో నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముఖ్యమైనది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరిగే ఈ లీగ్‌కు విశేష ప్రజాదరణ లభిస్తుంటుంది.

దీని తర్వాత రాష్ట్ర స్థాయుల్లోనూ చాలా లీగ్‌లు నిర్వహిస్తుంటారు.

క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ లీగ్‌లు భారత్‌లో స్పోర్ట్స్ పరిధిని మరింత పెంచాయి. దీంతో స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ ఇండస్ట్రీ కూడా నానాటికీ విస్తరిస్తోంది.

సాధారణంగా మాజీ క్రీడాకారులు ఎక్కువగా కామెంటేటర్లుగా కనిపిస్తుంటారు. అయితే, నేరుగా స్పోర్ట్స్‌ ఆడటంలో అనుభవం లేనప్పటికీ, లోతైన పరిజ్ఞానం ఉన్నవారు కూడా కామెంటేటర్లుగా కనిపిస్తుంటారు.

అర్హతలు ఏం ఉండాలి?

స్పోర్ట్స్ కామెంటేటర్ కావాలంటే కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. ముఖ్యంగా దీనికి ఉండాల్సిన అర్హతలపై స్పోర్ట్స్ కామెంటేటర్ రామన్ భానోత్‌తో బీబీసీ మాట్లాడింది.

స్పోర్ట్స్ కామెంటరీలో రామన్ భానోత్‌కు రెండు దశాబ్దాల అనుభవముంది. క్రికెట్ వరల్డ్ కప్, ఒలింపిక్స్, ఆసియా గేమ్స్‌తోపాటు కొన్ని జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లకు ఆయన కామెంటేటర్‌గా పనిచేశారు.

‘‘ఇక్కడ గేమ్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మనం కామెంటరీ ఇస్తున్న గేమ్ గురించి మనకు బాగా తెలుసుండాలి. ఒక్కో స్పోర్ట్స్ కామెంటరీ ఒక్కోలా ఉంటుంది’’ అని రామన్ అన్నారు.

ఇక్కడ రెండో ముఖ్యమైన అంశం భాష. ‘‘మన బుర్రలోని విషయాలను నేరుగా చెప్పడానికి మనకు భాషపై పట్టు ఉండాలి. దీనికి సంబంధించిన పదజాలం కూడా తెలుసుండాలి. అంతేకాదు, వీటిపై మనం పట్టుసాధించాలి’’ అని రామన్ చెప్పారు.

మూడో ముఖ్యమైన విషయం వాయిస్. ‘‘గేమ్ రిథమ్‌తో మీ స్వరం సమానంగా ఉండాలి. కొన్ని స్పోర్ట్స్‌కు స్వరం కాస్త తగ్గించి మాట్లాడాలి. ఉదాహరణకు టెన్నిస్‌ను తీసుకోండి. అక్కడ ప్లేయర్లు ఎలా ఆడుతున్నప్పటికీ మీరు స్వరాన్ని హెచ్చించకూడదు. అంతా లో పిచ్‌లోనే ఉండాలి’’ అని ఆయన వివరించారు.

గేమ్ నిబంధనల గురించి అవగాహన ఉండటం కూడా చాలా ముఖ్యమని రామన్ అన్నారు. ‘‘ఎందుకంటే మనమే ఆ గేమ్‌ను కామెంటరీ రూపంలో ప్రేక్షకులకు వివరించాల్సి ఉంటుంది. కాబట్టి నిబంధనలన్నీ మనకు తెలుసుండాలి’’ అని ఆయన తెలిపారు.

మాజీ వాలీబాల్ ప్లేయర్ నీతి రావత్ కూడా కొన్ని స్పోర్ట్స్‌కు కామెంటేటర్‌గా పనిచేశారు. నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్‌కు కూడా ఆమె హిందీ కామెంటరీ చెప్పారు.

‘‘కామెంటేటర్లకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తాము చెప్పాలనుకునే విషయాన్ని మెరుగ్గా వారు చెప్పగలగాలి. ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం కూడా ఇక్కడ చాలా ముఖ్యం’’ అని ఆమె అన్నారు.

ఎలా సన్నద్ధం కావాలి?

స్పోర్ట్స్ ఈవెంట్ల సమయంలో కామెంటేటర్లు మాట్లాడేటప్పుడు వారి వెనుక ఒక బృందం పనిచేస్తుంది. అదే సమయంలో కామెంటేటర్ కూడా ముందుగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

అసలు ఎలాంటి హోంవర్క్‌ను కామెంటేటర్లు చేయాల్సి ఉంటుందో రామన్ భానోత్ వివరించారు.

‘‘మన సన్నద్ధత చాలా సమగ్రంగా ఉండాలి. ముఖ్యంగా ఆన్‌స్క్రీన్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి? లాంటి అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే కామెంటరీలో ప్రతి సెకనూ విలువైనదే. మనం మాట్లాడే విషయాలు అక్కడి స్పోర్ట్స్‌కు అద్దం పట్టేలా ఉడాలి’’ అని ఆయన చెప్పారు.

ముఖ్యంగా ప్లేయర్లు ఎవరెవరో మనకు ముందుగా తెలుసుండాలని ఆయన చెప్పారు.

‘‘ఉదాహరణకు క్రికెట్‌ను తీసుకోండి. ముందుగానే బౌలింగ్, బ్యాటింగ్ చేస్తున్నది ఎవరో మీకు తెలుసుండాలి. అయితే, ఇక్కడ హాకీ లాంటి స్పోర్ట్స్‌లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితి ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతుంటుంది. అందుకే అందరి ప్లేయర్ల గురించీ మనం ముందుగానే తెలుసుకోవాలి’’ అని ఆయన వివరించారు.

తను ఎలా సన్నద్ధం అవుతంటారో నీతి కూడా బీబీసీకి వివరించారు.

‘‘బాస్కెట్‌బాల్ కామెంటరీ విషయానికి వస్తే, ఇటీవల జరిగిన మ్యాచ్‌ల గురించి ముందు రీసర్చ్ చేస్తాను. ఆ తర్వాత ప్రస్తుత మ్యాచ్‌లో స్పెషల్ ప్లేయర్లపై దృష్టి పెడతాను. అదే సమయంలో ప్రేక్షకులు ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారో కూడా సర్చ్ చేస్తాను. వారికి స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉందా లేదా ప్రత్యేక ప్లేయర్ మీద ఆసక్తి ఉందో తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం’’ అని ఆమె తెలిపారు.

‘‘కొన్ని స్పోర్ట్స్ చానళ్లు కొన్ని టోర్నమెంట్ల ముందు కామెంటేటర్ల కోసం వర్క్‌షాప్‌లు కూడా నిర్వహిస్తుంటాయి. మ్యాచ్ సమయంలో ఏం చెప్పాలి? ఎలా మాట్లాడాలి? ఎప్పుడు, ఎలా మనం జోక్యం చేసుకోవాలి? ప్లేయర్ల పేర్లను ఎలా పలకాలి? లాంటి అంశాలను కూడా వీటిలో చెబుతుంటారు’’ అని ఆమె వివరించారు.

లీడ్ కామెంటేటర్ ఏం చేస్తారు?

సాధారణంగా కామెంటరీలో ఇద్దరు ముగ్గురు కామెంటేటర్లు కలిసి కూర్చొని మాట్లాడుతుంటారు. వీరిలో ఒకరు లీడ్ కామెంటేటర్ ఉంటారు. ఆయన లేదా ఆమె ఆట ఎలా ముందుకు వెళ్తోందో ప్రధానంగా చెబుతుంటారు. ప్లేయర్ల ఆట తీరు గురించి మాట్లాడుతూ మధ్యమధ్యలో గత మ్యాచ్‌ల విశేషాలను కూడా చెప్పుకుంటూ వెళ్తారు.

సాధారణంగా లీడ్ కామెంటేటర్లుగా మాజీ ప్లేయర్లు, సమీక్షకులు ఉంటారు. తర్వాత ఏం జరగబోతుందో కూడా వీరు అంచనా వేస్తుంటారు.

గేమ్ సమయంలో ప్రేక్షకుల ఆసక్తిని ఎక్కడా తగ్గకుండా ఉండేలా చూసే బాధ్యత కామెంటేటర్లదే.

టెస్టు మ్యాచ్‌ల లాంటి సుదీర్ఘమైన ఈవెంట్లలో కొన్ని గణాంకాలు, పాత విశేషాలు, సంఘటలను కూడా చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కామెంటేటర్లు ప్రయత్నిస్తుంటారని రామన్ అన్నారు.

పక్షపాతం ఉండకూడదు

కామెంటేటర్లు ఎప్పుడూ పక్షపాతంతో వ్యవహరించకూడదు. గేమ్‌లో భావోద్వేగాలు పతాక స్థాయిలో ఉన్నప్పుడు కూడా తటస్థంగానే ఉండాలని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు, కామెంటేటర్ ఆదేశ్ కుమార్ గుప్తా ప్రధానంగా ప్రస్తావించారు.

‘‘ఇక్కడ ఒక టీమ్‌ గురించి ఎక్కువగా, మరో టీమ్ గురించి తక్కువగా అసలు మాట్లాడకూడదు’’ అని ఆయన అన్నారు.

కామెంటేటర్లుగా మాజీ ప్లేయర్లకే ఎక్కువ అవకాశాలు ఉంటాయా అనే ప్రశ్నపై రామన్ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా ఇక్కడ నేరుగా ఆడేటప్పుడు మనకు గేమ్‌లో కొంత అనుభవం వస్తుంది. దీని వల్ల గేమ్ మనకు మెరుగ్గా అర్థం అవుతుంది. అయితే, అసలు గేమ్‌లో ఆడనివారు కూడా కామెంటేటర్లుగా మెరుగ్గా రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి గేమ్‌ను ఇక్కడ మెరుగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యం’’ అని ఆయన చెప్పారు.

డిజిటల్ మీడియా ప్రభావం

కామెంటరీపై డిజిటల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని నేటి ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ స్టైల్‌ను కామెంటేటర్లు కూడా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది.

స్పోర్ట్స్ లీగ్‌ల సంఖ్య పెరుగుతుండటంతో కామెంటేటర్లుగా అవకాశాలు కూడా ప్రస్తుతం పెరుగుతున్నాయని నీతి చెప్పారు.

డిజిటల్ మీడియా వల్ల చాలా అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా చాలా మంది సొంతంగా యూట్యూబ్ లాంటి చానల్స్ పెట్టుకుని కామెంటరీ ఇవ్వడం మొదలుపెడుతున్నారు.

మహిళలకు మరిన్ని అవకాశాలు

నేడు మహిళలకు కామెంటేటర్లుగా అవకాశాలు చాలా పెరుగుతున్నాయి.

ఒకప్పుడు కేవలం క్రికెట్‌కు మాత్రమే మహిళా కామెంటేటర్లు పరిమితం అయ్యేవారు. నేడు ఇతర స్పోర్ట్స్‌లోనూ వారి పాత్ర పెరుగుతోంది.

మహిళలను కామెంటేటర్లుగా అంగీకరించేవారూ పెరుగుతున్నారు.

అయితే, ఈ దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని నీతి అన్నారు.

‘‘నేటికీ జెండర్ వివక్ష ఈ రంగంలో చాలా ఉంది. దీన్ని తగ్గిస్తూ మహిళల సంఖ్యను పెంచేలా అందరూ చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)