క్రికెట్ వరల్డ్ కప్ 2023: మ్యాచ్ జరుగుతుంటే మోదీ స్టేడియం ఖాళీ... ప్రారంభ మ్యాచ్ వాంఖెడేలో కాకుండా అహ్మదాబాద్‌లో ఎందుకు నిర్వహించారు?

    • రచయిత, జాన్వీ మూలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వన్డే ప్రపంచకప్ మొదలైంది. కానీ, స్టేడియం ఎందుకు ఖాళీగా కనబడుతోంది?

గురువారం ఇంగ్లండ్, న్యూజీలాండ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో, క్రికెట్ అభిమానుల్లో పుట్టుకొచ్చిన ప్రశ్న ఇది.

భారత్ ఆతిథ్యమిస్తోన్న ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, నిరుటి రన్నరప్ న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగింది.

ప్రతిష్టాత్మక వరల్డ్ కప్‌ ఆరంభ మ్యాచ్, బరిలో రెండు పెద్ద జట్లు అయినప్పటికీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పెద్దగా జనాలు కనబడలేదు.

మైదానంలో మ్యాచ్ గురించి ఎంత చర్చ జరిగిందో, అంతకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో స్టేడియంలో ఖాళీగా కనిపించిన సీట్ల గురించి జరుగుతోంది.

నరేంద్ర మోదీ స్టేడియంలో 1,32,000 సీట్లు ఉంటాయి. అయితే, మ్యాచ్‌కు ప్రత్యక్షంగా ఎంతమంది హాజరయ్యారో కచ్చితమైన సంఖ్య అందుబాటులో లేదు. కానీ, మ్యాచ్ దృశ్యాలు, ఫొటోల్లో మాత్రం ఖాళీగా ఉన్న స్టాండ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వారాంతం కాకపోవడం, మధ్యాహ్నం మ్యాచ్ జరగడం, పైగా భారత్ ఆడకపోవడంతో మ్యాచ్‌కు తక్కువ మంది వచ్చారనే చర్చ జరుగుతోంది.

ఒకవేళ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కాకుండా ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరిగి ఉంటే ఈ పరిస్థితి తలెత్తకపోయేదని కొంతమంది వాదన. ఇది నిజమా? అహ్మదాబాద్‌లోని ఖాళీ సీట్లు ఏం చెబుతున్నాయి?

జనాలు ఎందుకు రాలేదు?

బీబీసీ ప్రతినిధి తేజస్ వైద్య, మ్యాచ్‌ జరగడానికి ముందు స్టేడియం దగ్గరికి వెళ్లి అక్కడికి చేరిన అభిమానులతో మాట్లాడారు.

‘‘మ్యాచ్ 2 గంటలకు మొదలైంది. నేను 4:30 గంటల వరకు స్టేడియం దగ్గరే ఉన్నాను. అప్పటికి కూడా అభిమానులు వస్తున్నారు. అయినప్పటికీ, స్టేడియం నిండలేదు’’ అని తేజస్ వైద్య చెప్పారు.

అహ్మదాబాద్‌లో 33-34 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు, వేడి కారణంగా కొంతమంది స్టేడియం బయటే ఉండి ఎండ కాస్త తగ్గాక లోపలికి వెళ్లారు.

బీజేపీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు, ఈ మ్యాచ్‌ కోసం 40 వేల మంది మహిళలకు మ్యాచ్ పాస్‌లు ఇచ్చినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.

మ్యాచ్ పాస్‌లు అందుకున్నవారు ఉదయం 11:30 గంటలకల్లా స్టేడియానికి చేరుకున్నారు. అంతసేపు ఎదురుచూసిన జనం ఉత్సాహం కోల్పోవడం సహజం.

‘‘మొబైల్స్, వాలెట్స్ తప్ప మరేమీ స్టేడియంలోకి తీసుకెళ్లడానికి వీల్లేదు. బీజేపీ వారు పాస్‌లతో పాటు తమకు టీ, ఫుడ్ కూపన్లు ఇచ్చారని కొంతమంది మాకు చెప్పారు. మ్యాచ్ టికెట్లు ఉచితంగా ఇచ్చినప్పటికీ, స్టేడియం లోపల మంచినీళ్ల బాటిల్ కొనడం కూడా ఖరీదైన వ్యవహారమే. అందుకే చాలామంది స్టేడియంకు రావడం లేదు’’ అని తేజస్ వైద్య అన్నారు.

నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లడం కూడా కష్టంగా ఉంటుందని చాలా మంది అభిమానులు తేజస్‌తో చెప్పారు.

‘‘ఒకవేళ మీరు కారులో వెళితే, కార్ పార్కింగ్ ఎక్కడో చాలా దూరాన ఉంటుంది. మ్యాచ్ కోసం ముందుగానే బయల్దేరాలి. మ్యాచ్ అయ్యాక వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, టీమిండియా ఆడనప్పుడు మేం స్టేడియానికి ఎందుకు వెళ్లాలి?’’ అని కొందరు తనతో అన్నారని తేజస్ తెలిపారు.

ఈ మ్యాచ్‌తో పాటు వరల్డ్ కప్ ఆరంభ వేడుకలు ఉంటాయని ఆశించినవారికి ఓపెనింగ్ వేడుక లేకపోవడంతో మ్యాచ్‌కు వెళ్లేందుకు ఇష్టపడలేదు.

పుణే నుంచి కొల్లాపుర్ నుంచి కొంతమంది ప్రేక్షకులను తాను కలిశానని తేజస్ చెప్పారు. న్యూజీలాండ్, ఇంగ్లండ్‌ల నుంచి కూడా అభిమానులు వచ్చారని అన్నారు. కానీ, స్థానికుల నుంచి ఆశించిన మేరకు మ్యాచ్ పట్ల ఉత్సాహం కనిపించలేదని చెప్పారు.

అక్టోబర్ 14న ఇక్కడ జరిగే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు స్టేడియం నిండుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియాన్ని 2020లో ప్రారంభించారు. 63 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్టేడియంలో 1,32,000 సీట్లు ఉన్నాయి.

కాబట్టి స్టేడియంలో 20,000 మంది ప్రేక్షకులు ఉన్నప్పటికీ ఇది ఖాళీగానే కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో ఓపెనింగ్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కాకుండా వేరే చోట నిర్వహించాల్సిందా? అహ్మదాబాద్‌లోనే ఎందుకు నిర్వహించారు?

వాంఖెడేలో మ్యాచ్ ఎందుకు జరుగలేదు?

ముంబయిలోని వాంఖెడే స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియాలకు చారిత్రక గుర్తింపు ఉంది. ఇవి ఐకానిక్ స్టేడియాలు కూడా.

కానీ, ప్రపంచకప్ ఓపెనింగ్ మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్, ఇంకా భారత్-పాకిస్తాన్‌ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో నిర్వహిస్తున్నారు.

భారత క్రికెట్, బీసీసీఐల పవర్ సెంటర్ మార్పును ఇది హైలైట్ చేస్తుంది.

2019లో గుజరాత్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శిగా ఉన్న జైషా, బీసీసీఐలో అడుగుపెట్టారు.

జై షా ఇప్పుడు ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు. ఐసీసీ ఫైనాన్స్ కమిటీ హెడ్ కూడా. ఇలా చూస్తే ముంబయి, కోల్‌కతాలను కాదని అహ్మదాబాద్ స్టేడియానికి ప్రాముఖ్యత లభించడం కొత్త విషయం కాదు.

దీనికంటే ముందు దాల్మియా హయాంలో ఈడెన్ గార్డెన్స్, శరద్ పవార్ సమయంలో వాంఖెడే స్టేడియాల్లో ముఖ్యమైన మ్యాచ్‌లు జరిగేవి.

వాంఖెడేలో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యేదా?

మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో బదులుగా ముంబయిలో నిర్వహించి ఉంటే స్టేడియం ఖాళీగా కనిపించకపోయేదని ముంబయికి చెందిన కొందరు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

వాంఖెడే స్టేడియం సీటింగ్ సామర్థ్యం 32,000. సాధారణంగా ముంబయిలో క్రికెట్ అభిమానులు ఎక్కువ.

అయితే, 2011 వన్డే వరల్డ్ కప్‌లో వాంఖెడే వేదికగా జరిగిన శ్రీలంక, న్యూజీలాండ్ మ్యాచ్‌కు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదురైంది.

వాంఖెడేలో మళ్లీ ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విజయ్ లోక్‌పల్లి అన్నారు.

‘‘భారత్ ఆడని మ్యాచ్‌ల్లో ఇలాంటి దృశ్యాల్నే మనం చూడొచ్చు. బీసీసీఐ లేదా స్థానిక ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటే తప్పా ఈ పరిస్థితి మారదు’’ అని విజయ్ లోక్‌పల్లి అభిప్రాయపడ్డారు.

ఆఫీసులు ముగిసిన తర్వాత స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నట్లు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

‘‘భారత్ ఆడని మ్యాచ్‌లకు స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఉచిత టిక్కెట్లు ఇవ్వొచ్చు. పరిమిత ఓవర్ల ఆటపై ఆసక్తి తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. యువతకు వరల్డ్ కప్ మ్యాచ్ అనుభవాన్ని అందించడంతో పాటు కిక్కిరిసిన స్టేడియంలో క్రికెటర్లు ఆడే వీలుంటుంది’’ అని ట్వీట్‌లో సెహ్వాగ్ పేర్కొన్నారు.

వన్డే ఫార్మాట్‌పై ప్రజలు ఆసక్తి కోల్పోయారనడానికి స్టేడియంలో ఖాళీగా కనిపిస్తున్న సీట్లే నిదర్శనమని కొందరు అంటున్నారు.

ఈ ఏడాది ఇదే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు భారీగా జనాలు రావడం ఇందుకు రుజువని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)