సిక్కిం ఆకస్మిక వరదలు: 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతు.. క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదలలో 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతయ్యారు. క్లౌడ్‌ బరస్ట్‌తో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల 14 మంది చనిపోయారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

తీస్తా నది పై భాగంలో ఉత్తరాన క్లౌడ్‌బరస్ట్‌ జరిగింది. దీనివలన నదిలో ప్రమాదకరస్థాయిలో నీరు పొంగింది. సమీపంలోని డ్యామ్ నుంచి నీటిని వదిలిన తరువాత పరిస్థితి మరింత దిగజారింది.

రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలను కలిపే రెండు బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. కొన్ని సైనిక వాహనాలు వరదల్లో మునిగిపోయాయి. రక్షణ, సహాయకచర్యలు మొదలుపెట్టినట్టు, ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని రక్షణ మంత్రిత్వశాఖ బీబీసీకి చెప్పింది.

సిక్కింలో వరదల వలన తీవ్రంగా దెబ్బతిన్న మిగిలిన ప్రాంతాలలోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాల నుంచి అధికారులు ప్రజలను తరలిస్తున్నారు. 3వేలకుపైగా యాత్రికులు వరదలలో చిక్కుపోయినట్టు స్థానిక మీడియా రిపోర్టులు చెపుతున్నాయి.

ఈ హియాలయ రాష్ట్రంలో వరదలు, ప్రక‌ృతి విపత్తులు తరచూ సంభవిస్తుంటాయి. కిందటేడాది వచ్చిన తీవ్రమైన వరదల వలన వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులవ్వగా, 24 మంది మరిణించారు.

క్లౌడ్ బరస్ట్ తో సంభవించిన వరదలతో సిక్కిం అతలాకుతలమవుతోంది.

క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?

వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం, ఒక చిన్న ప్రాంతంలో (ఒకటి నుండి పది కిలోమీటర్ల లోపు) ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అంటారు.

ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 2013లో ఉత్తరాఖండ్‌లో జరిగినట్లుగా భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే, కుంభవృష్టి కురిసిన ప్రతిసారీ క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేం.

క్లౌడ్ బరస్ట్‌కు కారణాలేంటి?

ఇది భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు దక్షిణాన అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా మధ్యధరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి తేమను తోడ్కొని వస్తాయి.

ఈ రెండూ ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవి అకస్మాత్తుగా తక్కువ సమయంలో భారీగా వర్షిస్తాయి.

పర్వతాలపై తరచూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలో కుంభవృష్టి కురిపిస్తాయి. ఆ కారణంగా పర్వతాలపై క్లౌడ్ బరస్ట్ సంఘటనలు అధికంగా జరుగుతుంటాయి.

వర్షాకాలంలో మాత్రమే క్లౌడ్ బరస్ట్ జరుగుతుందా?

సాధారణంగా రుతుపవనాలు వచ్చే ముందు, వచ్చిన తరువాత కూడా క్లౌడ్ బరస్ట్ జరుగుతుంటుంది.

నెలల్లో చెపాలంటే మే నుంచి జూలై-ఆగస్ట్ వరకు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి.

పర్వత ప్రాంతాల్లోనే మేఘాల విస్ఫోటనం జరుగుతుందా?

అలాగని చెప్పలేం. దిల్లీ, పంజాబ్, హరియాణా లాంటి సమతల ప్రాంతాల్లో కూడా క్లౌడ్ బరస్ట్ సంభవించవచ్చు.

అయితే, భారతదేశంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఉత్తరాదినే సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఎత్తులో చిన్న చిన్న పర్వతాలు అనేకం ఉంటాయి. అలాంటిచోట క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశాలు అధికం.

ఈశాన్య రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్ జరుగుతుందా?

చిరపుంజీలాంటి ప్రాంతాల్లో ఏడాది పొడుగునా వర్షాలు కురుస్తుంటాయి. బెంగాల్ తీరం నుంచి అధిక తేమతో కూడిన గాలులు వీస్తుంటాయి. కాబట్టి వర్షాకాలంలో క్లౌడ్ బరస్ట్ సంభవమే.

అక్కడ చాలాసార్లు మేఘాల విస్ఫోటనం జరిగింది. కానీ అక్కడి ప్రజలు ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందు నుంచి సిద్ధంగా ఉంటారు.

నీరు ఒకేచోట పేరుకుపోదు. త్వరగా పల్లానికి తరలిపోతుంది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నివసించరు. అందుచేత అక్కడ క్లౌడ్ బరస్ట్ అయినా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడం అరుదు.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, కేవలం ఒక్క గంటలో 10 సె.మీ వర్షం కురవడం వలనే నష్టం వాటిల్లదు. సమీపంలో నది లేదా సరస్సు ఉంటే, కుంభవృష్టి వలన వాటిల్లో నీరు పొంగి, వరదలు ముంచెత్తడం వలన చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

ఈ కారణంగానే జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో ‌సంభవించిన క్లౌడ్ బరస్ట్ సంఘటనల్లో అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిన వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

క్లౌడ్ బరస్ట్‌ను ముందే అంచనా వేయొచ్చా?

ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల్లో వాతావరణ మార్పుల కారణంగా తేమతో నిండిన భారీ మేఘాలు మోహరించడం వలన క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. అందువల్ల వీటిని అంచనా వేయడం కష్టం.

రాడార్ సహాయంతో పెద్ద ప్రాంతంలో కురవబోయే భారీ వర్షాలను వాతావరణ శాఖ అంచనా వేయగలదు. కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరగవచ్చు అనేది అంచనా వేయడం దాదాపు అసాధ్యం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)