ఈ ఏడాది మేటి పర్యావరణ ఫొటోగ్రాఫర్‌గా ఆంటోనియా అరగాన్ రెనున్సియో

స్పానిష్ ఫొటోగ్రాఫర్ ఆంటోనియో అరగాన్ రెనున్సియో ఈ ఏడాదికి గానూ మేటి పర్యావరణ ఫొటోగ్రాఫర్‌గా ఎంపికయ్యారు. ఆయనకు 'ఇన్విరాన్‌మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్- 2021' అవార్డు లభించింది.

ఘనాలోని అఫియడెన్యిబా బీచ్‌లో తీరం కోత కారణంగా ధ్వంసమైన ఓ ఇంటిలో నిద్రిస్తోన్న ఒక చిన్నారి ఫొటోకు గానూ ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.

2019లో అఫియడెన్యిబా బీచ్‌లోని శిథిలావస్థలో ఉన్న ఇంటిలో నిద్రిస్తోన్న చిన్నారి.

' ద రైజింగ్ టైడ్ సన్స్' పేరుతో తీసిన ఈ చిత్రం, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పెరుగుతోన్న సముద్రపు మట్టాలను హైలైట్ చేస్తోంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల వేలాది మంది ప్రజలు తమ నివాసాలను విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.

విజేతగా నిలిచిన రెనున్సియోకు 10వేల పౌండ్ల (రూ. 10 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.

14వ సీజన్ 'ఇన్విరాన్‌మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్' పోటీలో, ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని కలిగించిన పర్యావరణ ఫొటోగ్రఫీని ప్రదర్శించారు.

ఈ అవార్డుల వేడుక మానవాళి మనుగడ సామర్థ్యాన్ని సెలెబ్రేట్ చేసుకోవడంతో పాటు, ఐక్యరాజ్య సమితి సుస్థిరత అభివృద్ధి లక్ష్యాలు నెరవేర్చేందుకు పిలుపునిస్తుంది.

గ్లాస్గోలో జరుగుతోన్న వాతావరణ మార్పుల సదస్సు కాప్26 సందర్భంగా ఈ ఏడాది విజేతను ప్రకటించారు.

ఆ పోటీలో ఇతర అవార్డులను గెలుపొందిన చిత్రాలను ఇక్కడ చూపిస్తున్నాం.

ఈ ఏడాది అతిపిన్న పర్యావరణ ఫొటోగ్రాఫర్: అమన్ అలీ

అమన్ అలీ తీసిన 'ఇన్‌ఫెర్నో' చిత్రం ఆయనకు ఈ అవార్డును తెచ్చిపెట్టింది. న్యూఢిల్లీలోని యుమునా ఘాట్‌లో అలీ ఈ ఫొటో తీశారు.

భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోని యుమునా ఘాట్‌లో తన ఇంటికి సమీపంలో ఉన్న పొదల్లో మంటలను ఆపడానికి ప్రయత్నిస్తోన్నబాలుడు.

'ద రెజిలియంట్ అవార్డ్': అష్రఫుల్ ఇస్లాం

జీవన పోరాటం పేరిట బంగ్లాదేశ్‌లోని నోఖలి ప్రాంతంలో అష్రఫుల్ ఈ చిత్రాన్ని క్లిక్‌మనిపించారు.

బీడు భూముల్లో గడ్డి కోసం వెతుకుతోన్న గొర్రెల మంద.

బంగ్లాదేశ్‌లోని తీవ్రమైన కరువు, జీవులన్నింటి మనుగడను కష్టాల్లోని నెట్టింది.

సుస్థిరత నగరాల విజేత: నెట్ జీరో ట్రాన్సిషన్- ఫొటోబయోరియాక్టర్

ఫొటోగ్రాఫర్: సిమోన్ ట్రామోంటే

ఐస్‌ల్యాండ్‌లోని రేకన్స్‌బేర్‌లో సిమోన్ ఈ చిత్రాన్ని తీశారు.

రేకన్స్‌బేర్‌లోని అల్గాలిఫ్ ఫెసిలిటీలోని ఫొటోబయోరియాక్టర్, క్లీన్ జియోథర్మల్ ఎనర్జీని ఉపయోగించి సుస్థిరమైన అస్టాక్షంథమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అస్టాక్షంథమ్‌ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది కణాలు నాశనం కాకుండా కాపాడుతుంది.

ఐస్‌ల్యాండ్, శిలాజ ఇంధనాలకు బదులుగా విద్యుత్ వినియోగాన్ని, పునరుత్పాదక వనరుల నుంచి ఉష్ణ వినియోగానికి మారింది.

'వాతావరణ చర్యల విజేత': ద లాస్ట్ బ్రీత్; ఫొటోగ్రాఫర్: కెవిన్ ఓచింగ్ ఓన్యాంగో.

కెన్యాలోని నైరోబీలో కెవిన్ ఈ ఫొటోను తీశారు.

ఒక మొక్క నుంచి బాలుడు గాలిని తీసుకుంటుండగా... వెనుకవైపు ఇసుక తుపాను రావడం ఈ చిత్రంలో చూడొచ్చు. రాబోయే వాతావరణ మార్పులను, దాని ప్రభావాలను చాలా కళాత్మకంగా ఈ చిత్రం ప్రతిబింబించింది.

వాటర్ అండ్ సెక్యూరిటీ విజేత: గ్రీన్ బారియర్

ఫొటోగ్రాఫర్: సందీపని చటోపాధ్యాయ్

భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దామోదర్ నదీలో సందీపని ఈ చిత్రాన్ని తీశారు.

ఒక క్రమం లేని రుతుపవనాలు, కరువుల కారణంగా దామోదర్ నదిపై ఆల్గే (ఒక రకమైన నాచు) విపరీతంగా విస్తరించింది.

ఈ ఆల్గే వల్ల సూర్యకాంతి నీటి ఉపరితంలోనికి చొచ్చుకొనిపోదు. నీటి లోపలి జీవరాశులకు కూడా ఆక్సీజన్ అందకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా ఆ ప్రాంతం సమీపంలోని మానవుల ఆరోగ్యాన్ని, వారి ఆవాసాలను కూడా ప్రభావితం చేస్తుంది.

భవిష్యత్ వాతావరణాలు విజేత: ఫ్లడ్

ఫొటోగ్రాఫర్: మైఖేల్ లాపిని

ఇటలీలోని మోడెనా, నోనంటోలా నగరంలోని పనారో నదీలో మైఖేల్ ఈ చిత్రాన్ని తీశారు.

అధిక వర్షపాతం, మంచు కరగడం లాంటి ఉపద్రవాల వల్ల పనారో నదికి వరదలు ముంచెత్తడంతో ఒక ఇళ్లు నీటిలో మునిగిపోయింది.

పోటీలో షార్ట్‌లిస్ట్ అయిన ఫొటోలు మీకోసం

నదిలో చేపల వేట: అష్రఫుల్ ఇస్లాం (ఫొటోగ్రాఫర్)

బంగ్లాదేశ్‌లోని సిరాజ్‌గంజ్‌ నగరంలోని నదిలో అష్రఫుల్ ఈ చిత్రాన్ని తీశారు.

నది మొత్తం ఆల్గే విస్తరిస్తుంది. అప్పుడు చాలా మంది మత్స్యకారులు ఇక్కడికి పడవల్లో వచ్చి నీటిలో చేపలు పడుతుంటారు.

నది మొత్తం ఆకుపచ్చ నాచుతో నిండి ఉంటుంది.

అగర్‌బత్తీలను ఆరబెట్టడం: అజీమ్ ఖాన్ రోనీ (ఫొటోగ్రాఫర్)

వియత్నాంలోని హనోయిలో అజీమ్ ఖాన్ ఈ చిత్రాన్ని తీశారు.

హనోయిలోని క్వాంగ్ పు కౌ గ్రామంలో ఆరబెట్టిన వేలాది అగర్‌బత్తీ పుల్లల మధ్యలో కూర్చొన్న వియత్నాం వర్కర్లు. ఇక్కడ వందల ఏళ్లుగా సంప్రదాయపద్ధతిలో ఈ ధూపం పుల్లలను తయారు చేస్తున్నారు.

వియత్నాం ప్రజల ఆధ్యాత్మిక జీవనంలో ఈ అగర్‌బత్తీల వాడకం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

సముద్రపు సింహం కూన: సెలియా కుజాలా

మెక్సికోలోని కొరోనాడో ఐస్‌ల్యాండ్స్‌లోని సెలియా ఈ చిత్రాన్ని తీశారు.

'నోటిలో ఒక లోహపు హుక్కు చిక్కుకొని ఉన్న ఈ కాలిఫోర్నియా సముద్రపు సింహపు కూనను నేను కలిశాను.'

'నేను డైవింగ్ చేస్తున్నంత సేపు అది నాకు సమీపంలోనే తిరిగింది. ఏదో సహాయం చేయమని అది నన్ను అడిగినట్లుగా నాకు అనిపించింది' అని సెలియా పేర్కొన్నారు.

' ద నీమోస్ గార్డెన్' : జియాకోమో డి ఓర్లాండో (ఫొటోగ్రాఫర్)

ఇటలీలోని నోలీలో ఓర్లాండో ఈ చిత్రాన్ని తీశారు.

వ్యవసాయానికి ప్రత్యామ్నాయ వ్యవస్థగా నీమోస్ గార్డెన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా మొక్కల పెంపకానికి అనువుగా లేని వాతావరణ పరిస్థితుల్లో ఈ వ్యవస్థను వినియోగిస్తున్నారు.

మన భవిష్యత్‌పై పెరుగుతోన్న వాతావరణ మార్పు ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి, ఆచరణీయమైన పర్యావరణ అనుకూల పరిష్కారంగా ఈ 'నీటి అడుగున వ్యవసాయ వ్యవస్థ'ను అభివృద్ధి చేస్తున్నారు.

ప్లాస్టిక్‌తో నిండిన పర్యావరణం: సుబ్రతా డే (ఫొటోగ్రాఫర్)

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఈ ఫొటో తీశారు.

''బంగ్లాదేశ్‌, చిట్టగాంగ్‌లోని ఒక ప్లాస్టిక్ రీ సైక్లింగ్ పరిశ్రమలో నేను ఈ ఫొటోను తీశాను.''

''ప్లాస్టిక్‌ను రీ సైక్లింగ్ చేయడం వల్ల ప్లాస్టిక్ కాలుష్యం, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల నుంచి పర్యావరణాన్ని కాపాడొచ్చు'' అని సుబ్రతా పేర్కొన్నారు.

క్లీన్ ఎనర్జీ: పెడ్రీ డీ ఒలివీరా సిమోస్ ఎస్టీవ్స్ (ఫొటోగ్రాఫర్)

పోర్చుగల్‌లోని సెర్రా డి సావో మకారియోలో పెడ్రో ఈ ఫొటో తీశారు.

మేఘావృతమైన రోజున సూర్యాస్తమయం ముందు తిరుగుతోన్న విండ్-ఎనర్జీ టర్బైన్స్.

పాలిగోనల్ ఫారెస్ట్: రాబర్టో బ్రూనో (ఫొటోగ్రాఫర్)

స్పెయిన్‌లోని సియెర్రా డి బెజార్‌లో ఈ ఫొటో తీశారు.

వాతావరణ మార్పులను నిరోధించడంలో అడవులను చక్కగా చూసుకోవడం ముఖ్యమైనది.

ఈ చిత్రంలో ఏపుగా పెరిగిన అడవి 'చెస్ట్‌నట్' అనే మొక్కలతో కూడిన అడవి. దీన్ని వుడ్ ఓనర్స్ ఒక క్రమపద్ధతిలో పెంచుతున్నారు.

''వారు బహుభుజి ఆకారంలో చెట్లను నరికి వేస్తారు. వాటి మధ్యలో మళ్లీ కొన్ని చెట్లను నరకకుండా వదిలేస్తారు. దీనివల్ల కొంతకాలానికి వాటి చుట్టు పక్కలా మళ్లీ చెట్లు మొలిచి అటవీ నిర్మూలన కాకుండా ఉంటుంది.

అన్ని ఫొటోలు కాపీరైట్ నిబంధనలకు లోబడి ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)