ఆసియా కప్ ఫైనల్ : ‘టీ తాగి వచ్చేలోపే అంతా అయిపోయింది’

ఆసియా కప్‌-2023ను భారత్ కైవసం చేసుకుంది. వన్డేల్లో శ్రీలంక భారత్ మీద నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే.

ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్డేడియంలో భారత్, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఒక టీమ్ బ్యాటింగ్ మొదలు పెట్టి, కుదురుకునేదుకు తీసుకునే సమయంలోనే రెండు టీమ్‌లు ఆడేసి, విజేత ఎవరో కూడా తేలిపోయింది.

ఈ విజయంపై ఆన్‌లైన్‌లో కామెంట్లు సరదాగా సాగాయి. ‘టీ తాగి వచ్చేలోగానే అంతా అయిపోయింది’’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ‘‘కళ్లు మూసి తెరిచేలోగా మ్యాచ్ ముగిసింది’’ అని మరో యూజర్ రాశారు.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్లు టీమిండియా బౌలింగ్‌కు ఎదురు నిలవలేక కేవలం 50 పరుగులకే ఆలౌటయ్యారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఏడో ఓవర్‌లోనే 51 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకను మహమ్మద్ సిరాజ్ ముప్పుతిప్పలు పెట్టాడు. మొదటి ఓవర్లో సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కుశాల్ పెరీరాను డకౌట్‌గా పెవిలియన్ పంపాడు.

ఆ తర్వాత వచ్చిన సిరాజ్ శ్రీలంక ఇన్నింగ్స్ ను కుదేలు చేశాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు. దీంతో లంక కోలుకోలేకపోయింది. అంతేకాదు మరో నాలుగు ఓవర్లు వేసి కెప్టెన్ షనకతో పాటు ప్రధాన బ్యాటర్లను పెవిలియన్ పంపాడు.

కేవలం 16 బంతుల్లోనే ఐదుగురు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. పాతుం నిస్సాంక, సదీర, చరిత్ అసలంక, ధనంజయ్ డిసిల్వా, దసున్ షనక, కుశాల్ మెండిస్‌ల వికెట్లు సిరాజ్ తీశారు.

మరో ఎండ్‌లో హార్దిక్ పాండ్యా కూడా వికెట్లు తీయడంతో శ్రీలంక ఇన్సింగ్ 50 పరుగులకే ముగిసింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ 7 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి 6 కీలక వికెట్లు తీశాడు.

హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీశారు.

అనంతరం టీమిండియా ఓపెనర్లు ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 23 పరుగులు, శుభ్‌మాన్ గిల్ 19 బంతుల్లో 27 పరుగులు చేయడంతో 7 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా మ్యాచ్ గెలిచింది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సిరాజ్ దక్కించుకోగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యాడు.

కలలా ఉంది: సిరాజ్

''ఇది కలలా ఉంది. గతంలో శ్రీలంకపై నేను 4 వికెట్లు తీశాను, కానీ ఐదో వికెట్ తీయలేకపోయా. అప్పుడు నీకు ఏది నిర్ణయమైందో అది నీకు దక్కుతుందని అనుకున్నా'' అని శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మహమ్మద్ సిరాజ్ అన్నాడు.

"ఈ రోజు అది నాకు రాసి పెట్టి ఉంది కాబట్టి నాకు దక్కింది. మొన్నటి మ్యాచ్‌ల్లో నాకు ఇవాల్టి ఊపు రాలేదు. నేను బ్యాట్స్‌మెన్‌ను ఆడనివ్వాలనుకున్నా. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో వికెట్లు పడవు కాబట్టి ఔట్‌ స్వింగర్లతో వికెట్లు తీయడం చాలా సంతృప్తినిస్తుంది'' అని అన్నాడు సిరాజ్.

' శ్రీలంక వర్సెస్ సిరాజ్'

ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ అత్యుత్తమ బౌలింగ్‌కు శ్రీలంకలో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన భారత క్రికెట్ అభిమానులు ఆనందంతో గంతులేశారు.

అలాంటి కొందరి అభిమానులతో బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ మాట్లాడారు.

''అభిమానులుగా మేం కూడా భారత బౌలర్ల ప్రదర్శనను ఊహించలేదు. నేటి మ్యాచ్ భారత్ వర్సెస్ శ్రీలంక కాదని, శ్రీలంక వర్సెస్ సిరాజ్'' అని అభిమానులు అన్నారు.

“300 కంటే ఎక్కువ పరుగులు చేస్తారని, పోటీ మ్యాచ్ ఉంటుందని ఆశించాం. ఒకవేళ ఇండియా-పాకిస్తాన్ లేదు కనీసం భారత్-శ్రీలంక ఆ ఉత్కంఠ మ్యాచ్ జరుగుతుందనుకున్నాం, కానీ ఇప్పుడు మ్యాచ్ ఇలా ముగిసింది'' అని మరో అభిమాని తెలిపారు.

ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో తన అద్భుత బౌలింగ్‌తో శ్రీలంక ఇన్నింగ్స్‌ను త్వరగా ముగిసేలా చేసిన సిరాజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

దిల్లీ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్’లో "ఈ రోజు సిరాజ్‌కు స్పీడ్ చలాన్ లేదు" అని రాశారు.

ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సిరాజ్ ఓవర్ బౌలింగ్ గురించి ఇలా రాశారు,

"0, 0, 0, 0, 0, 0, W, 0, W, W, 4, W, 0, 0, 0, W." - వాట్ బౌలింగ్! మాస్టర్ క్లాస్''.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)