You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆసియా కప్: ఫైనల్‌కు ముందు కోహ్లీ గురించి టీమిండియాలో ఆందోళన ఎందుకు?
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొలంబోలో జరిగే ఆసియా కప్ ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
ఫైనల్ మ్యాచ్ జరిగే ఆర్ ప్రేమదాస స్టేడియం, విరాట్ కోహ్లీల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే కోహ్లీ అక్కడ నాలుగు సెంచరీలు కొట్టాడు.
అంతేకాదు గతవారం ఇదే మైదానంలో పాకిస్తాన్‌పై సెంచరీ సాధించాడు. అది కూడా తడి పిచ్‌పై.
అయితే, శ్రీలంకతో జరిగిన తదుపరి మ్యాచ్ విరాట్ కోహ్లీ ఔటైన విధానం కొద్దిగా కలవరపరిచేదే.
కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లాలఘే. అప్పటికి విరాట్ చేసింది 12 బంతుల్లో 3 పరుగులు మాత్రమే.
నిరాశతో తల దించుకుని పెవిలియన్ చేరాడు కోహ్లీ. అయితే తమ మ్యాచ్ విన్నర్ ఇలా స్పిన్నర్ల చేతిలో ఔటవుతుండటం టీమిండియాను ఆందోళన పడేలా చేస్తోంది.
కోహ్లీ ఎడమచేతి వాటంలో ఇబ్బంది పడతాడా?
2023లో ఎడమచేతి వాటం స్పిన్నర్ బౌలింగ్‌లో ఔటవడం కోహ్లీకి ఇది నాలుగోసారి.
2021 నుంచి పరిశీలిస్తే మిచెల్ సాంట్నర్, షకీబ్ అల్ హసన్, అష్టన్ అగర్, కేశవ్ మహరాజ్, శ్రీలంకకు చెందిన వెల్లలఘేలు విరాట్ కోహ్లీని తేలిగ్గా ఔట్ చేసిన స్లో లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్లు.
వీరిలో సాంట్నర్, షకీబ్ అల్ హసన్, మహరాజ్ రెండేసి సార్లు కోహ్లీని ఔట్ చేశారు.
2021 నుంచి ఆడిన 28 వన్డే మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ 8 సార్లు ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
"కోహ్లీ ఈ గణాంకాలను మరిచిపోయి స్పిన్నర్లను ఎదుర్కోవాలి" అని శ్రీలంక మాజీ ప్లేయర్, లెఫ్టార్మ్ బౌలర్ సనత్ జయసూర్య సూచిస్తున్నాడు.
“కోహ్లీ వంటి పెద్ద ఆటగాళ్లు ఉంటే అతనిపై బౌలర్లే కాదు, ప్రత్యర్థి జట్టులోని నిపుణులంతా వ్యూహం రచిస్తారు. కోహ్లీ మ్యాచ్ విన్నర్ కాబట్టి, అతన్ని ఔట్ చేయడం చాలా ముఖ్యం. అతని కోసం ప్రత్యర్థి జట్టు కెప్టెన్ స్పిన్నర్‌ను త్వరగా బౌలింగ్‌కు దించడం చూస్తున్నాం. బహుశా ఇది ఇంతకుముందు జరగకపోయిండొచ్చు" అని అన్నారు జయసూర్య.
పడిపోతున్న స్ట్రైక్ రేట్
స్పిన్ బౌలింగ్‌లో విరాట్ ఇబ్బంది పడటం కేవలం వన్డేలకే పరిమితం కాలేదు. గత కొన్నేళ్లుగా ఆడిన IPL మ్యాచ్‌లను పరిశీలించినా అదే తీరు కనిపిస్తోంది.
మొత్తం ఐపీఎల్‌లో ఫాస్ట్ బౌలర్లపై విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 132.51 కాగా, స్పిన్నర్లపై స్ట్రైక్ రేట్ 123.96 గా ఉంది.
2020 నుంచి పరిశీలిస్తే ఫాస్ట్ బౌలింగ్‌లో కోహ్లీ స్ట్రైక్ రేట్ నిలకడగానే (133.28) ఉండగా, స్పిన్నర్‌లపై స్ట్రైక్ రేట్ (106.68) తగ్గుతూ వస్తోంది.
ఐపీఎల్ 2023 సీజన్ మొదటి అర్ధభాగంలో కోహ్లీ ఐదుసార్లు ఔటైతే అందులో 4 సార్లు స్పిన్నర్ల చేతిలోనే ఔటయ్యాడు. లలిత్ యాదవ్, అమిత్ మిశ్రా, హర్‌ప్రీత్ బ్రార్, సునీల్ నరైన్ కోహ్లీ వికెట్ తీసుకున్నారు.
“ప్రతి మ్యాచ్‌లోనూ విజేతలం కాలేం. దీనిని మరచిపోకూడదు. మ్యాచ్ విన్నర్ ప్రత్యర్థి జట్టును బోల్తా కొట్టించి గెలిపించగలడు. ఒక పెద్ద మ్యాచ్ విన్నర్, సాధారణ ఆటగాడికి మధ్య ఉన్న తేడా అదే. కోహ్లీ నేటికీ మ్యాచ్ విన్నర్'' అని ఇంగ్లండ్ మాజీ బౌలర్ డొమినిక్ కార్క్ అంటున్నాడు.
శ్రీలంక స్పిన్నర్లతో పరీక్షే..
భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆదివారం జరిగే ఫైనల్‌పై భారీ అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా ఏ ఆసియా ప్రత్యర్థితో తలపడదు.
ఈ టోర్నీ తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. అనంతరం అక్టోబర్‌లో ఇండియా వేదికగా జరిగే ప్రపంచ కప్ ఆడనుంది.
ఆసియా కప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి సూపర్-ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడింది టీమిండియా. ఫైనల్‌లో భారత జట్టు మళ్లీ తన లయను అందుకోవల్సి ఉంటుంది.
గత మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ గెలిచినప్పటికీ, ఆ జట్టు స్పిన్నర్లే టీమిండియా 10 వికెట్లను పడగొట్టారు. గత మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన వారిలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు.
“శ్రీలంకలో యువ స్పిన్నర్లు ప్రపంచంలోని ఏ టాప్ బ్యాట్స్‌మెన్‌ను అయినా ఇబ్బంది పెట్టగలరు. వెల్లలఘే కాకుండా, మహీష్ తీక్షణ, చరిత్ అసలంక, దుషన్ హేమంత్, ధనంజయ్ డి సిల్వాలను ఎదుర్కోవడమూ కష్టమే'' అని శ్రీలంక ఎడమచేతి వాటం స్పిన్నర్ రంగనా హెరాత్ తెలిపారు.
టీమిండియాకు ఈ ఆసియా కప్ ఫైనల్ మాత్రమే కాకుండా, శ్రీలంక స్పిన్నర్లను భారత బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కొంటారనేది కూడా ముఖ్యమైనది.
భారత్ వేదికగా జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లలో టీమిండియా తన గ్రూప్ మ్యాచ్‌లను చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబైలోని స్లో పిచ్ గ్రౌండ్‌లలో ఆడనుంది.
అందుకే ఈ మైదానాల్లో జట్టు స్పిన్నర్లను ఆడించడమే కాకుండా, తమ బ్యాట్స్‌మెన్‌లను ఆ స్పిన్ బౌలింగ్‌లోనే పరీక్షించాల్సి ఉంటుంది.
సహజంగానే అందరి చూపు కూడా వన్డే క్రికెట్‌లో 13,000 పరుగులు చేసిన విరాట్ కోహ్లీపై ఉంటుంది.
ఇవి కూడా చదవండి
- Skin care: కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడితే భారతీయుల చర్మం కూడా అలా మారుతుందా?
- పాకిస్తాన్: ఇంధనానికి డబ్బుల్లేక ఆగిపోతున్న ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ విమానాలు
- కోరుట్ల: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో ఆమె చెల్లెలు చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్ షేక్ ఎలా దొరికిపోయారంటే
- ‘మీ దయవల్లే బతికున్నా, సార్’.. 9 ఏళ్ల కిందట ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారికి చేతులెత్తి మొక్కిన పేద మహిళ
- తెలంగాణలో బోర్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు, నీటిని వాడుకున్నందుకు ఎంత చెల్లించాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)