You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్టార్ క్రికెటర్ అప్పుడు కిడ్నాప్ కేసులో బాధితుడు, ఇప్పుడు డ్రగ్స్ అమ్ముతున్నాడంటూ అరెస్ట్
- రచయిత, టిఫానీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ
భారీ మొత్తంలో కొకైన్‌ను సరఫరా చేసేందుకు వేసిన పథకంలో ప్రమేయం ఉందంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ స్టార్ స్టువర్ట్ మాక్‌గిల్‌పై కేసు నమోదైంది.
ఈ ఆరోపణలతో 52 ఏళ్ల గిల్‌ను మంగళవారం సిడ్నీలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా తరఫున గిల్ 44 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఆయన స్పిన్ బౌలర్.
2021లో గిల్‌ను ఎవరో కిడ్నాప్ చేసి కొట్టినట్టినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేశారు.
అయితే, డ్రగ్స్ సరఫరాలో తన ప్రమేయానికి సంబంధించిన ఆరోపణలను గిల్ గతంలోనే ఖండించారు.
2021 ఏప్రిల్‌లో సిడ్నీ శివారులోని క్రెమోర్న్‌లో దుండగులు తనను బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్లారని పోలీసులకు గిల్ చెప్పారు. ఆ ఘటన తర్వాత ఆయన అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కారు.
తనను నగర శివారులోని ఓ మారుమూల ప్రాంతానికి కారులో తీసుకెళ్లి కొట్టారని, గన్‌ను గురిపెట్టి చంపుతామని బెదిరించారని ఆయన పోలీసులకు తెలిపారు.
తర్వాత మరో చోట తనను వదిలేసి వెళ్లారని ఆయన చెప్పారు.
ఆ ఘటనలో మాక్‌గిల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మెడికల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు.
కిడ్నాప్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాక్‌గిల్ మాట్లాడుతూ, ‘‘నేను ఏ తప్పూ చేయలేదు’’ అని అన్నారు.
అప్పుడు పోలీసులు కూడా ఆయనొక బాధితుడు అని చెప్పారు.
ఈ ఘటనలో ఆరుగురిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అందులో గిల్ మాజీ భాగస్వామి సోదరుడు కూడా ఉన్నారు.
కానీ, రెండేళ్ల దర్యాప్తు తర్వాత పోలీసులు ఇప్పుడు మాక్‌గిల్‌పై కూడా నేరారోపణలు మోపారు. భారీ మొత్తంలో నిషేధిత మాదకద్రవ్యం సరఫరాలో గిల్ పాల్గొన్నట్లు పోలీసులు ఆరోపించారు.
ఈ డీల్ రూ. 2.49 కోట్లకు పైగా విలువ చేసే కొకైన్‌కు సంబంధించినదని స్థానిక మీడియా పేర్కొంది.
బెయిల్‌పై మాక్‌గిల్ విడుదలయ్యారు. అక్టోబర్ 26న కోర్టుకు హాజరవుతారు.
ఒకానొక సమయంలో ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన మాక్ గిల్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున 1998 నుంచి 2008 వరకు స్పిన్నర్‌గా ఆడారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)