''ఉరిశిక్ష అమలు చేయటానికి తలారి కావలెను...'': ప్రెస్‌రివ్యూ

దేశంపై దాడికి దిగిన ఉగ్రవాదుల్ని మినహాయిస్తే.. అత్యాచారం కేసులో సరిగ్గా 15 ఏళ్ల కిందట ధనుంజయ్ ఛటర్జీని ఉరితీశారని 'సాక్షి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నిర్భయ అత్యాచారం కేసులో దోషులకి రేపో మాపో ఉరిశిక్ష అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ.. ఈ శిక్షని అమలు చేయడానికి తలారీలు కరవయ్యారు. అందులోనూ నిర్భయ దోషుల్ని ఉంచిన దిల్లీలోని తీహార్ జైలుకి అధికారికంగా తలారి ఎవరూ లేరు.

మన దేశంలో తలారీ వృత్తి కూడా వంశపారంపర్యంగా వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో మీరట్ జైల్లో పవన్ అనే తలారి అధికారికంగా ఈ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం 56 ఏళ్ల వయసున్న పవన్ నెలకి రూ. 3,000 జీతంతో పనిచేస్తున్నారు.

ఆయన తండ్రి కల్లు, తాత లక్ష్మణ్ కూడా తలారీలే కావటంతో చిన్నప్పటి నుంచీ ఉరిశిక్ష అంటే ఏమిటి, దానిని అమలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది పవన్‌కి బాగా తెలుసు. పవన్ తాత లక్ష్మణ్.. ఇందిరాగాంధీ హంతకుల్ని ఉరితీశారు. పవన్ తండ్రి కల్లు.. కరడుగట్టిన నేరస్తులు రంగా, బిల్లాలను ఉరితీశారు.

ఇప్పుడు తీహార్ జైలు నుంచి అధికారికంగా పవన్‌కి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా.. నిర్భయ నిందితుల్ని ఉరితీయటానికి పవన్ సిద్ధమవుతున్నారు.

మరోవైపు సిమ్లాకు చెందిన రవికుమార్ అనే కూరగాయల వ్యాపారి.. నిర్భయ హంతకుల్ని ఉరితీస్తానంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు.

అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరం కాదు: మద్రాసు హైకోర్టు

అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం చెప్పలేదని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించినట్లు 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు లాడ్జికి ఇటీవల జిల్లా అధికారులు సీలు వేశారు. ఓ గదిలో అవివాహిత జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉన్నాయనే కారణాలను పోలీసు, రెవెన్యూ అధికారులు చూపారు.

దీన్ని సవాల్ చేస్తూ లాడ్జి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి ఎం.ఎస్.రమేశ్ విచారించారు. పోలీసులు చెప్పే వివరణతో ఏకీభవించలేమని, అవివాహిత స్త్రీ, పురుషులు ఒకే గదిలో ఉండకూడదనే చట్టం లేని నేపథ్యంలో అది ఎలా తప్పవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు.

లివింగ్ టుగెదర్ విధానంలో సహజీవనాన్ని నేరంగా ఎలా పరిగణించలేమో.. అలాగే లాడ్జిలోని ఒకే గదిలో అవివాహిత జంట ఉండటాన్ని నేరంగా చూడలేమని స్పష్టంచేశారు.

మరో గదిలో మద్యం సీసాలు ఉండటంతో ఆ లాడ్జి అక్రమంగా బార్ నిర్వహిస్తోందనీ చెప్పలేమని పేర్కొన్నారు. తమిళనాడు మద్యపాన చట్టం ప్రకారం ఓ వ్యక్తి స్వదేశంలో తయారైన విదేశీ మద్యం లీటరు, ఏడు లీటర్ల బీరు, 9 లీటర్ల వైన్ కలిగి ఉండటానికి అనుమతి ఇచ్చిందన్నారు.

లాడ్జి మూసివేతలో చట్ట ప్రకారం నిబంధనలు పాటించలేదని.. అందువల్ల సీలు తొలగించాలని కోయంబత్తూరు కలెక్టరును న్యాయమూర్తి ఆదేశించారు.

15 ఏళ్లకు ఫేస్‌బుక్‌ ద్వారా ఆచూకీ!

పదిహేనేళ్ల కిందట అదృశ్యమైన మూడేళ్ల బాలికను.. ఫేస్‌బుక్‌ ఇప్పుడు తల్లిదండ్రుల చెంతకు చేర్చిందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలపింది.

ఆ కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లికి చెందిన కోడిపెట్ల మాధవరావు, వరలక్ష్మి దంపతులు పన్నెండేళ్ల కిందట ఉపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లారు. వీరికి సంతోష్‌, గోపీ అనే ఇద్దరు కుమారులతో పాటు భవానీ అనే కుమార్తె ఉండేది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా.. అన్న సంతోష్‌ బడికి వెళ్తుంటే వెంటపడిన భవానీ దారి తప్పింది. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ కానరాలేదు.

సీన్‌ కట్‌ చేస్తే.. ఓ ఇంటి గేటు వద్ద ఏడుస్తుండగా జయమ్మ అనే మహిళ భవానీని చేరదీసింది. అప్పటికే ఇద్దరు కుమార్తెలున్నా.. భవానీని కూడా కన్నబిడ్డలా సాకింది. ఇంటర్‌ వరకూ చదివించింది. ప్రస్తుతం భవానీకి 18 ఏళ్లు. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం జయమ్మ విజయవాడకు మకాం మార్చింది. ఇటీవల జయమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. దీంతో భవానీ ఓ ఇంట్లో పనికి కుదిరింది.

తన చిన్ననాటి విషయాలను ఇంటి యజమాని మోహన్‌ వంశీకి చెప్పి భవానీ కన్నీటిపర్యంతమైంది. దీంతో సదరు యజమాని ఫేస్‌బుక్‌లో వివరాలు ఉంచడంతో పాటు భవానీ సోదరుల పేరుతో సెర్చ్‌ చేశారు. దీంతో కొన్ని వివరాలతో పాటు ఫోన్‌ నంబర్లు లభ్యమయ్యాయి.

ఆ నంబర్లకు ఫోన్‌ చేయగా భవానీ సోదరులు సంతోష్‌, గోపీ లైన్‌లోకి వచ్చారు. తనకు ఓ చెల్లి ఉండేదని, ఆమె పేరు భవానీ అని, చిన్నతనంలో తప్పిపోయిందని సంతోష్‌ చెప్పాడు. హైదరాబాద్‌ నుంచి తాము కూడా స్వగ్రామానికి వచ్చేశామని తెలిపారు. ఇటు భవానీ చెప్పిన వివరాలు, అటు సంతోష్‌ చెప్పిన వివరాలు సరిపోలడంతో వీడియో కాల్‌ చేశారు. వారితో భవానీని మాట్లాడించారు.

తల్లిదండ్రులు, సోదరులను చూసి భవానీ భావోద్వేగానికి లోనైంది. ఇక లేదనుకున్న కుమార్తె 15 ఏళ్ల తర్వాత కనిపించడంతో వారూ ఆనంద పరవశులయ్యారు. భవానీని తీసుకెళ్లడానికి చీపురుపల్లి నుంచి తల్లిదండ్రులు విజయవాడకు బయలుదేరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)