You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Deepfake: ‘పోర్న్ వీడియోలలో నా ముఖాన్ని మార్ఫింగ్ చేసి చూపించారు'
- రచయిత, సారా మెక్ డెర్మాట్, జెస్ డెవీస్
- హోదా, బీబీసీ న్యూస్
మీకు తెలియకుండా, చెప్పకుండా మీ ముఖాన్ని పోర్న్ వీడియోలో మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్ పెట్టారనుకోండి. మీకేమనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి భయానక అనుభవాన్నే ఎదుర్కొన్న ఓ మహిళ, తన అనుభవాన్ని వెల్లడించారు.
కేట్ ఇసాక్స్ తన ట్విటర్ ఖాతాను స్క్రోలింగ్ చేస్తుండగా ఓ వీడియో దగ్గర ఆగిపోయారు. ''నా కాళ్ల కింద భూమి కంపించి పోయింది. ఎవరో నా ముఖాన్ని పోర్న్ వీడియోకు జతచేసి అచ్చం నాలాగే కనిపించేలా చేశారు'' అని కేట్ వెల్లడించారు.
ఇలా చేయడాన్ని డీప్ ఫేక్ అంటారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఒకరి ముఖం స్థానంలో ఇంకొకరి ముఖానికి అతికించి, వారే వీరు అని నమ్మింపజేస్తారు. ఇక్కడ కేట్ ముఖాన్ని ఒక పోర్న్ వీడియోకు జత చేశారు.
అనుమతి లేకుండా రూపొందించే ఇలా పోర్న్ వీడియోలకు వ్యతిరేకంగా కేట్ పోరాడుతున్నారు. టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూల నుంచి ఆమె ముఖాన్ని కొందరు ఫొటో తీసుకుని ఈ పోర్న్ వీడియోలో వాడారు. ఈ వీడియోలో ఆమె సెక్స్ చేస్తున్నట్లు కనిపిస్తారు.
''నా గుండె బద్ధలైంది. ఈ వీడియో అందరికీ చేరితే ఏమవుతుంది, అదో భయంకరమైన అనుభవం'' అన్నారామె.
గతంలోనూ ఇలాగే..
గతంలో చాలామంది సెలెబ్రిటీలు ఇలా డీప్ ఫేక్ కు గురయ్యారు. అయితే, ఈ వీడియోలన్నీ కేవలం పోర్న్ కోసమే ఉపయోగించినవి కావు. కామెడీ కోసం కొన్నింటిని ఉపయోగిస్తుంటారు. అయితే, రానురాను ఈ డీప్ ఫేక్‌లో 96 శాతం ఇలా అనుమతి లేకుండా పోర్న్ వీడియోలకు వాడడం కనిపిస్తోందని సైబర్ సెక్యురిటీ సంస్థ డీపాట్రేస్ వెల్లడించింది.
రివెంజ్ పోర్న్ లాగా, డీప్ ఫేక్ పోర్నోగ్రఫీని ఇమేజ్ ఆధారిత సెక్సువల్ అబ్యూస్ గా పిలుస్తున్నారు. వ్యక్తుల సమ్మతి లేకుండా వారి వ్యక్తిగత ఫొటోలను తీసుకోవడం, మార్ఫింగ్, డీప్ ఫేక్ చేసి ఆన్‌లైన్‌లో షేర్ చేయడం ఇందులో భాగంగా ఉంటుంది.
స్కాట్లాండ్ లాంటి దేశాలలో వ్యక్తుల అనుమతులు లేకుండా ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేయడం చట్టరీత్యా నేరం. అయితే యూకేలోని కొన్ని ప్రాంతాలలో ఇలాంటి చర్యల వల్ల ఆ ఫొటోలలోని వ్యక్తులు వేదనకు గురైనట్లుగా నిరూపించినప్పుడే అది శిక్షార్హమైన నేరంగా మారుతుంది. చట్టంలోని ఇలాంటి లోపాలను ఉపయోగించుకుని, ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నవాళ్లు తప్పించుకోగలుగుతున్నారు.
ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు యూకే ప్రభుత్వం ఆన్‌లైన్ సేఫ్టీ బిల్ తీసుకురావాలని భావిస్తున్నా, అది ముందుకు సాగడం లేదు. పదే పదే వాయిదా పడుతోంది.
కేట్ పోరాటం ఎవరిపై?
30 ఏళ్ల కేట్, #NotYourPorn అనే ఉద్యమాన్ని 2019 నుంచి నడిపిస్తున్నారు. ఏడాది తర్వాత ఆమె ఉద్యమానికి ఫలితం అన్నట్లుగా, ప్రముఖ సెక్స్ వీడియోల సైట్ 'పోర్న్‌హబ్' అనధికారిక యూజర్ల నుంచి వచ్చే వీడియోలను తన సైట్ నుంచి తొలగించింది.
తన ఉద్యమం వల్ల ఇబ్బందులు పడ్డ వ్యక్తులే తనను ఇలా డీప్‌ఫేక్ చేశారని కేట్ అభిప్రాయపడ్డారు.
కేట్ తన ఫొటోను పోర్న్ వీడియోలలో వాడిన వ్యక్తి ఎవరు, ఆ వీడియోను ఇప్పటి వరకు ఎంతమంది చూశారు అన్న విషయాన్ని కనిపెట్టలేకపోయారు. ''నా అనుమతి లేకుండా నా ఫొటోలను వాడారు. ఇది కచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించడమే'' అని ఆమె అన్నారు.
ఆ వీడియో కింద వచ్చిన కామెంట్లు చాలా దారుణంగా ఉన్నాయి. కేట్ ఇంటి మీద దాడి చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడాలని, ఆ దాడిని, అత్యాచారాన్ని వీడియో తీసి వాటిని ఆన్‌లైన్ లో పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు.
''ఇలాంటి సమయాలలోనే ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఇలాంటి వీడియోలు చూస్తే వాళ్లేమనుకుంటారు'' అని కన్నీటి పర్యంతమయ్యారు కేట్. ఒక వ్యక్తి వివరాలు, ఇంటి అడ్రస్ లాంటివి అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేయడాన్ని డాక్సింగ్ అంటారు.
''నాకు పిచ్చెక్కినట్లయింది. నా అడ్రస్ వాళ్లకెలా తెలిసింది, తెలిసిన వాళ్లే ఈ పని చేశారా?'' అని ఆమె సందేహం వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆమె బాధితులకు సలహాలు, సూచనల ద్వారా సాయం చేస్తుంటారు. కానీ, తన స్థితికి తాను ఏమీ చేయలేక పోయారు.
ఈ వీడియోలను, తన అడ్రస్ వివరాలను ట్విటర్ నుంచి తొలగించారని ఆమె ఫ్రెండ్ ఒకరు చెప్పారు. కానీ, ఒకసారి డీప్ ఫేక్ పబ్లిష్ అయ్యాక, ఆన్‌లైన్ నుంచి వాటిని తొలగించడం చాలా కష్టమని కేట్‌కు తెలుసు.
మార్కెట్ ప్లేస్
ఆన్‌లైన్ ఫోరమ్‌లలో డీప్ ఫేక్‌ల కోసం ఒక మార్కెట్ ప్లేస్ ఉంది. కొంతమంది వ్యక్తులు తమ భార్యలు, ఇరుగుపొరుగువారు, సహోద్యోగుల డీప్‌ఫేక్ వీడియోల కోసం రిక్వెస్టులు పెడుతుంటారు. చెబితే నమ్మకపోవచ్చుగానీ, కొందరు తమ తల్లులు, చెల్లెళ్ల వీడియోల కోసం కూడా రిక్వెస్టులు పెడుతుంటారు.
అలా రిక్వెస్టులు పెట్టే వారికి ఎలాంటి వీడియో కావాలి, ఏయే యాంగిల్స్ తీస్తే మంచి వీడియోలు వస్తాయి అన్న సమాచారంతో పాటు వాటిని క్రియేట్ చేసినందుకు ఎంత ఖర్చవుతుందో కూడా అక్కడున్న కంటెంట్ క్రియేటర్లు చెబుతారు.
''ఇలాంటివి వారి ఊహలను వీడియోల రూపంలో నిజం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి'' అని గోర్కెమ్ అనే డీప్‌ఫేక్ కంటెంట్ క్రియేటర్ బీబీసీతో అన్నారు. ఆయన ఇంగ్లాండ్ కు చెందినవారు.
''నేను ఇష్టపడిన అమ్మాయిలను డీప్‌ఫేక్ చేశాను. అలాగే నా ఆఫీసులో పని చేసే వారిని కూడా చేశాను. వారిలో ఒకరు పెళ్లయినవారు కూడా. మరొకరు, వేరే వ్యక్తితో సంబంధం ఉన్నవారు. వారి వీడియోలు డీప్ ఫేక్ చేశాక ఆఫీసుకు వెళ్లాలంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ, నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఏమీ తెలియనట్లు నటించాను. నన్నెవరూ అనుమానించలేరు'' అన్నారు గోర్కెమ్.
ఇలాంటి వీడియోలు చేయడాన్ని ఆయన హాబీగా మార్చుకున్నారు. తర్వాత అలాంటి వీడియోలు చేసినందుకు ఆయనకు కమిషన్లు కూడా వస్తున్నాయి. ఇటీవల జూమ్ కాల్‌లో మాట్లాడిన ఓ మహిళను కూడా తాను డీప్ ఫేక్ చేసినట్లు గోర్కెమ్ వెల్లడించారు.
కొంతమంది మహిళలు బాధపడతారని, కొంతమంది మాత్రం సింపుల్‌గా అది ఫేక్ అని కొట్టిపారేస్తారని గోర్కెమ్ అన్నారు. నైతికంగా చూసినప్పుడు కూడా తనకు ఇందులో ఎలాంటి అభ్యంతరం కనిపించలేదని గోర్కెమ్ అన్నారు. ''నాకు దీని ద్వారా డబ్బులు వస్తున్నాయి. అందుకే చేస్తున్నాను'' అని గోర్కెమ్ తనను తాను సమర్ధించుకున్నారు.
గుర్తించడం అసాధ్యమా?
అత్యధిక డీప్‌ఫేక్ వీడియోలతో ఒక సైట్‌ను నిర్వహిస్తున్న ఓ వ్యక్తి దీనికి గురించి బీబీసీతో మాట్లాడారు. ఈ వీడియోలను డీప్ ఫేక్ చేసినట్లు గుర్తించడం దాదాపు అసాధ్యమని ఆయన అన్నారు. ఆయన నడిపించే వెబ్‌సైట్‌కు నెలకు 1 కోటీ 30 లక్షల మంది విజిటర్లు వస్తుంటారు.
ఆయన సైట్‌లో కనీసం 20 వేల వీడియోలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అమెరికా కేంద్రంగా ఈ సైట్‌ను నడపుతున్న ఆయన, తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.
ఇటీవలి కాలం వరకు ఈ డీప్‌ఫేక్ సాఫ్ట్‌వేర్ అంతగా అందుబాటులో ఉండేవి కావు. ఒక సగటు మనిషి ఇలాంటి వీడియోలు చేసే అవకాశం ఉండేది కాదు.
కానీ, ఇప్పుడు 12 సంవత్సరాలు దాటిన వారెవరైనా డజన్ల కొద్దీ అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకుని, సులభంగా డీప్‌ఫేక్ వీడియోలను తయారు చేయగలరు.
''ఇది చాలా భయంకరమైన విషయం. ఇది డార్క్ వెబ్ కాదు. మన కళ్లముందే, యాప్ స్టోర్ లలో ఇవి కనిపిస్తుంటాయి'' అన్నారు కేట్.
రాబోయే కాలంలో ఒకవేళ ఆన్‌లైన్ సేఫ్టీ బిల్ వచ్చినా, టెక్నాలజీని అది ఏమీ చేయలేకపోవచ్చని ఆమె భయపడుతున్నారు.
‘కంపెనీలు చర్యలు తీసుకోవాలి’
ఒక డీప్ ఫేక్ బాధితురాలిగా కేట్ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడింది. ఎదుటి మనిషిని నమ్మలేని స్థితికి చేరుకున్నారు.
తనపై ఇలాంటి దాడులకు దిగుతున్న వారు, తన నోరు మూయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె అర్ధం చేసుకున్నారు. ఒక దశలో ఈ పోరాటం నుంచి వెనకడుగు వేశారు.
అయితే, మళ్లీ ధైర్యం తెచ్చుకున్న పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ''వాళ్లు గెలిచే అవకాశం ఇవ్వను'' అన్నారామె.
అప్లికేషన్లు తయారు చేస్తున్న కంపెనీలు సేఫ్‌గార్డ్స్‌ను దృష్టిలో పెట్టుకుని పని చేయాలని, సెక్సువల్ కంటెంట్‌ను గుర్తించేలా టెక్నాలజీని తీర్చి దిద్దాలని ఆమె సూచిస్తున్నారు.
''కంపెనీలు కేవలం డబ్బు సంపాదించడం మీదనే దృష్టి సారించడం మంచిది కాదు. వాళ్ల అప్లికేషన్‌లు సెక్స్ కంటెంట్ తయారు చేసే వారికి ఆయుధంగా మారకూడదు. అలా చేసేందుకు అవకాశమిచ్చారంటే, ఆ కంపెనీలు కూడా ఇందులో భాగస్వాములైనట్లే '' అన్నారు కేట్.
డీప్ ఫేక్ కు గురైతే ఏం చేయాలి?
వివరాలు సేకరించాలి: కొందరు ప్రచురించిన వెంటనే వాటిని డిలీట్ చేసే అవకాశం ఉంది. అందుకని వెంటనే వీడియోలను డౌన్ లోడ్ చేయడం, స్క్రీన్ షాట్లు తీసుకోవడం, డేట్, టైమ్ లను రికార్డు చేయడం, యూజర్ నేమ్, యూఆర్ఎల్‌లను సేకరించి వాటిని ఒక ఫోల్డర్ భద్రపరచాలి.
ఫిర్యాదు చేయాలి: వివరాలు సేకరించిన తర్వాత, ఏం జరిగిందో, బాధ్యులెవరో స్పష్టంగా రాసి పెట్టుకోవాలి.
పోలీసులను కలవాలి: పోలీసులను కలిసి మీరు రికార్డు చేసిన వివరాలను, ఫిర్యాదును ఇవ్వాలి.
ఇవి కూడా చదవండి:
- మహిళలపై ఆర్ఎస్ఎస్ వైఖరి మారుతోందా... బీజేపీకి ఓట్ల కోసమే అలా చేస్తున్నారా?
- లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా? ఈ వైరస్ మనుషులకూ సోకుతోందా? దేశంలో ఎందుకిన్ని వదంతులు?
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)