లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు

లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించారు. అంతకు ముందు, ఆమె ఆరు వారాల పాటు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఇంత స్వల్పకాలంలో ఆమె ఎందుకు రాజీనామా చేశారు? ఏం జరిగింది? బ్రిటన్ ప్రస్తుత రాజకీయల గురించి తెలుసుకోవాల్సిన ఎనిమిది పాయింట్లు ఇవే..

అతి తక్కువ కాలం ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి

జూలైలో బోరిస్ జాన్సన్ రాజీనామా అనంతరం జరిగిన టోరీ ఎన్నికల్లో లిజ్ ట్రస్ గెలిచారు. ఆమె సెప్టెంబర్ 6న కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షురాలిగా, బ్రిటన్ ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చారు.

సరిగా 45 రోజుల తరువాత ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దాంతో, బ్రిటన్‌కు అతి తక్కువ కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి లిజ్ ట్రస్ అయ్యారు.

అంతకుముందు, 1827లో జార్జ్ కానింగ్ 119 రోజుల పాటు ప్రధానిగా వ్యవహరించారు.

చాలా త్వరగా సమస్యల్లోకి జారుకున్నారు

లిజ్ ట్రస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడవ వారంలో ఆమె ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్ 45 బిలియన్ పౌండ్ల పన్ను తగ్గింపులను ప్రవేశపెట్టారు. దీన్ని వారు "మిని-బడ్జెట్" అని పిలిచారు.

అయితే, ఈ ప్రణాళిక తీవ్ర ఆర్థిక పరిణామాలకు దారితీసిందనే విమర్శలు ఎదుర్కొంది.

ఇప్పుడు ఆ సొమ్మంతటినీ వెనక్కి తీసుకున్నారు. క్వార్టెంగ్‌ను ఛాన్సలర్‌గా తొలగించారు.

ఆమె ప్రభుత్వంలోని ఎంపీలే ఆమెను బహిరంగంగా విమర్శించారు

లిజ్ ట్రస్ రాజీనామా చేయాలని పలువురు టోరీలు డిమాండ్ చేశారు. ఆమె హోం సెక్రటరీ సుయెల్లా బ్రెవర్‌మన్ రాజీనామా చేశారు. ఈ ఖాళీలను పూరించేందుకు తన పూర్వ ప్రత్యర్థులైన గ్రాంట్ షాప్స్, జెరెమీ హంట్‌లను లిజ్ ట్రస్ నియమించుకోవాల్సి వచ్చింది.

'ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయాను'

లిజ్ ట్రస్ డౌనింగ్ స్ట్రీట్ వెలుపల ఇచ్చిన రాజీనామా ప్రసంగంలో, "కన్జర్వేటివ్ పార్టీ తనను ఏ ప్రాతిపదికపై ఎన్నుకుందో, దానిని నెరవేర్చలేకపోయానని" అన్నారు.

మాజీ ఛాన్సలర్ రిషి సునాక్‌ను ఓడించి ప్రధానమంత్రి అయ్యారు

కన్జర్వేటివ్ ఎంపీలు, పార్టీ సభ్యులు మాత్రమే ఓటు వేసిన ఎన్నికల్లో రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. కానీ, చివరి ఫలితాలు లిజ్ ట్రస్‌కు అనుకూలంగా వచ్చాయి. దాంతో ఆమె ప్రధాని అయ్యారు.

తరువాతి ప్రధాని ఎవరు?

వచ్చే వారంలోగా మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. కొత్త నాయకుడిని ఎన్నుకునేవరకు లిజ్ ట్రస్ ప్రధానిగా కొనసాగుతారు.

క్వీన్ ఎలిజెబెత్ 2 నియమించిన చివరి ప్రధాని ఆమె

క్వీన్ ఎలిజబెత్ 2 మరణించడానికి కొన్ని రోజుల ముందే లిజ్ ట్రస్‌ను బ్రిటన్ ప్రధానిగా నియమించారు. లిజ్ ట్రస్ నాయకత్వం రాణి అంత్యక్రియలతో ప్రారంభమైంది.

ఆర్థికవేత్తగా పనిచేశారు

యూనివర్సిటీ చదువుల అనంతరం, లిజ్ ట్రస్ షెల్ అండ్ కేబుల్ & వైర్‌లెస్ సంస్థలో ఆర్థికవేత్తగా పనిచేసారు. 2000లో అకౌంటెంట్ హ్యూ ఓ లియరీని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఆమె కుటుంబం నార్ఫోక్‌లోని థెట్‌ఫోర్డ్‌లో నివసిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)