You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
- రచయిత, పవన్ సింగ్ అతుల్
- హోదా, బీబీసీ కోసం
పాకిస్తానీ తీవ్రవాది హఫీజ్ తల్హా సయీద్‌ను ఐక్యరాజ్య సమితి బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంది. పాకిస్తాన్‌లో ఉన్న తీవ్రవాద సంస్థలు, వాటి నాయకులపై ఐక్యరాజ్య సమితి ద్వారా ఆంక్షలు విధించేందుకు భారత్, అమెరికాలు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలోని అయిదు శాశ్వత సభ్య దేశాలలో ఒకటైన చైనా ఈ ప్రయత్నాలను అనేకసార్లు వీటో చేసింది.
గత రెండు దశాబ్దాలుగా పాకిస్తాన్, చైనాల మధ్య దౌత్యపరమైన సాన్నిహిత్యం పెరుగుతుండడంతో ఇరు దేశాల మధ్య సహకారం కూడా పెరిగింది.
గత నాలుగు నెలల్లో, పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాదులను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు జరిగిన అయిదు ప్రయత్నాలనూ చైనా అడ్డుకుంది.
ఇంతకీ, భారత్, అమెరికాలు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ తీవ్రవాదుల జాబితాలో చేర్చాలనుకుంటున్న ఆ అయిదుగురు టెర్రరిస్టులు ఎవరు?
1. హఫీజ్ తల్హా సయీద్
లష్కరే తోయిబా చీఫ్, ముంబై దాడుల ప్రధాన నిందితుడు హఫీజ్ సయీద్ కుమారుడే హఫీజ్ తల్హా సయీద్ (46). పాకిస్తాన్‌కు చెందిన ఒక తీవ్రవాదిని ఐక్యరాజ్య సమితి బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు భారతదేశం ప్రయత్నాలను చైనా అడ్డుకోవడం గత కొద్ది రోజుల్లో ఇది రెండోసారి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం హఫీజ్ తల్హా సయీద్‌ను తీవ్రవాదిగా ప్రకటించింది. అయితే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి '1297 అల్ ఖైదా ఆంక్షల కమిటీ' కింద సయీద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే తీర్మానాన్ని ఆమోదించడానికి చైనా నిరాకరించింది.
హఫీజ్ తల్హా సయీద్ భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు భారత్, అఫ్గానిస్తాన్‌లలో తీవ్రవాదుల ఎంపిక, నిధుల సేకరణ, దాడులలో చురుకుగా పాల్గొంటున్నాడని భారత హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పాకిస్తాన్‌లోని లష్కర్ కేంద్రాలను సందర్శిస్తూ భారత్, ఇజ్రాయెల్, అమెరికాలపై జిహాద్ ప్రకటించడం గురించి మాట్లాడుతున్నాడని పేర్కొంది.
హఫీజ్ తల్హా సయీద్ లష్కర్ సీనియర్ నాయకుడే కాకుండా, ఆ తీవ్రవాద సంస్థ మతపరమైన విభాగానికి అధిపతి కూడా.
అంతకుముందు మంగళవారం, ఐక్యరాజ్య సమితి బ్లాక్‌లిస్ట్‌లో లష్కరే తోయిబా నాయకుడు షాహిద్ మెహమూద్‌ను చేర్చాలని భారత్, అమెరికాలు కోరాయి. కానీ, ఈ ప్రయత్నాలను కూడా చైనా అడ్డుకుంది.
2.షాహిద్ మెహమూద్
2016 డిసెంబర్‌లో అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ మెహమూద్‌తో పాటు మరో లష్కరే నాయకుడు మహ్మద్ సర్వర్‌ను తీవ్రవాదులుగా ప్రకటించింది.
అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, కరాచీలో నివసిస్తున్న మెహమూద్ చాలా కాలంగా లష్కరే సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఆయన 2007 నుంచి ఈ తీవ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు.
మెహమూద్ 2015 జూన్ నుంచి 2016 జూన్ వరకు లష్కరే తోయిబాకు నిధుల సేకరించే సంస్థ 'ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్' వైస్-ఛైర్మెన్‌గా ఉన్నారు. దీనికి ముందు, 2014 సంవత్సరంలో కరాచీ ప్రాంతంలో ఈ సంస్థకు అధిపతిగా ఉన్నారు.
అమెరికా అందించిన వివరాల ప్రకారం, 2013 ఆగస్టులో లష్కర్ ప్రచురణ విభాగంలో సభ్యునిగా మెహమూద్ గుర్తింపు బయటికొచ్చింది. దీనికి ముందు, మొహమూద్ లష్కర్ విదేశీ కార్యకలాపాల అధిపతి సాజిద్ మీర్ బృందంతో కలిసి పని చేసేవాడని తెలిపింది.
2013 ఆగస్టులో బంగ్లాదేశ్, మియాన్మార్ లలోని ఇస్లామిక్ సంస్థల మధ్య సంబంధాలను నెలకొల్పే పనిని ఆయనకు అప్పగించారు.
భారతదేశం, అమెరికాలపై దాడి చేయడమే లష్కరే తోయిబా ప్రధాన లక్ష్యమని మొహమూద్ చెప్పినట్టు అమెరికా వెల్లడించింది.
3.అబ్దుల్ రెహ్మాన్ మక్కీ
ఈ ఏడాది జూన్‌లో పాకిస్తానీ తీవ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐక్యరాజ్య సమితి బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు భారత్, అమెరికాలు చేసిన ప్రయత్నాన్ని చైనా చివరి నిమిషంలో ఆపేసింది.
మక్కీని ఇప్పటికే అమెరికాలో తీవ్రవాదిగా ప్రకటించారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు మక్కీ బావమరిది.
జమాత్-ఉద్-దవాలో మక్కీ రెండవ నాయకుడు. హఫీజ్ సయీద్ అనారోగ్యం కారణంగా, మక్కీ అనేక రూపాలలో తానే ఆ సంస్థకు అధిపతి అన్న స్థాయిలో పని చేస్తున్నారు.
లష్కరే తోయిబా శిక్షణా శిబిరాలకు మక్కీ నిధులు సమకూరుస్తారని అమెరికా వెల్లడించింది. 2007 సంవత్సరంలో ఒక శిక్షణా శిబిరానికి మక్కీ సుమారు 2.5 లక్షల అమెరికా డాలర్లు ఇచ్చారు.
అలాగే, లష్కర్‌తో సంబంధం ఉన్న ఒక మదరసాకు లక్షా అరవై ఐదు వేల అమెరికన్ డాలర్లను అందించారు. జమాత్-ఉద్-దవా ప్రధాన బృందంలో మక్కీ భాగం. షురా సభ్యుడు కూడా. లష్కరే తోయిబా కోసం నిధులు సేకరించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది.
మక్కీ, తీవ్రవాద సంస్థలకు నిధులు సేకరించడమే కాకుండా, భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్‌లోని యువకులను ప్రేరేపిస్తారని భారత్ ఆరోపిస్తోంది.
మక్కీని చాలా పేర్లతో పిలుస్తారని అమెరికా 'రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం' వెల్లడించింది. హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ అనీ, అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ అనీ పిలుస్తారు. మక్కీపై అమెరికా 20 లక్షల డాలర్ల రివార్డును ప్రకటించింది.
4.అబ్దుల్ రవూఫ్ అజహర్
ఆగస్టులో, జైష్-ఎ-మహ్మద్ సీనియర్ నాయకుడు అబ్దుల్ రవూఫ్ అజహర్‌ను నిషేధించే ప్రతిపాదనను కూడా చైనా అడ్డుకుంది. అమెరికా 2010లో అజహర్‌ను తీవ్రవాదిగా ప్రకటించింది.
పాకిస్తానీయులు తీవ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలని అజహర్ పిలుపునిచ్చారని అమెరికా పేర్కొంది.
2007లో భారతదేశంలోని అత్యంత సీనియర్ జైష్ కమాండర్లలో అజహర్ ఒకడు. భారతదేశంలో జైష్‌కి ఎగ్జిక్యూటివ్ హెడ్‌గా కూడా వ్యవహరించారు.
2008లో అజహర్‌కు భారతదేశంలో ఫిదాయీన్ దాడులను నిర్వహించే పనిని అప్పగించారని అమెరికా తెలిపింది.
1999 డిసెంబర్‌లో కాఠ్‌మాండూ నుంచి దిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను హైజాక్ చేయడంతో అజహర్ ప్రపంచం దృష్టికి వచ్చాడు. జమ్మూలోని కోట్ బల్వాల్‌లో బందీగా ఉన్న మసూద్ అజహర్‌ను విడుదల చేయడమే ఈ హైజాక్ లక్ష్యం.
దీని తరువాత, 2000లో భారత పార్లమెంటుపై జరిగిన దాడిలో కూడా రవూఫ్ హస్తం ఉందని చెబుతున్నారు. 2016లో పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై ఉగ్రదాడి జరిగిన తరువాత, రవూఫ్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని భారత ఎన్‌ఐఏ ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తి చేసింది.
అనంతరం, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలనుకుంటున్న తీవ్రవాద ముఠాలో రవూఫ్ సభ్యుడు అని ఇంటర్‌పోల్ ఒక నోటీసులో పేర్కొంది.
5.సాజిద్ మీర్
సెప్టెంబరులో లష్కరే తోయిబా తీవ్రవాది సాజిద్ మీర్‌ను ఐక్యరాజ్య సమితి బ్లాక్ లిస్ట్‌లో చేర్చే ప్రయత్నాలను చైనా నిలువరించింది. మీర్ ముంబై 26/11 దాడుల్లో నిందితుడు.
2008 నవంబర్ 26న, భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 160 మందికి పైగా మరణించారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది.
సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుల జాబితాలో చేర్చాలని భారత్, అమెరికా కోరుకుంటున్నాయి. సాజిద్ మీర్ భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. సాజిద్‌పై అమెరికా 5 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.
ఈ ఏడాది జూన్‌లో, తీవ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరించినందుకు పాకిస్తాన్ కోర్టు సాజిద్‌కు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ జాబితా నుంచి బయట పడాలంటే తమ దేశం నుంచి తీవ్రవాద కార్యకలాపాలు జరగట్లేదని నిరూపించుకోవాలి.
సాజిద్ మీర్ చనిపోయాడని గతంలో పాకిస్తాన్ వాదించింది. అయితే పాశ్చాత్య దేశాలు దీనిని అంగీకరించలేదు. సాజిద్ మరణానికి రుజువు కావాలని పాకిస్తాన్‌ను కోరాయి.
ఎఫ్ఏటీఎఫ్ నుంచి బయటపడే ప్రయత్నాల్లో పాకిస్తాన్‌కు సాజిద్ మీర్ అంశం పెద్ద వివాదంగా మారింది.
2008లో ముంబైపై జరిగిన దాడుల్లో లష్కరే తోయిబా కార్యకలాపాలకు సాజిద్ మీర్ మేనేజర్‌గా ఉన్నారు. అమెరికా విదేశాంక మంత్రిత్వ శాఖ ప్రకారం, సాజిద్ ఈ దాడుల ప్రణాళిక, తయారీ, అమలులో ప్రముఖ పాత్ర పోషించారు.
2008 నవంబర్‌లో ముంబై దాడుల్లో పాల్గొన్న తీవ్రవాదిగా సాజిద్‌పై అమెరికా 5 మిలియన్ల డాలర్ల బహుమతిని ప్రకటించింది.
'కామన్ సెన్సుకు అందని చైనా వైఖరి'
ఈ సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ, "తీవ్రవాద కార్యకలాపాల సూత్రధారులను నిషేధించడం ద్వారా ఐక్యరాజ్య సమితి తీవ్రవాదానికి తగిన సమాధానం ఇస్తుంది. దీన్ని జరగనివ్వకుండా తప్పు చేస్తున్నారు. అలాంటి దేశాలు తమ సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోలేవు. తమ విశ్వసనీయతను మెరుగుపరచుకోలేవు" అని అన్నారు.
తీవ్రవాదాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించకూడదని జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్య సమితిలో ఏదైనా తీర్మానాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడం కామన్ సెన్సుకు అందని ధోరణి అని ఆయన పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.
అయితే, ఐక్యరాజ్య సమితిలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని కాదు. 2019 మే 2019 జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. ఇది భారతదేశానికి పెద్ద దౌత్య విజయం. కానీ, దీని కోసం కూడా భారత్ ఒక దశాబ్దం పాటు వేచి ఉండవలసి వచ్చింది.
ఐక్యరాజ్య సమితిలో చైనాకు వీటో అధికారం ఉంది. చైనా మద్దతు ఇవ్వకపోతే ఏ ప్రతిపాదికైనా ఆమోదం పొందడం అసాధ్యం. ఐక్యరాజ్య సమితిలో చైనాతో పాటు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్‌లకు వీటో అధికారం ఉంది.
ఇవి కూడా చదవండి:
- మునుగోడు ఉపఎన్నిక : ‘ఇక్కడ ఓటుకు ఎంఆర్పీ రేటును ఎలా నిర్ణయిస్తున్నారంటే...’’
- ఈస్టిండియా కంపెనీ: ‘పారిశ్రామిక దేశమైన భారత్‌ను వ్యవసాయంపై ఆధారపడే దేశంగా’ ఈ కంపెనీ ఎలా మార్చేసింది?
- క్యాసినోల్లోని పేకాట మెషీన్లను హ్యాక్ చేసి, కోట్లు కొట్టేస్తున్న గ్యాంబ్లింగ్ ముఠా.. ఆట కట్టించిన గణిత మేధావి
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకుంటున్నారా, ఈ 5 విషయాలూ గుర్తుంచుకోండి..
- మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మోదీ-షాలను ఢీ కొట్టగలరా, ఉత్తర భారత ప్రజలను ఆకట్టుకోగలరా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)