You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Rummy, Poker: క్యాసినోల్లోని పేకాట మెషీన్లను హ్యాక్ చేసి, కోట్లు కొట్టేస్తున్న గ్యాంబ్లింగ్ ముఠా.. ఆట కట్టించిన గణిత మేధావి
- రచయిత, షేన్ కీటింగ్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
పేకాట, జూదం సాగే క్యాసినోలలో ప్రత్యేకమైన మెషీన్‌లకు అద్దెకు ఇచ్చే కంపెనీ అది. ఆ మెషీన్లు పేక ముక్కలను కలుపుతాయి. కలపడమంటే ఏదో ఒకలా కాదు.. ముక్కలను ఎవరూ అంచనా వేయలేనంతలా.
అమెరికాలోని లాస్ వెగాస్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలలోని క్యాసినోలలో ఈ 'కార్డ్ షఫ్లింగ్ మెషీన్'లు నిత్యం కార్డులు కలుపుతుంటాయి. ఆ యంత్రాలకు అద్దె రూపంలో సంస్థ ఏటా వందల కోట్లు సంపాదిస్తోంది. స్టాక్ ఎక్స్చేంజ్‌లోనూ ఆ కంపెనీ లిస్ట్ అయింది.
అలాంటి కంపెనీకి చెందిన ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం... ముక్కలు కలిపే మిషన్లు కొన్ని హ్యాక్ అవడమే.
గ్యాంబ్లింగ్ ముఠా ఇలా వాడుకుంది
క్యాసినోలలో జూదమాడే ముఠా ఒకటి ఈ మెషీన్‌ను తెలివిగా వాడుకుందని కంపెనీ అధికారులు కనిపెట్టారు.
కార్డులు కలిపే ఈ యంత్రాలు ఉన్న చోట రహస్యంగా ఒక కెమేరా అమర్చి అవి ఎలా పనిచేస్తున్నాయో రికార్డు చేశారు వారు. అలా రికార్డు చేసిన చిత్రాలను క్యాసినో బయట పార్కింగ్ స్థలంలో అప్పటికే సిద్ధంగా ఉన్న ముఠా సభ్యుడికి పంపించేవారు.
అక్కడ వాటిని స్లో మోషన్లో ప్లే చేసి చూసి అందులోని సీక్వెన్స్‌ను కనిపెడతారు. వెంటనే ఆ సమాచారాన్ని క్యాసినోలో ఉన్న తమ ముఠా గ్యాంబ్లర్లకు చేరవేస్తారు. ఈ సమాచారం సహాయంతో వారు పక్కగా కార్డులను అంచనా వేసి జూదంలో డబ్బులు గెలుచుకుంటారు.
ఇలా చేయడం వల్ల గ్యాంగ్‌లోని గ్యాంబర్లు గెలుస్తూ డబ్బు సంపాదించేవారు. క్యాసినోకు మాత్రం తీవ్రమైన నష్టం వచ్చింది.
చివరకు వారు పట్టుబడే లోగానే క్యాసినో కోట్ల రూపాయల మేర నష్టపోయింది.
కంపెనీ ఏం చేసిందంటే..
ఈ ఘటన తరువాత షఫ్లింగ్ మెషీన్ల కంపెనీ జాగ్రత్త పడింది. పాత యంత్రాల స్థానంలో కొత్తవి తయారు చేసింది. వాటిని అంతకుముందులా బయటకు కనిపించేలా ఉంచకుండా కాంతి నిరోధక పెట్టెల్లో ఉంటూ పనిచేసేలా ఏర్పాటు చేసింది.
కార్డులను ఎప్పుడూ ఒకేలాంటి సీక్వెన్సులలో కలపకుండా ర్యాండమ్‌గా కలిపేలా సెట్టింగ్ మార్చారు.
అయితే, ఈ యంత్రాలు ముక్కలను ఎంత కచ్చితంగా కలుపుతున్నాయనే విషయంలో 'పెర్సీ డయకోనిస్' సాయం తీసుకుంది.
ఎవరీ పెర్సీ డయకోనిస్? ముక్కలు కలపడంలో ఇంతకంటే మొనగాళ్లు లేరా?
పెర్సీ డయకోనిస్ అంటే స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన గణిత మేధావి. ఆయన మెజీషియన్ కూడా. ముక్కలు కలపడంలో ప్రపంచంలోనే అత్యంత నేర్పరిగా, కార్డ్ షఫ్లింగ్ వెనుక ఉన్న గణిత మెలకువలలో దిట్టగా ఈయనకు పేరుంది.
పేక ముక్కలకు సంబంధించిన సాహిత్యంలో ఆయన పేరు ఎక్కువగా కనిపిస్తుంది. ముక్కలు కలపడంలో ట్రిక్‌లు, మెలకువలు, చేతివాటాలు, కనికట్టులు అన్నిటిలో ఆయన్ను మించినవారు ప్రపంచంలో ఎవరూ లేరంటారు.
అందుకే షఫ్లింగ్ మెషీన్ల కంపెనీ ప్రతినిధులు ఆయన్ను సంప్రదించారు. తమ మెషీన్లు కరెక్టుగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయమన్నారు. కంపెనీ నుంచి అలాంటి ప్రతిపాదన రాగానే పెర్సీ కూడా తనకు కలిగిన అదృష్టానికి ఆశ్చర్యపోయారు.
స్టాన్‌ఫర్డ్‌లో స్టాటిస్టియన్‌గా పనిచేసే సుసాన్ హోమ్స్‌తో కలిసి పెర్సీ.. లాస్ వెగాస్‌లోని ఆ కంపెనీ షో రూమ్‌కు వెళ్లారు. అక్కడ ఆ కొత్త మెషీన్‌ను పరిశీలించారు.
మెషీన్‌లోని ఒక లోపాన్ని పెర్సీ కనిపెట్టారు. షఫ్లింగ్ ర్యాండమ్‌గానే జరుగుతున్నప్పటికీ కలిపిన తరువాత ముక్కలు ట్రే పడే సమయంలో వాటి సీక్వెన్స్ అంచనా వేయడానికి వీలు కల్పించేలా డిజైన్ ఉందని వారు చెప్పారు.
వారు గుర్తించిన లోపం సరైనదేనని నిరూపించడానికి పెర్సీ, హోమ్స్ ఒక గణిత నమూనా రూపొందించారు. దాని ఆధారంగా వారు ఈ కొత్త మెషీన్ కలిపే కార్డులలో 9 నుంచి 10 ముక్కలను కరెక్టుగా అంచనా వేయగలిగారు.
మొత్తం కార్డులలో 9 నుంచి 10ని కరెక్టుగా అంచనా వేయగలిగితే ఆటలో పైచేయి సాధించే అవకాశాలు చాలా ఎక్కువే అవుతాయి.
పెర్సీ పరిశీలించి లోపాలు గుర్తించిన తరువాత కంపెనీ ఈ కొత్త మెషీన్లను పక్కన పెట్టి వేరేది తయారు చేసే పనిలో పడింది.
13 ఏళ్ల వయసు నుంచే..
పెర్సీ డయకోనిస్ తన 13 ఏళ్ల వయసులో 1958లో అనుకోకుండా పేక ముక్కలపై ఆసక్తి పెంచుకున్నారు.
న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఉండే టానెన్స్ మేజిక్ ఎంపోరియంలో అలెక్స్ ఎమ్స్‌లీ అనే స్కాటిష్ కంప్యూటర్ సైంటిస్ట్‌ను పెర్సీ అప్పుడు కలిశారు.
కార్డులను కచ్చితంగా కలపడంలో అలెక్స్‌కి అప్పటికే పేరుంది.
అలెక్స్ నుంచి కార్డ్ షఫ్లింగ్ నేర్చుకున్నారు పెర్సీ.
ఆ తరువాత ఏడాది.. అంటే తన 14 ఏళ్ల వయసులో పెర్సీ ఇంటి నుంచి పారిపోయి ఒక మెజీషియన్ వద్ద చేరి కార్డులు కలిపే టెక్నిక్‌లు మరిన్ని నేర్చుకోవడం ప్రారంభించారు.
ఆయనతో పదేళ్ల పాటు తిరిగి పేక ముక్కలతో అన్ని రకాల ట్రిక్కులు, మేజిక్కులు నేర్చుకున్నారు పెర్సీ.
అలెక్స్‌తో తన తొలి సంభాషణ పెర్సీలో విపరీతమైన ఆసక్తి కలిగించింది. ఆ క్రమంలోనే ఆయన ఈ విద్యపై పట్టు పెంచుకున్నారు.
ఎనిమిది సార్లు కలిపిన తరువాత ఎక్కడ ముక్క అక్కడే..
ముక్కలను కలపడంలో ఒక ప్రాథమిక టెక్నిక్ ఎక్కువగా పాటిస్తారు. అదేంటంటే.. మొత్తం 52 పేక ముక్కలను 26 చొప్పున రెండు భాగాలుగా చేస్తారు. ఒక చేతిలో 26 ముక్కలు, మరో చేతిలో ఇంకో 26 ముక్కలను పట్టుకుని ఒకదాని తరువాత ఒకటి రెండు చేతుల నుంచి జార విడుస్తూ కలుపుతారు. అంటే మొదట కుడి చేతిలోని ముక్క తరువాత ఎడమ చేతిలోని ముక్క.. మళ్ళీ కుడి చేతిలో ముక్క తరువాత ఎడమ చేతి నుంచి జారవిడిచిన ముక్క... ఇలా నిర్దిష్టమైన క్రమంలో అవన్నీ కలుస్తాయి.
ఇలా కచ్చితంగా చేయడాన్ని 10 సెకండ్లలోపే పూర్తి చేయగలిగేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో పెర్స్ డయకోనిస్ ఒకరు.
పేకాటలో ముక్కలను ఇలా కలిపే పద్ధతిని జూదగాళ్లు, ఇంద్రజాలికులు వందల ఏళ్లుగా పాటిస్తున్నారు. ఇలా చేయడమంటే ముక్కలను ర్యాండమ్‌గా కలపడమని.. దీని వల్ల ముక్కలను అంత సులభంగా అంచనా వేయలేరన్న భ్రమ చాలామందికి ఉంటుంది. కానీ, ఇది పూర్తిగా ర్యాండమ్ విధానం కాదు.
ర్యాండమ్ షఫ్లింగ్‌గా చెప్పే ఈ విధానంలో ముక్కలను వరుసగా ఎనిమిది సార్లు కచ్చితంగా కలిపితే ముక్కలన్నీ వాటి పూర్వ క్రమంలోకి వచ్చేస్తాయి.
కాబట్టే ఇది ర్యాండమ్ విధానం కాదు అంటారు గణిత నిపుణులు.
పెర్సీ చేసి చూపించారు..
పెర్సీ డయకోనిస్ కూడా దీన్ని అనేకసార్లు నిరూపించారు. ఆయన 52 ముక్కలున్న కొత్త పేక దస్తా తీసుకుని ఈ ప్రయోగం చేస్తారు. పేక దస్తాకు ఒక వైపు నల్ల రంగులో పెద్ద అక్షరాలతో RANDOM అని రాసిన తరువాత ఆయన ముక్కలు కలపడం ప్రారంభిస్తారు.
ఒక్కోసారి ముక్కలు కలుపుతుంటుంటే దస్తాపై కనిపించే RANDOM అనే అక్షరాలు చెదిరిపోతుంటాయి. అయితే, 8 సార్లు వరుసగా ముక్కలను కలిపిన తరువాత దస్తాపై మళ్లీ RANDOM అనే అక్షరాలు కనిపిస్తాయి.
రైఫిల్ షఫిల్
ముక్కలను కలపడంతో రైఫిల్ షఫిల్ అనే మరో విధానాన్ని వాడుతుంటారు కొందరు. దీన్ని అధ్యయనం చేయడానికి 'మార్కోవ్ చైన్' అనే ఒక గణిత విధానాన్ని పెర్సీ వాడేవారు.
రైఫిల్ షఫిల్ పద్ధతిలో కలిపినప్పుడు రెండు చేతుల నుంచి జారే ముక్కలు ఒకదాని తరువాత ఒకటి క్రమ పద్ధతిలో కాకుండా ఇష్టమొచ్చినట్లుగా కలుపుతారు.
దీనివల్ల ముక్కలు అంచనావేయడం చాలా కష్టమవుతుంది.
తమ సెర్చ్ ఇంజిన్ ఫలితాల ఆధారంగా వెబ్ పేజీలకు ర్యాంకులివ్వడంలో గూగుల్ అల్గారిథమ్ మార్కోవ్ చైన్ విధానంపైనే ఆధారపడి పనిచేస్తుంది.
ఈ రైఫిల్ షఫ్లింగ్‌పై పెర్సీ కొలంబియా యూనివర్సిటీ గణిత శాస్త్రవేత్త డేవ్ బేయర్‌తో కలిసి అధ్యయనం చేశారు.
అన్ని ట్రిక్కులు తెలిసిన పెర్సీ ఆ ఆట ఎందుకు ఆడరంటే..
క్యాసినోలు నడిపేవారు పెర్సీ డయకోనిస్ అధ్యయనాలను పెద్దగా పట్టించుకోనప్పటికీ ఆయన ప్రభావం గణిత శాస్త్రవేత్తలు, కంప్యూటర్ సైంటిస్టులపై చాలా ఉంది.
2020 జనవరిలో స్టాన్‌ఫర్డ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పెర్సీ 75వ జన్మదిన వేడుకలు జరిపి ఆయన్ను సత్కరించారు.
పేక ముక్కలపై అపారమైన పట్టున్న పెర్సీ ఎన్నడూ ఆ ఆటను పట్టించుకోరు. డబ్బు సంపాదించడానికి అనేక ఇతర మార్గాలుంటాయి అని ఆయన అంటారు.
అయితే, ముక్కలను అంచనా వేసే తెలివితేటలను ఆటలో వాడేవారిపైనా ఆయన ఎన్నడూ అసంతృప్తి వ్యక్తంచేయరు. అందులో తప్పేమీ లేదంటారాయన. ''బుర్ర ఉపయోగించడం మోసం చేయడం ఒకటి కాదు.. బుర్ర ఉపయోగించడం బుర్ర ఉపయోగించడమే' అంటారు ఆయన.
(షేన్ కీటింగ్ సైన్స్ రచయిత. సిడ్నీలోని న్యూసౌత్‌వేల్స్ యూనివర్సిటీలో మేథమెటీషియన్)
ఇవి కూడా చదవండి:
- ఎలక్ట్రిక్ కారు, స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలూ గుర్తుంచుకోండి..
- బిల్కిస్ బానో: మోదీ ప్రభుత్వ అనుమతితోనే ఆ సామూహిక అత్యాచార దోషులను విడుదల చేశారా?
- మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మోదీ-షాలను ఢీ కొట్టగలరా, ఉత్తర భారత ప్రజలను ఆకట్టుకోగలరా
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)