You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి?
- రచయిత, మిషెల్లీ రాబర్ట్స్
- హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్
50 ఏళ్లు దాటిన తరువాత తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదాన్ని కొంతవరకైనా తప్పించుకోవాలంటే రోజుకు కనీసం 5 గంటలకు నిద్రపోవాలని తాజా అధ్యయనం ఒకటి సూచించింది.
అనారోగ్యం వల్ల నిద్ర సరిగా ఉండకపోవచ్చు.. అదేసమయంలో నిద్ర తగినంత లేకపోవడం కూడా అనారోగ్యానికి దారితీయొచ్చని ఈ అధ్యయనం పేర్కొంది.
మనసుకు, శరీరానికి విశ్రాంతి, పునరుత్తేజం కలిగించడానికి నిద్ర దోహదపడుతుందనడానికి ఆధారాలున్నాయి.
అయితే, ఎన్ని గంటలు నిద్రపోతే మంచిది అనే విషయంలో ఇంతవరకు స్పష్టత లేదు.
'పీఎల్ఓఎస్ మెడిసన్' అధ్యయనం బ్రిటన్‌లో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యం, నిద్రను ట్రాక్ చేసింది.
8 వేల మందితో చేసిన ఈ అధ్యయనంలో 'మీరు వారంలో సగటున రాత్రి పూట ఎన్ని గంటలు నిద్రపోతారు?' అని అడిగారు.
సర్వేలో పాల్గొన్న వారిలో కొందరు రిస్ట్ వాచ్ స్లీప్ ట్రాకర్లు కూడా వాడారు.
వారిలో ఎవరికైనా గత 20 ఏళ్లలో డయాబెటిస్, కేన్సర్, హృద్రోగాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయేమో కనుక్కున్నారు.
ఈ అధ్యయనం ప్రకారం... 50 ఏళ్లకు అటూఇటుగా ఉన్నవారిలో 5 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారికి అదే వయసులో ఉన్న 7 గంటలు నిద్రపోయేవారి కంటే 30 శాతం అదనంగా అనారోగ్యం ముప్పు ఉందని గుర్తించారు.
50 ఏళ్ల వయసువారు తక్కువ నిద్రపోతే అనారోగ్య సమస్యలతో పాటు మరణం ముప్పు కూడా అధికమని ఈ అధ్యయనం చెబుతోంది.
సాధారణంగా 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతారని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
అసలు ఎందుకు నిద్రపోతాం
ఎందుకు నిద్రపోతాం అనే విషయంలో శాస్త్రవేత్తల వద్ద కూడా కచ్చితమైన సమాధానం లేదు. కానీ, జ్ఞాపకాలను ప్రాసెస్ చేయడంలో నిద్ర సహాయపడుతుందని.. మానసిక స్థితి, ఏకాగ్రత, జీవక్రియకు నిద్ర మంచిదని మాత్రం పరిశోధనలు చెబుతున్నాయి.
అక్కర్లేని విషయాలను మెదడు నుంచి బయటకు పంపించడానికీ నిద్ర మంచి సాధనం.
మంచి నిద్రకు 6 మార్గాలు
- పగటి పూట బాగా చురుగ్గా, బిజీగా ఉంటూ అలసిపోండి.. రాత్రి నిద్ర వేళ సరికి క్రమంగా విశ్రాంతి స్థితిలోకి వచ్చేయండి.
- పగటిపూట మధ్యమధ్యలో కునుకు తీయడం తగ్గించండి.
- నిద్రకు ముందు రాత్రి పూట మీ దినచర్య హాయిగా ఉండేలా చూసుకోండి. బెడ్ రూమ్ విశ్రాంతి, నిద్రకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి.
- దళసరి కర్టెన్లు, సరైన గది ఉష్ణోగ్రత, మంచి పరుపు వంటి ఏర్పాటు చేసుకోండి.
- నిద్రపోవడానికి ముందు కెఫీన్, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి.
- నిద్రరాకపోతే చికాకు పడకుండా లేచి కూర్చుకుని మనసుకు నచ్చే ప్రశాంతమైన పని ఏదైనా చేయండి. పుస్తకం చదవడం వంటివి చేస్తూ నిద్ర వస్తున్నట్లు అనిపించగానే వెళ్లి పడుకోండి.
'తక్కువ నిద్రపోవడమనేది ఆరోగ్యానికి మంచిదికాదని ఈ పరిశోధన మరోసారి తేల్చింది. కొందరి విషయంలో తక్కువ నిద్రతో నష్టం లేకపోవయినా సాధారణంగా చూస్తే మాత్రం ఏమాత్రం ఆరోగ్యకరం కాదు' అని సర్రే స్లీప్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ డెర్క్ జాన్ 'బీబీసీ'తో చెప్పారు.
'కొందరు ఎందుకు తక్కువగా నిద్రపోతారు అనేది పెద్ద ప్రశ్న. దీనికి కారణాలేంటనే విషయంలో స్పష్టత లేదు. అయితే, నిద్ర అనేది ఎవరికి వారు సవరించుకోగలిగే లైఫ్ స్టైల్ అంశం' అన్నారు డెర్క్.
వైద్యులు కూడా ఇప్పుడు నిద్ర మాత్రలు సూచించడం తగ్గించారు. వీటివల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. లైఫ్ స్టైల్‌లో మార్పులతో నిద్ర అలవాట్లను మార్చుకోవడం సాధ్యమంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి:
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- రోజర్ బిన్నీ: ప్రపంచంలోనే సుసంపన్న క్రికెట్ బోర్డు అధ్యక్షుడు గురించి మనకు ఏం తెలుసు?
- జయలలిత సర్జరీని ఎవరు, ఎందుకు అడ్డుకున్నారు? ఆర్ముగస్వామి నివేదికలో సరికొత్త అనుమానాలు
- దగ్గు మందు మరణాలు: భారత్లో తయారవుతున్న ఔషధాలు సురక్షితమైనవి కావా?
- పవన్ కల్యాణ్; 'ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా'- 'ఒక్కసారి కాదు వందసార్లు అంటా' -వైసీపీ మంత్రి అంబటి రాంబాబు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)