‘‘కవితలు రాసిందని మా అమ్మాయిని రెండు నెలలుగా జైల్లో పెట్టారు’’

''నా 19ఏళ్ల కూతురు రెండు నెలలుగా జైలులో ఉంది. ఆమె చేసిన నేరమేంటి? ఆమె కేవలం ఒక కవిత మాత్రమే రాసింది. ఆమె చాలా తెలివైన విద్యార్థి. మేం కూలి చేసుకుని జీవిస్తూ ఆమెను చదివిస్తున్నాం. ఆమెను జైలు నుంచి బయటకు తీసుకురాకపోతే తన భవిష్యత్తు నాశనమవుతుంది''

బర్సాశ్రీ బోర్గోహైన్ అస్సాంలోని గోలాఘాట్ జిల్లా జైలులో ఉన్నారు. ఆమె తల్లి ఉష ఈ మాటలు అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

నిషేధిత తీవ్రవాద సంస్థ ఉల్ఫా (ఐ)కి మద్దతుగా కవిత రాసిందన్న ఆరోపణపై అస్సాం పోలీసులు మే 18న బర్సాశ్రీ ని అరెస్టు చేశారు. గోలాఘాట్ జిల్లాలోని సరుప్తర్‌కు చెందిన బర్సాశ్రీ,, స్నేహితురాలి ఇంటికి వెళ్లినప్పుడు పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

బీఎస్సీ సెకండియర్ చదువుతున్న బర్సాశ్రీ చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని సెక్షన్‌10, సెక్షన్ 13 కింద అరెస్టయ్యారు.

బర్సాశ్రీ ఇటీవల ఎనిమిది కవితలు రాశారు. వాటిని ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఆ కవితలన్నీ ఫేస్‌బుక్ నుంచి తొలగించారు. బర్సాశ్రీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో అప్‌డేట్ చేసిన పోస్ట్‌ పై అస్సాం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

''రోజు కూలీ చేస్తూ మా కూతురికి చదువు చెప్పిస్తున్నాం''

''మా అమ్మాయి రాసినట్లు పోలీసులు చెబుతున్న కవితలో ఏ తీవ్రవాద సంస్థ పేరు లేదు. మేం పేదవాళ్లం. మా జీవితమంతా కష్టాలే. రోజు కూలీగా పని చేస్తూ నా కూతురికి చదువు చెప్పిస్తున్నాం. మా కుటుంబం ఏ తీవ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వదు'' అని బర్సాశ్రీ తండ్రి అజిత్ బోర్గోహైన్ బీబీసీతో అన్నారు.

ఆర్థికంగా వెనకబడిన కుటుంబం నుండి వచ్చిన బర్సాశ్రీ 10వ, 12వ పరీక్షలలో మంచి మార్కులు సాధించారు. వెనుకబడిన ప్రాంతానికి చెందిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థి అరెస్టుపై సోషల్ మీడియాలో తమ స్పందనను తెలియజేస్తూ చాలామంది యూజర్లు ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

'జైల్లో ఉంటే జీవితం నాశనం అవుతుంది'

బర్సాశ్రీ గురించి మాట్లాడినప్పుడు ఆమె తల్లి ఉష ఉద్వేగానికి లోనయ్యారు. "ఆమె చదువు గురించి నాకు చాలా బాధగా ఉంది. కష్టపడి చదివిస్తున్నాం. ఆమె జైలులో ఉంటే జీవితం నాశనం అవుతుంది. చిన్నప్పటి నుంచే ఇంటి ఆర్ధిక పరిస్థితులను అర్ధం చేసుకుని బాగా చదివేది'' అన్నారామె.

12వ తరగతి పూర్తి కాగానే నీట్ పరీక్షలో ర్యాంక్ సాధించిందని, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కూతురును ఉన్నత చదువుకు పంపలేకపోయామని ఉష అన్నారు.

బర్సాశ్రీ ఆర్థిక సమస్యలను, ఉన్నత విద్య కోసం చాలా కాలంగా పడుతున్న కష్టాలను, ఆమె కవితలలో వ్యక్తీకరించిన భావాలతో ముడిపెట్టి చూస్తున్నారు కొందరు సోషల్ మీడియా యూజర్లు. బర్సశ్రీ తన ఫేస్‌బుక్‌లో ఒక ఫొటోతో పాటు క్యాప్షన్‌లో ఇలా రాశారు, "నీ ప్రేమను గెలుచుకోవడానికి కలం నా ఆయుధం."

బర్సాశ్రీ అస్సామీ భాషలో రాసిన పంక్తుల ఆధారంగా పోలీసులు ఆమె పై చర్య తీసుకున్నారు. ''స్వతంత్ర సూర్యుడి కోసం మరో అడుగు, మరోసారి దేశద్రోహానికి పాల్పడతాను'' అంటూ ఆమె అస్సామీ భాషలో ఓ కవిత రాశారు.

అస్సాం పోలీసుల వాదన ఏమిటి?

ఇక్కడ పనిచేస్తున్న నిషేధిత తీవ్రవాద సంస్థ ఉల్ఫా(ఐ) ఉద్యమానికి, ఈ కవితలకు లింక్ ఉందని పోలీసులు అంటున్నారు. ఇది పెద్ద నేర పూరిత కుట్రగా, 'భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలనే ఉద్దేశ్యం'' గా చెబుతున్నారు.

ఈ విషయాన్ని అస్సాం పోలీసు ప్రత్యేక డీజీపీ (లా అండ్ ఆర్డర్) జీపీ సింగ్ బుధవారం ట్వీట్‌లో తెలిపారు. బర్సాశ్రీ పంక్తులను ఉటంకిస్తూ, "తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో దేశంపై యుద్ధం చేయడానికి ఆమె పిలుపునిచ్చారు. నేను దేశ ద్రోహానికి పాల్పడతాను అని స్వయంగా రాశారు'' అని పేర్కొన్నారు.

"ఎవరైనా నిషేధిత సంస్థకు మద్దతు ఇస్తున్నట్లు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలనుకుంటున్నట్లు ప్రకటిస్తే, మేము ఆ వ్యక్తిని చట్ట ప్రకారం విచారిస్తాం'' అని జీపీ సింగ్ అన్నారు.

అయితే, రెండు రోజుల తర్వాత అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత ఈ వ్యవహారంపై స్పందించారు. కేవలం కవిత రాసినందుకు ఆమెను అరెస్టు చేయలేదని చెప్పారు.

''ఆమె ఉల్ఫా(ఐ) తీవ్రవాద సంస్థలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. కేవలం కవితలు రాసినందుకు అరెస్టు చేయలేదు. అదంతా తప్పుడు సమాచారం. తాను వెళ్లడమే కాక, ఇతరులను కూడా ఉల్ఫాలోకి తీసుకెళ్లాలని ఆమె కోరుకుంది. అందుకే ఈ కవితలు రాసింది'' అన్నారు డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత.

అస్సాం ముఖ్యమంత్రి ఏం చెప్పారు?

బర్సా శ్రీని విడుదల చేయాలంటూ సోషల్ మీడియాలో వస్తున్న డిమాండ్‌లపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. '' కవిత్వం రాసినందుకు బర్సాశ్రీని అరెస్టు చేయలేదు. కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు'' అన్నారు.

ఇదిలా ఉండగా, జూలై 16 నుంచి ప్రారంభమయ్యే బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షకు హాజరయ్యేందుకు గోలాఘాట్ జిల్లాలోని స్థానిక కోర్టు బర్సాశ్రీని అనుమతించింది.

అంతకు ముందు, పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జైలు అధికారుల ద్వారా గోలాఘాట్ జిల్లా సెషన్స్ కోర్టులో బర్సాశ్రీ పిటిషన్ దాఖలు చేశారు.

జైలు నుంచి పరీక్షా కేంద్రానికి తగిన ఏర్పాట్లు చేయాలని, తగిన భద్రత కల్పించాలని జిల్లా కోర్టు గురువారం జైలు అధికారులను ఆదేశించింది.

"నేను జైలులో ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు, తన చదువు గురించి ఆమె చాలా బాధపడింది. అమ్మా...నాకు బెయిల్ ఎప్పుడు వస్తుంది, నా ఫైనల్ ఎగ్జామ్స్ రాయగలనా అని అడిగేది. పరీక్షకు అనుమతించినందుకు కోర్టుకు మా ధన్యవాదాలు'' అన్నారు బర్సా శ్రీ తల్లి ఉష.

''ఆమె మామూలు అమ్మాయి. వేర్పాటువాద సంస్థల్లో చేరాలని ఆమె అనుకోదు. చాలా భయస్తురాలు. రాత్రి కలలు వస్తేనే భయపడిపోతుంది'' అన్నారు ఉష.

"ఆమెకు చదువుకోవాలని ఉంది, కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా మేం ఏమీ చేయలేకపోతున్నాం. నా కూతురు ఎలాంటి విప్లవ కవితలు రాసిందో నాకు తెలియదు. కానీ ఒక తండ్రిగా ఆమె ఏ ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వదని ఖచ్చితంగా చెప్పగలను. మా కుటుంబం ఏ ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వదు. నా కూతురిని వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను'' అన్నారు బర్సా శ్రీ తండ్రి అజిత్ బోర్గోహైన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)