గోటాబయ రాజపక్ష: శ్రీలంక నుంచి పారిపోయి మళ్ళీ స్వదేశం చేరుకున్న మాజీ అధ్యక్షుడు

    • రచయిత, అంబరాసన్ ఎథిరాజన్
    • హోదా, బీబీసీ న్యూస్

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటాబయ రాజపక్షకు వ్యతిరేకంగా జులైలో భారీ నిరసనలు తలెత్తాయి. ఈ నిరసనల నడుమ ఆయన దేశం వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆయన కొంత కాలం పాటు థాయిలాండ్‌‌లో తాత్కాలిక వీసా పై ఉన్నారు. ఆయన తిరిగి సింగపూర్ మీదుగా ప్రయాణించి శ్రీలంక చేరుకున్నారు.

కొంత మంది శ్రీలంక మంత్రులు ఆయనను ఎయిర్‌పోర్ట్ దగ్గర కలిసినట్లు సమాచారం అందింది.

శ్రీలంక చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణమైన ఆర్ధిక సంక్షోభం తలెత్తడానికి రాజపక్ష ప్రభుత్వమే కారణమని శ్రీలంక ప్రజలు నిందిస్తారు. విదేశీ కరెన్సీ నిల్వలు పడిపోవడంతో దేశంలో ఆహారం, ఇంధనం కరువయ్యాయి.

దేశంలో ఆహారం, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో ఏప్రిల్‌లో నిరసనలు మొదలయ్యాయి.

శాంతియుతంగా మొదలైన ఈ నిరసనల్లో వివిధ వర్గాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. అప్పటి దేశాధ్యక్షుడు రాజపక్ష, ఆయన సోదరుడు, ప్రధాని మహింద రాజపక్ష కూడా పదవి నుంచి తప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

మహింద మే నెలలో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.

జులైలో వేలాది మంది ప్రజలు రాజపక్ష అధ్యక్ష నివాసాన్ని ముట్టడించారు. దీంతో, ఆయన మిలిటరీ విమానంలో మాల్దీవులకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లి అక్కడి నుంచి అధ్యక్ష పదవికి రాజీనామా లేఖను పంపించారు.

దీంతో, రణిల్ విక్రమసింఘే అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు.

దేశంలో కొత్తగా నిరసనలు తలెత్తకుండా చూస్తూ రాజపక్షకు భద్రత కల్పించే విషయంలో కొత్త ప్రభుత్వం చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

"రాజపక్ష దేశానికి తిరిగి రావడానికి మేం వ్యతిరేకులం కాదు. శ్రీలంక పౌరులెవరైనా దేశానికి తిరిగి రావచ్చు" అని నిరసనలకు నాయకత్వం వహించిన ఫాదర్ జీవంత పెరిస్ అన్నారు.

"రాజపక్ష ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే ఆరోపణలుండటంతో ప్రజలు వీధుల్లోకొచ్చి నిరసనలు చేపట్టారు. ఆయన పై మాకు వ్యక్తిగతమైన ద్వేషమేమీ లేదు" అని అన్నారు.

రాజపక్ష తిరిగి ప్రభుత్వంలో కానీ, రాజకీయాల్లో కానీ చేరాలని చేసే ఎటువంటి ప్రయత్నాన్నైనా వ్యతిరేకిస్తాం" అని కొంత మంది నిరసనకారులు అన్నారు.

"ఆయన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత అధ్యక్ష పదవిలో చేసిన తప్పులకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మహీందా రాజపక్షకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేయాలి" అని రాజీవ్ కాంత్ బీబీసీకి చెప్పారు.

గోటాబయ రాజపక్ష నివాసముండేందుకు ప్రభుత్వం సెంట్రల్ కొలొంబోలో ఒక ఇంటిని కేటాయించినట్లు శ్రీలంక మీడియా కథనాలు పేర్కొన్నాయి. కానీ, ఆయన నేరుగా తనకు కేటాయించిన నివాసానికి వెళతారో లేదా సైనిక సంరక్షణలో ఉండే నివాసానికి వెళతారో అనే విషయం పై స్పష్టత లేదు.

రాజపక్షకు మాజీ అధ్యక్షుని హోదాలో అవసరమైన భద్రతను కల్పిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి బీబీసీకి తెలిపారు.

విక్రమసింఘే అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత ప్రభుత్వం నిరసనకారులను అణచివేసేందుకు ప్రయత్నించిందని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని డజన్ల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చాలా మందిని బెయిల్ పై విడుదల కూడా చేశారు.

నిరసనలకు నాయకత్వం వహించిన ముగ్గురు విద్యార్థి నాయకులను తీవ్రవాద నిరోధక చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు.

విక్రమసింఘే పదవికి చట్టబద్ధత లేకపోవడంతో పాటు ప్రజల మద్దతు కూడా లేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈయన రాజపక్ష కుటుంబానికి భద్రత కల్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు, చట్టాన్ని ఉల్లఘించిన వారి పై మాత్రమే చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.

కొలొంబోలో అధ్యక్షుని సెక్రటేరియట్ ముందున్న నిరసన శిబిరాన్ని కూడా సేనలు జులై మూడవ వారంలో తొలగించాయి. నిరసనకారులు గాల్ ఫేస్ తీరం దగ్గర నుంచి కూడా గత నెలలో వైదొలిగారు.

శ్రీలంకలో ప్రభుత్వం గత కొన్ని వారాలుగా ఇంధన సరఫరాలను క్రమబద్ధీకరణ చేసింది. క్యూఆర్ కోడ్ ఉండి రిజిస్టర్ అయిన వాహనాలు మాత్రమే పెట్రోల్ స్టేషన్లలో ఇంధనం కొనుక్కునే సౌకర్యం కల్పించింది. కానీ, పెట్రోల్ స్టేషన్ల దగ్గర బారులు తీరిన క్యూలను చూస్తుంటే ఇంధన డిమాండ్ కొనసాగుతోందని తెలుస్తోంది.

షాపుల్లో ముఖ్యమైన ఆహార సరుకులు లభిస్తున్నాయి. కానీ, సుమారు 65% ద్రవ్యోల్బణం ఉండటంతో ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి.

ఈ వారం ప్రారంభంలో శ్రీలంక ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తో 2.9 బిలియన్ డాలర్ల రుణాన్ని పొందేందుకు ప్రాధమిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే, ఈ రుణాన్ని మంజూరు చేసేందుకు దేశంలో అమలు చేయనున్న ఆర్ధిక సంస్కరణలు, శ్రీలంకకున్న 51 బిలియన్ డాలర్ల రుణ పునర్వ్యవస్థీకరణ చేయడం లాంటి నిబంధనల పై ఆధారపడి ఉంటుంది.

ఆదాయాన్ని పెంచేందుకు కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రజలను ఒప్పించే విషయంలో ప్రభుత్వం సవాళ్ళను ఎదుర్కొంటోంది. ప్రైవేటీకరణ వల్ల జరిగే ఉద్యోగ నష్టాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముంది.

ప్రస్తుతానికి పరిస్థితులు పైకి ప్రశాంతంగానే కనిపిస్తున్నాయని శ్రీలంక ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ఇంధన, ఆహార సరఫరాల్లో అంతరాయం కలిగితే, రానున్న రోజుల్లో నిరసనలు జరగవని చెప్పేందుకు లేదని అంటున్నారు.

శ్రీలంక:

శ్రీలంక భారత్‌కు దక్షిణంగా ఉన్న ఒక ద్వీప దేశం. బ్రిటిష్ పాలన నుంచి 1948లో స్వతంత్రం పొందింది. శ్రీలంకలో ఉన్న 2.2 కోట్ల మంది జనాభాలో 99% మంది సింహళీయులు, తమిళులు, ముస్లిం జనాభా ఉంటారు.

ఒకే కుటుంబానికి చెందిన సోదరులు సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నారు. శ్రీలంకలో కొన్నేళ్ల పాటు సాగిన అంతర్యుద్ధం తర్వాత 2009లో మహింద రాజపక్ష ప్రభుత్వం తమిళ వేర్పాటువాదులను అణిచివేయడంతో సింహళీయులకు హీరోగా మారారు.

ఆయన సోదరుడు గోటాబయ, అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి అధ్యక్ష పదవిని చేపట్టారు. కానీ, ఇటీవల జరిగిన నిరసనలతో పదవి నుంచి తప్పుకున్నారు.

అధ్యక్ష అధికారాలు: శ్రీలంక అధ్యక్షుడు ప్రభుత్వ, దేశ, సైన్యానికి అధ్యక్షునిగా ఉంటారు. కానీ, ప్రధాన మంత్రితో పాటు చాలా ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తారు.

ఆర్ధిక సంక్షోభం వీధుల్లో నిరసనలకు దారి తీసింది: దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం వల్ల కొన్ని రకాల ఆహార పదార్ధాలు, ఔషధాల కొరత ఏర్పడింది. శ్రీలంకలో ఏర్పడిన పరిస్థితికి రాజపక్ష కుటుంబమే కారణమంటూ ఆగ్రహంతో ఈ ఏడాది మొదట్లో సాధారణ ప్రజలు కూడా వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)