You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్‌లో రంజాన్: 'ఈ కష్ట కాలంలో విశ్వాసమే మమ్మల్ని కాపాడుతుంది రక్షిస్తుంది' - బీబీసీతో ఇద్దరు ముస్లిం మహిళలు
- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
"రోజంతా సైరన్ల మోత, విధ్వంసమైన స్కూళ్లు, ఇళ్ళు, ఆసుపత్రుల ఫోటోలు చూస్తుంటే ఏమీ జరగనట్లు ఎలా ఉండగలం?" అని నియారా మముతోవా అడిగారు.
చుట్టూ శవాలు, కాలిన ఇళ్ళు చూస్తుంటే కడుపులో దేవినట్లుగా ఉంటోంది. చాలా ఒత్తిడిగా ఉంటోంది. ఈ సారి రంజాన్ వేదనతో నిండిపోయింది.
నియారా తాతర్ జాతికి చెందిన ముస్లిం మహిళ. రష్యా 2014లో క్రైమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమె అక్కడ నుంచి వలస వచ్చారు.
యుక్రెయిన్‌లోని కీయెవ్ చెందిన మరో ముస్లిం మహిళ విక్టోరియా నెస్టరెంకో కూడా నియారా మాదిరిగానే నిస్సహాయతను వ్యక్తం చేశారు. యుద్ధ వాతావరణంలో రంజాన్ ఉపవాసాలు చేయడం గురించి ఈ ఇద్దరు మహిళలు బీబీసీకి వివరించారు.
"విచారంతో నిండిపోయాను"
"దారుణమైన యుద్ధ దృశ్యాలు పదే పదే గుర్తుకొస్తున్నాయి" అని విక్టోరియా అన్నారు.
"కీయెవ్‌లో సాధారణ పౌరులు, పసిపిల్లలు కూడా రష్యన్ సేనల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ రంజాన్ మాసంలో పవిత్రమైన వాతావరణం లేదు. నా హృదయం అంతా విచారంతో నిండిపోయింది" అని అన్నారు.
యుక్రెయిన్‌లో అనధికారిక అంచనాల ప్రకారం మొత్తం జనాభాలో ఇస్లాం జనాభా 1% మాత్రమే.
కానీ, గత రెండేళ్లుగా కోవిడ్ వల్ల జరుపుకోలేకపోయిన రంజాన్ పండుగను ఈ ఏడాదైనా జరుపుకోవాలని ఆశ పడ్డారు.
కానీ, యుద్ధం వారి ప్రణాళికలన్నిటిని నాశనం చేసింది.
"నైతికంగా, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు మలుచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నేను ఖురాన్‌కు ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. ప్రార్ధన కోసం ఎక్కువ సమయం తీసుకోవల్సి ఉంటుంది. ఒత్తిడి, అలసట వల్ల ప్రార్ధన పై దృష్టి పెట్టడం చాలా కష్టం" అని విక్టోరియా అన్నారు.
నియారా తన పసిబిడ్డకు పాలు ఇస్తున్నారు. అందుకే ఆమె ఉపవాసం చేయడం లేదు. ఆధ్యాత్మికంగా దృష్ఠిని కేంద్రీకరించడం ఇద్దరికీ సవాలుగానే ఉంది.
"ప్రార్ధన కోసం సమయం అయితే కేటాయిస్తున్నాం. ఎలాగో ఒకలా మతపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం" అని చెప్పారు.
ఎక్కడా సురక్షితం కాదు
గత 8 సంవత్సరాలుగా నియారా జాఫోరిజియాలో నివసిస్తున్నారు.
ఆమె ఒక స్వచ్చంద సంస్థను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా పర్యావరణ అవగాహన, ముస్లింల గురించి సమాజంలో నెలకొన్న మూస ఆలోచనలను పోగొట్టేందుకు కృషి చేస్తున్నారు.
ఆమెకు నాలుగవ బిడ్డ పుట్టిన 3 వారాలకు యుద్ధం మొదలయింది. అదే సమయంలో రంజాన్ కోసం ఇంట్లో అందరూ ఇల్లు శుభ్రం చేసుకోవడం, అలంకరణ కోసం ఆలోచిస్తున్నారు.
"మేము షాక్‌కి గురయ్యాం. విమానాశ్రయాల పై క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఇంధన నిల్వల్లో మంటలు చెలరేగాయి. రష్యన్ సేనలు నగరానికి దగ్గరగా వస్తుండటంతో నగరం విడిచి పెట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నాం.
క్రైమియా స్వాధీనం చేసుకున్నప్పుడు రక్తపాతం చోటు చేసుకోలేదు. ఈ ఆక్రమణ పూర్తిగా రక్తపాతంతో కూడుకుని అమానుషంగా ఉంది.
ఈ సారి విక్టోరియా కుటుంబం తమను తాము కాపాడుకునేందుకు చెర్నివిట్సీకు వలస వెళ్లారు. పిల్లలకు చాలా ఒత్తిడిగా ఉంటోంది. "నా పిల్లలు వారి స్నేహితుల నుంచి దూరమయ్యారు. సొంత ఇంటి నుంచి దూరమయ్యారు. ఈ నగరంలో కూడా మేము సురక్షితంగా ఉన్నామని చెప్పలేను. రష్యా క్షిపణులు, బాంబులు ఏ క్షణంలోనైనా ఇక్కడకు చేరవచ్చు.
గత స్మృతులు
మొదట్లో వాళ్లొక మసీదులో ఆశ్రయం తీసుకున్నారు. తర్వాత సొంతంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. గతంలో రంజాన్ జరుపుకున్న జ్ఞాపకాలు ఆమె కోల్పోయిన వాటిని గుర్తు చేశాయి.
"కుటుంబం అంతా కలిసి ఉపవాసం, ప్రార్ధన చేయడం, ఉపవాసాన్ని ముగించడం చేసేవారు. ఈ యుద్ధం వల్ల మా కుటుంబాలన్నీ విడిపోయి, చెల్లాచెదురయ్యాయి. కొంత మంది దేశం విడిచిపెట్టి వేరే దేశాలకు వెళ్లిపోయారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం లేదు" అని నియారా అన్నారు.
ఆమె భర్త ఒక మసీదులో ఇమామ్‌గా పని చేస్తున్నారు. ఒక ఇంటినే మసీదుగా మార్చారు.
చెర్నవిట్సీలో రాత్రి పూట కర్ఫ్యూ అమలులో ఉంది.
దాంతో, ఆమె భర్త కొన్ని సార్లు మసీదులోనే ఉండిపోవల్సి వస్తోంది. కానీ, ఈ కొత్త ప్రదేశంలో కూడా నియారా కొంత మందిని స్నేహితులుగా చేసుకున్నారు.
"మేం మిగిలిన ముస్లిం కుటుంబాలతో కలిసి ఉపవాసాన్ని బ్రేక్ చేస్తున్నాం. ఒకరికొకరం సహాయం చేసుకుంటున్నాం. నిరాశ్రయులైన వారికి ఆహారం దానం చేయమని ధనిక ముస్లిం కుటుంబాలను అడుగుతున్నాం.
హలాల్ మాంసం కొరత
మసీదులో ఉంటున్న నిరాశ్రయుల కోసం వంట చేసేందుకు ఆమె సహాయం చేస్తున్నారు.
"మేము గతంలో చేసిన వంటకాలే వండుతున్నాం, కానీ, హలాల్ చేసిన మాంసం మాత్రం దొరకడం లేదు. కొన్ని రకాలైన హలాల్ చికెన్ మాత్రమే దొరుకుతోంది" అని నియారా చెప్పారు.
టర్కీ లాంటి దేశాలు ఆహారాన్ని, వంటపాత్రలను పంపించి సహాయం చేస్తున్నాయి. విక్టోరియా ఫ్రోజెన్ మాంసం, చేపలతో వంట చేస్తున్నారు.
"హలాల్ చేసిన ఆహారాన్నే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ, హలాల్ చేసిన మాంసం కొరత ఉంది. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ముస్లింలకు హలాల్ చేసిన మాంసం దొరకడం లేదు" అని చెప్పారు.
యుద్ధానికి ముందు ఆమె కీయెవ్ లోని హలాల్ సర్టిఫికేషన్ కేంద్రంలో డైరెక్టర్ గా పని చేశారు.
ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆమె ఆశిస్తున్నారు.
యుద్ధ ప్రయత్నాలు
యుక్రెయిన్ సైన్యంలో, ప్రాంతీయ సైనిక దళాల్లోనూ చాలా మంది ముస్లిం పురుషులు, స్త్రీలు పని చేస్తున్నారు. కొంత మంది స్వచ్చంద సేవకులతో కూడిన సాయుధ దళాలుగా కూడా రూపొందారు.
"నా స్నేహితులు, బంధువులు రష్యన్‌లతో పోరాడుతున్నారు" అని విక్టోరియా చెప్పారు.
"మేము మానవతా సహాయం అందిస్తున్నాం. ప్రజలు ఖాళీ చేసి వెళ్లేందుకు, సైనికులకు ఆయుధాలను సమకూర్చేందుకు విరాళాలు సేకరించేందుకు కూడా పని చేస్తున్నాం.
కీయెవ్ లో ప్రధాన మసీదుకు సాధారణ సమయంలో వచ్చే భక్తుల్లో 5 శాతం మాత్రమే వస్తున్నారు" అని విక్టోరియా చెప్పారు.
నగరంలో చాలా మంది ముస్లింలు అత్యవసర సేవల్లో పని చేస్తూ బిజీగా ఉన్నారు.
"నేను వీలైనంత సహాయం చేయాలని అనుకుంటున్నాను. నాకు జాతీయ బాధ్యత ఉంది. యుక్రెయిన్ ప్రజల బలమే ఐక్యత. మేం కలిసికట్టుగా ఉండి అందరికీ సహాయం చేయాలి. అప్పుడే మా శత్రువును ఓడించగలం" అని అన్నారు.
నమ్మకానికి పరీక్ష
ఈ కష్ట సమయంలో విశ్వాసమే తనను రక్షిస్తుందని నియారా ఆశిస్తున్నారు.
"ఈ సమయంలో నా మతవిశ్వాసాలు నాకు చాలా ముఖ్యం. విశ్వాసం నాకు బలాన్నిస్తుంది. నా ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుంది. ఈ యుద్ధం మీకొక పరీక్ష అని అర్ధమవుతుంది" అని అన్నారు.
ఈ విపత్తును దాటేందుకు భగవంతుడే తనకు శక్తినిస్తాడని ఆమె నమ్ముతున్నారు.
"మేం సజీవంగా ఉన్నాం. ప్రార్థిస్తున్నాం. శాంతి కోసం ఎదురు చూస్తున్నాం" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇమ్రాన్ ఖాన్: ప్లేబాయ్ నుంచి పాకిస్తాన్ ప్రధాని వరకూ...
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- షాంఘై లాక్డౌన్: ఆహారం దొరకడం లేదంటున్న కొందరు స్థానికులు
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)