ఇంటర్నెట్‌లో సీక్రెట్ పేజీలు.... చేసిన తప్పులు, వ్యక్తిగత రహస్యాలు చెప్పుకునే కొత్త మార్గాలు

    • రచయిత, హరియట్ ఒరెల్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

మీ మనసు భారాన్ని తొలగించుకుంటే దానికంటే తేలికమైన భావన మరోటి ఉండదు.

కానీ, వ్యక్తిగత రహస్యాలను, చేసిన తప్పులను ఇతరులతో పంచుకోవడం సాధ్యం కాదు.

భయం, సిగ్గు, అవమానభారం కారణంగా మనం మన రహస్యాలను బయటపెట్టం. కొన్నిసార్లు ఆ రహస్యం మనకు చెందినది కాకపోయినా దాన్ని బహిర్గతం చేయలేం.

కాబట్టి మనకు లేదా ఇతరులకు బాధ కలగకుండా మన ఆందోళనలను ఎలా తెలియజేయవచ్చు?

దీనికి సోషల్ నెట్‌వర్క్‌లు వాడుతున్నారు. మరికొందరు 'కన్‌ఫెషన్ పేజెస్' పేరిట రహస్య ఖాతాను తయారు చేసుకుంటారు.

'భద్రమైన ప్రదేశాలు'

వందల ఏళ్లుగా మానవులు తమ పాప ప్రాయశ్చిత్తం కోసం మత అధికారులను సంప్రదించేవారు. తమ తప్పులను వారికి వివరించేవారు.

ఇటీవలి దశాబ్ధాలలో కొన్ని రేడియో కార్యక్రమాలు... తమ పేరు, వివరాలను చెప్పకుండానే తమ రహస్యాలను, తాము చేసిన వాటిని పంచుకోవడానికి ప్రజలను అనుమతిస్తున్నాయి.

1980లో ఒక ఆర్టిస్టు తయారు చేసిన 'అపాలజీ లైన్' 15 ఏళ్ల పాటు పని చేసింది. దీనిద్వారా న్యూయార్క్‌కు చెందిన ప్రజలు తమ వివరాలను వెల్లడించకుండా కేవలం తమ రహస్యాలను మాత్రమే ఇతరులతో పంచుకునే వీలుండేది.

దీనికి సంబంధించిన టేపులు ఇప్పుడు ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో ప్రసారం అయ్యాయి. ఇతరుల కన్‌ఫెషన్లను తెలుసుకోవడానికి ప్రజలు ఉత్సాహంగా ఉన్నట్లు దీనిద్వారా తెలుస్తోంది.

ఇప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలో ప్రజలు, తమ గుర్తింపును బయటపెట్టకుండానే తమ నిజ జీవితాలను ఆవిష్కరిస్తున్నారు.

ఆన్‌లైన్ కన్‌ఫెషన్ పేజీల ద్వారా తమ రహస్యాలను పంచుకుంటున్నారు.

మొదట ఇంటర్నెట్‌లో ఇలాంటి కార్యక్రమాలకు ఫోరమ్స్, చాట్ రూమ్స్‌ వేదికలుగా అనిపించాయి. కానీ, తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్‌లు వచ్చాయి.

ఇప్పుడు ఆధునీకరించిన సామాజిక మాధ్యమాల ఖాతాలు ఈ పనిని చేస్తున్నాయి.

''ఆన్‌లైన్‌ సపోర్ట్ గ్రూపులకు ప్రజలు కనెక్ట్ అవ్వగలిగితే ఇవి చాలా మంచి వేదికలుగా పనిచేస్తాయి. తమ వివరాలు గోప్యంగా ఉంచుతూనే రహస్యాలను పంచుకునేందుకు వీటిని మంచి అవకాశంగా ఉపయోగించుకోవచ్చు. మనలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటున్నవారి అనుభవాలను తెలుసుకోవడం ద్వారా మనం నేర్చుకోవచ్చు'' అని పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌కు చెందిన సైకాలజిస్టు జహ్రా కమల్ ఆలమ్ అన్నారు.

''ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా లైంగిక వేధింపులు, హింస, లైంగికత వంటి అంశాలు గురించి మాట్లాడే విషయంలో ఇవి సహాయపడతాయి'' అని ఆమె చెప్పారు.

కౌన్సెలింగ్‌, థెరపీ అందించే ప్రదేశంలో సమస్యల గురించి మాట్లాడతారు. వైద్యవిధానంలో ఇది కూడా ఒక పద్దతి. కాబట్టి ప్రజలు తమ రహస్యాలను పంచుకోవడానికి ఇంటర్నెట్‌ వైపు మళ్లడం ఆశ్చర్యకరం ఏమీ కాదు అని ఆమె అన్నారు.

''ఇంటర్నెట్ తొలి రోజుల్లో మీరు ఫోరమ్‌ల వేదికగా ప్రతిదీ చెప్పవచ్చు. దానికి ఎలాంటి పర్యవసానాలు ఉండవు. మీ మాటల్ని మీ ఇంట్లోవారు, మీ బాస్ ఎవరూ వినరు. మీ మనసులో ఉన్నది చెప్పడానికి అది ఒక సురక్షితమైన ప్రదేశం'' అని లండన్‌కు చెందిన రాబ్ మాన్యుయెల్ అన్నారు. ట్విట్టర్‌లోని ప్రముఖ కన్‌ఫెషన్ పేజీ 'ఫెస్‌హోల్' వెనుకున్నది ఈయనే.

''సోషల్ మీడియా ఒక స్లాట్ మెషీన్ లాంటింది. మీరు అక్కడ ఆడుతూ ఉంటే వేల సంఖ్యలో లైక్‌లని పొందడం ద్వారా గెలవొచ్చు. ఒకవేళ ఓడిపోతే మాత్రం మీ ఉద్యోగం కూడా కోల్పోవచ్చు'' అని ఆయన అన్నారు.

ట్విట్టర్‌లో 'ఫెస్‌హోల్' అనే కన్‌ఫెషన్ పేజీని రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించారు. దీనికి 3,25,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. రాబ్ వద్దకు ప్రతిరోజు వందల సంఖ్యలో కన్‌ఫెషన్లు వస్తాయి. కానీ, అందులో కేవలం 16 మాత్రమే ఆయన పేజీలో షేర్ చేస్తారు.

ఉదాహరణలు

ఫెస్‌హోల్ పేజీలో చాలా రకాల కన్‌ఫెషన్లు వస్తుంటాయి.

ఒక వ్యక్తి ఇలా రాశారు. ''గత ఏడాది నా సవతి తండ్రి మరణించారు. నా తల్లి బాధలో ఉన్నారు. కాబట్టి ఆమె పాస్‌వర్డ్‌లు తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాను. ఈ ప్రయత్నంలో ఆన్‌లైన్‌లోని వేర్వేరు డేటింగ్ సైట్‌లలో ఆమె ఎఫైర్ నడుపుతున్నారని నాకు తెలిసింది. దీని గురించి నేను ఆమెకు చెప్పలేదు. తెలిస్తే ఆమె గుండె పగులుతుంది'' అని ఒక వ్యక్తి తన బాధను పంచుకున్నారు.

ఈ కన్‌ఫెషన్ పేజీని హాస్యాస్పదంగా ఉండాలని తాను కోరుకున్నట్లు రాబ్ చెప్పారు. కానీ, ఉద్వేగాన్ని అందించడం కోసం ఇలాంటి స్టోరీలను కూడా చేర్చుతున్నట్లు తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నడిచే 'ద సీక్రెట్ కీపర్స్' అనే పేజీ మరింత ఉద్వేగపూరితమైన కన్‌ఫెషన్లను షేర్ చేస్తుంది.

''మనం ఆధునిక ప్రపంచంలో నివసిస్తున్నాం. అత్యంత వ్యక్తిగతమైన అంశాలను స్నేహితులతో, కుటుంబ సభ్యులతో చర్చించడం చాలా కష్టం'' అని ఓలివియా పీటర్ అన్నారు. యూకే చెందిన 'ద సీక్రెట్ కీపర్స్' పేజీని ఆమే నడిపిస్తున్నారు.

''మీరు ఒక విషయాన్ని సున్నితమైనదిగా భావించినప్పుడు దాన్ని బహిరంగంగా వెల్లడించాలని అనుకోరు. అదే ఆన్‌లైన్ అయితే మీ వివరాలు గోప్యంగా ఉండటంతో మీరు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. మిమ్మల్ని ఎవరూ వేలెత్తి చూపరు అని అనుకుంటారు. థెరపిస్టులను కూడా ప్రజలు అందుకే కలుస్తారు. స్నేహితులకు ఎప్పటికీ చెప్పలేని విషయాలను థెరపిస్టులకు చెబుతారు'' అని ఓలివియా వివరించారు.

ఫోరమ్స్

తమ పేజీలో పంచుకునే కన్‌ఫెషన్లకు మద్దతుగా, సహాయంగా నిలవడానికి 'ద సీక్రెట్ కీపర్స్' పేజీ ఒక ఓపెన్ ఫోరమ్‌ను నిర్వహిస్తుంది. ఇందులో చాలా మంది థెరపిస్టులు, సైకాలజిస్టులు ఉంటారు. వారు ప్రజలకు మద్దతుగా నిలుస్తూ ధైర్యాన్ని, తగిన సలహాలను ఇస్తుంటారు.

''రహస్యాలను, తప్పులను పంచుకోవడం వల్ల ప్రజల్లో ఒంటరిని అనే భావన కాస్త తగ్గుతుంది. దీనితో పాటు ఆ రహస్యం చుట్టూ ఉన్న అనేక అవమానాలను, ఆందోళనలను మనం పరిష్కరించవచ్చు. నిజంగా ఈ పేజీకి మంచి స్పందన లభిస్తోంది. దీనివల్ల సహాయం పొందుతున్నవారిని చూడటం అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్రజల భావాలు ఆమోదయోగ్యమైనవి అని చాటిచెప్పడం ద్వారా కొన్ని రకాల కళంకాలను దూరం చేయడంలో 'ద సీక్రెడ్ కీపర్స్' పేజీ సహాయపడుతుందని నమ్ముతున్నాం'' అని ఓలివియా అన్నారు.

సైబర్ బుల్లీయింగ్

కన్‌ఫెషన్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల అనుకూలతలతో పాటు ప్రతికూలతలు కూడా ఉంటాయి.

అనామక వ్యక్తులతో నిజాయితీగా మన రహస్యాలను చెబుతుంటాం. కానీ, దీన్ని అదునుగా తీసుకొని చెలరేగిపోయేవారు కూడా దీని వెనుక ఉంటారు.

బుల్లీయింగ్‌కు అనుమతిస్తుందనే ఆరోపణలతో 'సారాహ్' అనే యాప్‌ను 2018లో గూగుల్, ఆపిల్ స్టోర్స్ తొలిగించాయి.

ఉద్యోగుల నుంచి నిజాయితీగా ఫీడ్‌బ్యాక్‌ను పొందాలనే ఉద్దేశంతో యాజమాన్యాల కోసం ఈ యాప్‌ను తయారు చేశారు.

అయితే, కొందరు ఉద్యోగులు దీన్ని సైబర్ బుల్లీయింగ్‌కు వేదికగా మార్చుకున్నారు.

అలాగే విస్పర్, సీక్రెట్, ఆస్క్.ఎఫ్‌ఎం వంటి యాప్‌ల దుర్వినియోగాన్ని అరికట్టడంలో డెవలపర్లు విఫలమయ్యారు. దీంతో వీటిని కూడా మూసివేశారు.

''ఇతర కారణాల రీత్యా ఆన్‌లైన్ ఫోరమ్‌లు దుర్వినియోగం కావచ్చు. ఇలా జరిగితే ప్రజలు ప్రమాదంలో పడతారు. అంతేకాకుండా అర్థరహితమైన, తప్పుడు సలహాల కారణంగా ప్రజలు మరింత ఒత్తిడికి గురి కావచ్చు. దీనివల్ల మరింత గందరగోళానికి లోనవుతారు'' అని జహ్రా అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కన్‌ఫెషన్లు

ఆన్‌లైన్‌లో తమ తప్పులను ఒప్పుకోవడం చాలామందికి ఒక చికిత్సగా మారింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మెంటల్ హెల్త్ గ్యాప్ యాక్షన్ ప్రోగ్రాం ప్రకారం, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న తక్కువ ఆదాయ దేశాలలోని 75% ప్రజలు, మానసిక ఆరోగ్య నిపుణుల సేవలను వినియోగించుకోలేని స్థితిలో ఉన్నారని అంచనా వేశారు.

అంటే చికిత్స తీసుకునేవారికి, తీసుకోనివారికి మధ్య అంతరం భారీగా ఉన్నట్లు అని జహ్రా అన్నారు.

"శిక్షణ పొందిన నిపుణులు అందుబాటులో లేకపోవడం, నివారణ చర్యలపై పరిమిత దృష్టి, గ్రామీణ, తక్కువ ఆదాయ వర్గాలకు సేవలను పరిమితం చేయడం, మానసిక ఆరోగ్యంపై ఉండే కొన్ని రకాల అపోహలు దీనికి మరింత దోహదం చేస్తున్నాయి'' అని ఆమె అన్నారు.

మానసిక ఆరోగ్య సంరక్షణను పొందుతున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నట్లు జహ్రా చెప్పారు. అయితే, ఇది కేవలం పట్టణ లేదా ధనవంతుల కుటుంబాలకే పరిమితంగా ఉంది.

రహస్యాలను పంచుకోవడానికి సురక్షితమైన ప్రదేశాలుగా ఆన్‌లైన్ కన్‌ఫెషన్ సైట్లను తీర్చిదిద్దడం చాలా ముఖ్యం అని ఆమె అన్నారు.

సమస్యల గురించి చర్చిస్తే ఉపశమనం దక్కొచ్చు. కానీ, కొన్నిసార్లు ఇది ప్రతికూల పరిస్థితులకు దారి తీయొచ్చు.

సైకోథెరపిస్ట్ ఏంజెలో ఫోలే దీని గురించి మరింత చెప్పారు. ఆమె 'బ్యాలెన్స్ యువర్ ఫియర్' అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను నడుపుతున్నారు.

ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తమ తప్పులను ఒప్పుకునేవారికి, వాటిని వింటున్నవారికీ దీనివల్ల ప్రయోజనం ఉంటుందని ఆమె అన్నారు.

''ఇతరుల కన్‌ఫెషన్‌ను వినడం నవల చదవడం లాంటిది. వారి కథలో మనల్ని మనం వెతుక్కుంటాం. ఇతరుల కథలు మన మానసిక మరియు భావోద్వేగ ప్రక్రియను పనిచేసేలా చేస్తాయి'' అని ఆమె చెప్పారు.

"మన జీవిత అనుభవాలు, బాధలు, మన అస్తిత్వంలోనే భయం అనేది ఉంది. దీన్ని బహిర్గతం చేయడానికి అనువైన ప్రదేశం లేదు. దీనికి అనుగుణంగా ఇన్‌స్టాగ్రామ్‌ను రూపొందించడంలో నా వంతు ప్రయత్నం నేను చేశాను'' అని ఏంజెలో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)